మనవూరి పాండవులు – అద్భుత చిత్రకారులు బాపు గారి చలనచిత్రాల ప్రస్తావన లో వచ్చే వరుసలో మొదటి అయిదు చిత్రాల్లో ఒకటి. రావుబహద్దూర్ కథ, ముళ్ళపూడి వారి కథనం మరియు మాటలు, బాపు దర్శకత్వం, నటీనటుల అభినయం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిత్రంలో ప్రతీదీ ప్రత్యేకమే. ఇప్పుడు ఒక్కో ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం.
కథ :
1978లో జరిగే ఈ కథలో ఆ కాలం నాటి జమీందారి వ్యవస్థ, దొరతనం, అంటరానితనం ప్రధాన అంశాలు. ఓ గ్రామంలోని రాజవంశానికి చెందినా ఓ దొర (రావు గోపాలరావు) ఆ ఊరికి పెద్ద మనిషిగా చెలామణి అవుతూ, ప్రజలుకు తెలియకుండా చాలా అన్యాయాలు చేస్తుంటాడు. అతనికి ఓ ప్రధాన సలహాదారు కన్నప్ప (అల్లు రామలింగయ్య), ఎప్పుడూ అతని వెంటే ఉంటూ అతని భజన చేసే వారు (కాంతారావు, తదితరులు) ఉంటారు. ఓసారి ఆ దొర ఓ తక్కువ జాతి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ అమ్మాయి గర్భవతి అయ్యింది అని తెలిశాక, తక్కువ జాతి అమ్మాయని తూలనాడి మాట తప్పుతాడు. చివరకు దేవుడు కూడా తన మొర వినకపోవటంతో ఆ అమ్మాయి మతిస్థిమితం కోల్పోతుంది. ఇలాంటి అరాచకాలని భరించలేని ఓ అయిదుగురు యువకులు ఓ జట్టుగా ఏర్పడి, ఊరి ప్రజలని కాపాడాలని నిర్ణయం తీసుకుంటారు.
1. తన తండ్రి ధర్మయ్య (కాంతారావు) కి జూదం అలవాటు చేసి, తప్పుడు ఆట ఆడి తమ ఆస్తిని దోచేస్తున్న ఊరి పెద్ద (రావు గోపాలరావు) కోపం పెంచుకున్న రాము (మురళీమోహన్).
2. ఇరవై ఏళ్ళు తనతో చాకిరి చేయించుకొని, పెళ్ళికి పైకం అడిగితే చావబాదిన యజమాని (రావు గోపాలరావు) కి ఎదురుతిరిగిన భీమన్న (ప్రసాద్ బాబు).
3. వరసకు మేనమామే అయిన అతని (రావు గోపాలరావు) పద్ధతులు నచ్చక ఎప్పటికప్పుడు అతని తప్పులు బయటపెట్టే పార్థు (చిరంజీవి).
4, 5. తమ సోదరి (పైన ప్రస్తావించిన మతిస్థిమితం కోల్పోయిన అమ్మాయి) ని నమ్మించి మోసం చేసిన దొర (రావు గోపాలరావు) తప్పు బయటపెట్టి సోదరి జీవితం నిలబెట్టాలని చూసే అన్నదమ్ములు (భానుచందర్, విజయభాస్కర్).
వీళ్ళకి, రక్తం పంచుకున్నా అన్న బుద్ధులు పంచుకోని దొర తమ్ముడు కృష్ణ (కృష్ణంరాజు) సాయం చేస్తాడు. ఆ తరువాత ఈ విప్లవాన్ని ఆపటానికి దొర చేసిన ప్రయత్నాలు, ఆ అయిదుగురు ఎలా దొర చేసే అన్యాయాలను బట్టబయలు చేసి ఊరిని కాపాడారు అనే అంశాల మీద మిగిలిన కథ నడుస్తుంది.
కథనం :
ఈ చిత్రం పేరుని బట్టి దీనికి, మహాభారతానికి సంబంధం ఉంది అన్న అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాన్ని అడుగడుగునా నిజం చేశారు కథకుడు, సంభాషకుడు మరియు దర్శకుడు. భారతంలోని ముఖ్య ఘట్టాలయిన ద్రౌపదీ వస్త్రాపహరణం, వనవాసం, పాండవులను చంపటానికి కౌరవులు గుడిస తగలబెట్టిన యత్నం మొదలగునవి ఈ చిత్రంలోనూ కీలక సన్నివేశాలు. పైన పరిచయం చేసిన పాత్రలను బట్టి పాండవులు ఎవరెవరో, కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది. ఇక మిగిలింది దొర (రావు గోపాలరావు) పాత్ర. ఈ పాత్రలో దుర్యోధనుడు, శిశుపాలుడు కనపడతారు. వస్త్రాపహరణం చేసినందుకు, పాండవుల గుడిసెను తగలబెట్టించినందుకు దుర్యోధనుడుగా, నూరు తప్పులు నిండాక నూరేళ్ళు నిండుతాయని కృష్ణంరాజు పాత్ర వాటిని లేక్కవేయటం వలన ఇది శిశుపాలుడు పాత్రగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎల్లప్పుడూ ప్రక్కనే ఉండి సలహాలు ఇచ్చే కన్నప్ప (అల్లు రామలింగయ్య) పాత్ర సాక్షాత్తు శకుని పాత్రే.
