సినిమాకు కొన్ని ప్రమాణాలు అవసరం. మరికొన్ని ప్రమాణాలు మరింత అవసరం. ఈ మధ్య వచ్చే చిత్రాల్లో “మరింత అవసరం” నుండి “అవసరం” కు వెళ్ళిన మొదటి ప్రమాణం “కథ“. కథ లేకపోయినా “కథనం” బాగుంటే విజయం సాధించవచ్చు అని కొన్ని చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుత చలనచిత్రాలకు కథకన్నా కథనమే ముఖ్యమైనది. దానికి సహజత్వం, స్పష్టత తోడై ప్రేక్షకుడు పాత్రల్లో తనను, కథనంలో తన జీవితాన్ని చుసుకోగలిగేలా చేస్తే అభినందనలు తప్పవు. అలాంటి ప్రమాణాలతో చిత్రాలు తీసే దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. తన మునుపటి రెండు చిత్రాలు అతడి దార్శనికత్వాన్ని చూపాయి. ముఖ్యంగా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం, అతడి స్పష్టతని చూపింది. అలాంటి అడ్డాల దర్శకత్వంలో చిరంజీవి కుటుంబం నుండి నాగబాబు తనయుడు “వరుణ్ తేజ్” పరిచయం అయ్యాడు “ముకుంద” అనే చిత్రం ద్వారా. పూజా హెగ్డే కథానాయిక. మిక్కీ జె.మెయెర్ సంగీతం అందించగా అద్భుత కవి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు.
అసలు విషయం చెప్పకుండా ఇంత ఉపోద్ఘాతం వ్రాయటానికి కారణం, శ్రీకాంత్ అడ్డాల స్పష్టత ఈ చిత్రంలో గాడి తప్పడమే. కానీ అలవాటు కోసం ఇందులోని విషయాలను ప్రస్తావించాలి.
కథ :
ఓ చిన్న పట్టణానికి చెందిన ముకుంద (వరుణ్ తేజ్) అనే కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రపు కథ.
కథనం :
అడ్డాలలో నాకు నచ్చే మొదటి విషయం చిత్రంలో పేర్లు వేసే విధానం. అప్పుడే హాలులోనికి ప్రవేశించిన ప్రేక్షకుడికి చిత్రంపై ఓ పసందైన భావాన్ని కలిగించడానికి ఎటువంటి ఆడంబరాలు లేకుండా, చక్కటి వినసొంపైన సంగీతంతో ప్రశాంతంగా పేర్లు వేస్తాడు. అదే అలవాటు ఈ చిత్రంలోనూ చూపించాడు. గోపికను పిల్లనగ్రోవి ఊది అల్లరిపెట్టే మాధవుడి చిత్రపటంతో “ముకుంద” అనే పేరు వెండితెరపై పడుతుంది.
చిత్రం మొదటి సన్నివేశంలోనే దర్శకుడు ఓ ముందుజాగ్రత్త చర్య తీసుకున్నాడు. రద్దీగా ఉన్న అమీర్ పేట్ లోని జనాన్ని చూపిస్తూ, ఈ చిత్రానికి కథేమీ అనుకోలేదని, ఆ జనంలో ఎవరు దొరికితే వారిని, వారి కథని అనుసరించడమే ఈ చిత్రం అని చెప్పేశాడు. అలా పరిచయం అవుతాడు కథానాయకుడు. బస్సులో కనిపించిన తన పాత స్నేహితుడికి తన కథను చెప్పడం మొదలుపెడతాడు. “భగవంతుడు బలహీనుడీకే భగవద్గీత బోధించాడు” అని చెప్పిన తరువాత కథానాయకుడి స్నేహితుడు “అర్జున్” పాత్ర మనకు పరిచయం అవుతుంది. ఈ కృష్ణుడు, ఆ అర్జునుడు స్నేహితులు కనుక జీవితాంతం కృష్ణుడు అర్జునుడిని కాపాడటం విధి అని చెప్తాడు ముకుంద. ఇక అక్కడి నుండి అయిదు నిమిషాలకు ఒకసారి అర్జునుడు ఎదో ఒక పని చేయటం, ముకుంద పోరాడి అతడిని కాపాడటం. కేవలం స్నేహితుడు ఉన్నాడన్న ధైర్యంతో, పరిస్థితులను ఎదిరించే సత్తా తనకు లేదని తెలిసినా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అర్జున్ పాత్ర మీద జాలి ఏమాత్రం కలుగలేదు. నిజానికి వీరిద్దరి పాత్రలు పురాణంలోని కృష్ణార్జునులే అయితే మొదటి అస్పష్టత ఇదే. ఎందుకంటే భారతంలో కృష్ణుడు అర్జునుడి కోసం యుద్ధం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. తన వాక్చాతుర్యంతో ఆర్జునుడిని బలపరిచి అతడి చేత యుద్ధం చేయించాడు. బహుశా దర్శకుడు అలా చూపించి ఉన్నా ముకుంద అనే చిత్రానికి, పాత్రల పేర్లకు ఓ అర్థం ఉండేది.
