గోపాల గోపాల (2015)

gopala-gopala1

ఒక భాషలోని చిత్రాన్ని మరో భాషలో పునర్నిర్మించడం మన చిత్రసీమలోని పాత పోకడ. ఈ పోకడ చిత్రాలకు పెట్టింది పేరు “విక్టరీ” వెంకటేష్. ఇదే దారిలో వెళ్ళి విజయాలు సాధించిన మరో కథానాయకుడు పవన్ కళ్యాణ్. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం “గోపాల గోపాల”. ఇది హిందీ చిత్రం “ఓ మై గాడ్” ఆధారంగా రూపొందించబడింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, తడాఖా చిత్రాలతో సుపరిచయం అయిన కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహించారు. సురేష్ బాబు, శరత్ మరార్ నిర్మించారు. ఇక ఈ చిత్రపు కథ, కథనాల్లోకి వెళ్తే…

కథ :

దేవుణ్ణి, దేవుడి కోసం జనం నమ్మే మూఢనమ్మకాలను ససేమిరా నమ్మని నాస్తికుడు గోపాలరావు (వెంకటేష్). కానీ అవే నమ్మకాలను వాడుకొని దేవుడి విగ్రహాలు అమ్మి జీవనం సాగిస్తుంటాడు. ఓసారి సంభవించిన భూకంపంలో అనూహ్యంగా కేవలం అతడి దుకాణమే కూలిపోగా, బీమా పరిశ్రమ అది దేవుడి చర్య అని సహాయం నిరాకరిస్తుంది. దాంతో గోపాలరావు, దేవుడిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాడు. మత పెద్దలు అతడిపై కాలు దువ్వుతారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు (పవన్ కళ్యాణ్) భూమిపైకి వస్తాడు. ఆ తరువాత ఆ దేవుడు ఈ కథను ఎలా నడిపించాడు, గోపాలరావు గెలిచాడా లేదా అన్నది మిగతా కథాంశం.

కథనం :

ఓ భాషలోని చిత్రాన్ని మరో భాషలో తీయడం చాలా సులువు అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ అది కష్టమైన పని అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక భాషకు, మరో భాషకు ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా తేడా ఉంటుంది. మరో భాషలో తీసినప్పుడు ఆ ప్రేక్షకులకు చేరువయ్యే మాతృత్వాన్ని తీసుకొని రావాలి. ఇదే చాలా కష్టం. ఈ చిత్రానికి కథాపరంగా ఆ కష్టం కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి భాష మారుతుంది కానీ దేవుళ్ళు, వారి భక్తులు పాటించే ఆచారాలు మారవు. కనుక వాటిని యథాతథంగా చూపించే సౌలభ్యం లభించింది దర్శకుడికి. ఈ చిత్రపు మొదటి సగంలోని సన్నివేశాలు దాదాపు మాతృకలోనివే. ఆ చిత్రం చూడని ప్రేక్షకుడు వాటిని బాగా ఆనందిస్తాడు.

ఈ చిత్రంలో ప్రధానమైన పాత్ర గోపాలరావు. మాతృకలో ఈ పాత్రకి, అతడి భార్య పాత్రకి పెద్దగా సన్నివేశాలు లేవు. ఇక్కడ శ్రియని తీసుకొని ఆ పాత్ర నిడివిని పెంచాడు దర్శకుడు. ఇది మాతృత్వం తీసుకొని రావడానికి చేసిన ఓ ప్రయత్నం, వ్యాపార సూత్రం కూడా. ఇందులో ఓ ముఖ్య పాత్రకి పోసాని కృష్ణమురళిని ఎంచుకోవడం దర్శకుడు చేసిన మంచి పని. ఈ మధ్య హాస్యనటుడిగా పోసాని బాగా ఆదరణ పొందారు. ఆ పాత్రని మాతృకలోని నటుడికంటే అద్భుతంగా పోషించారు. ఇందులో ప్రధాన బాబా పాత్రకు హిందీలో నటించిన మిథున్ చక్రవర్తి గారినే తీసుకున్నారు. ఆయన అందులోని నటనే ఇక్కడ కూడా చేశారు. మాతృక చూడని ప్రేక్షకులకు ఆయన ఆహార్యం వినోదాన్ని పంచిందేమో కానీ ఈ పాత్రకి కూడా ఓ తెలుగు నటుడినే ఎంపిక చేసుంటే మరింత బాగుండేది.