భారతం కథలాగే తను చెయ్యకుండా పాండవులచే యుద్ధం చేయించి, అడుగడుగునా వారికి సలహాలు ఇస్తూ, సాయం చేసే కృష్ణుడు పాత్రలో కృష్ణంరాజు పాత్ర సాగుతుంది. మూలకథ ఓ విప్లవానికి సంబంధించింది కానీ కథనం ఆ విప్లవాన్ని దెబ్బతీయకుండా, అంతర్లీనంగా చెప్తూ, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేక్షకుడికి ఇది ఓ విందు భోజనం లాంటి చిత్రం.
మాటలు :
ఈ చిత్రానికి ముఖ్యమైన ప్రత్యేకతగా చెప్పుకోవాల్సింది ముళ్ళపూడి వారి సంభాషణలు. దొరతనాన్ని, విప్లవాన్ని చిన్న మాటల్లో, సూటి మాటల్లో చెప్పేశారు. అది ఆయనలోని సృజనాత్మకతకి నిదర్శనం. అలాగే బాపు – రమణ అనే జంటలో ఆయన పాత్ర ఎంత ఉందో ఆ మాటలు గుర్తు చేస్తాయి. ఆయన ప్రతిభకు నిదర్శనమైన కొన్ని మాటలు ఇవే :
1. “డబ్బు తీసుకొని కూడా గడ్డి కరవని సింహాలు ఇంకా పుట్టలేదు” అని కన్నప్ప పాత్ర ఓ సన్నివేశం లో పలుకుతుంది.
2. పూజారిని కాలితో తొక్కే సన్నివేశం లో “కన్నప్పా! ధర్మం ఎక్కడుంది?” అని దొర అడిగితే “మన కాళ్ళ కింద గింజుకుంటోంది” అని సమాధానం ఇస్తాడు కన్నప్ప. ఈ మాటలో దొరలలోని అహాన్ని చూపించారు.
ఇలాంటి ఎన్నో మాటలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి.
దర్శకత్వం :
ఈ చిత్రానికి మరో ముఖ్యమైనది బాపు గారి దర్శకత్వం. రమణ గారి కథనాన్ని, మాటలని చిత్రంలోని ప్రతి సన్నివేశం లో ఆయన గౌరవించారు. రవంతైనా అశ్లీలత లేకుండా, ఏ పాత్ర పరిధి దాటకుండా, ఉన్నా రెండున్నర గంటల నిడివిని ఎలా వాడుకోవాలో ఈ తరం దర్శకులకు ఓ పాఠం లో ఈ చిత్రాన్ని మలిచారు బాపు. ముత్యాలముగ్గు, బుద్ధిమంతుడు లాంటి చిత్రాల కోవలో ఈ చిత్రం కూడా వెండితెర పై బాపు చేసిన ఓ అందమైన సంతకం లా మిగిలిపోయిందని చెప్పొచ్చు.
పాత్రలు – ప్రత్యేకతలు :
1. దొర పాత్ర. ఇలాంటి పాత్రలు చెయ్యటం రావు గోపాలరావు కి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యని ఈ చిత్రంలో మరింత బాగా వాడారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం లో, చేతికర్రతో చీరలు తీసుకోమని చెప్పే సన్నివేశం ఆయన పలికిన సంభాషణలు, పలికించిన హావభావాలు ఆయనలోని నటుడిని, పాత్రలోని క్రూరత్వాన్ని ఒకేసారి చూపించింది.
2. కన్నప్ప పాత్ర. బాపు గారి ప్రతి చిత్రం లోనూ అల్లు రామలింగయ్య గారికి ప్రత్యేకమైన పాత్రే దక్కింది. అలాగే ఈ చిత్రంలోనూ దక్కింది. ఆయన ఆహార్యం, సంభాషణలు పలికే విధానం, ముఖ్యంగా “కనెక్షన్” అనే ఊతపదాన్ని వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ఆయిన వాడిన తీరును చూస్తే, చిత్ర పరిశ్రమ లో ఆయనకు ఎందుకు అంత గౌరవం దక్కిందో అర్థం అవుతుంది.
3. కృష్ణ పాత్ర. తెల్ల లాల్చీ, పంచ, భుజాన శాలువ, ఓ చేతిలో వేమన శతకం మరో చేతిలో మందు సీసా పట్టుకొని కృష్ణంరాజు ఆ పాత్రకు సరైన న్యాయం చేశారు. కథలోని కీలక సన్నివేశాల్లో ఈ పాత్ర ప్రవేశించి కథా గమనాన్ని మారుస్తూ ఉంటుంది. ఆ సమయాల్లో అది పాడే పాటలు ఆ పాత్రకున్న వేదాంతాన్ని బయటపెడతాయి.
అదనపు ప్రత్యేకత :
ప్రతి చిత్రానికి పాటలు చాలా ముఖ్యం. ఈ చిత్రానికి కూడా అంతే. కానీ ఇందులోని పాటలు దాదాపు కథలో భాగంగా, కథను ముందుకు నడిపించేవే అవ్వటం ఓ ప్రత్యేకత. అందులో ముఖ్యమైనవి కృష్ణంరాజు పాత్ర పాడే “సిత్రాలు సేయరో శివుడో శివుడా” మరియు “ఒరేయ్ పిచ్చి సన్నాసి” అని సాగే గీతాలు పాత్రని బాగా పరిచయం చేయడంతో పాటు కథకి బలాన్ని ఇచ్చాయి.
ఈ చిత్రం గురించి ఒక్క వాక్యం లో :
ఇది ఓ సుందర విప్లవ కావ్యం…. బాపురమణీయం!!!!
– యశ్వంత్ ఆలూరు
Super Yashu. Keep it up and keep going…
LikeLiked by 1 person
Thanks annayya
LikeLike