మనం (2014)

Screen - 1

కొన్ని చిత్రాలకు విశ్లేషణ వ్రాస్తే బాగోదు. కొన్ని చిత్రాలకు వ్రాయకపోతే బాగోదు. అలాంటి చిత్రాల్లో, ఈ మధ్య కాలంలో అనిపించిన చిత్రం అక్కినేని వారి మూడు తరాలు కలిసి నటించిన “మనం”. మూడు తరాలు అనేసరికి మూల కథకు ఎన్నో ప్రత్యేకతలు జోడించి వ్రాసి ఉంటారు అనే భావన కలుగుతుంది. కానీ ఈ చిత్రపు కథలో అలాంటి ప్రత్యేకతలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇందులో కథే ప్రత్యేకతమైనది కాబట్టి. అలాంటి కథకి సున్నితమైన కథనం తోడయ్యింది. ఓ పెద్ద చలనచిత్ర కుటుంబం ఇంతకంటే మంచి చిత్రంలో కలిసి నటించలేరనే భావన కలిగించింది “మనం”. ఎంతోమంది అనుభవజ్ఞులు, విజయాలు సాధించిన దర్శకులను వదిలేసి తక్కువ చిత్రాలు చేసిన విక్రం.కె.కుమార్ ని నమ్మి స్వీయ నిర్మాణంలో నాగార్జున ఈ చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఇది ఒక రకమైన సాహసమే.

కథ :

అది 1983, రాధామోహన్ (నాగచైతన్య), కృష్ణవేణి (సమంత) పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారా ఒకటైన దంపతులు. వీరికి ఆరేళ్ళ కొడుకు (పాత్ర అసలు పేరు నాగేశ్వరరావు) బిట్టు. అతడి పుట్టినరోజు వేడుకకు రాధ, కృష్ణ ఓ వీడియోని బహుమతిగా ఇవ్వటంతో కథ మొదలవుతుంది. ఆ తరువాతే వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలుస్తుంది. మరుసటి రోజు (14 ఫిబ్రవరి 1983) విడాకులు తీసుకోవడానికి వెళుతుండగా కారు ప్రమాదంలో రాధ, కృష్ణ మరణిస్తారు. వారు మరణించిన ప్రదేశంలో ఒక “క్లాక్ టవర్” ఉంటుంది, అందులో సమయం 10:20 ఉంటుంది.

కొన్ని సంవత్సరాల తరువాత…

ప్రస్తుత కాలం, ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారం అందుకుంటాడు నాగేశ్వరరావు (నాగార్జున). ముంబై నుండి హైదరాబాద్ వెళ్ళే విమానంలో అతడికి పరిచయం అవుతాడు నాగార్జున (నాగచైతన్య). తన తండ్రి మళ్ళీ పుట్టాడని అతడి చేతి మీదున్న మచ్చ ద్వారా కనుక్కుంటాడు నాగేశ్వరరావు. తండ్రి పుట్టాడు కనుక తల్లి కూడా మళ్ళీ ఎక్కడో పుట్టి ఉంటుందని ఆమె కోసం వెతుకుతూ ఉండగా ఓ చోట తన తల్లి ప్రియ (సమంత) రూపంలో కనపడుతుంది. ఇక అక్కడినుండి తనను బిట్టుగా నాగార్జున, ప్రియలకు పరిచయం చేసుకొని ఆనందంగా గడుపుతుంటాడు నాగేశ్వరరావు.

ఇంతలో నాగేశ్వరరావుకి పరిచయం అవుతుంది డాక్టర్ అంజలి (శ్రియ). ఓ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఇద్దరు కలిసి ఆసుపత్రికి తరలించి, ఆ వ్యక్తికి నాగేశ్వరరావు రక్తదానం కూడా చేస్తాడు. ఆ వ్యక్తి చైతన్య (నాగేశ్వరరావు). నాగేశ్వరరావు, అంజలిని చూసి తనకు చిన్నప్పుడే దూరమయిన తన తల్లిదండ్రులు మళ్ళీ పుట్టారని ఆనందపడతాడు చైతన్య.