ఈ సంగతిని కాసేపు ప్రక్కన పెట్టి కేవలం ముకుంద పాత్రపై దృష్టి పెడదాం. మొదటి సారి అర్జున్ ని కాపాడే సన్నివేశంలో పోరాటం లేకుండా “వాడు గెలుస్తాను అనుకుంటేనే బరిలోకి దిగుతాడు” అని అన్నీ ఆలోచించి చేసే స్థితప్రజ్ఞత ఉన్న కుర్రాడిగా కనపడి, “చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా?” అని ప్రశ్నించిన ముకుంద పాత్ర తరువాత గాడి తప్పినట్టు అనిపించింది. ఈ పాత్రని గెలిపించడం కోసం వచ్చే ప్రతి పాత్రనీ కావాలని తక్కువ చేసి చూపించినట్టు అనిపించింది. అలాంటి పాత్రే, ఈ చిత్రంలో ముఖ్యమైన మునిసిపల్ చైర్మన్ అయిన “రావు రమేష్” పాత్ర.
రావు రమేష్ పాత్ర విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనికోసం రచయితగానే అడ్డాల బాగా శ్రమించాడు. విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రాల్లోని అంశాలను తెలుగు పదాలలో ఈ పాత్ర ద్వారా ప్రస్తావించాడు. ఇదో కొత్త ప్రయత్నం. ప్రతీ విషయానికి వాటిని జోడించి ఈ పాత్ర పలికే సంభాషణలకి అంతర్లీనంగా అర్థం,భావం ఉన్నాయి. కానీ సాధారణ తెలుగే సరిగ్గా రాని ఇప్పటి యువతరానికి “గరిమనాభి“, “వ్యాసార్థం“, “కుంభాకార దృష్టి“, “పుటాకార దృష్టి” లాంటి పదాలు ఎంత మాత్రం చేరువ అవుతాయి అని రచయిత భావించాడో తెలియలేదు. రావు రమేష్ అద్భుతమైన నటుడు, తండ్రిలాగే సంభాషణలు అవలీలగా పలుకగలడు కనుక చాలా బాగా నటించాడు అని ప్రతిఒక్క ప్రేక్షకుడూ తన తోటి ప్రేక్షకుడితో అనక తప్పదు. కానీ నిజంగా రావు రమేష్ ఏమి చెప్పాడో చాలా మందికి అర్థమై ఉండదు అని నా ప్రగాఢ నమ్మకం. ఒకవేళ ఆ తెలుగు పదాలకు అర్థం తెలిసినా, సందర్భానుసారంగా ఆ పదాలు పరోక్షమైన భావాన్నే పలికిస్తాయి తప్ప సూటిగా అర్థం కావు.
ఉదాహరణకు, ఓ సన్నివేశంలో “వాడి వ్యాసార్థం ఏంటో తెలుసుకోవాలి!” అని అంటాడు రావు రమేష్. వ్యాసార్థం అనగా ఆంగ్లంలో “Radius”. దీన్ని బట్టి ఆ సంభాషణ భావం, “వాడు తన బలం చూపించగలిగే ప్రదేశం ఎంత? వాడికి ఎంత దూరంలో ఉండాలి?” అని. మరో ఉదాహరణకు, “వాడి గరిమనాభి ఏంటి!” అని సాగే సంభాషణ ఒకటి ఉంది. గరిమనాభి అనగా ఆంగ్లంలో “Center of Gravity”. ఇది పైకి లేస్తే మనిషి పైకి ఎగురగలుగుతాడు, లేకపోతే స్థిరంగా ఉంటాడు. దీన్ని బట్టి ఆ సంభాషణ భావం, “వాడి బలం ఏంటి? వాడి బలహీనత ఏంటి?”. అడ్డాల తెలుగు మాధ్యమంపై తనకున్న అభిమానాన్ని ఈ పాత్ర ద్వారా చూపించాడు కానీ అది ప్రేక్షకుడికి సూటిగా అర్థం అయ్యేలా చేయలేక విఫలమయ్యాడు. ఈ చిత్రపు పాటలోని ఓ వాక్యాన్ని కాస్త మార్చి ఈ ప్రయత్నాన్నిలా వర్ణించవచ్చు. “పక్కపక్కనే తెలుగు పదాలను వ్రాసిఉంచినా అర్థమయ్యే ఓ మాట కానిదే ఫలితం ఉండునా?”.
