ఐ (2015)

Shankar's I Telugu Logo Poster

సినీ పరిశ్రమలో ఏళ్ళ తరబడి ఒక దారిలో ప్రయాణం చేసిన కొందరు దర్శకులు అమాంతం దారిని మారిస్తే ఆ విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అదే జరిగింది దిగ్గజ దర్శకుడు “శంకర్” విషయంలో కూడా. తన మొదటి చిత్రం “జెంటిల్మెన్” నుండి “శివాజీ” వరకు సృజనాత్మకతతో పాటు సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. తన “రోబో” చిత్రంలో సందేశం లేకపోయినప్పటికీ అందులోని అబ్బురపరిచే దృశ్యాలతో “సందేశం” గురించి ప్రేక్షకుడు మరిచిపోయేలా చేశాడు. అలాంటి శంకర్ తన “అపరిచితుడు” విక్రమ్ తో ఈసారి “ఐ” అనే చిత్రంతో వచ్చాడు. ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకుడు ఈసారి శంకర్ మరో మెట్టు ఎక్కాడని, చిత్రం ఫలితాన్ని ముందుగానే ఊహించేశాడు అంటే అది ప్రేక్షకుల్లో శంకర్ సంపాదించుకున్న నమ్మకమే. ఎమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని “ఆస్కార్ రవిచంద్రన్” నిర్మించారు. “ఐ మనోహరుడు” పేరిట ఈ చిత్రం తెలుగులోకి అనువాదమయింది. ఓసారి ఈ “ఐ” చూపించిన ప్రపంచంలోకి వెళ్తే…

కథ :

హాలీవుడ్ కండల వీరుడు “ఆర్నాల్డ్” స్పూర్తితో ఎంతగానో శ్రమించి “మిస్టర్ ఆంధ్ర” బిరుదును కైవసం చేసుకుంటాడు లింగేశ (విక్రమ్). అతడు ఎంతగానో అభిమానించే మోడల్ దియా (ఎమీ జాక్సన్) ఓసారి అతడిని ఓ సాయం కోరుతుంది. అదేంటి? దియాకు సాయపడిన లింగేశ జీవితంలో ఆ తరువాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో అవే ఈ కథాంశాలు.

కథనం – దర్శకత్వం :

మాములుగా బరువైన కథలు వ్రాసుకొని, వాటికి పుష్కలంగా వాణిజ్య అంశాలను జోడించి ఒక్క తమిళనాడే కాకుండా భారతదేశం దృష్టినంతా తన వైపు తిప్పుకున్న శంకర్ లాంటి దర్శకుడికి పరిపూర్ణమైన స్వేచ్చనిస్తే అతడి మనసులోంచి ఎలాంటి కథ పుడుతుందో అదే “ఐ”. మొదటిసారి శంకర్ ఓ స్వచ్చమైన ప్రేమకథతో రావడం సాధారణ ప్రేక్షకులకు, శంకర్ అభిమానులకు నిరాశ కలిగించేదేమో కానీ ఈ చిత్రం చూసినంత సేపు నాకు చాలా సంతోషమేసింది. ఎందుకంటే, “ప్రేమికుడు” అనే పేరున్న చిత్రాన్ని ప్రేమతో తీయని శంకర్ “ఐ” లాంటి చిత్రాన్ని ప్రేమకథాచిత్రంగా చేశాడంటే నమ్మశక్యం కాని విషయమే. ఈ విషయానికి అతడికి బోలెడు మార్కులు వేసేయాలి.

“శివాజీ”, “రోబో” చిత్రాల్లో లాగా ఇందులో భారీ సన్నివేశాలుండవు. అలాగని తన శైలి చిత్రీకరణను కూడా శంకర్ విడిచిపెట్టలేదు. దీనికి ఉదాహరణే “పరేషానయ్యా” గీతం. ఇందులో వాడిన గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. “ఐ”ని నడిపించిన విధానం కూడా కొత్తగా ఉంది. కథ చిన్నది కనుక కథనాన్ని వర్తమానానికి, గతానికి మారుస్తూ, ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగానూ చేశాడు. కథానాయికలను సరిగ్గా చూపించడని శంకర్ మీదున్న అపవాదు కూడా ఈ చిత్రంతో తొలగిపోయింది. స్వతహాగా మోడల్ అయిన ఎమీ జాక్సన్ ఈ చిత్రంలో దియా పాత్రకు సరైన ఎంపికగా అనిపించింది. ఆమెను చూపించిన విధానం కూడా అందంగా ఉంది.

