అతడు (2005)

Screen - 16

చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. నా దృష్టిలో తెలుగు తెరపై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని మొదటి పుస్తకం 1957 లో విడుదల అయిన “మాయాబజార్”. తరువాత 1989లో వచ్చిన రాంగోపాల్ వర్మ “శివ”. ఆ తరువాత అలాంటి పుస్తకంలా అనిపించిన చిత్రం 2005లో వచ్చిన అతడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ చిత్రం వెండితెరపై పెద్ద విజయం సాధించకపోయినా ఎందరో మనసులకి హత్తుకుంది. ఇప్పటికీ బుల్లితెరపై వస్తే చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ చిత్రంలోని సంభాషణల గురించి మాట్లడుకోనివారు, వారి జీవితాల్లో జరిగే సంఘటనలకు వాటిని ఆపాదించుకొని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అప్పటికే రచయితగా తనను తాను నిరూపించుకొని, “నువ్వే నువ్వే” చిత్రానికి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కథానాయకుడిగా అప్పుడప్పుడే స్థిరపడుతున్న మహేష్ బాబులను ఈ చిత్రం ఓ సుస్థిరమైన మెట్టు ఎక్కించింది.

కథ :

చిన్నప్పుడే హత్య, బ్యాంక్ దోపిడి లాంటి నేరాలు చేసిన నందగోపాల్ అలియాస్ నందు (మహేష్ బాబు) పెద్దయ్యాక కాంట్రాక్ట్ హంతకుడిలా జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి తోడుగా తన చిన్నప్పటి నేర స్నేహితుడు మల్లి (సోనూ సూద్) ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు శివారెడ్డి (సాయాజీ షిండే) పదవిని పొందే ఎత్తుగడలో భాగంగా నందు కోసం కబురు పెడతాడు. ఇది నడిపించే బాధ్యత అతని సహాయకుడు బాజిరెడ్డి (కోట శ్రీనివాసరావు) తీసుకుంటాడు. శివారెడ్డిని చంపే ప్రయత్నం చేయాలి కానీ మనిషి మిగలాలి అనేది ఒప్పందం. కానీ అనుకోకుండా, అనుకున్న రోజు నందు తుపాకి పెల్చకుండానే శివారెడ్డిని ఎవరో కాల్చి చంపేస్తారు. అప్పుడే నందు స్నేహితుడు మల్లి కారు ప్రమాదంలో చనిపోతాడు. ఇంతలో పోలీసులు నందు వెంటపడడంతో అతడు తప్పించుకొని పారిపోతాడు. ఆ ప్రయాణంలో అతనికి పరిచయం అవుతాడు పార్థసారథి అలియాస్ పార్థు (రాజీవ్ కనకాల). తోటి ప్రయాణికుడు కావటంతో తన కథని నందుకి చెప్తాడు పార్థు. రైలు గుడివాడలో ఆగి ఉండగా నందుని వెంబడించిన పోలీస్ (చరణ్ రాజ్) అతడిని కాల్చగా, అనుకోకుండా ఆ బుల్లెట్ పార్థుకి తగిలి అతడు చనిపోతాడు, నందు తప్పించుకుంటాడు.

తన వల్ల పార్థు చనిపోయాడు కనుక ఆ విషయం చెప్పటానికి నందు పార్థు గ్రామానికి వస్తాడు. కానీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా తనే పార్థు అని అబద్ధం చెప్తాడు. తల్లిదండ్రులు లేని పార్థుకి తాతయ్య సత్యనారాయణ మూర్తి (నాజర్) మరియు ఓ ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఇక అక్కడి నుండి వారి సమస్యలను పార్థు స్థానంలో ఉన్న నందు తీరుస్తాడు. ఈ క్రమంలో పార్థు మరదలు పూరి (త్రిష)తో ప్రేమలో పడతాడు.