చిత్రమంతా దాదాపు ఇలాంటి పరోక్ష సంభాషణలతోనే సాగుతుంది. ఇది కొన్ని చోట్ల బాగానే ఉంది. ఉదాహరణకు పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశంలో ఇలాంటి సంభాషణలే ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. ఈ చిత్రంలో సూటిగా మాట్లాడే ఒక పాత్రని “ప్రకాష్ రాజ్” పోషించారు. సమాజంపై తన అసహనాన్ని మాటల్లో ప్రకటించే ఓ ప్రజ్ఞావంతుడు. ఈ పాత్ర పరిచయపు సన్నివేశంలో భారతదేశం గురించి, దాని ప్రజల గురించి చెప్పిన సంగతులు బాగున్నాయి. అలాగే రాజకీయ నాయకుల మాయమటలకు తల ఊపే జనాన్ని గురించి “భరించాం, భరిస్తాం” అనే మకుటంతో సాగే సంభాషణలు విప్లవ కవిత్వపు ప్రభావం దర్శకుడిపై ఉందన్న విషయాన్ని తెలిపాయి.
ఈ చిత్రంలోని మరో వినూత్న ప్రయత్నం నాయకానాయికల ప్రేమాయణం. మామూలు చిత్రాలకు భిన్నంగా చిత్రమంతా మాటలే లేకుండా కేవలం చూపులు, చిరునవ్వులతో వారి ప్రేమాయణం సాగుతుంది. అది అర్థం అవ్వాలని ఈ రెండు పాత్రలు చిత్రంలో ఎప్పుడు ఎదురుపడితే అప్పుడు ఓ పాటను కథనంలో ఇరికించి, అసలు ఈ చిత్రంలో పాటలు అవసరమా అన్న భావన కలిగించాడు దర్శకుడు. కానీ పాటలు తీసిన విధానం, ఛాయాగ్రహణం బాగున్నాయి. ఈ క్రమంలో కథానాయిక పాత్ర కేవలం పాటల కోసమే ఉన్నట్టుగా అనిపించింది. ఆ పాత్రకు ఓ వ్యక్తిత్వాన్ని చూపించి ఉంటే దానిపై గౌరవం కలిగేది.
ఇక రెండో సగం అంతా ఎన్నికల నేపథ్యం, నాయకానాయికల మూగ ప్రేమాయాణం, అర్జునిడిని కృష్ణుడు కాపాడటం, కలబడిన ప్రతిసారీ నాయకుడి పాత్రని రావు రమేష్ పాత్రపై గెలిపిస్తూ, పాతికేళ్ళుగా జనాన్ని తన చాతుర్యంతో పాలించిన రాజకీయ నాయకుడి ఆలోచనలు ఓ సాధారణ కుర్రాడికి ఏమాత్రం దీటుగా ఉండలేవు అని చూపించే గాడి తప్పిన కథనంతో సాగుతుంది.
ఎన్నికల ప్రచారంలో, ముకుంద జనానికి తామెప్పుడు ఎదుటివారికంటే తక్కువని భావించొద్దనీ, నాయకుల మీద ఆధారపడటం మానేయమని చెప్తాడు. కానీ ఇదే మాట, సమస్యను ఎదుర్కోలేక ప్రతిసారీ తనపై ఆధారపడే స్నేహితుడు “అర్జున్” కి ఎందుకు చెప్పలేదో, అతడిని ఎందుకు మేల్కొలపలేదో అర్థం కాలేదు. చివరిదాకా అతడిని కాపాడుతూనే ఉంటాడు ముకుంద. ఇలా, ఎటు వెళ్ళాలో తెలియని బోలెడంత అస్పష్టతతో చిత్రం ముగుస్తుంది.