ఆ తరువాత నాగేశ్వరరావు, అంజలిల పూర్వజన్మ కథ ఏమిటి? ప్రస్తుత జన్మలో నాగార్జున – ప్రియ, నాగేశ్వరావు – అంజలి ఎలా తమ ప్రేమను గెలుచుకున్నారు? తమ తల్లిదండ్రులు మళ్ళీ కలవటానికి నాగేశ్వరావు, చైతన్య ఏమి చేశారు అనే అంశాలపై మిగతా కథ సాగుతుంది.

కథనం :

ఈ చిత్రానికి ప్రధాన బలం కథే. కాకపోతే అది చాలా చిక్కుముళ్ళు ఉన్న కథ. జన్మజన్మల ప్రేమ గురించి ఇదివరకే మూగమనసులు, జానకిరాముడు, మగధీర లాంటి చిత్రాలు వచ్చి విజయాలు సాధించాయి. అదే కోవకి చెందిన ఈ కథను కూడా అదే దారిలో నడిపిస్తే కొత్తదనం ఉండదు. అందుకే కథలో చాలా చిక్కుముళ్ళు వేసుకున్నాడు దర్శకుడు. వేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ అవి విప్పుకునే పని ప్రేక్షకుడికి ఎక్కడా కలిపించకపోవటం దర్శకుడి మేధాశక్తికి నిదర్శనం. ప్రేక్షకుడికి దీన్ని చాలా అందంగా, వినోదాత్మకంగా చెప్పాడు. ఇందులోని మూడు విభిన్నమైన కథలను ఎంత బాగా తెరకెక్కించాడో వాటి అనుసంధానం కూడా అంతే బాగా చేశాడు అనిపించింది.

చిత్రం మొదలు అవ్వగానే మనకు పరిచయం అయ్యే మొదటి కథ రాధామోహన్, కృష్ణవేణి ల కథ.

Screen - 2

బిట్టు పుట్టినరోజు వేడుక జరిపే సమయంలోనే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని తెలుస్తుంది. అసలు వీరిద్దరు ఎలా ఒకటి అయ్యారు, ఆ గొడవలు ఎలా వచ్చాయి అనే విషయాలు అర్థమయ్యేలా ఒక పాటలో చూపించేశాడు దర్శకుడు. నిజానికి ఈ విషయం చెప్పటానికి కనీసం పది లేదా ఇరవై నిమిషాల సమయం కావాలి. కానీ ఓ అయిదు నిమిషాల పాటలో మొత్తం అర్థమయ్యేలా చూపించటం అతని ఆలోచన విధానాన్ని తెలుపుతుంది. ఇదే కథలో భార్యాభర్తలకు ఒక కొత్త సలహా కూడా ఇచ్చాడు దర్శకుడు. అదే, గొడవపడిన ప్రతిసారీ హుండిలో ఓ బిళ్ళ వేసి దానితో పోగయిన డబ్బుతో ఇంటి కోసం ఏదోటి కొనటం.

Screen - 3

ఇలాంటి గొడవ ఇదివరకు చూడలేదు కనుక ప్రత్యేకంగా చెప్పాల్సివస్తోంది.

ఇక ప్రస్తుత కథలో మనకు పరిచయం అయ్యే మొదటి పాత్ర మధ్య వయస్కుడైన నాగేశ్వరరావు (బిట్టు).

Screen - 5

జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగినప్పటికీ దూరమైన తల్లిదండ్రులనే తలచుకుంటూ బ్రతికే పాత్ర. ఈ పాత్ర తన తండ్రి మళ్ళీ పుట్టాడని గుర్తిస్తుంది, అదీ ఈ జ్ఞాపకం ద్వారా…

Screen - 6

ఒక పాత్ర తదుపరి జన్మలో మళ్ళి పుట్టింది అని ఇలా కొన్ని గుర్తులు ఉంచుకోవటం, వాటిని వాడుకోవటం చాలా బాగుంది. ఈ సన్నివేశం కూడా నవ్వు తెప్పించే ప్రయత్నం చేసింది.

తండ్రిని కనుగొన్న బిట్టు తల్లి కోసం గాలిస్తాడు. ఇక్కడ ఓ షాట్ లో అమల తళుక్కున మెరుస్తుంది. సరిగ్గా తన తల్లిదండ్రులు చనిపోయిన సమయానికే అతడి తల్లి కనపడుతుంది.

