సంకీర్తన – ఈ చిత్రం గురించి చాలా మందికి తెలియదు అనే అనుకుంటాను నేను. కె. విశ్వనాథ్ గారి దగ్గర సహాయకుడిగా పని చేసిన గీతాకృష్ణ ఈ చిత్రానికి దర్సకత్వం వహించారు. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం ఎక్కువ పేరు సంపాదించినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈ చిత్ర విశ్లేషణలోకి వెళ్దాం…
కథ :
ఈ చిత్రపు కథ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జరుగుతుంది. పాతకాలపు సమాజంలోని మూఢ నమ్మకాలు, వర్ణ విబేధాలు ఈ కథకు మూలాలు. ఇందులో ప్రధాన పాత్రలు కాశి (నాగార్జున), కీర్తన (రమ్యకృష్ణ).
జాలరి జాతికి చెందిన కాశి కవి, గాయకుడు. కానీ అతడి ప్రతిభ అతి కొద్ది మందికే తెలుసు. తల్లి (డబ్బింగ్ జానకి) జాలరి కావడంతో ఎటువంటి ఉద్యోగం చేయకుండా ప్రకృతితో స్నేహం చేస్తూ కవితలు, పాటలు వ్రాసుకుంటూ కాలం గడుపుతుంటాడు కాశి. ఇతనికి నలుగురు చిన్న పిల్లలు మరియు మూగవాడైన గోదారి (రాళ్ళపల్లి) స్నేహితులు.
ఉత్తమ జాతికి చెందిన కీర్తన (రమ్యకృష్ణ) ని ఆ ఊరి ప్రజలందరూ దేవతగా కొలుస్తూ ఉంటారు. ఆమె రాకతోనే ఊరికి సుభిక్షం వచ్చిందని బలంగా నమ్ముతూ ఉంటారు. పిల్లలు లేని వాసుదేవ మూర్తి (సోమయాజులు) కీర్తనని గుడి మెట్ల మీద నుండి తెచ్చుకొని పెంచుకోవడం నచ్చని అతని భార్య కీర్తనని ఇంట్లో ఛులకనగా చూస్తూ ఉంటుంది. ప్రతి యేటా దుర్గాదేవి ఉత్సవాల్లో నాట్యం చేసే కీర్తన కి గురువు పరమేశ్వరశాస్త్రి (గిరీష్ కర్నాడ్). ఓసారి కీర్తన నృత్య ప్రదర్శన చూసిన కాశి, తన కవితకి ఆమెని ప్రేరణగా తీసుకుంటాడు. ఆమెని “కవితా దేవత” గా వర్ణించి కవితలు వ్రాస్తాడు. అతడి కవితలని కాశి స్నేహితులైన నలుగురు పిల్లలు కీర్తనకి చేరవేస్తారు. ఆ కవితలు చదివిన కీర్తన కాశిని ప్రేమిస్తుంది.
ఇంతలో ఆ గ్రామానికి వస్తాడు ఆ ఊరి ధనవంతుడు శ్రావణ్ (శరత్ బాబు). చిత్రకారుడు అయిన శ్రావణ్, కీర్తన నాట్యం చూసి ఆమెని ప్రేమిస్తాడు. కానీ కీర్తన కాశిని ప్రేమిస్తోంది అని తెలిసి తన ప్రయత్నం విరమించుకుంటాడు. కాశి లోని కళ అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో అతడి గాన కచేరి కూడా ఏర్పాటు చేయిస్తాడు. ఇంతలో కాశి తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది.