అందమైన దృశ్యాలను ప్రేక్షకుడికి చూపించడంలో శంకర్ దిట్ట. ఈ చిత్రంలో చైనాలో తీసిన ప్రతి ఒక్క సన్నివేశం కనువిందుగా ఉంటుంది. దీనికి మరో కారణం “పీ.సి.శ్రీరాం” గారి ఛాయాగ్రహణం. పూలతోటలో తీసిన “పూలనే కునుకేయమంటా” గీతం మరోసారి శ్రీరాంగారి కెమెరా పనితనాన్ని పరిచయం చేసింది. సాధారణంగా అనువాద చిత్రాల్లోని సాహిత్యం అద్దెకు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఈ చిత్రంలోనూ అలాగే ఉన్నా, ఈ గీతాన్ని మాత్రం “అనంత శ్రీరాం” తమిళ సాహిత్యంపై ఆధారపడకుండా స్వేచ్చగా “ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ” అనే చక్కని వాక్యాన్ని వ్రాశాడు.

శంకర్ చిత్రాల్లో పోరాటాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రంలో మొదట మిస్టర్ ఆంధ్ర పోటిలో వచ్చే పోరాట సన్నివేశం పెద్దదిగా అనిపించినా మొదటిసారి చూసినప్పుడు బాగా అనిపించింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది “చైనాలో తీసిన పోరాట ఘట్టం”. పీటర్ మింగ్ నేతృత్వంలో తెరకెక్కిన ఈ పోరాటాన్ని చిత్రానికే ఉత్తమ పోరాటంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రహమాన్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది.

ఇంత అందంగా చిత్రాన్ని తీసుకొని వెళ్తున్నప్పటికి ఇబ్బందిపెట్టిన పాత్ర మాత్రం “ఒస్మా జాస్మిన్”. ఈ పాత్రకు ఓ స్వలింగ సంపర్కుడిని పెట్టాలని ఎందుకు అనిపించిందో తెలియదు. ఇలాంటి అంశాన్ని సినిమాలో చూపిస్తే ప్రేక్షకులు అంత సులువుగా జీర్ణించుకోలేరు. ఆ స్థానంలో ఓ అమ్మాయిని పెట్టుంటే చిత్రం మరింత అందంగా ఉండేది. దానితో పాటు తన ప్రేమను లింగేశ కాదన్నాడన్న కోపం కూడా న్యాయంగా అనిపించేది. స్వలింగ సంపర్కుడిని పెట్టాలనుకుంటే హాస్యం కోసం పెట్టుంటే సరిపోయేది. ఇంత పెద్ద పాత్ర ఇవ్వడం ఇబ్బందిగానే అనిపించింది. మొదటి సగంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే.

రెండో సగం అంతా పగ ప్రతీకరాల మీద నడిచింది. అయినా కూడా చక్కటి ఉపశమనం “ఐల ఐల” గీతం. ఇందులో చిత్రించిన పలు ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. నాకు బాగా నచ్చినది “నిప్పాన్ పెయింట్” ప్రచార చిత్రం. అనేకమందిపై చిత్రించిన ఈ ప్రచార చిత్రానికి ఎంతో ఓపిక మరియు తోడ్పాటు కావాలి. దాన్ని నూటికి నూరుశాతం సాధించాడు శంకర్. ఈ క్రమంలో దియా లింగేశకు ఓ బహుమతినిచ్చే సన్నివేశం కూడా అందంగా ఉంది. ప్రేమను ప్రేక్షకుడు అనుభవించాలంటే అందులోని బాధను కూడా అతడు అనుభవించాలి. అదే ప్రయత్నం చేశాడు శంకర్ “నువ్వుంటే నా జతగా” గీతంలో. అభిమానులతో సహా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని చిత్రానికి శత్రువుగా మార్చింది ఈ గీతమే. ప్రచార చిత్రాల్లో మృగం రూపంలో ఉన్న విక్రమ్ ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మృగంలా విక్రమ్ చిత్రంలో కాసేపు కనిపిస్తాడేమోనని ఊహించుకున్న ప్రతి ఒక్కరు అది కేవలం గీతానికే పరిమితమయ్యేసరికి ఖంగుతిన్నారు. ఇదిలావుండగా గీత చిత్రీకరణ మాత్రం ఆకట్టుకుంది. ఇక్కడ కూడా శ్రీరాం గారి పనితనమే కనిపించింది. అలాగే పాత్రలోని బాధను విక్రమ్ నటన బాగా చేరవేసింది. చివర్లో మృగం తనను అంతం చేసుకొని మనిషిగా మారే షాట్ ఎన్నో విషయాలను చెబుతుంది.