ఇదిలా ఉండగా, శివారెడ్డి హత్య కేసు విచారణ ఆంజనేయ ప్రసాద్ (ప్రకాష్ రాజ్) అనే సీబీఐ అధికారికి అప్పగిస్తారు. అతడు ఆ విచారణలో భాగంగా నందుయే ఆ హత్య చేశాడని ఆధారం సంపాదిస్తాడు. ఇది తెలుసుకున్న పార్థు కుటుంబం నందుని దూషిస్తుంది. అయినా కుడా ధైర్యంగా నిజం ఒప్పుకున్నా నందునే పార్థుగా అంగీకరిస్తాడు తాతయ్య. దాంతో అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవాలని బయలుదేరిన నందుకి బాజిరెడ్డి ద్వారా తన స్నేహితుడు మల్లి చనిపోలేదని, బాజిరెడ్డి ఒప్పందం మేరకు తనే ఆ హత్య చేశాడని తెలుసుకుంటాడు. ఆ తరువాత నందుకి, మల్లికి జరిగిన పోరాటంలో తుపాకి పేలి మల్లి చనిపోతాడు. శివారెడ్డిని చంపి అతడి పేరు వాడుకొని ముఖ్యమంత్రి అయిన బాజిరెడ్డి ఈ కుట్ర పన్నాడని నందు ఇచ్చిన ఆధారం చూపిస్తాడు ఆంజనేయ ప్రసాద్. అది చూసి ఆత్మహత్య చేసుకుంటాడు బాజిరెడ్డి. తనపై ఎలాంటి కేసు లేనందున నందు తిరిగి గ్రామం చేరుకొని పార్థుగా బ్రతకాలని నిర్ణయించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

కథనం :

ఈ చిత్రం కథ పెద్దగా చిక్కుముళ్ళు లేని కథే. మాములుగా అయితే ఎక్కడో ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప దర్శకుడు పెద్దగా మెదడుకి పని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ త్రివిక్రమ్ అణువణువునా మెదడు వాడారు. అందువల్ల ఈ చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం బోరు కొట్టదు, అలాగని పరిమితి కుడా దాటదు. ముఖ్యంగా పాత్రలు ఉన్న ప్రాంతాన్ని ఒక టైపు రైటర్ లో టైపు చేసిన విధంగా చూపించిన విధానం ఆ సమయంలో చాలా కొత్త ప్రయత్నం. ఈ పోకడ తరువాత చాలా చిత్రాల్లో అనేకమంది చేశారు. ముఖ్యంగా చిత్రం మొదట్లో ఒక వ్యక్తిని చంపి పారిపోతున్న నందు చిన్నప్పటి పాత్రను చూపిస్తూ వేసిన ప్రదేశం తాలూకు వివరం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది.

Screen - 1

ఇలాంటివి చిత్రంలో చాలానే ఉన్నాయి. అవన్నీ దర్శకుని మేధాశక్తిని తెలిపేవే. కథని నడిపించడంలో నేర్పు కావాల్సిన ఘట్టం నందు పార్థుగా గ్రామంలో అడుగుపెట్టినప్పుడు. అక్కడ కూడా వివధ రకాలయిన పాత్రలను పరిచయం చేసి ఆద్యంతం వినోదాత్మకంగా కథనాన్ని సాగించాడు.

ఇలాంటి కథనంలో మనకు మొట్టమొదట పరిచయం అయ్యే ముఖ్యమైన పాత్ర సత్యనారాయణ మూర్తి (నాజర్). కనిపించకుండాపోయిన మనవడి కోసం ఎదురుచూసే ఈ తాత పాత్రకు నాజర్ వంద శాతం న్యాయం చేశారు. ఆ పాత్రకు బాలసుబ్రహ్మణ్యం గారు అరువిచ్చిన గాత్రం అద్భుతం. పార్థు (నందు)ని చూడగానే అతడిని తాకాలని ముందుకు వచ్చి తరువాత వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఓ చిన్నపిల్లాడు, పెద్దమనిషి ఉన్నారు. పిల్లాడిలోని బెట్టు, పెద్దరికం కలగలిపిన భావం చక్కగా పలికించారు నాజర్.

