జీవితంలో ఊహలుంటాయి, జ్ఞాపకాలుంటాయి. సినిమా విషయంలో కూడా అంతే. ఊహలకు రూపకల్పన చేయవచ్చు లేదా జ్ఞాపకాలకు తెర రూపాన్ని ఇవ్వొచ్చు. ఊహలు, జ్ఞాపకాల మిళితమే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అనే చిత్రం. “ఓనమాలు” చిత్రంతో అభినందనలు పొందిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్య మీనన్ జంటగా, సుప్రసిద్ధ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రం. దీని విశేషాల్లోకి వెళ్తే…
కథ :
ఖేల్ రత్న పురస్కార గ్రహీత అయిన రాజారాం (శర్వానంద్), మలేషియాలో పారిశ్రామికవేత్త అయిన నజీరా ఖానం (నిత్య మీనన్) ల ప్రేమ తాలూకు జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్ర కథ.
కథనం :
పైన చెప్పుకున్న విధంగా ఈ చిత్రంలో ఊహలున్నాయి, జ్ఞాపకాలున్నాయి. మధ్య వయస్కుడైన ఖేల్ రత్న పురస్కార గ్రహీత రాజారాంతో తన పాత “బూట్లు మాట్లాడటం” అనే ఊహతో తెరిచిన జ్ఞాపకాల పుస్తకం ఈ చిత్రంలోని మొదటి సగం. చిత్రం మొదలవ్వగానే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విషయం ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి “శర్వానంద్” లాంటి యువ కథానాయకుడిని “నాన్న” అని పిలవడం. కానీ ఇది ఆలోచించాల్సిన విషయం కానే కాదు.
మొదటి సగంలో నాయకానాయికలు కళాశాలలో చదివే రోజుల నాటి సన్నివేశాలు కొన్ని ఆ జీవితాన్ని దాటి వచ్చిన వారు మరోసారి నెమరువేసుకునేలా తెరపై చూపించాడు రచయిత, దర్శకుడు క్రాంతి మాధవ్. ఇస్లాం మతానికి చెందిన కథానాయిక, హిందూ మతానికి చెందిన కథానాయకుడి పాత్రలను తీసుకున్నప్పటికీ, అక్కడక్కడ మత ప్రస్తావన కొద్ది కొద్దిగా తెచ్చినప్పటికీ, అవి కథకు కానీ, చూసేవారి మనోభావాలకు కానీ ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ సగంలో కేవలం కళ్ళను చూసి ప్రేమించే సన్నివేశాలు, నాయకానాయికల దోబూచులాటలు మొదలైన అంశాలను హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. దీనికి సంభాషణలు కూడా బాగా సాయం అందించాయి.
మొదటి సగంలో కథనం పరంగా నాకు బాగా నచ్చిన సన్నివేశం, బురఖా వేసుకున్న నజీరాను వెంటపడి అలసిపోయిన రాజారాం “బాగానే పరిగెడుతున్నావ్! రా కలిసి పరిగెడదాం” అని చెప్పే సన్నివేశం. మరికొన్ని సంభాషణలు గుర్తుపెట్టుకొని మాట్లాడుకునేలా ఉన్నాయి. ఉదాహరణకు “ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్ గానే ఉంటుంది… కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది” లాంటి సంభాషణలు. ఇదే సగంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు. అందులో చెప్పుకోవలసింది, బురఖా వేసుకున్న నజీరాతో “నాలో ఉన్న నిన్ను చూడాలి” అని రాజారాం చెప్పే సన్నివేశం. మొత్తానికి పెద్దగా మలుపులేవి లేకుండా ప్రేక్షకుడి ఊహలకు అవలీలగా అందుతూ మొదటి సగం ముగుస్తుంది.
ఇక రెండో సగం నజీరా ఖానం జ్ఞాపకాలతో సాగుతుంది. ఓ “కూతురి”కి, “తల్లి”లా ఉన్న నజీరా తన కథని వివరిస్తుంది. ఈ సగంలో, చిత్రంలో ఓ కథానాయకుడు ఉన్నాడన్న విషయాన్ని మరిపించేలా నిత్య మీనన్ నటించింది. స్వతహాగా మంచి నటి అయిన నిత్య ఈ పాత్రలో మరింత ఒదిగిపోయి నటించింది. దీనికి ఓ మచ్చుతునక, తండ్రి చిత్రపటాన్ని చూస్తూ మాట్లాడే సన్నివేశం. ఈ సన్నివేశానికి నిత్య నటనతో పాటు సాయిమధవ్ బుర్రా సంభాషణలు కూడా ప్రాణం పోశాయని చెప్పాలి.
