లింగ (2014)

Lingaa-Telugu-Audio-Released-Wallpaper-Posters

రజినీకాంత్ నటించిన చిత్రం అంటే రజినీతో పాటు పెట్టుబడి, సాంకేతికత, వాహనాలు, బంగళాలు ఇలా అన్నీ భారీగానే ఉండేలా చూసుకుంటారు నిర్మాతలు. ఎందుకంటే అది “రజినీకాంత్” చిత్రం కాబట్టి. నాలుగున్నర సంవత్సరాల తరువాత సూపర్ స్టార్ తెర మీద కనిపించబోయే చిత్రం కాబట్టి ఇది ఎంత భారిగా ఉండాలో సినిమా పరిజ్ఞానం ఏమాత్రం లేనివారు కూడా ఓ అంచనా వేసుకోగలరు. ఆ అంచనాలను అందుకోవాలంటే ఆ చిత్ర దర్శకుడు మామూలు దర్శకుడు కాకూడదు. శంకర్ తీయాలనుకున్న రోబో-2 కి సమయం కావాలి కనుక, కె.ఎస్.రవికుమార్ వెలుగులోకి వచ్చారు. ఇదివరకు వచ్చిన ముత్తు, నరసింహ వంటి చిత్రాలు రవికుమార్ – రజినీ జోడి యొక్క సత్తా ఏంటో చాటాయి, పైగా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు కనుక వీరి కలయికలో “లింగ” అనే చిత్రం రూపుదాల్చింది. వంద కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్మాత రాక్లైన్ వెంకటేష్ ఏమాత్రం సంకోచించలేదు. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ.ఆర్.రహమాన్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం, ఇలా సాంకేతికతకు కూడా ఏమాత్రం లోటు లేదు. ఇన్ని హంగులతో వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ పొందకుండా రెండు “చిన్న” విషయాలు అడ్డుపడ్డాయి. అవే “కథ” మరియు “కథనం”. అసలు వాటి కథేంటో చూద్దాం…

కథ :

ఇది కర్నూలు జిల్లా సింగనూరు అనే గ్రామానికి, అక్కడ ఉన్న ఆనకట్టకి సంబంధించిన కథ. ఆ గ్రామానికి ఓ పెద్ద (కె. విశ్వనాథ్) ఉంటాడు. ఆ ఆనకట్ట ప్రక్కనే ఉన్న మూతపడిన శివాలయాన్ని అది కట్టించిన రాజా లింగేశ్వర తెరవాలి అనేది ఆ ఊరి పెద్ద తండ్రి చెప్పిన మాట. కానీ రాజా లింగేశ్వర ప్రాణాలతో లేడు కనుక, అతడి మనవడు ఉన్నాడని తెలిసి ఆ ఆలయాన్ని తెరిపించడానికి అతడి కోసం గాలింపు మొదలుపెడతారు. అతడి పేరు కూడా రాజా లింగేశ్వర (రజినీకాంత్). కానీ తన తల్లిదండ్రులకు చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకుండా, తను ప్రస్తుతం దొంగగా మారినందుకు కారణం అయిన తాతయ్య అంటే ఇష్టం లేదు కనుక తన పేరుని లింగ గా మార్చుకుంటాడు. అతడిని ఓ జైలు నుండి విడిపిస్తుంది టీవీ వ్యాఖ్యాత అయిన ఊరి పెద్ద మనవరాలు లక్ష్మి (అనుష్క). అతడిని సింగనూరుకి రమ్మనగా, తాతయ్య మీద కోపంతో నిరాకరిస్తాడు. దాంతో అతడిపై ఓ వ్యూహరచన చేసి సింగనూరుకి రప్పిస్తుంది. అసలు ఆ ఊరి ఆనకట్టని కట్టించిన రాజా లింగేశ్వర కథ ఏమిటి, ఆ శివాలయం ఎందుకు మూతపడింది, ఆనకట్టని పరిశీలించడానికి వచ్చిన అధికారిని చంపిన నాగభూషణం (జగపతిబాబు) ఆశయం ఏమిటి అనే అంశాల మీద కథ నడుస్తుంది.