కీర్తనని విదేశాలకు తీసుకొనివెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తానంటాడు శ్రావణ్. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి ఊరి గుడ్డి నమ్మకాన్ని వాడుకుంటుంది. జాతరలో అమ్మవారు పూనినట్లుగా నటించమని ఒకరికి తాయిలం ఇస్తుంది. దాంతో ఆ మహిళ ఊరి దేవత దుర్గాదేవి కోరిక మేరకు కీర్తన జీవితాంతం కన్యగా మిగిలిపోవాలని పలుకుతుంది. దానితో డీలా పడిపోయిన కీర్తనని శాస్త్రి ఓదారుస్తాడు. అప్పుడే కీర్తన తనని ప్రేమిస్తోంది అన్న విషయం తెలుసుకున్న కాశి ఆ ప్రేమని అంగీకరిస్తాడు. తను హైదరాబాద్ నుండి తిరిగొచ్చాక కాశిని, కీర్తనని ఎలాగైనా కలుపుతానని అంటాడు శ్రావణ్. ఈ విషయం తెలుసుకున్న తల్లి పెట్టిన బాధని భరించలేని కీర్తన తాండవం చేస్తుండగా కాశి ఆమెని ఆపి వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఊరి జనం కాశిని ఊరి నుండి బహిష్కరిస్తారు.
ఇక్కడ కథ ఒక మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు కీర్తన తన తండ్రి అనుకున్న వాసుదేవ మూర్తి తన తండ్రి కాదని, అతడికి కీర్తన ఓ గుడి మెట్ల మీద దొరికింది అని తెలుస్తుంది. కీర్తన అసలు తండ్రి శాస్త్రి అన్న విషయం స్వయంగా శాస్త్రి కీర్తనకి చెప్తాడు. కట్టుబాట్లకు, కులమతాలకు భయపడి తన భార్యను, కీర్తనను దూరం చేసుకున్నాను అని, ప్రజల గుడ్డి నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని కీర్తన దుర్గాదేవి అంశ అని అందరిని నమ్మించాను అని చెప్తాడు. కీర్తనని తన జీవితాన్ని సంఘానికి బలి ఇవ్వొద్దని హితవు చెప్పి పంపుతాడు. ఇదంతా తెలుసుకున్న ఊరి జనం శాస్త్రి ని చావబాదుతారు.
ఊరు వదిలి వెళ్ళిపోతున్న కాశితో కీర్తన కూడా కదలటంతో కాశిని చంపి తమ దేవతని తీసుకొని రావటానికి బయలుదేరుతారు ఊరి జనం. ఇంతలో కాశిని చావబాది కీర్తనని అపహరిస్తారు ఓసారి కాశి చేతిలో దెబ్బలు తిన్న జమీందారు కొడుకు (సాయికుమార్), అతని స్నేహితుల బృందం. జమీందారు కొడుకుని చంపి వారి నుండి కీర్తనని, కాశిని కాపాడతాడు గోదారి. ఇంతలో కాశిని చంపడానికి వస్తున్న జనానికి అడ్డుపడతాడు అప్పుడే తిరిగొచ్చిన శ్రావణ్. ప్రేమికులని చంపడం మానేసి తమలోని అజ్ఞానాన్ని చంపమని హితవు చెప్పి కాశిని, కీర్తనని తనతో తీసుకొని బయలుదేరటంతో కథ ముగుస్తుంది.
కథనం :
ఈ చిత్రం కథలోనే కాదు, కథనంలోనూ కె. విశ్వనాథ్ గారి ప్రభావం ప్రస్ఫుటంగా కనపడుతుంది. కథనం బొత్తిగా ప్రేక్షకుడికి ఆసక్తిని కానీ, ఆనందాన్ని కానీ కలిగించదు. గోదావరి జిల్లాలోని పచ్చని పొలాల్లో చిత్రీకరించిన పాటలు చిత్రానికి ఉన్న కాస్త బలం అని చెప్పుకోవాలి. వర్ణ బేధాలు అనే అంశం మీద అప్పటికే కె. విశ్వనాథ్ 1981 లో “సప్తపది” చిత్రం తీసి విజయాన్ని సాధించారు. మళ్ళీ అదే సూత్రం మీద చిత్రం తీయడం, అది కూడా బోరు కొట్టించే విధంగా చెప్పడం ఈ చిత్రానికి బలహీనతగా మారింది.