ఈ చిత్రం శంకర్ ని ప్రేక్షకుడికి మిత్రుడినో, శత్రువునో చేసినా విక్రమ్ ని మాత్రం అందరి గుండెల్లో నిలబెడుతుంది. కారణం, ఈ చిత్రం కోసం అతడు పడ్డ కష్టం వర్ణనాతీతం. శరీరాన్ని హూనం చేసుకొని మరీ నటించాడంటే సినిమా అంటే అతడికి ఎంత మక్కువో, పాత్రని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. తన రూపాన్ని అద్దంలో చూసుకున్న సన్నివేశం మరియు దియాను గుడిలో కలిసే సన్నివేశంలో కంటతడి పెట్టించాడు విక్రమ్. రెహమాన్ నేపథ్య సంగీతం ఆ సన్నివేశాల ఔన్నత్యాన్ని అమితంగా పెంచేసింది కూడా.

శంకర్ కథానాయికలకు మంచి పాత్ర ఇవ్వడన్న అపవాదు కూడా ఈ చిత్రంతో తొలగిపోయింది. రెండో సగంలో నిజం తెలిశాక దియా తీసుకునే నిర్ణయం ఆ పాత్రపై అమితమైన గౌరవాన్ని పెంచేసింది. చేతిలో చేయి వేసుకొని లింగేశ, దియా తమ ప్రపంచంలోకి వెళ్ళే సన్నివేశం మనుసును తాకింది. ఇక్కడ శంకర్ తో పాటు అభినందించాల్సిన వ్యక్తులు ఛాయాగ్రాహకులు శ్రీరాం మరియు సంగీత దర్శకుడు రెహమాన్. వాణిజ్య అంశాలకు చాలా దూరం వచ్చిన శంకర్ చిత్రాన్ని కూడా అలాగే ముగించాడు. లేకపోతే లింగేశ పూర్తిగా మామూలు మనిషి అయినట్టుగా చూపించాలి. అలా కాకుండా అతడు కోలుకుంటున్నాడు అని చూపించిన విధానం బాగుంది. నిజానికి ఇదే సరైన విధానం. కానీ శంకర్ లాంటి దర్శకుడి నుండి ఓ సగటు ప్రేక్షకుడు ఇలాంటివి ఆశించడు.

ఇంతగా పొగుడుతున్న ఈ చిత్రంలో జీర్ణించుకోలేని మరో అంశం కూడా ఉంది. అదే తీర్చుకోవాల్సినంత కాకుండా “అంతకుమించి”న ప్రతీకారం తీర్చుకోవడం. ఆ క్రమంలో నటులకు చేసిన మేకప్పులు జుగుప్సాకరంగా ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటి విషయాలు చూస్తే వారి సృజనాత్మకతను మెచ్చుకునే భారతీయ ప్రేక్షకులు భారతీయ సినిమాలో, ప్రత్యేకించి దక్షిణ భారత సినిమాలో ఆదరించరు. ఈ విషయంలో శంకర్ జాగ్రత్త వహించి ఉంటే ఇది ఒక అందమైన చిత్రంగా మిగిలిపోయేది. ఈ చిత్రానికి నిడివి కూడా బాగా హాని చేసింది. అసలే ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసిన ఈ చిత్రం నెమ్మదిగా 188 నిమిషాలు నడవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇందులో ఇబ్బందిపెట్టిన మరో అంశం రైలుపై విక్రమ్, ఉపేన్ పటేల్ పై తీసిన అధిక నిడివిగల పోరాటం. దీన్ని ఓ అయిదు నిమిషాలు కుదించి ఉండవచ్చు.

మొత్తానికి “ఐ” చిత్రం ఈ శంకర్ మూడో కన్ను కన్న కల.