Screen - 7

అసలు ఈ చిత్రంలో కథకు ఉపయోగపడే ముఖ్యమైన సన్నివేశాలన్నీ సరిగ్గా 10:20 కే చోటుచేసుకుంటాయి. అది ఎందుకు అనే విషయాన్ని దర్శకుడు చెప్పలేదు. ఇలాంటిదే మరో సన్నివేశం సమంత, నాగచైతన్య ఇంద్రధనుస్సు ని చూసి ఫోటో తీసుకునే సన్నివేశం.

Screen - 8

పైన ఎర్రని చతురస్రంలో చూస్తే సమయం 10:20 గా కనపడుతుంది.

Screen - 9

ఇక కథలో పెద్దగా అవసరంలేని పాత్రలు ఇవి. ఫాదర్ ఫ్రాన్సిస్ (ఎమ్మెస్ నారాయణ) మరియు గిరీష్ కర్నాడ్ (బ్రహ్మానందం). ఇవి పండించిన హాస్యం కూడా మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకొని నవ్వే హాస్యం కాదు. అక్కినేని కుటుంబం నటించే ప్రత్యేక చిత్రం కనుక వీటికి ఈ ఇద్దరు అనుభవజ్ఞులను ఎంపిక చేసుకున్నట్టు అనిపించింది. కానీ కథనంలో ఈ పాత్రలు ఉడతాభక్తి గా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. ఫాదర్ ఫ్రాన్సిస్ వల్లే నాగర్జున (నాగచైతన్య) పాత్ర మళ్ళీ బిట్టుని కలుసుకుంటుంది. గిరీష్ కర్నాడ్ ని ఉపయోగించుకొనే బిట్టు ప్రియకి మరింత దగ్గర అవుతాడు, నాగార్జున (నాగచైతన్య) ప్రేమ వ్యవహారం చెడగొడతాడు.

ఇక్కడ ఓ సన్నివేశం చూసి నా స్నేహితుడు ఒకడు ఆ సన్నివేశం అప్పటివరకు తనకు బిట్టు పాత్రపై ఉన్న గౌరవాన్ని పోగొట్టింది అన్నాడు. అది నాగార్జున (నాగచైతన్య) బిట్టు కోసం అతని ఆఫీసు కి రాగా గిరీష్ కర్నాడ్ అతడిని వారిస్తాడు. అది చుసిన బిట్టు ఆవేశంలో గిరీష్ కర్నాడ్ పై చేయి చేసుకుంటాడు. ఇక్కడ ఈ సన్నివేశం కాకుండా, బిట్టు గిరీష్ కర్నాడ్ కి వచ్చింది ఎవరో తెలియదు కనుక అతడికి నచ్చజెప్పి నాగార్జున (నాగచైతన్య) ని లోపలికి తీసుకొని వెళ్లుంటే బాగుండేది అని నా స్నేహితుడి అభిప్రాయం.

Screen - 10

కానీ నా అభిప్రాయం, ఇక్కడ బిట్టులోని వ్యాపారవేత్త కోణం చూపించాడు దర్శకుడు అని. సహజంగా వ్యాపారవేత్తలు తమకు కావాల్సినవారికి ఎవరైనా అడ్డుపడితే ఇలాగే స్పందిస్తారు. ఇది నాకు వ్యాపారవేత్తలను చూసిన అనుభవం కూడాను. (నన్నెవరూ ఇలా కొట్టలేదులెండి). ఇది నా విశ్లేషణ. కానీ సగటు ప్రేక్షకుడికి ఈ సన్నివేశం నవ్వు తెప్పించి ఉండొచ్చు.

తరువాత కథనంలో తళుక్కుమనే పాత్ర ప్రతాప్ (అమితాబ్ బచ్చన్).

Screen - 11

ఇది కథనాన్ని మలుపు తిప్పే పాత్ర కాదని, కేవలం ఓ ప్రత్యేకత కోసమే పెట్టిన పాత్ర అని నాగార్జున చిత్రం విడుదలకు ముందే చెప్పేశారు కనుక ఇబ్బంది లేదు. నాగార్జునతో అమితాబ్ కి స్నేహం ఉంది కనుక దీనికి ఆయన ఒప్పుకున్నారు. ఈ పాత్రకి ప్రత్యేకమైన డబ్బింగ్ కూడా లేదు. లైవ్ రికార్డింగ్ లో అమితాబ్ తన గొంతుతోనే ఇంగ్లీష్ లో మాట్లాడారు.