నటీనటుల ఎంపిక కూడా సరి అయినది కాదు అని అనిపించింది. నర్తకిగా రమ్యకృష్ణ కొత్తగా ఉన్నప్పటికీ బహుశా తను నిజ జీవితంలో నర్తకి కాకపోవటం ఆ పాత్రకు ఆమె సరిపోలేదు అనడానికి ఒక కారణం కావొచ్చు. కానీ తన పాత్రకు కావాల్సిన నటనని పూర్తిగా ఇచ్చారు రమ్యకృష్ణ. నాగార్జున కూడా తన పాత్రకి సరైన న్యాయమే చేశారు. ఇక ఈ చిత్రంలో పూర్తిగా పనికిరాకుండా పోయిన పాత్ర శ్రావణ్ (శరత్ బాబు). ఆఖరులో కాశిని, కీర్తనని అప్పటికే గోదారి కాపాడేశాడు. ఆ క్షణంలో శ్రావణ్ పాత్ర ప్రవేశం ఉన్నా, లేకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. కథనం కోసమే సృష్టించిన పాత్రలు మల్లికార్జునరావు, నర్రా వెంకటేశ్వరరావులవి. వీటి ప్రవర్తన కూడా విశ్వనాధ్ చిత్రాల పాత్రలనే తలపిస్తాయి కొత్తగా ఏమి లేవు.
ఈ కథనానికి మరి కాస్త బలం ఇచ్చింది తనికెళ్ళ భరణి మాటలు. కాశి పాత్ర కవి అవ్వడం భరణి గారికి కాస్త ఊతం ఇచ్చింది. ఒక సన్నివేశంలో సముద్రతీరం లో నడుస్తున్న కాశి, కీర్తన ల మధ్య జరిగే సంభాషణలో వచ్చే కవిత్వపు మాటలు చాలా అందంగా ఉంటాయి. మరో మంచి మాట శ్రావణ్ ఒక సన్నివేశంలో పలుకుతాడు. కీర్తన కాశిని ప్రేమిస్తోందని తెలుసుకున్న తరుణంలో బొమ్మను గీయటం ఆపేసిన శ్రావణ్ తన పాలేరుతో “నా స్వార్థాన్ని గీద్దామనుకున్నాను అందుకే అర్థాంతరంగా ఆగిపోయింది” అంటాడు. కథనం పరంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన మాట.
మొత్తానికి ఈ రెండు గంటల పదహారు నిమిషాల చిత్రం నిరాశపరిచే చిత్రం అనే చెప్పొచ్చు.
బలాలు :
1. మొదటి బలం మరియు ముఖ్యమైన బలం ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా గారి సంగీతమే. అద్భుతమైన పాటలే కాకుండా హత్తుకునే నేపథ్య సంగీతం కూడా ఇచ్చారు రాజా గారు. వారి సంగీతానికి ఆత్రేయ, సినారె, సిరివెన్నెల అద్భుతమైన సాహిత్యాలు కూడా తోడయ్యాయి.
2. భరణి గారి మాటలు. ముఖ్యంగా కీర్తనని మొదటిసారి చుసినప్పుడు కాశి చెప్పే కవిత.
3. పాటల చిత్రీకరణ. ముఖ్యంగా “వేవేలా వర్ణాలా”, “మనసున మొలిచిన సరిగమలే”, “దేవీ దుర్గాదేవి” మరియు “మనసే పాడేనులే” అంటూ సాగే గీతాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది.
బలహీనతలు :
1. కొత్తదనం లేని కథ.
2. కథ, కథనం మరియు దర్సకత్వం పై ఉన్న విశ్వనాథ్ గారి ప్రభావం దర్శకుడికి ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు రాకుండా చేసింది.
3. ఆకట్టుకోలేని, ఆనందం లేని కథనం.
ఈ చిత్రం చెప్పిన పాఠం :
వేరొక దర్శకుల నుండి స్ఫూర్తి పొందాలి కానీ వాళ్ళని అనుకరించకూడదు.
– యశ్వంత్ ఆలూరు