Screen - 12

తాతయ్య పలకరించలేదు అని పార్థు (నందు) వెళ్ళిపోగా, ఎందుకు మాట్లాడలేదు అని కూతురు అడుగుతుంది. అప్పుడు “వాడోస్తాడని పన్నెండేళ్ళ నుంచి చూస్తున్నాను. నేను మాట్లడతనేమోనని ఇంకో పది నిమిషాలు చుడలేడమ్మా వాడు?” అంటాడు మూర్తి. మనవడి కోసం ఎదురుచూడటంలో తనకు ఉన్న ఓపిక తాతయ్య పట్ల మనవడికి లేదని బాధ తెలుపుతాడు. ఈ మాటతో పెద్దరికాన్ని, పెద్దలకున్న ప్రేమని చూపించారు.

తరువాత పరిచయం అయ్యే పాత్రలు రమణ (సునీల్), గిరి. పల్లెటూళ్ళల్లో అమ్మయకత్వం, మంచితనం కలగలిపిన మనుషులకు ప్రతిబింబాలు ఈ పాత్రలు. ఆ తరువాత పార్థు చిన్నప్పటి అల్లరి పని బయట పెట్టడానికి ఎమ్మెస్ నారాయణ పాత్ర పరిచయం అవుతుంది. ఇది ఒక మంచి ప్రయత్నం మరియు వ్యాపార సూత్రం. ఒక పాత్ర మంచితనం అయినా చెడ్డతనం అయినా ఆ పాత్ర ద్వారా కాకుండా మరో పాత్ర ద్వారా చెప్పించడం వల్ల దాని విలువ పెరుగుతుంది. పార్థు చిన్నప్పటి కథ తెలిశాక నందు పార్థు వల్ల నష్టపోయిన పూజారి కుటుంబానికి సాయం చెయ్యడం వల్ల అప్పటివరకు హంతకుడు గా ఉన్న నందు పాత్రలోని కొత్త కోణం బయటపడుతుంది. పైగా ఆ సన్నివేశం చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు. ఇక్కడ ఛాయాగ్రాహకుడు గుహన్ పనితనం చాలా ఉపయోగపడిందని చెప్పాలి.

Screen - 11

ఈ సన్నివేశం తరువాత పూజారి జీవితం బాగుపడిందని ఎలాంటి సన్నివేశం చూపించకపోవటం వెనుక ఒక అర్థం ఉంది. ఈ సన్నివేశపు ఉద్దేశ్యం, నందు పాత్రపై ప్రేక్షకుడి అభిరుచి మార్చటం, అది సన్నివేశంలోనే జరిగిపోయినప్పుడు ఇక దాని పరిణామాలు చూపించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. పైగా అలా చేస్తే ఇది ఒక మామూలు చిత్రంగా కూడా మిగిలిపోతుంది. ఇది ఒక కొత్త ఆలోచనగా చెప్పొచ్చు.

ఈ కథనంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టం పార్థు (నందు) సత్యనారాయణ మూర్తి పొలం సమస్య తీర్చే ఘట్టం. ఇక్కడే మనకు నాయుడు (తనికెళ్ళ భరణి) పాత్ర పరిచయం అవుతుంది. మూలకథకి, ఈ పాత్రకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఈ పాత్ర గురించి, ఈ సన్నివేశం గురించి మాట్లాడుకోకుండా ఎవరూ ఈ చిత్రం గురించి మాట్లాడలేరు. ముఖ్యంగా ఇక్కడ చిత్రీకరించిన పోరాట సన్నివేశం, సంభాషణలు ఎప్పటికి గుర్తుండిపోయేలా చిత్రీకరించారు. నాయుడు పాత్రకి తనికెళ్ళ భరణి రెండు వందల శాతం న్యాయం చేశారు.

Screen - 2

ఇక్కడ కూడా ఛాయాగ్రాహకుడు గుహన్ పనితనం బాగా కనపడుతుంది.