హిందీ చిత్రం చూడని ప్రేక్షకుడు ఈ చిత్రంలో ఎక్కడైనా దేవుడి ప్రస్తావన వచ్చినా, లేదా బలమైన నేపథ్య సంగీతం వినిపించినా పవన్ కళ్యాణ్ వస్తాడని ఎదురుచుస్తాడు. కానీ దర్శకుడు కథాపరంగానే వెళ్ళి ఆ పాత్రని ఎప్పుడు తీసుకొనిరావాలో అప్పుడే తీసుకొని వచ్చి విరామం ఇచ్చాడు. అంతవరకు వెంకటేష్ ఈ చిత్రాన్ని నడిపించారు.

ఇక రెండో సగంలో చాలా సన్నివేశాలు ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా వ్రాసుకున్నవి. దాదాపుగా ఏ సన్నివేశమూ అనవసరం అనిపించలేదు. ఇద్దరూ పెద్ద నటులే కనుక వారి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులు ఆశిస్తారు. దీనికోసం “మాయాబజార్” చిత్రంలో మాయా కృష్ణుడు, ఘటోత్కచుడు మధ్య వచ్చే సన్నివేశాన్ని వాడుకోవడం బాగుంది. ఇది ఈ కథకు కూడా బాగా సరిపోయింది.

“ఓ మై గాడ్”లో అక్షయ్ కుమార్ పాత్ర నిడివి తక్కువ. తెలుగులో “పవర్ స్టార్” ఉన్నాడు కనుక ఆ పాత్ర నిడివిని పెంచుతూ “భజే భాజే” అనే గీతం ఈ చిత్రంలో వస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి చేసిన నృత్యం వారి అభిమానులకు ఓ పండుగే. కథనానికి ఇది అవసరం లేకపోయినా అభిమానుల కోసం పెట్టడం తప్పుగా అనిపించలేదు. చిత్రీకరణ కూడా ఫరవాలేదనిపించింది. దీని తరువాత గోపాలరావు తన కొడుకు కోసం వెళ్ళే సన్నివేశం కూడా బాగుంది. “సాయి”కోటి వ్రాస్తే సాయిబాబా వస్తాడన్న నమ్మకంతో నాన్న కోసం “నాన్న”కోటి అతడి కొడుకు వ్రాయటం మంచి సన్నివేశంలా అనిపించింది. ఇక తరువాత సన్నివేశాలన్నీ మాతృకలోనివే. మధ్యలో వచ్చే “నీదే నీదే” అనే గీతాన్ని సీతారామశాస్త్రి గారు చాలా బాగా వ్రాశారు. ఈ పాటలో గోపాలకృష్ణులను “కృష్ణార్జునులు”గా చూపించడం కూడా బాగుంది. కొన్నిచోట్ల భారతంలోని అంశాలను “ఓ మై గాడ్” కంటే ఇందులోనే బాగా వాడుకున్నారు అనిపించింది.

ఈ చిత్రపు కథలో చర్చించే ప్రధాన అంశం “Act of God”. దాన్ని తప్పించకుండా, అసలు చిత్రంలో, ఆఖరు రోజున న్యాయస్థానంలో వాదించిన తరువాత పరేష్ రావల్ పాత్ర పక్షవాతంతో పడిపోతుంది. కానీ ఇక్కడ గోపాలరావు పాత్రను ఓ మనిషి కత్తితో పొడవటం సబబుగా అనిపించలేదు. ఈ సన్నివేశం యొక్క ఉద్దేశ్యమే “Act of God” అనే అంశాన్ని చూపించడం. ఇక్కడ ఈ చిత్రం గాడి తప్పింది. గోపాలరావుకి, కృష్ణుడికి మధ్య ఆసుపత్రిలో వచ్చే సన్నివేశం బాగుంది. అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన సంభాషణలు చాలా బాగున్నాయి. అక్షయ్ కుమార్ లాగా పవన్ కళ్యాణ్ ని కూడా నిజమైన కృష్ణుడిలా చూపించకుండా తెలివిగా భగవద్గీతలోని విశ్వరూపాన్ని చూపించాడు దర్శకుడు. ఆ తరువాత, గోపాలరావుని నరసింహునిగా భ్రమ కలిగించిన సన్నివేశం అనవసరమే.