దీని తరువాత వచ్చే సన్నివేశం జనాన్ని తికమక పెట్టడానికి విడుదల చేసిన ఓ ట్రైలర్ లోని సన్నివేశం. తను ఎకనామిక్స్ పరీక్ష పాస్ అయినందుకు ప్రియా వ్యక్తపరిచే “పిచ్చి” ఆనందం. ఆ పిచ్చితో, ఆసుపత్రిలో చేరిందని తెలియగానే బిట్టు కంగారుపడి తన మిత్రుడు ప్రతాప్ (అమితాబ్ బచ్చన్) కి ఫోన్ చేసి వైద్యులందరినీ కంగారు పెట్టే సన్నివేశం.

Screen - 12

“నాగేశ్వర్ అంటే ఎవరనుకుంటున్నారు?” అని పదే పదే అతడి పేరు జపించే సమంత కి సంబంధించిన ఓ ట్రైలర్ చిత్రం విడుదల కాకముందు విడుదల చేశారు. అప్పటికి ప్రేక్షకులకి నాగేశ్వరరావు అంటే ఎవరో తెలియదు కనుక ఆ ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. కానీ చిత్రంలో ఈ సన్నివేశం వచ్చే సమయానికి నాగేశ్వరరావు అంటే ఎవరో అందరికి తెలిసిపోయింది కాబట్టి ఈ సన్నివేశంలో ఆసక్తికర విషయం ఏదీ కనిపించలేదు. మొదటిసారి చూసినప్పుడు కొందరు నవ్వి ఉండొచ్చు కానీ రెండోసారి చూస్తే ఈ సన్నివేశం అనవసరం అనే భావన కలుగుతుంది సగటు ప్రేక్షకుడికి. కానీ నాలాంటి విశ్లేషకుడికి, ఈ సన్నివేశంలో వైద్యులందరినీ కంగారు పెట్టడం కూడా బిట్టు పాత్రలోని వ్యాపార కోణాన్ని బయటపెట్టడం కోసమే అనిపిస్తుంది. ఆ తరువాత బిట్టు, ప్రియా ఉంటున్న హాస్టల్ ని సమూలంగా (గిరీష్ కర్నాడ్ ద్వారా) మార్చివేయటం తో వారి బంధం మరింత బలపడుతుంది.

తరువాత కథనంలో పైన చెప్పుకున్న విధంగా ఉడతాభక్తి గా కథకి తన సాయం అందించటానికి ప్రవేశించే పాత్ర పోసాని కృష్ణమురళి పాత్ర.

Screen - 13

అతడు నాగార్జున (నాగచైతన్య) ని అరెస్ట్ చేయటం వల్ల బిట్టు, నాగార్జున (నాగచైతన్య) ఈసారి మరింత దగ్గర అవుతారు. ఈ సన్నివేశంలో బిట్టు పాత్ర ప్రాముఖ్యతని తెలపటానికి తళుక్కున మెరిసే పాత్ర హోంమంత్రి (జయప్రకాష్ రెడ్డి). వ్యాపారవేత్తలకు రాజకీయపరంగా కూడా బలం ఉంటుందని తెలిపే ప్రయత్నమే ఇది అని నా అభిప్రాయం. కానీ పైన ఆసుపత్రి సన్నివేశం లాగానే ఇది కూడా రెండోసారి చూస్తే అలరించే సన్నివేశం కాదు. మొదటిసారి కూడా ఒక్క మాటే కాస్త నవ్వు తెప్పిస్తుంది. హోంమంత్రి సెక్రటరీ “ట్రెడ్మిల్ మీద పాదయాత్ర ప్రాక్టిసు చేయటం ఏంట్రా?” అంటాడు. ఇది మినహాయించి ఈ సన్నివేశం, పోలీసు స్టేషన్ లో పోసాని అందరిని నిలబెట్టి బెదిరించే సన్నివేశం ఈ కథకు, కథనానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. బహుశా ఇది మాస్ ప్రేక్షకులకు కాస్త వినోదం పంచే ప్రయత్నం కావొచ్చు. దానికోసమే ఈ పాత్రకి పోసానిని తీసుకోవడం జరిగిందేమో. కథాపరంగా వెళ్ళాలి అనుకుంటే అతడు విచారణ చేయకుండా అందరినీ జైలులో పెట్టి, తరువాత బిట్టు ఫోను ద్వారా వారిని విడుదల చేసుంటే సరిపోయేది అని నా అభిప్రాయం. బిట్టు స్టేషన్ కి వచ్చి పోసనిని బెదిరించటం, అతడు తరువాత బిట్టు కి, నాగార్జున (నాగచైతన్య) కి సలాం కొట్టడం ఓ రెండు నిముషాలు చిత్రం నిడివిని పెంచిందే తప్ప మరే ఉపకారం చేయలేదు.