ఈ చిత్ర కథనంలో మరో ముఖ్య ఘట్టం : విరామం సమయంలో ఆంజనేయ ప్రసాద్ పార్థు (నందు)ని వెతుక్కుంటూ బాశర్లపూడికి వస్తాడు. అతడే శివారెడ్డిని హత్య చేశాడని అనుమానంతో అతడి వేలిముద్రలు సంపాదించడానికి ఎత్తు వేస్తాడు. ఇక్కడ నందు దొరికిపోయాడని ప్రేక్షకుడికి అనిపించేలా విరామం ఇచ్చారు. విరామం తరువాత ఆ ఎత్తుగడని తిప్పికొట్టేలా, ఆంజనేయ ప్రసాద్ తనంతట తానే విసిటింగ్ కార్డ్ నందుకి ఇచ్చే సన్నివేశంలో ఎంతో సహజంగా మాటలతో ప్రేక్షకుడిని ఒప్పించారు. ఇది దర్శకుడి తెలివికి మరో నిదర్శనం.

Screen - 3

ఇలా చిత్రంలోని మొదటి సగం ఎక్కువ కథతో, తక్కువ కథనంతో గడిచిపోతుంది. ఇక అసలు కష్టం వచ్చేది రెండో సగంలో. ఇక్కడ కథ యొక్క అవసరం కన్నా కథనపు అవసరమే ఎక్కువ ఉంది. ఇలాంటి సమయాల్లో కథతో సంబంధంలేని పాత్రలని తీసుకొని రావడం తప్పేమీ కాదు. పైగా ఆ పాత్ర తీసుకొని రావటానికి ఒక ఊతం కూడా ఉంది. మొదటి సగంలో పార్థు (నందు) చేతిలో దెబ్బ తిన్న నాయుడు పగతో ఉంటాడు. కానీ అతడి మగతనాన్ని, “శ్రద్ధ” ని పొగుడుతాడు. ఇక్కడ అతడి పగని భుజాలపై వేసుకునే ఓ పాత్ర పరిచయం అవుతుంది. అదే నాగసముద్రం బుజ్జి (బ్రహ్మాజీ) పాత్ర. పార్థుని చంపడానికి వీరిద్దరూ కలిసి పన్నాగం పన్నే సన్నివేశంలో త్రివిక్రమ్ లోని రచయిత విజ్రుమ్భించాడని చెప్పాలి. ఇది ఒక కొత్త రకమైన, అంతవరకు ఏ చిత్రంలోనూ కనిపించని సన్నివేశం. ఇక్కడ దర్శకరచయిత త్రివిక్రమ్ వంద శాతం విజయం సాధించాడు.

Screen - 4

“అన్ని బళ్ళు ఎందుకురా?” అని నాయుడు అడగ్గానే నవ్వని ప్రేక్షకుడు ఎవరూ ఉండరు. శబ్దం చేస్తున్న వాహనాన్ని ఆపు చేయించి “నిశబ్ధం ఎంత భయంకరంగా ఉంటదో చూశావా? అందుకే మీరెంత సైలెంట్ గా ఉంటే, మర్డర్ అంత వైలెంట్ గా ఉంటది” అంటాడు.

Screen - 5

ఈ సన్నివేశంలో, మొదట వాహనపు శబ్దం బాగా వినిపిస్తుంది. అది ఆగిపోయిన వెంటనే విపరీతమైన నిశబ్ధం వచ్చేలా చేసిన శబ్దగ్రహణం ఆ మాటకు మరింత ఊతం ఇచ్చింది, ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా చేసింది. ఈ ఒక్క పొలం సన్నివేశం దీని తరువాత ఓ పోరాట సన్నివేశానికి దారి తీసింది, రంజింపచేసింది.