చివరగా, ఈ చిత్రానికి అవసరమైన ప్రమాణం “సహజత్వం“. మరింత అవసరమైన ప్రమాణాలు “స్పష్టమైన కథ, కథనాలు“. దర్శకుడి దృష్టిలో చూస్తే ఓ పట్టణంలోని కుర్రాడి జీవితం నిజంగా ఇలాగే ఉండొచ్చు. కానీ ఎంత సహజత్వం ఉన్నా సినిమా కథలో కాస్త నాటకీయత ఉండాల్సిందే అని నా అభిప్రాయం. బహుశా ఈ చిత్రంలో స్పష్టత కరువై ఉండొచ్చు కానీ శ్రీకాంత్ అడ్డాలలో ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. అతడి కష్టం అక్కడక్కడ బాగానే కనిపించింది. అందుకు ఉదాహరణే పోలీసు స్టేషన్ లోనున్న తన స్నేహితుడి కోసం రాత్రంతా అక్కడే ఉంటానని పోలీసు అధికారితో ముకుంద చెప్పే సన్నివేశం. స్పష్టంగా వెళ్తే ప్రస్తుత చిత్రసీమలో శేఖర్ కమ్ముల తరువాత అంత హృద్యంగా చిత్రాలను మలిచే దర్శకుడు అడ్డాలే అని చెప్పటంలో ఏమి సందేహం లేదు.
ప్రత్యేకతలు :
1. సంగీతం, సాహిత్యం. సీతారామశాస్త్రి గారు తన కలం జూలు మరొక్కసారి విదిలించి ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ఈ చిత్రానికి అందించారు. ఈ చిత్రానికి ప్రధాన ఊతం ఇదే అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ సాహిత్యం స్పష్టంగా వినిపించేలా మిక్కీ సంగీతం అందించాడు.
2. నాయకానాయికల ప్రేమాయణం. ఇలాంటి ప్రయోగం ఒకప్పటి “మౌనమేలనోయి” చిత్రం తరువాత ఇప్పుడే కనిపించడం. దర్శకుడు, పురాణంలో కృష్ణుడు, రుక్మిణిల ప్రేమకథను స్పూర్తిగా పొంది కొత్తగా, బాగా చూపించాడు.
3. రావు రమేష్ పాత్ర. కొన్ని సన్నివేశాల్లో “మనవూరి పాండవులు” చిత్రంలో రావు గోపాలరావు పాత్రని అనుకరించినట్టుగా అనిపించినా, మాటలు అందరికీ అర్థం కాకపోయినా మాటతీరు, ఆహార్యంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రతినాయకుడి పాత్రలకు భవిష్యత్తులో తన తండ్రిలాగే చిరునామా అయ్యే అవకాశాలు రావు రమేష్ కి చాలా ఉన్నాయి.
4. అక్కడక్కడ బాగున్న సంభాషణలు.
బలహీనతలు :
1. స్పష్టత లేని కథ, కథనం.
2. అసంపూర్ణమైన సన్నివేశాలు. ఉదాహరణకు రావు రమేష్ ప్రచారం చేస్తుండగా మైక్ అందుకొని నాయకులు మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టకండని జనానికి చెప్పే సన్నివేశం. ఇక్కడ ఇంకో అదనపు సంభాషణ ఉండుంటే బాగుండేది.
3. సరైన సందర్భాలు లేక అనవసరం అనిపించే పాటలు.
4. సన్నివేశానికి తగ్గట్టుగా హావభావాలు పలికించలేకపోయిన కథానాయకుడు వరుణ్ తేజ్.
5. అర్థం కాకుండా వ్రాసిన పరోక్షమైన సంభాషణలు.
6. కొత్త ప్రయత్నం అయినా వ్యర్థం అయిన రావు రమేష్ పాత్ర.
7. అవసరం లేకపోయినా ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇబ్బంది పెట్టే రామ్-లక్ష్మణ్ పోరాటాలు.
8. కరువైన హాస్యం.
ఈ చిత్రం నేర్పిన పాఠాలు :
1. సినిమాలో సహజత్వం ఉండాలనుకుంటే బాగుంటుంది కానీ సహజత్వంలో కూడా సినిమా ఉంటుంది అనుకుంటే పొరపాటు.
2. కథ, కథనాల్లో స్పష్టత ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు