మన చిత్రసీమలో, ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఒక్కో కాలంలో ఒక్కో పోకడని మనం గమనించవచ్చు. 1960 ల వరకు పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి వారి ప్రవేశంతో వాణిజ్య చిత్రాలు, బి.గోపాల్, వి.వి.వినాయక్, రాజమౌళి లు తీసిన ప్రతీకార ఒరవడి చిత్రాలు వచ్చాయి. కానీ ఈ దర్శకులు అందరూ ఒకే దారిలో వెళ్ళినా ఆ దారిలో తమదైన శైలిలో ప్రయాణం చేసి ఓ ముద్రని సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య చిత్రసీమలో ప్రధానంగా ఒక పోకడ కనపడుతోంది. అదే “ప్రేమ మరియు యువతీయువకుల మనోభావాలు”. అతడు వేసిన ఈ బాటను తీసుకొని ఇప్పుడు కొత్తగా పరిశ్రమకు వచ్చే దర్శకులు అందులో వినోదంతో పాటు చిత్ర విచిత్రమైన మెలికలు కథలో జోడించి చిత్రాలు తీస్తున్నారు.
ఇంత ఉపోద్ఘాతం వ్రాయటానికి కారణం ఇటీవల విడుదల అయిన “అలా ఎలా?” అనే చిత్రం. అందాల రాక్షసి చిత్రంతో మనకు పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంలో కథానాయకుడు. అనీష్ కృష్ణ అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా చిత్రసీమకి పరిచయం అయ్యాడు. ఇక దీని విశ్లేషణలోకి వెళ్దాం…
కథ :
కార్తిక్ (రాహుల్ రవీంద్రన్) కి తన తాతయ్య (రాళ్ళపల్లి) ఆఖరి కోరికను తీర్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది అతడు పెళ్ళి చేసుకోవడం. అతడి కోసం ఓ పెళ్ళి సంబంధాన్ని కూడా చూస్తాడు తాతయ్య. కానీ పెళ్ళి చేసుకునే ముందు అమ్మాయిని తను ఓ అజ్ఞాత వ్యక్తిగా కలిసి ఆ అమ్మాయి మనస్తత్వం తెలుసుకొని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు కార్తీక్. అందుకోసం ఆ అమ్మాయి సొంతఊరు అయిన రాజోలు కి తన స్నేహితులు కీర్తన్ (వెన్నెల కిశోర్), కళ్యాణ్ (షాని) ని వెంటబెట్టుకొని వెళ్తాడు. అక్కడ తను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి దివ్య (ఖుషి) కి దగ్గర అవ్వడానికి శృతి (హీబా పటేల్) ని పరిచయం చేసుకుంటాడు. ఇద్దరికీ స్నేహితుడు అయ్యాక అతడికి దివ్యతో పాటు శృతి కూడా నచ్చుతుంది. ఆ తరువాత ఓ సంఘటన ద్వారా తను శృతినే నిజంగా ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో అతడు తనకు నిశ్చయించిన పెళ్ళిని తప్పించుకొని తను ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు, దీనికి అతడికి తన స్నేహితులు ఎలా సహాయపడ్డారు, ఆ ప్రయత్నంలో అతడికి ఎలాంటి వ్యక్తులు, అనుభవాలు ఎదురయ్యాయి అనే అంశాల మీద మిగతా కథ సాగుతుంది.
కథనం :
ఇది ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి కథ. ఇదివరకు ఎందరో దర్శకులు ఇలాంటి కథలని వాడి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కథే తీయాలి అంటే దానిలో కొత్త అంశాన్ని చుపించాలి. అదే ఇప్పటి పోకడ అయిన “యువతీయువకుల మనోభావాలు”. ఈ అంశాన్ని వాడుతున్నాం కాబట్టి ప్రధానంగా యువతీయువకులే ప్రేక్షకులు అవుతారు. కనుక ఇందులో వినోదం బాగా పం(వం)డాలి. అదే చేశాడు దర్శకుడు అనీష్ కృష్ణ. అతని వంటకంలో పుట్టిన పాత్రలే కార్తీక్ స్నేహితుల పాత్రలు కీర్తన్, కళ్యాణ్. ఈ పాత్రలు చిత్రం అంతా ముఖ్య పాత్రతో పాటు ప్రయాణం చేస్తాయి. వీటిని వెన్నెల కిశోర్, షాని లాంటి నటులు బాగా పండించారు. ముఖ్యంగా భార్య పీడితుడుగా వెన్నెల కిశోర్ తనదైన శైలిలో పలికిన సంభాషణలు, షాని పలికిన తెలంగాణ యాస ప్రేక్షకులని నవ్విస్తాయి. ఈ హాస్యం అంతా చిత్రం చూసివచ్చిన ప్రేక్షకులు మళ్ళీ నెమరు వేసుకునేలా ఉండదు.