ప్రత్యేకతలు :

 1. శంకర్ కథనం మరియు దర్శకత్వం. కథావస్తువు చిన్నదే అయినా, వాణిజ్య అంశాలకు దూరంగా వచ్చినా ఈ చిత్రాన్ని శంకరే తీయగలడు. ఇది నిజం.
 2. విక్రమ్ నటన. దీని గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. చిత్రంలో కనిపించే వివిధ కోణాలున్న పాత్రల కోసం అతడు పడ్డ కష్టానికి తలవంచి నమస్కరించాలి.
 3. పీ.సి.శ్రీరాం ఛాయాగ్రహణం. ఈ చిత్రాన్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటే దానికి సగం కారణం శ్రీరాం గారి పనితనమే అని చెప్పాలి.
 4. రెహమాన్ సంగీతం. గీతాలు వినసొంపుగా, నేపథ్య సంగీతం చిత్రం ఔన్నత్యాన్ని పెంచేలా ఉన్న రెహమాన్ ప్రతిభను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
 5. గీతాల చిత్రీకరణ. శంకర్ చిత్రాలు అందమైన గీతాలకు పెట్టింది పేరు. మళ్ళీ మళ్ళీ చూసేలా గీతాలను చిత్రీకరించినందుకు శంకర్ ని మళ్ళీ అభినందించాలి.
 6. అనల్ అరసు, పీటర్ మింగ్ పోరాటాలు. మిస్టర్ ఆంధ్ర పోటి మరియు చైనాలో తీసిన పోరాటాలు ఆకట్టుకున్నాయి.
 7. శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్. చిత్రంలో గ్రాఫిక్స్ సాయంతో తీసిన సన్నివేశాలు బాగా ఉన్నా, అన్ని సహజంగానే అనిపిస్తాయి.
 8. నిర్మాణ విలువలు. కేవలం దర్శకుడిని నమ్మి చిత్రం ఇంత అందంగా రావడానికి కారణం ఏమాత్రం వెనకాడకుండా రవిచంద్రన్ పెట్టిన ఖర్చే.

బలహీనతలు :

 1. ప్రచారం మరియు ప్రేక్షకుడి అంచనాలు. ఈ చిత్రం థియేటర్ల వరకు రావడానికి కారణం శంకర్ మరియు అతడు చేసిన ప్రచారం. దానితో ప్రేక్షకులు అమితమైన అంచనాలు పెట్టుకొని వెళ్లి నిరాశ చెందారు. దీనికి శంకరే బాధ్యుడు. కానీ దీన్ని రోబో తరువాత తీయడం అతడి వ్యాపార సూత్రాలను చూపించింది.
 2. నిడివి. నెమ్మదిగా నడిచిన కథనం ఈ చిత్రాన్ని 188 నిమిషాల చిత్రంగా చేసింది.
 3. బలహీనమైన కథ. శంకర్ సినిమాలో ఇంత చిన్న కథ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కనుక ఇది కూడా చిత్రాన్ని ప్రేక్షకుడికి చేరవేయలేదు.
 4. ఎక్కువ నిడివిగల పోరాటాలు. పోరాటాలను కుదించి ఉంటే చిత్రానికి మేలు జరిగేది.
 5. అంటోని కూర్పు. చిత్రాన్ని 188 నిమిషాల చిత్రంగా మలచడం దర్శకుడి ఆలోచనే అయినప్పటికీ చాలా సన్నివేశాలు పెద్దవిగా అనిపించాయి.
 6. ఒస్మా జాస్మిన్ పాత్ర. ప్రేక్షకుడు ఏమాత్రం ఒప్పుకోలేని పాత్ర ఇది.
 7. మేకప్. కావాల్సినంత కాకుండా “అంతకుమించి” చేసిన మేకప్పులు జుగుప్సాకరంగా ఉన్నాయి.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

ఏ చిత్రాన్ని ఎన్నో చిత్రంగా తీయాలో తెలుసుకొని అప్పుడే తీస్తే వ్యాపారం బాగా జరుగుతుంది.

శంకర్ గురించి మరికొంత :

ఈ చిత్రం చూసిన ప్రతి ప్రేక్షకుడు శంకర్ ఎప్పటిలాగే ఈసారి ఏ సందేశాన్ని ఇవ్వలేదేంటని వాపోయాడు. నిజానికి శంకర్ ఇందులో కూడా “స్వచ్చమైన ప్రేమ, అందం శరీరానికి సంబంధించినవి కావు, మనుసుకు సంబంధించినవి” అనే సందేశాన్నిచ్చాడు. కాకపోతే తన మునుపటి చిత్రాల్లో సందేశాలు ఎక్కువగా మాటలతో చెబితే ఇందులో దృశ్యాలతో అంతర్లీనంగా చెప్పాడు. అంతే తేడా!

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s