దీని తరువాత వచ్చే “కనిపెంచిన మా అమ్మకే” అనే గీతాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. మొదట్లో చెప్పుకున్న విధంగా ఎక్కువ సమయం తీసుకునే కథనాన్ని ఓ నాలుగు నిమిషాల పాటలో సాగించాడు దర్శకుడు. ఇలాంటి పనితనమే పైన రెండు సన్నివేశాల్లో చూపించి ఉంటే బాగుండేది.

తరువాత వచ్చే సన్నివేశం నాగర్జున (నాగచైతన్య) తన ప్రేమ (రాశి ఖన్నా) ని తీసుకొని వచ్చి బిట్టుకి పరిచయం చేసే సన్నివేశం.

Screen - 14

పై రెండు సన్నివేశాలకంటే ఇది కాస్త ఉపయోగకరమైన సన్నివేశమే. ఇక్కడ బిట్టు పాత్ర తన తల్లిదండ్రులు మళ్ళీ ఒకటి కారేమో అని పడే కంగారుని చూపించింది. ఇక్కడ నాగార్జున గారి అభినయం అటు కంగారుని, ఇటు భయాన్ని బాగా చూపించింది. ఇక్కడ గిరీష్ కర్నాడ్ పాత్రని మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం దక్కింది.

తరువాత కథలోని అతి ముఖ్యమైన ఘట్టం వస్తుంది. అదే నాగేశ్వరరావు (నాగార్జున) కి అంజలి (శ్రియ) కి పరిచయం. అప్పటివరకు కొడుకుగా ఉన్న పాత్ర ప్రేమికుడిగా మారిపోతుంది.

Screen - 15

ఇక్కడ ఇదివరకు మన తెలుగు చిత్రాల్లో చాలాసార్లు వాడుకున్న “ప్రియుడి హృదయ స్పందన” అనే అంశాన్ని వాడుకున్నారు. ఇది అస్తమానం చలనచిత్రాల్లోని తర్కాన్ని పరిశీలించే కొద్దిమంది భౌతిక శాస్త్రవేత్తల మనసులలో ప్రశ్నలకు తావు ఇవ్వొచ్చు. అన్నీ నిజ జీవితాల్లోనే జరిగితే చలనచిత్రాల్లో ఊహ, సృజనాత్మకత అనే పదాలకు అర్థమే లేకుండా పోతుందిగా! ఇక్కడ పరిచయం అయ్యే అంజలి పాత్ర మాటల్లో తడబడే లక్షణం (నత్తి) ఉంటుంది. దాన్ని శ్రియకు గాత్రదానం చేసిన సునీత బాగానే పండించారు.

ఇక్కడ నాగేశ్వరరావు (నాగార్జున) నుండి రక్తదానం అందుకుంటూ చైతన్య (నాగేశ్వరరావు) పాత్ర పరిచయం అవుతుంది.

Screen - 16

నాగేశ్వరరావు (నాగార్జున), అంజలి ని చూసి చైతన్య (నాగేశ్వరరావు) “అమ్మ!”,”నాన్న!” అంటాడు. ఈ సన్నివేశం మొదటిసారి చూసినవారికి ఆశ్చర్యం, రెండోసారి చూసేవారికి నవ్వు తెప్పిస్తుంది. ఇక్కడ కథను నమ్ముకొనే వెళ్ళినందుకు దర్శకుడు విక్రం ని, నిర్మాత నాగార్జున ని అభినందించాలి. సాధారణంగా ఇలాంటి ప్రత్యేకమైన చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలన్నింటినీ మొదట్లోనే పరిచయం చేసేసి, తరువాత వాటిని ప్రతి సన్నివేశంలోనూ ఉంచాలని, ఉంచలేక విఫలమవుతారు సాధారణ కమర్షియల్ దర్శకులు. దానికి భిన్నంగా వెళ్లినందుకే ఆ ఇద్దరికీ అభినందనలు. చైతన్య (నాగేశ్వరరావు) పాత్రని ఇక్కడ పరిచయం చేయటం వల్ల, ఇక్కడ విరామం ఇవ్వటం వల్ల కథలోనూ, కథనంలోనూ ఆసక్తిని పెంచింది.

ఇక చిత్రం రెండో భాగంలో మనకు పరిచయం అవుతుంది ఓ చక్కని కథ. అదే నాగేశ్వరరావు (నాగార్జున), అంజలి (శ్రియ) ల పూర్వజన్మ కథ. ఇది 1920 ప్రాంతంలో జరిగే కథ. ఇక్కడ దర్శకుడు మళ్ళీ తెలివిని ఉపయోగించాడు. మొదట రాధ, కృష్ణల కథ తనే చెప్పాడు. ఈ కథని చైతన్య (నాగేశ్వరరావు) ద్వారా చెప్పించాడు. తన తల్లిదండ్రుల ప్రేమకథ వారిని చిన్న వయసులోనే కోల్పోయిన ఇతనికి ఎలా తెలుసు అనే సందేహం ఎవరికీ కలుగకుండా, అది నాయనమ్మ వొళ్ళో పడుకున్నప్పుడు అనేకసార్లు విన్న కథ అని చెప్పించాడు.

ప్రస్తుత జన్మలో నాగేశ్వరరావు (నాగార్జున), అంజలి (శ్రియ) ఎలా పరిచయం అయ్యారో పూర్వజన్మ లోనూ సీతారాముడు (నాగార్జున), రామలక్ష్మి (శ్రియ) అలాంటి సన్నివేశంలోనే పరిచయం అవుతారు.

Screen - 17

ఇక్కడ కూడా తన బామ్మని కాపాడుకోవడానికి రామలక్ష్మి, సీత ని వెంట తీసుకొని వెళ్తుంది. ఆమెకి అతను ఓ దొంగగా పరిచయం కావటం, తరువాత ఆవిడ ఆశయం తెలుసుకొని ఆవిడకి సహాయం చేయడం, ఈ క్రమంలో వారిద్దరి స్నేహం బలపడటం చాలా అందంగా, హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ కథని ప్రతిబింబించేలా చంద్రబోస్ తన పాటలో “ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే”, “నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే” అనే వాక్యాలతో సున్నితంగా ఆ పాటను వ్రాశారు. ఈ కథలో శ్రియ ఆహార్యం, అభినయం ఆ పాత్రకి పూర్తి న్యాయం చేశాయి. నాగర్జున (నాగచైతన్య) పాత్రకు పుట్టుమచ్చలా ఈ పాత్రకి నత్తిని మరో జన్మ కోసం ఓ ప్రత్యేకతగా ఉంచాడు దర్శకుడు. “I LOVE YOU” అనే ఆంగ్ల వాక్యానికి “ఇలా ఇవ్వు!” అనే గమ్మత్తైన అర్థాన్ని కూడా ఈ కథలో చెప్పాడు.

ఇక్కడ వచ్చే ఓ అందమైన షాట్ ఇది…

Screen - 18

ఈ కథకి ముగింపు పలికే ధాతువుల్లో ఇది ఒకటి…

Screen - 19

అసలు ఈ చిత్రంలో కథకి, ఫిబ్రవరి 14వ తేదీ 10:20 కి సంబంధం ఏమిటో దర్శకుడు చెప్పాలి అనుకోలేదు. ఈ విషయమై కొద్దిమంది విమర్శకులు అది ప్రేక్షకులకే వదిలేశాడేమో అన్నారు, మరి కొద్దిమంది దర్శకుడు మర్చిపోయాడు అన్నారు. నేను దీని గురించి ఏమీ అనడంలేదు. దర్శకుడు కథలో వదిలేసినట్టు నేను ఈ విశ్లేషణలో వదిలేస్తున్నాను.

Screen - 20

మొదటి ట్రైలర్ నుండే నాకు బాగా నచ్చిన షాట్ ఇది. సీతారాముడి నోటిలో నుండి రక్తం వచ్చే షాట్ ని చాలా బాగా తీశాడు ఛాయాగ్రహకుడు వినోద్.