ఈ చిత్రంలో ఉన్న హాస్యాన్ని “సమకాలీన హాస్యం”గా చెప్పొచ్చు. రచయిత – దర్శకుడు ఈ చిత్రంలోని సంభాషణలలో దాదాపుగా ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు, వ్యక్తుల పైనే వ్రాయటం వలన అవి కొన్ని రోజులకి పాతబడిపోతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన సమస్య, మహేష్ బాబు చిత్రాలు, ఇలా పలురకాల సమకాలీన విషయాలనే హాస్యంలో జోడించాడు. ఇది ఓ వాణిజ్య సూత్రంలా వాడుతున్నారు కనుక చిత్రం విజయం సాధించడానికి ఉపయోగపడి ఉండొచ్చు. కానీ ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చుడనీయకుండా చేసేది మాత్రం ఈ రకమైన సంభాషణలు, హాస్యమే అని బలంగా చెప్పొచ్చు.
కార్తీక్ పాత్రకి, శృతి పాత్రతో కానీ దివ్య పాత్రతో కానీ ప్రేమ సన్నివేశాలు పెద్దగా లేవు. రెండో భాగంలో, కార్తీక్, శృతి ఒకే ఇంట్లో విద్యుత్తు లేని సమయంలో చేసుకునే సంభాషణలో భాగంగా కార్తీక్ తనలోని వివిధ మనస్తత్త్వాలతో మాట్లాడే సన్నివేశం ఈ కథకి అవసరం లేదు అనిపించింది. దాని బదులు ఓ సాధారణ సున్నిత సంభాషణ ఆ రెండు పాత్రల మధ్య పెట్టుంటే బాగుండేది. కానీ పైన చెప్పుకున్న విధంగా దర్శకుడి అంశం “యువతీయువకుల మనోభావాలు” కనుక ఈ సన్నివేశం జోడించాడు కాబోలు. ఈ చిత్రపు ప్రచార చిత్రాల్లో మనకు కనిపించే శీర్షికని చిత్రపు ఆఖరి ఘట్టంలో సమర్థించటానికి ఈ సన్నివేశాన్ని మళ్ళీ వాడుకున్నాడు దర్శకుడు.
ఇవే కాకుండా శృతి స్నేహితుడైన ఓ వికలాంగుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయాలని ప్రయత్నించి దర్శకుడు విఫలమయ్యాడు అనే చెప్పాలి. కారణం అలాంటి సన్నివేశాలు మన తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కనుక.
వెన్నెల కిశోర్ భార్యగా నటించిన భానుశ్రీ మెహ్రా (“వరుడు” కథానాయిక) పాత్ర పెద్దగా ఏమి లేదు. వరుడు చిత్రం ప్రచారంలో భాగంగా ఆవిడని ప్రేక్షకులకి పరిచయం చేయకపోవటమే ఇప్పుడు ఇలాంటి పాత్రలు ఆవిడకు దక్కేలా చేస్తోంది అని నా అభిప్రాయం.
ఇక ప్రతినాయకుడిగా క(అ)నిపించిన రవివర్మ, అతడి వెంటే ఉన్న జోగి సోదరులు మేలయిన హాస్యం పండించారు. ముఖ్యంగా రవివర్మ కొన్ని సన్నివేశాల్లో కోప్పడుతుంటే “బాబు! ఈ బిస్కెట్ తినండి బాబు!” అని జోగి నాయుడు అతడి జాగ్రత్తలు చూస్తాడు. దీనికి ప్రేక్షకులు తప్పకుండా నవ్వుతారు.
ఈ చిత్రపు ఆఖరి ఘట్టంలో వచ్చే కార్తీక్ బృందాన్ని రవివర్మ బృందం వెంటపడే సన్నివేశం, అక్కడ వచ్చే హాస్యం బాగా పండింది కనుక ప్రేక్షకుడు చిత్రం చూశాక నవ్వుకుంటూ బయటకు వస్తాడు. ఇదే ఈ చిత్రం యొక్క విజయ సూత్రం అని చెప్పాలి.
ఆఖరులో ప్రేక్షకులకు ఈ కథలోని అసలు మెలిక తెలుస్తుంది. అక్కడితోనే చిత్రానికి శుభం పలికుంటే బాగుండేది. మరో సన్నివేశం పెట్టి ఆ తరువాత “కృష్ణభగవాన్” గొంతుకలో నీతి వాక్యాలను చెప్పడం ఏమాత్రం అవసరం లేదు అనిపించింది.
అలా, పాత కథని తీసుకున్నా ఎలాగోలా హాస్యం జోడించి అలా ఎలా చిత్రం తీశాడు దర్శకుడు. ఏది ఏమైనా ఎదురుగా ఉన్న పెద్ద చిత్రం యొక్క పరాజయం ఈ చిత్రానికి మరింత విజయాన్ని చేకూరుస్తుంది. కేవలం హాస్యం మాత్రమే కోరుకునే ప్రేక్షకులను హాయిగా సినిమా హాలు నుండి బయటకి వెళ్ళనిస్తుందీ చిత్రం.
ఈ చిత్రపు ప్రత్యేకతలు :
1. రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసితో పరిచయం అయిన ఈ కథానాయకుడు ఈ చిత్రంలో నటనలో బాగా పరిణితి సంపాదించాడు అని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాల్లో అతడు పలికిన వివిధ రకాలైన సంభాషణలు, పలికించిన వివిధ హావభావాలు ఆకట్టుకుంటాయి.
2. సాయి శ్రీరాం ఛాయాగ్రహణం. ఈ చిత్రానికి ఇదే ప్రత్యేకమైన ప్రత్యేకతగా చెప్పాలి. కొన్ని షాట్స్ చాలా బాగా తెరకెక్కించాడు. మొదటి పాటలో మరియు వికలాంగుడు చనిపోయాడు అని తెలిసిన సన్నివేశంలో కారు ఆగిన ఓ దూరపు షాట్ చాలా బాగా వచ్చింది.
3. భీమ్స్ సంగీతం. పాటలు అన్నీ వినసొంపుగానే ఉన్నాయి ఈ చిత్రంలో.
4. శృతి పాత్రకి చిన్మయి ఇచ్చిన గాత్రదానం.
బలహీనతలు :
1. సమకాలీన హాస్యం.
2. పాత కథ, అదే పోకడ.
3. అనవసరపు సన్నివేశాలు.
ఈ చిత్రం ద్వారా తెలుసుకున్న పాఠం :
1. పోకడని అనుసరించినా మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చే చిత్రాలు చేయాలి.
2. సమకాలీన హాస్యం చిత్రం విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది కానీ చిత్రాన్ని తరువాతి తరాలు గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడదు.
చివరి మాట :
నా ఉద్దేశ్యం ప్రకారం చిత్రసీమకి పరిచయం కావాలంటే ఇలాంటి కథ, కథనాలనే ఎంచుకుంటేనే విజయం వరిస్తుంది అనే గుడ్డి నమ్మకం నుండి కొత్త తరం దర్శకులు బయటపడితే బాగుంటుంది. కొత్త దర్శకులు అంటే కేవలం ప్రేమ, హాస్యం, అనవసరపు మెలికలు ఉన్న చిత్రాలు తీస్తేనే జనం ఆదరిస్తారు అని అనుకోవడం పిచ్చితనం. కథ ఎలాంటిది అయినా ప్రేక్షకులకు నచ్చేలా చెప్తే చాలు. ఈ విషయాన్ని చాలా మంది కొత్త దర్శకులు ఉన్న పోకడకు వేరుగా వెళ్ళి విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. కనుక ఈ ఆలోచన ధోరణి నుండి బయటపడితే మంచిది.
– యశ్వంత్ ఆలూరు