కథనం :

ఈ కథ వినగానే ఇందులో ఎటువంటి ప్రత్యేకత లేదు అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ రజినీ చేశారు కాబట్టి ఈ చిత్రం ప్రత్యేకం. అయినాకూడా కథనంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. అది నత్తనడక నడిచినందువలన ఇది దాదాపు మూడు గంటల చిత్రం అయ్యింది. కానీ అభిమానులు ఆశించే, రజినీకాంత్ చిత్రంలో ఉండాల్సిన విషయాలు అన్నింటినీ దర్శకుడు పొందుపరిచాడు. ఉదాహరణకు ఈ క్రింది మూడు విషయాలు…

1. రజినీ పాత్ర పరిచయపు షాట్ గొప్పగా లేకపోయినా ఎప్పటిలాగే ఆ సమయానికి నీతి వాక్యాలతో వ్రాసిన, భారీగా తీసిన, బాలు పాడిన గీతం ఒకటి వస్తుంది. ఈ గీతం ముగిసే సమయంలో రజినీ పలికించిన హావభావాలు అభిమానులను ఉర్రూతలూగిస్తాయి అనడంలో సందేహం లేదు.

2. రజినీ పాత్ర చుట్టూ తిరుగుతూ అతడి గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు వివరించేలా ఓ నలుగురు స్నేహితులు ఇందులోనూ ఉన్నారు. అందులో ఒక స్నేహితుడి పాత్రని పోషించిన సంతానం ప్రతిభ ఏంటో ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది.

3. ఎప్పటిలాగే, ఒకానొక సమయంలో రజినీకాంత్ తనకున్న ఆస్తి, పేరు అన్నీ జనం కోసం వదులుకొని తానొక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోయే సన్నివేశం.

మొదటి సగం ఫర్వాలేదనిపించాడు దర్శకుడు. అందులో వచ్చే ఓ ఆభరణ దొంగతనం ఘట్టాన్ని బాగా చూపించాడు కానీ అది నిడివి ఎక్కువ అయినట్టు అనిపించింది. ఇక ఈ సగంలో అనుష్క పాత్రని బాగానే వాడుకున్నాడు. కథానాయకుడు తన గ్రామానికి వెళ్ళేవరకు చిత్రం బాగానే ఉంది.

ఈ కథకు ముఖ్య పాత్ర అయిన ఆంగ్లేయుల పాలన కాలం నాటి రాజా లింగేశ్వర (రజినీకాంత్) పాత్ర మొదటి సగం మధ్యలోనే మనకు పరిచయం అవుతుంది. అక్కడ వచ్చే రైలు పోరాట సన్నివేశాన్ని అత్యద్భుతంగా తీశాడు ఛాయాగ్రహకుడు రత్నవేలు. ముఖ్యంగా రజినీకాంత్, దేవ్ గిల్ రైలు పైకప్పు మీద పోరాడే షాట్స్ అన్నీ కన్నుల పండుగగా కెమెరాలో బంధించాడు రత్నవేలు. ఆ షాట్స్ లోని ఛాయాచిత్రపు నాణ్యత చాలా బాగుంది.

ఇక ఆ తరువాతే కథనం నెమ్మదిస్తుంది. విరామం వచ్చేసరికే ఎంతో సమయం గడిచిపోయింది అనే భావన కలిగించిందీ చిత్రం. విరామానికి ముందు వచ్చే విందు సన్నివేశంలో భారీతనాన్ని ఎక్కువగా చూపించబోయి దాని నిడివిని బాగా పెంచేశాడు దర్శకుడు. అక్కడే ప్రేక్షకుడు సీటులో కాస్త జారిపడి కూర్చుంటాడు.