ఆ తరువాతి కథనాన్ని నెమ్మదిగా, అక్కడక్కడ కాస్త అతిశయంగా సాగించి ఇబ్బందిపెట్టాడు దర్శకుడు. కానీ సంభాషణలు ప్రేక్షకుడు చివరిదాకా చిత్రాన్ని చూసేలా తమవంతు సహకారాన్ని అందించాయి.
మొత్తానికి ఊహలతో మొదలై, జ్ఞాపకాల్లో ప్రయాణించి, నాటకీయంగా విడిపోయిన ప్రేమికులను కలిపి చివరకు ఓ సర్వసాధారణ కథలా ముగుస్తుంది ఈ చిత్రం.
సంభాషణలు :
ఈ చిత్రానికి ప్రధాన బలం ఇదే. అందుకే ప్రత్యేకంగా చెప్పాల్సివస్తోంది. సాయిమాధవ్ బుర్రా తన సంభాషణలతో ముఖ్యమైన సన్నివేశాలకు బలాన్ని, బరువుని పెంచారు. కొన్ని ఉదాహరణలు ఇవే,
1) బాగానే పరిగెడుతున్నావ్… రా కలిసి పరిగెడదాం! (ఇది కథనం పరంగా…)
2) బ్రతుకుని పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. చావును గౌరవించాలి.
3) ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం… ప్రేమకన్నా చాలా చిన్నది.
4) అందరూ ఇష్టానికి పుడతారు. కొందరు మాత్రం కష్టంగా పుడతారు.
5) గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను, గుర్తుపడితే బ్రతకలేను. ఇది నీకు అర్థం అవ్వాలంటే ఈ జన్మ సరిపోదు. ప్రేమ సరిపోతుంది.
6) కళ్ళకి, మనసుకి కామన్ సెన్స్ ఉండదు. వాటితో పాటు తిరిగితే మనం చెడిపోతాం.
7) కన్నీళ్ళు, మనసు రెండు కవల పిల్లలు. పుట్టిన దగ్గరనుండి మనతో ఉండేవి అవే!!
ప్రత్యేకతలు :
1) నిత్య మీనన్. తన నటన, సౌందర్యంతో పాత్రకు, చిత్రానికి ఊతంగా మారింది. అటు ప్రక్క శర్వానంద్ ని అధిగమించి నటించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
2) జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం. సాగర తీరంలోని సన్నివేశాలు, మొదటి సగంలో వర్షం పడే సమయంలో నాయకానాయికల మధ్య వచ్చే సన్నివేశం, “ఎన్నో ఎన్నో” అనే గీతం అతడి ప్రతిభకి నిదర్శనాలు.
3) గోపీ సుందర్ సంగీతం. ఈ చిత్రానికి సంగీతం కూడా మరో బలంగా నిలిచింది. “మర్హబ” గీతంలో “ముద్దుగారే యశోద” కీర్తనని ఇమిడింపచేసిన విధానం బాగుంది. “ఎన్నో ఎన్నో” అనే గీతం కూడా కొన్ని రోజులు గుర్తుపెట్టుకునేలా ఉంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తోడునిచ్చేలా అందించారు గోపి. ముఖ్యంగా మొదటి సగంలో నాయకానాయికలు ఎదురుపడే సందర్భాల్లో వచ్చే వీణ సంగీతం చాలా బాగుంది.
బలహీనతలు :
1) పెద్దగా బలం లేని మామూలు మూలకథ.
2) రెండో సగంలో నెమ్మదిగా సాగిన కథనం.
3) ఆకట్టుకోలేని “మాట్లాడే బూట్లు” లాంటి ఊహలు.
4) జ్ఞాపకాలు, భావాలు మీద దృష్టి సారించడంతో కరువైపోయిన హాస్యం.
5) జ్ఞాపకాలు, ఊహల మధ్య కుదరని సమతుల్యం.
ఈ చిత్రం చెప్పిన పాఠం :
సినిమా అనే ఊహకు నిజజీవిత జ్ఞాపకాలు జోడిస్తే ప్రేక్షకుడికి త్వరగా చేరువ అవుతుంది. కానీ వాటి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవాలి.
– యశ్వంత్ ఆలూరు
Yeswanth analyzation is simply superb
LikeLike