టెంపర్ (2015)

Temper-Movie-Release-Date-Posters-2

పరిశ్రమలో “నటులు”గా చెప్పుకునే కథానాయకుల జాబితాలో ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి పాత్రైనా పోషించగల దమ్మున్న కథానాయకుడు. కానీ ఈ మధ్య కాలంలో సరైన విజయం అందుకోలేక అటు అభిమానుల్ని, సరైన సినిమాలు చేయక ఇటు ప్రేక్షకుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అలాంటి సమయంలో ఆంధ్రావాలా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మళ్ళీ నటిస్తున్నాడని తెలిసి అందరు ఆశ్చర్యపోయారు. ఆ చిత్రాన్ని గుర్తుచేసుకొని ఈసారి కూడా పరాజయమే అనుకున్నారు అంతా. కానీ వారందరి ఆలోచనలను, ఆశ్చర్యాలను ఛేదిస్తూ, బండ్ల గణేష్ నిర్మాణంలో “టెంపర్” ఈ నెల 13న విడుదలయింది…

కథ :

సంఘంలో పోలీసులకు ఉన్న గౌరవాన్ని, అవినీతిలో వారికున్న సౌలభ్యాన్ని చూసి వాటి కోసం పోలీస్ అవుతాడు దయ (ఎన్టీఆర్). విశాఖపట్నంలోని వాల్తేరు వాసు (ప్రకాష్ రాజ్)తో చేతులు కలిపి, అతడి అక్రమాలకు సాయపడుతూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఇంతలో అతడికి కనపడుతుంది శాన్వి (కాజల్). అతడి తెలివితేటలతో ఆమె ప్రేమను గెలుచుకున్న దయని ఓ పని చేయమని అడుగుతుంది. ఆ కోరిక దయ జీవితాన్ని ఎలా మార్చింది అనేది మిగతా కథాంశం.

కథనం :

ఈ సినిమాకున్న ప్రత్యేకత, తొలిసారి పూరి తన సొంత కథని తీయకపోవడం. వరుస విజయాల కథలను అందిస్తున్న వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథకుడు. ఏ చిత్రానికీ 30 రోజులకంటే చిత్రీకరణ జరపని పూరి ఈ చిత్రాన్ని దాదాపు 6 నెలలు చిత్రించాడు. మునుపెన్నడూ లేని ఆహార్యంతో, నటనతో ఎన్టీఆర్ ఈ చిత్రంలో కనిపించాడు.

మొదటి సగం అంతా దయ పాత్ర పైనే దృష్టి సారించాడు దర్శకుడు. అతడి అవినీతిని, తెలివిని బాగా చూపించాడు. దీనికి మొదటి ఉదాహరణ, చిత్రం మొదట్లో ఓ రౌడీ శవం ద్వారా డబ్బు సంపాదించడం. దయ, వాల్తేరు వాసు మొదటిసారి కలుసుకునే సన్నివేశంలోనూ ఈ పాత్ర స్వభావాన్ని బాగా చూపించాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వినోదాన్ని పంచాయి. తనికెళ్ళ భరణి పాత్రతో ఉన్న సన్నివేశం దయ పాత్రలోని అవినీతిని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇది, చూసే ప్రేక్షకులను కూడా ఓ రకమైన అనుభూతికి గురిచేసింది. శాన్వితో మరో వ్యక్తి (వెన్నెల కిశోర్) ని చుసిన సన్నివేశంలో దయ పడిన ఇబ్బంది, చూపించిన అసహనం పాత్ర ఔన్నత్యాన్ని పెంచాయి. ఇది ఎన్టీఆర్ నటనాప్రతిభను కూడా చూపించింది.

ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర కానిస్టేబుల్ నారాయణ మూర్తి (పోసాని కృష్ణమురళి). ఈ మధ్య కాలంలో హాస్యనటుడిగానే కనపడుతున్న పోసానికి, అవినీతితో రెచ్చిపోతున్న దయ పాత్రను అనుక్షణం ప్రశ్నించే మంచి పాత్ర దక్కింది. ఈ రెండు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు, వాటిలోని సంభాషణలు చాలా బలంగా ఉన్నాయి. అందులోనూ నీతి, అవినీతి గురించి ఇద్దరూ సాగరతీరంలో మాట్లాడుకునే సన్నివేశం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. సమాజంలో డబ్బుకున్న విలువను గురించి చెప్పిన ఈ సన్నివేశానికి పూరి వ్రాసిన మాటలు మూలం అయితే ఎన్టీఆర్ నటన ప్రాణం. తన పై అధికారన్న గౌరవాన్ని, కళ్ళ ముందు జరిగే అన్యాయ్యాన్ని ఆపలేని చేతకానితనాన్ని బాగా ప్రదర్శించారు పోసాని.

ఇక శాన్వి పాత్రకు విరామ సమయానికి ప్రాముఖ్యత దొరికింది. తను పొరపాటుగా చిక్కుకున్న “సమస్య”లో ఉన్న అసలు బాధితురాలు లక్ష్మి (మధురిమ) ని కాపాడమని అడగడంతో తప్పక వాసుతో వైరానికి దిగుతాడు దయ. దీని గురించి ప్రత్యేకంగా వ్రాయటానికి కారణం ఆ తరువాత జరిగే కథనం. చూసే ప్రేక్షకుడు దయ ఇక్కడ మారిపోయాడు అని అనుకుంటాడు. కానీ రెండో సగం ఆరంభంలో వాసుతో గోడవ పడినందుకు దయ బాధపడే సన్నివేశాన్ని వ్రాసుకొని మంచి పని చేశారు కథకుడు, దర్శకుడు. ఒకవేళ విరామానికే దయ మారిపోయి ఉంటే ఇప్పటివరకు నెలకొల్పిన ఆ పాత్రకి న్యాయం చేయనట్లే అవుతుంది. ఆ తరువాత వాసు, దయ కలిసిపోవడం, “సమస్య”ని పరిష్కరించడానికి దయ వేసే ఎత్తుగడ ఆ పాత్రని మరింత పటిష్టం చేశాయి. ఇది నారాయణ మూర్తితో పాటు చూసే ప్రేక్షకుడికి కూడా దయ ఇక మారడన్న భావం కలిగించి ఆ పాత్ర పట్ల ద్వేషాన్ని పెంచే ప్రయత్నం. పై ఇద్దరూ ఇక్కడ మార్కులు కొట్టేశారని చెప్పాలి.

ఇక్కడితో మొదటి నుండి చూపించిన దయ పాత్రకు పూర్తి న్యాయం జరిగింది. కానీ కథలో ఓ కొరత అలాగే ఉండిపోయింది. అదే, పైన పేర్కొన్న “సమస్య”. అసలు అదేంటన్న విషయం తెలియాలి. కథనం చాలాసేపు దీని మీదే నడిచింది కనుక ఇది చాలా బలమైనదిగా ఉండాలి. ఆ బలానికి ఓ ప్రభావం ఉండాలి. అది “దయ”లో వచ్చే “మార్పు” కావాలి. పోలీసుస్టేషన్ కి వచ్చిన దయని చుసిన నారాయణ మూర్తి “మీరు మారిపోయారు సార్!” అని అనడం, దయ అకస్మాత్తుగా తనకిచ్చిన గౌరవాన్ని చూసి ఆ “మార్పు”ని నమ్మడం కథలోని ఈ కొత్త “మార్పు”కి అత్యంత బలాన్నిచ్చాయి. అతడు దయకి సెల్యూట్ చేసే అంశం కొత్తదేమి కాకపోయినా ఈ సన్నివేశాన్ని మాత్రం బాగా పండించింది. దయలో వచ్చిన ఈ “మార్పు”ని ప్రేక్షకుల చేత ఒప్పించే ప్రయత్నం దర్శకుడు బాగానే చేశాడనిపించింది.

ఇక ఆ తరువాత కథనం సమాజం వైపు కాసేపు వెళ్ళినా దయ దగ్గరికి త్వరగానే తిరిగొచ్చేసింది. మొదటి రోజు ఆధారాలు చూపించలేని దయ మరో రోజు గడువు కోరతాడు. తన గత జీవితాన్ని గుర్తు తెచ్చుకొని పశ్చాతాపంతో దేవుడిని ఓ అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆ తరువాత వచ్చే పోరాట సన్నివేశంలో చాలా లీనమై నటించాడు ఎన్టీఆర్. అది వంద శాతం “పూరి” సంతకం ఉన్న సన్నివేశం.