దీని తరువాత కథనాన్ని మోయటానికి మరో పాత్ర కావాలి. బుజ్జి పాత్రలాగే దానికి కూడా కథతో సంబంధం అవసరం లేదు. నాయుడు పాత్ర ఇక అక్కరలేదు కనుక ఇప్పుడు వచ్చే పాత్ర పార్థు ఉమ్మడి కుటుంబానికి సంబంధించిందైతే బాగుంటుంది. ఆ పాత్ర కథనానికి, ప్రేక్షకునికి కొత్తదిగానూ, కుటుంబానికి పాతదిగానూ ఉండాలి. అదే కృష్ణమూర్తి (బ్రహ్మానందం) పాత్ర. సత్యనారాయణ మూర్తి గారి మూడో అల్లుడు. ఈ పాత్ర ఆ తరువాత ఓ ఇరవై నిమిషాలు కథనాన్ని మోస్తూ ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది.

Screen - 6

ఈ పాత్రని, బ్రహ్మానందం పలికిన సంభాషణలని ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకుంటారు. ఇది సత్యం.

దీని తరువాత కాస్త కథలోకి వెళ్తుంది చిత్రం. అది పార్థు, పూరిల ప్రేమ. ఇదివరకటి చిత్రాల్లా కాకుండా “కట్టె, కొట్టె, తెచ్చె” అని చిన్న సన్నివేశంతో, సూటి మాటలతో చెప్పటం నాటకీయతకి దూరంగా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఇదే సన్నివేశంలో నందు పాత్ర ఏమిటో కూడా తెలుస్తుంది. చిన్నప్పటి నుండి ఎవరిని ప్రేమించని, ఎవరిచేతా ప్రేమించబడని ఓ అనాథ తన ప్రేమని ఓ పల్లెటూరి పిల్లకి అర్థమయ్యేలా చెప్పటానికి ఆ పాత్ర పడే కష్టాన్ని త్రివిక్రమ్ ఎంత మనసుపెట్టి వ్రాశాడో మహేష్ బాబు కూడా అంతే మనసు పెట్టి నటించాడు.

Screen - 7

“ఎవరైనా ప్రతిసారీ అందంగా కనిపించరు, కనిపిస్తారని అబద్ధం చెప్పకూడదు” అని వెన్నెలను చూపించి చెప్పటంలో ఎంతో పెద్ద సందేశం దాగి ఉంది.

ఇక పూర్తి కథలోకి వెళ్ళిన చిత్రంలో ఆఖరి ఘట్టం వస్తుంది: నందు నిజంగా పార్థు కాదనే విషయం కుటుంబానికి తెలిసిపోతుంది. అందరూ నందుని దూషిస్తూ ఉండగా అతడి మంచితనాన్ని రమణ (సునీల్) వివరిస్తాడు. నిజం బయటపడింది కనుక పారిపోయి ఉంటాడు అనుకున్న ఆ కుటుంబసభ్యులు, ప్రేక్షకులు ఖంగు తినేలా నందు తిరిగి ఇంటికి రావటం మనసును హత్తుకునే మరో కొత్త ప్రయత్నం. ఇది పాత్ర యొక్క నిజాయితీని బయటపెట్టే ప్రయత్నం. ఈ సన్నివేశంలో మహేష్ బాబు నటన, పలికిన సంభాషణలు అద్భుతం. అబద్ధం చెప్పటం మోసం చెయ్యటం ఒకటి కాదని చాలా అర్థవంతంగా చెప్పారు త్రివిక్రమ్. ఈ సన్నివేశానికి మరింత ఊతం ఇచ్చింది మణిశర్మ నేపథ్య సంగీతం.

Screen - 8

ఈ సన్నివేశంలోని క్లోజప్ షాట్స్ సన్నివేశాన్ని మరింత హత్తుకునేలా చేశాయి. ఇక్కడ ఛాయగ్రహకుడి పనితనాన్ని కూడా పోగాడాల్సిందే. ఫోకస్ ఎక్కడ తప్పలేదు. ఏ పాత్రని ఎంత ఫోకస్ చెయ్యాలో సరిగ్గా అంతే చేశాడు.

Screen - 13

ఈ సన్నివేశం ఓ సమిష్టి కృషి అని చెప్పాలి. ఈ సన్నివేశం తరువాత నాజర్, మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశం కూడా అద్భుతంగా పండింది.

తరువాత చెప్పుకోవాల్సినది నందు బాజిరెడ్డితో ఫోనులో మాట్లాడే సన్నివేశం. అతడి నుండి నిజాన్ని రాబట్టే తీరు చాలా బాగుంటుంది. ఇంతవరకు కనపడని మనిషి కేవలం మాటతోనే బెదిరించి నిజాన్ని రాబట్టిన ఆ సన్నివేశంలో మహేష్ బాబు మాట్లాడిన తీరు ప్రేక్షకుడిని ఒప్పిస్తుంది.

Screen - 17

ఇక్కడ త్రివిక్రమ్ కి మళ్ళీ మార్కులు వేయాలి. ఈ సన్నివేశం ముందు వరకు ప్రేక్షకుడు శివారెడ్డి ఎలా చనిపోయాడనే విషయాన్ని మరిచిపోతాడు. గ్రామంలో జరిగే సన్నివేశాలు, కుటుంబంలో ఉండే భావోద్వేగాలు, తదితర కథనంపై మనసు పెడతాడు కానీ ఈ అసలు విషయం మనసులోకి రాదు. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళి ప్రస్తావించడంతో చిత్రం ఇంకా మిగిలి ఉంది అని సరికొత్త ఆత్రుత కలుగుతుంది. ఇది పూర్తిగా కథనం యొక్క గొప్పతనమే.

ఫోనులో మాట్లాడిన తరువాత బాజిరెడ్డి చెప్పిన నిజాన్ని ప్రేక్షకుడికి చూపించే విధానం ప్రశంసనీయం. తరువాత చర్చి లో వచ్చే పోరాట ఘట్టం హాలీవుడ్ శైలిలో సాగుతుంది. దానికి ముందు నందుకి, మల్లికి మధ్య నడిచే సంభాషణలో కూడా బలాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా కారిడార్ పై తూటాలు పేల్చే షాట్ అద్భుతంగా వచ్చింది.

Screen - 9

చివరగా నందు పార్థుగా మారిపోతాడు. ఆ విషయం ఎంతో సులభంగా ప్రకాష్ రాజ్ “ఇంకేంటి పార్థు కబుర్లు?” అంటాడు. నందు అలియాస్ పార్థుని, పార్థు అలియాస్ నందుగా మార్చి చిత్రం ముగుస్తుంది.

Screen - 10

కథనంలోనే దర్సకత్వం గురించి చెప్పాను కాబట్టి దర్శకత్వం గురించి వేరుగా మాట్లాడను. ఇది కథ, కథనం మరియు దర్శకత్వం యొక్క సమిష్టి కృషి.

మాటలు :

ఈ చితంలోని కథకి, కథనానికి అత్యంత బలాన్ని ఇచ్చింది మాటలే అని చెప్పాలి. పైగా త్రివిక్రమ్ లాంటి మాంత్రికుడు వాటితో మరింత మాయ చేశాడు. చెప్పాలంటే ఇందులో ప్రతి మాటను గురించి చెప్పాలి కానీ అది సాధ్యపడదు కనుక కొన్ని మాటలనే ప్రస్తావిస్తాను. నందు పాత్రకు ఎక్కువ మాటలు లేవు కానీ పలికిన కొన్ని మాటల్లో కూడా త్రివిక్రమ్ ఎంతో జాగ్రత్త వహించాడు. మాట చిన్నదై ఉండి, దాని అర్థం పెద్దదై ఉండే మాటలే నందు పాత్ర మాట్లాడుతుంది. అలాగే వాటిలో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే మాటలు కూడా ఉన్నాయి.

1. “నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు”.

2. “గన్ను చూడలనుకోండి తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడలనుకోవద్దు చచ్చిపోతారు”.

3. “సార్! బ్యాగ్ బాగా చినిగిపోయింది సార్!”. ఈ మాట కథనం పరంగా హాస్యం పంచింది.