ఇక రెండో సగం అంతా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే సగమే. ఎంతసేపటికీ రాజా లింగేశ్వర గతం ముగియకపోవటం, సరే ముగిసింది కదా అనుకునే సమయానికి జగపతిబాబు పాత్రని పూర్తిస్థాయి ప్రతినాయకుడిగా మార్చటం, అతడిని అరికట్టడానికి లింగ పాత్ర చేసే ఓ పోరాటం, అతడిని లింగ వాహనంపై తరిమే సన్నివేశం, ఇలా ప్రేక్షకుడికి ఊపిరి సలపకుండా చేశాడు దర్శకుడు. ఆఖరి ఘట్టంలో ద్విచక్రవాహనం పై నుండి హాట్ బెలూన్ పైకి ఎటువంటి సాయం లేకుండా రజినీ దూకటం, ఆ బెలూన్ లో జగపతిబాబు తో పోరాటం, చివరిలో బాంబు నుండి అనుష్కని, ఆనకట్టని కాపాడటం అన్నీ ఎంతో ఎబ్బెట్టుగా అనిపించాయి. అలా మొత్తానికి, వచ్చిన ప్రేక్షకుల శాపాలకు గురయ్యేలా ఈ చిత్రం ముగుస్తుంది.

కథానాయికల విషయానికి వస్తే ఈ చిత్రంలో అనుష్క పాత్రని కథ కోసం బాగానే వాడుకున్నాడు దర్శకుడు. ఈ కథలోని భారతి పాత్రకు ఏమాత్రం అతకని నాయిక సోనాక్షి సిన్హా. బాలీవుడ్ నుండి దిగుమతి అయిన ఈ నాయిక ఓ సాధారణ పాతకాలపు పల్లెటూరి పిల్ల పాత్రకి ఏమాత్రం సరిపోలేదు. తెలుగు అనువాదంలో ఈ పాత్ర పలికే రాయలసీమ యాస సంభాషణలు ప్రేక్షకుడిని ఏమాత్రం ఒప్పించలేవు. ఈ పాత్రకి ఎవరైనా దక్షిణాది కథానాయికని ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేది. ఈ పాత్రకి గాత్రదానం చేసిన చిన్మయి తమిళ అమ్మాయి అయినప్పటికీ రాయలసీమ యాస చాలా బాగా మాట్లాడింది. ఇక్కడ చిన్మయికే మార్కులు వేయగలం కానీ సోనాక్షికి కాదు.

ఈ చిత్రంలో ప్రేక్షకుడిని మెప్పించలేక పనికిరాకుండా పోయింది జగపతిబాబు పోషించిన పాత్ర. “లెజెండ్” చిత్రంలో కనిపించిన ఆహర్యంతోనే ఈ చిత్రంలోనూ కనిపించారు. మొదటగా నెమ్మదిగా ఉండి ఆఖరులో అతడే మోసగాడు అని తెలిసిన తరువాత, ఆ పాత్రను బాగా స్వతంత్రంగా నటించారు. కానీ అది ఎందుకు పనికిరాకుండా పోయింది. కె.విశ్వనాథ్ గారు ఎప్పటిలాగానే ఊరిపెద్దగా హుందాగా కనిపించారు.

ఈ చిత్రంలో కొన్ని చోట్ల సంభాషణలు బాగున్నాయి.

పాటలు :

రజినీకాంత్ కి వీరాభిమాని అయిన ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి గొప్ప సంగీతాన్ని అందించలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మునుపటి చిత్రం కోచ్చడయాన్ (విక్రమసింహ) పాటలలో పదోవంతు కూడా లింగ చిత్రంలోని పాటలు లేవు. కొద్ది రోజులు వినగానే బోరు కొట్టేలా ఉన్నాయి ఇందులోని పాటలు. నేపథ్య సంగీతం కూడా సంతృప్తికరంగా లేదు. తెలుగు అనువాదంలో సాహిత్యం అరువుతెచ్చుకున్నట్టుగా ఉంది. అన్నింటిలోకి చంద్రబోస్ వ్రాసిన “ఇండియనై రా” అనే గీతంలో సాహిత్యం ఫర్వాలేదు అనిపించింది.