మొత్తానికి, “ఓ మై గాడ్” చూసినవారికి ఫరవాలేదు అనిపించేలా, మొదటిసారి చూసే ప్రేక్షకులకు బాగుంది అనిపించేలా, ఏమీ పట్టించుకోని అభిమానులకు ఓ పండుగలా “గోపాల గోపాల” చిత్రం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది.

తారలు – నటనలు :

వెంకటేష్

ఈ చిత్రానికి ప్రధాన పాత్ర వెంకటేష్ పోషించిందే. నేను “ఓ మై గాడ్” చిత్రం చూశాను కనుక పరేష్ రావలే అద్భుతంగా నటించారు అని నా అభిప్రాయం. వెంకటేష్ కూడా దాదాపు ప్రతి సన్నివేశంలో పరేష్ రావల్ కి ధీటుగానే అనిపించారు. కానీ వెంకటేష్ మూలంగా నేను నిరాశపడిన సందర్భాలు ఈ చిత్రంలో మూడు ఉన్నాయి. గోపాలరావు సమస్య చాలా చిన్నదని అవతలి వకీలు చెప్పగానే, అది చిన్నది కాదని, తన జీవితం, తన కుటుంబ భవిష్యత్తు ఆ దుకాణమే అని చెప్పే సన్నివేశంలో పరేష్ రావల్ చూపించినంత హృద్యమైన భావోద్వేగాన్ని వెంకటేష్ చూపించలేదు అనిపించింది. రెండవది, న్యాయస్థానం గోపాలరావు తరహా కేసులన్నీ ఆమోదించాక మిథున్ చక్రవర్తి యొక్క ఆహార్యాన్నే అనుకరిస్తూ అతడితో మాట్లాడే సన్నివేశం. మూడవది, శివలింగంపై పోసే పాలు తాగాలని ప్రయత్నించిన ఓ బికారి గురించి చెప్పే సన్నివేశం. వీటిలోని సంభాషణలు మాతృకలోనివే అయినా నటనలో వెంకీ కొద్దిగా నిరాశపరిచారు. ఇవి మినహాయిస్తే ఈ చిత్రంలో అత్యధిక మార్కులు ఆయనకే చెందాలి.

పవన్ కళ్యాణ్

కృష్ణుడి పాత్ర పవన్ కి బాగా నప్పింది. పాత్రకి తగ్గట్టుగా సమ్మోహనంగా కనిపించారు. ఆయన వేసుకున్న దుస్తులు ఆ పాత్రకి ఆయన్ని మరింత దగ్గర చేశాయని చెప్పాలి. నటనలో హుందాతనం, సంభాషణలు పలకిన తీరు మరియు ఆహార్యం ఈ పాత్రకి పవనే సరైన ఎంపిక అనిపించాయి.

శ్రియ

ఇచ్చిన పాత్రకు తగిన ఆహార్యంతో సరయిన న్యాయమే చేశారు.

ప్రత్యేకతలు :

1. కథనం, దర్శకత్వం. దర్శకుడు కిషోర్ ఇది దిగుమతి చేసుకున్న కథ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఒప్పించే ప్రయత్నాలు చాలానే చేశారు. ఇద్దరు పెద్ద నటులున్నా దాదాపు కథాపరంగానే వెళ్ళారు. వివాదాలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నటీనటుల ఎంపిక కూడా బాగానే ఉంది.

2. అనూప్ రూబెన్స్ సంగీతం. “మనం” తరువాత మళ్ళీ మంచి సంగీతాన్ని ఈ చిత్రానికి అందించారు. ఉన్నవి మూడు పాటలే అయినా వినసొంపైన బాణీలిచ్చారు.

3. పోసాని కృష్ణమురళి పాత్ర, నటన.

బలహీనతలు :

1. కొన్ని అనవసరపు సన్నివేశాలు.

2. వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు వాటి ప్రభావాన్ని కోల్పోవడం.

3. “Act of God” అంశానికి పూర్తి న్యాయం జరగకపోవటం.

ఈ చిత్రం నుండి తెలుసుకోవాల్సిన విషయం :

దిగుమతి చేసుకున్న కథలతో సినిమా తీయడం కష్టమైన విషయమే. కష్టపడితే దాన్ని సొంత కథ లాగే ప్రేక్షకుడికి చెప్పొచ్చు. పెద్ద నటులతో బహుళ తారా చిత్రాలు కూడా తీయొచ్చు. కానీ మూలకథలోని మూలాంశాలకు మాత్రం తగిన న్యాయం చేయాల్సిందే.

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s