అసలు కథలు ఇక్కడితో అయిపోయాయి కనుక ఇక పిల్లలు (నాగేశ్వరరావు, చైతన్య) తమ తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం మొదలుపెడతారు. చైతన్య (నాగేశ్వరరావు) నాగేశ్వరరావు (నాగార్జున) ఇంటికి చేరుకుంటాడు. ఇక్కడ, తను తన కుటుంబంతో సంపూర్ణంగా జీవించానని చెప్పిన ఈ వృద్ధుని కోసం తన కుటుంబసభ్యులు ఎవరూ రాలేదేంటి అన్న సందేహాలు వదిలేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ భాగంలో కాస్త హాస్యాన్ని మేళవించారు కథనంలో. ఇక్కడ నాగచైతన్య నటనలో పరిణితి పొందాడు అనిపిస్తుంది.

Screen - 21

ఈ సన్నివేశమే అందుకు ఉదాహరణ. ఇక్కడ తాత, మనవడు చాలా తేలికగా నటించి మెప్పించారు.

అక్కినేని నాగేశ్వరావు గారి మరణంతో నిరాశపరిచింది “పియో పియో” గీతం. ఆయన కూడా ఉండుంటే ఈ గీతం మరింత రక్తి కట్టేది. కానీ ఆయన “ప్రేమనగర్” చిత్రంలోని గీతాన్ని వాడుకొని ఈ పాటని బాగానే నెట్టుకొచ్చారు.

ఇక ప్రియ (సమంత) కి కూడా 10:20 సమయానికే తన గతం గుర్తొస్తుంది. ఆ తరువాత నాగార్జున (నాగచైతన్య) ని బిట్టు గదిలో చూసి అతనికి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటుంది. ఇదే సమయంలో మనకు మరో ఉడుత పాత్ర పరిచయం అవుతుంది.

Screen - 22

నాగార్జున (నాగచైతన్య), ప్రియలను కలిపే ప్రయత్నం చేస్తుంది ఈ పాత్ర. అలీ హాస్యం పండించడానికి తన వంతు ప్రయత్నం తనదైన శైలిలోని సంభాషణలతో ప్రయత్నించారు, ప్రేక్షకులను నవ్వించగాలిగారు.

ఇక కథ అసలైన అంతిమ ఘట్టంలోకి వెళ్తుంది. మొదటి సన్నివేశం నాగేశ్వరరావు (నాగార్జున), అంజలి (శ్రియ) లు మళ్ళీ ఒకటవ్వడం. చైతన్య (నాగేశ్వరరావు) తన కర్తవ్యం నెరవేరిందని ఆనందపడటం.

Screen - 23

ఇక్కడ అనూప్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశానికి చాలా తోడయ్యింది. అలాగే “ఇలా ఇవ్వు!” అనే తెలుగు మాటకి ఆంగ్లంలో “I LOVE YOU” అని తిరిగి అర్థం చెప్పాడు దర్శకుడు.

Screen - 24

తన మీద పెట్టిన చివరి షాట్ లో, అనారోగ్యంతో ఉన్నా, తనకు సినిమా పై ఎంత అభిమానం ఉందో చూపించారు అక్కినేని. చిత్రసీమకి ఈయనను ఓ కన్నుగా ఎందుకు అందరూ అభివర్ణిస్తారో ఈ షాట్ లో ఆయన చిరునవ్వు చెప్తుంది. ఇది తెలుగుతెరపై ఎప్పటికీ నిలిచిపోతుంది.

ఇక నాగార్జున (నాగచైతన్య), ప్రియ (సమంత) మళ్ళీ ఒకటయ్యే సన్నివేశంలోనూ నాగచైతన్య బాగా నటించాడు.

Screen - 25

కానీ ఇక్కడ హర్షవర్ధన్ వ్రాసిన సంభాషణలు మరింత బరువుగా ఉండుంటే బాగుండేదనినిపించింది. అవి బాగా తేలికగా అయిపోయాయి.

ఆఖరులో ఈ కథకు గండమైన ఫిబ్రవరి 14 వస్తుంది. ప్రతీ కథలో ఎలాంటి సంఘటనలు జరిగాయో మళ్ళీ అవే పునరావృతం అవుతాయి. కానీ వారందరినీ ఆ గండం నుండి బయటపదేస్తుంది అఖిల్ (అఖిల్ అక్కినేని) పాత్ర.