పాటలను చిత్రీకరించిన విధానం బాగానే ఉంది. రజినీ, అనుష్క ల పై చిత్రించిన “గాసోలిన” యుగళగీతం ఫర్వాలేదు అనిపించింది. అందులో రజినీ స్టైల్ ని ఇంకాస్త ఎక్కువ చూపించి ఉంటే ఇంకా బాగుండేది. “ఇండియనై రా” గీతంలో ఆనకట్ట వద్ద తీసిన కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. రజినీ, సోనాక్షి పై చిత్రించిన “ఓ మన్మథ”  గీతం చాలా భారీగా ఉంది. ఆ గీతం చివరలో వచ్చే ఓ ట్రాలీ షాట్ బాగుంది.

“అరవై ఏళ్ళ వయసులో డ్యూయెట్ పాడటం ఓ శిక్ష!” అని రజినీకాంత్ విడుదల ముందు చెప్పారు. ఇది నిజమే అని పాటలు చూస్తే తెలుస్తుంది. రజినీ యుగళగీతాల్లో నాయికలతో ఆడిపాడటానికి ఇబ్బంది పడ్డారనిపించింది.

ఈ చిత్రపు ప్రత్యేకతలు :

1. సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటించే ప్రతీ చిత్రంలోనూ ఆయనే మొదటి ప్రత్యేకత అయినప్పటికీ నటనలో మునుపటికంటే ఎక్కువ ఉత్సాహం చూపించారు రజినీ. ఈ విషయం మొదట ఉన్న ఆభరణ దొంగతనపు ఘట్టంలో అర్థం అవుతుంది. శివాలయాన్ని తెరిచే సన్నివేశంలో పాముని చూసి ఆయన ఇచ్చిన ముఖకవళికలు, పలికించిన హావభావాలు కూడా ఆయన చలాకితనాన్ని చూపించాయి. రెండో పాత్ర లాంటి పాత్ర చేయటం రజినీకి కొత్తేమీ కాదు. బాషా నుండి దాదాపు ప్రతి చిత్రంలో ఇలాంటి పాత్రే చేశారు కనుక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

2. రత్నవేలు ఛాయాగ్రహణం. పైన కథనంలో చెప్పుకున్న పోరాట ఘట్టం ఒక నిదర్శనం. అలాగే ఆనకట్ట నిర్మాణంలో వచ్చే కొన్ని షాట్స్ బాగున్నాయి.

3. ఈ చిత్రంలోని ఏనుగులు కంప్యూటర్ ద్వారా చేయబడినవి అని చిత్రం మొదలుకాక ముందు వేశారు. కానీ చిత్రంలో ఎక్కడ కూడా ఏ ఏనుగూ కంప్యూటర్ కల్పనగా అనిపించలేదు.

ఈ చిత్రపు బలహీనతలు :

1. సుపరిచయమైన కథ.

2. నెమ్మదిగా సాగుతూ అలసట కలిగించిన కథనం.

3. ఆకట్టుకోలేకపోయిన రెహమాన్ పాటలు మరియు నేపథ్య సంగీతం.

4. పాత్రకి సరిపోని బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా.

ఈ చిత్రం చెప్పిన పాఠం :

సరైన కథ, కథనం లేకపోతే భారీ పెట్టుబడి, ఉత్తమ సాంకేతికత ఇవేవి పనికిరావు. చివరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే “సూపర్ స్టార్ రజినీకాంత్” నటించినా కూడా చిత్రం ప్రజాదరణ పొందేలా చేయలేరు.

– యశ్వంత్ ఆలూరు

One thought on “లింగ (2014)

  1. భలే యశ్వంత్. నా మనసులో ఉన్న భావాల్ని అక్షర రూపంలో చూస్తునట్టు ఉంది. రవి కుమార్ ఇంకా చాలా జాగ్రత్తలు తీస్కోవలసింది. అసలు కథ మొత్తం బ్రిటిష్ కాలం నాటి కథలా తీసిన బాగుండేదేమో. ఏదైతేనేం రజిని మాయ పని చేయలేదు. నాలుగేళ్ళ క్రితం మనిద్దరం కలిసి రజిని రోబో చూసి ఆనందించం ఇప్పుడు లింగ చూసి నిరాశ చెందాం.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s