4. “మీరు ఈల వేస్తే హీరోలు పుడతారు. మీరు ఓటు వేస్తే నాయకులు పుడతారు. మీరు అవును అన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి”.

5. “వాడోస్తాడని పన్నెండేళ్ళ నుంచి చూస్తున్నాను. నేను మాట్లడతనేమోనని ఇంకో పది నిమిషాలు చుడలేడమ్మా వాడు?”

6. పూజారి గురించి చెప్పే సన్నివేశంలో రమణ ఇలా అంటాడు. “ఈయన నైవేద్యం పెడితే కానీ భోంచెయ్యడం రాని రాముడు ఈయన కస్టాలు ఏం తీరుస్తాడు చెప్పు!”.

7. “పదేళ్ళకే అన్ని చూసేస్తే పాతికేళ్ళకు టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు?”

8. “పాపం అమ్మ వాళ్ళు వీణ్ణి కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు, చాలా కంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్లకి!”

9. “రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతాం అంటారు. కానీ మర్చిపోవటానికి వాడేమైనా జ్ఞాపకమా? నా జీవితం!”

10. “ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ వాడితో పెట్టుకోకురా బుజ్జి పరువు పోద్ది!”

11. “నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదా అని చూస్తున్నావ్! నేను అదే తలుపుకి అవతల నిల్చొని ఎప్పుడు తెరుచుకుంటుందా అని చూస్తున్నాను!”

12. “నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయ్యలనుకోవటం మోసం!”

13. “మనల్ని చంపాలనుకునేవాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం. మనల్ని మోసం చేయాలనుకునేవాడిని చంపడం న్యాయం!”

ఇలాంటి ఎన్నో మాటలు చిత్రాన్ని ఉచ్చ స్థానంలో నిలబెట్టాయి.

సంగీతం :

మణిశర్మ అందించిన సంగీతం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి బాగా చేరువ చేసింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలకి ప్రాణం పోసింది. ఆ సన్నివేశాలు ఇవే :

1. చిన్నప్పటి నందు పాత్ర హత్య చేసిన తరువాత పరుగెత్తే సన్నివేశం.

2. నందు పాతబస్తీలో నర్సింగ్ ని హత్య చేసే సన్నివేశం. ఆ తరువాత అతడిని నర్సింగ్ మనుషులు తరిమే సన్నివేశం.

3. శివారెడ్డి సభ చేసే సన్నివేశం. అందులో నందు శివారెడ్డిపై తుపాకి గురిపెట్టే సన్నివేశం.

4. నందు రైలు పైకి దూకే సన్నివేశం.

5. నందుని మొదటిసారి చూడటానికి పూరి పరుగెత్తే సన్నివేశం.

6. నాయుడు చేత పొలం నుండి కంచె తీయించే సమయంలో వచ్చే పోరాట సన్నివేశం లోని నేపథ్య సంగీతం.

7. జాతరలో బుజ్జితో గొడవపడే సన్నివేశం.

8. నందు పూరికి తన ప్రేమ విషయం చెప్పే సన్నివేశం.

9. ఆఖరులో నందు నిజం ఒప్పుకునే సన్నివేశం. ఇక్కడ వచ్చే సంగీతం అన్నిటికంటే ఉత్తమ సంగీతంగా చెప్పొచ్చు.

పాటల విషయానికి వస్తే “అతడు”, “నీతో చెప్పనా”, “అవును నిజం నువ్వంటే నాకిష్టం” అనేవి నా అభిమాన గీతాలు.

మరిన్ని ప్రత్యేకతలు :

1. గుహన్ ఛాయాగ్రహణం. ఈ చిత్రపు ఛాయాగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏ సన్నివేశంలోనూ ఏ రంగు ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ కి ఈస్ట్మెన్ కలర్ కి మధ్యలో ఉంటుంది. ఆ పనితనం ఈ క్రింది సన్నివేశంలో బాగా గమనించవచ్చు.

Screen - 14

నందు తన గతం చెప్పిన తరువాత వచ్చే ట్రాలీ షాట్ చాలా బాగుంటుంది.