Screen - 26

ఈ పాత్ర ప్రవేశంతో ఈ చిత్రంలో అక్కినేని అనే ఇంటిపేరు ఉన్న నటులంతా (మొదట్లో కనిపించిన అమలతో కలిపి) నటించినట్టు అయ్యింది. ఈ చిత్రం చుసిన ప్రేక్షకుల మెప్పు మాత్రమే కాకుండా విమర్శకుల మెప్పు కూడా పొందింది. దీనికి ప్రధాన కారణాలు కథ, కథనం మరియు దర్శకత్వం చేసిన విక్రం, దాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఛాయాగ్రహకుడు వినోద్, కేవలం కథను మాత్రమే నమ్మి నిర్మించి, నటించిన అక్కినేని కుటుంబం.

మరిన్ని ప్రత్యేకతలు :

1. నాగార్జున. “భాయ్” చిత్రం తో తప్పటడుగు వేసిన నాగార్జున ఈ చిత్రం లోని నటనతో క్షమాపణ చెప్పారు అనిపించింది. ఈ చిత్రం మొత్తానికి నాగార్జున నటనే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమానం అందుకున్న వ్యాపారవేత్తగా, తల్లిదండ్రుల ముందు చిన్నపిల్లడిలా అమాయకంగా, పాతకాలపు జమీందారుగా, ఇలా పలురకాల కోణాలను తనలో బాగా ఆవిష్కరించారు. దానికి ఓ నిదర్శనం నాగార్జున, నాగచైతన్య విమానంలో కలిసి ప్రయాణించే సన్నివేశం.

Screen - 4

ఇక్కడ ఆశ్చర్యాన్ని, అమాయకత్వాన్ని బాగా వ్యక్తపరిచారు నాగార్జున.

2. అనూప్ రూబెన్స్ సంగీతం. అంత పెద్ద చిత్రానికి ఇంత చిన్న సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నారేంటి అని అనుకున్నవారికి చాలా మంచి సంగీతం ఇచ్చి సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రంలోని అన్ని గీతాలు బాగా ప్రజాదరణ పొందాయి. నాకు నచ్చిన గీతం “కనిపెంచిన మా అమ్మకే” అనే గీతం. ఈ పాటతో చంద్రబోస్ మళ్ళీ తనలోని ప్రతిభని నిరూపించుకున్నారు.

3. అతి తక్కువ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయం ఉన్న దర్శకుడు విక్రం ఈ ఒక్క చిత్రంలోనే అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి మహామహులను దర్శకత్వం చేసే అవకాశం పొందాడు, ఇది అతడి ప్రతిభకి దక్కి తీరాల్సిన ఫలితం.

బలహీనతలు :

1. నాకు అనిపించిన బలహీనతల్లో మొదటిది, సరిగ్గా పండని హాస్యం. ఆ పాత్రలు అటు మాస్ కాదు, క్లాస్ కాదు. సరిగ్గా నవ్వించలేక మధ్యలోనే నిలిచిపోయాయి.

2. సన్నివేశాల బరువుని పెంచలేని సంభాషణలు.

3. ట్రైలర్లలో జనానికి ఆసక్తిని కలిగించేందుకు తప్ప అసలు కథనంలో అవసరం లేని కొన్ని సన్నివేశాలు.

ఈ చిత్రం చెప్పిన పాఠాలు :

1. ఎంత పెద్ద చిత్రమైనా, ఎంత పెద్ద నటీనటులు ఉన్నా కథకే ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే విజయం తథ్యం.

2. ఎంత క్లిష్టమైన కథ ఉన్నా సరే ప్రతిభ ఉంటే అరటిపండులా దాన్ని వొలిచి ప్రేక్షకుడికి ఇచ్చి అతడిని సంతోషపరచవచ్చు.

ముగింపు :

ఈ చిత్రంపై విశ్లేషణ వ్రాయటం కాస్త కష్టంగా అనిపించింది. అందుకే పెద్దగా వచ్చింది. నన్ను మన్నించండి.

– యశ్వంత్ ఆలూరు

One thought on “మనం (2014)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s