మరో షాట్ విరామ సమయంలో వచ్చే షాట్.

Screen - 18

ఈ సన్నివేశంలో మిగతా వారందరిపై నుండి ఫోకస్ మహేష్ బాబు పైకి తీసుకొని రావడంలో అత్యంత అద్భుతమైన పనితనాన్ని కనబరిచాడు గుహన్.

2. మహేష్ బాబు. ఒక్కడు, అర్జున్ చిత్రాల తరువాత అంతకంటే పరిపూర్ణమైన నటనని మహేష్ నుండి రాబట్టగలిగారు త్రివిక్రమ్. తక్కువ మాట్లాడుతూ ఉండే నందు పాత్రని అద్భుతంగా పోషించాడు మహేష్. ఆ సంవత్సరం ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా “నంది” పురస్కారం అందుకున్నాడు. మహేష్ బాబుని ఈ చిత్రానికి ముఖ్య ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే అతడి సినీజీవితంలో ఈ చిత్రాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు చిత్రం తరువాతే మహేష్ కి మంచి నటుడనే పేరు లభించింది.

3. కథానాయకుడు (నందు) చేతుల్లో ప్రతినాయకుడు (మల్లి) చనిపోకపోవటం. ఈ పోకడ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాల్లో కూడా కొనసాగించారు. 2005 నాటికి ఇది ఒక కొత్త విషయం.

4. త్రిష. ఇచ్చిన పాత్రని చాలా బాగా పోషించింది. ముఖ్యంగా ఈ క్రింది సన్నివేశంలో ఆమె నటన ఎవరూ మర్చిపోలేరు.

Screen - 15

ఈ చిత్రం చెప్పిన పాఠం :

కథ గొప్పగా లేకపోయినా కథనం, మాటలు, దర్శకత్వం, సంగీతం మరియు ఇతర సాంకేతిక బృందం సమిష్టి కృషి మామూలు చిత్రాన్ని కూడా గొప్ప చిత్రంగా నిలబెట్టగలవు అని “అతడు” నిరూపించాడు.

చిత్రం గురించి ఒక్క వాక్యంలో :

“అతడు” తెలుగు చలనచిత్ర గ్రంథాలయంలో చెక్కు చెదరని, చెదలు పట్టని ఓ పుస్తకం.

– యశ్వంత్ ఆలూరు

4 thoughts on “అతడు (2005)

 1. Good analysis Yashu. Few more characters and dialogues are worth mentioning like the CBI director character by K.Viswanath, second son-in-law character by Dharmavarapu and dialogues like “seetha leni ramudu, toka leni hanumanthudu”, “nuvvu adigavani cheppaledu, ninnu nammanu kabatti cheppanu”, “illu intha baguntundani teleedu atta ledante eppudo vachese vadini”, “siggutho koodina bhayam valla vachina gouravam ayyuntundi”. Ofcourse if you start analyzing the dialogues, every dialogue is a master piece and review goes into pages :-).

  The opening scene of the movie is worth mentioning here. During a heavy rain, a car comes and stops on highway with a big tree on the right. Beautiful camera work there. You can use that frame as a desktop wallpaper.

  Like

  • Thanks annayya… whatever you said I had in mind but didn’t include just because review goes high number of pages. Thanks a lot for reading and giving feedback. . 🙂

   Like

 2. Wonderful sir…wonderful … :-p
  Really awesome man…!

  1.The way you have shown the inner meaning of Nazar dialogues when he 1st met Mahesh , you caught the pulse man.
  2.Your analysis on Director’s point behind introduction of MS character and logic of introducing different characters in second half
  Complete analysis is super, why director have’nt shown about pujari family again and the way trivikram does justification to some complicated scenes with his dialogues .

  I think there will be no 1 in tollywood who does’nt know the story of this masterpiece movie so, you could have cut down the story part and can write more on other characters like viswanath etc (it wont be lengthy that way..)

  Nice work dude……!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s