ఆ తరువాత ఆధారం సంపాదించలేక నేరం తనపై వేసుకొన్న చోట ఓ చిన్న తర్కం తప్పింది. తను ఇదివరకటిలా లేడు కనుక ఆ సీడీని కాపీ తీయలేదు కానీ ఓసారి అయినా లక్ష్మికి ఫోన్ చేయవచ్చు కదా అన్న ఆలోచన రాలేదేమో కథకుడికి మరియు దర్శకుడికి అనిపించింది. అలా చేసుంటే దయ పాత్రకు అప్పటివరకు చూపించిన తెలివితేటలు సార్థకం అయ్యేవేమో. కానీ నేరం తనపై వేసుకొని కోర్టులో మాట్లాడే సన్నివేశం భావోద్వేగానికి గురిచేసేది. బహుశా నాలాంటి విమర్శకులు తప్ప మిగతా ప్రేక్షకులు తర్కానికంటే దీనికే బాగా స్పందిన్చారేమో అనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ నటనాప్రతిభను కూడా చూపించింది. పూరి వ్రాసిన మాటలు కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. మాట్లాడటం ముగిసన తరువాత ఎన్టీఆర్ పలికించిన ఓ భావోద్వేగం బాగా ఆకట్టుకుంది.

ఇక పతాక సన్నివేశంలోని పోరాటాన్ని బాగా చిత్రీకరించారు. ఇక్కడ ఛాయాగ్రహకుడు శ్యాం కె. నాయుడు పనితనం కూడా బాగుంది. కానీ మొదటి నుండి ప్రతినాయకుడు అనుకున్న వాల్తేరు వాసు పాత్ర ఇక్కడికి వచ్చేసరికి వ్యర్థం అయిపోయినట్లుగా అనిపించింది. దీనికి ముందు దయని అడ్డుకోవడానికి అతడు చేసే ప్రయత్నాలు కూడా ప్రభావితంగా లేవు. మొత్తానికి దయ నిర్దోషిగా విడుదల అవ్వడంతో చిత్రం ముగుస్తుంది.

పాటల విషయానికి వస్తే “చూలెంగే ఆస్మాన్” అనే గీత చిత్రీకరణ బాగుంది. “దేవుడా” గీతం సరయిన సమయంలో వచ్చింది. “టెంపర్” గీతం కథనానికి అడ్డంగా ఉన్నా అందులో నృత్యంతో ఎన్టీఆర్ అలరించాడు. సంగీతపరంగా పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా లేవు.

ప్రత్యేకతలు :

1) ఎన్టీఆర్. ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ చిత్రం చూస్తే కేవలం ఎన్టీఆర్ కోసమే చూడాలి అనేట్టుగా మునుపెన్నడూ చేయని విధంగా నటించాడు. చిత్రం అంతా దయే తప్ప ఎన్టీఆర్ ఎక్కడా కనపడనంతగా పాత్రలో లీనమైపోయాడు. దీనికి ఉదాహరణలు, తనికెళ్ళ భరణితో సంతకం చేయించే సన్నివేశం, పోసానితో నీతి, అవినీతి గురించి మాట్లాడే సన్నివేశం, వెన్నెల కిశోర్ ని మొదటిసారి చుసిన సన్నివేశం, ఆఖరి ఘట్టం ముందు వచ్చే సాగరతీరంలోని పోరాట సన్నివేశం మరియు ఆఖరులో వచ్చే కోర్టు సన్నివేశం. ఈ చిత్రంతో, నటనతో అభిమానులను అలరించడమే కాకుండా మిగతా ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతిని ఇచ్చాడు ఎన్టీఆర్. మునుపటి చిత్రాలకంటే అందంగా కనిపిస్తూ, ఇంతకాలం వేసుకున్న గళ్ళ చొక్కాలు వదిలేసి మంచి దుస్తుల్లో కనిపించాడు.

2) సంభాషణలు. పూరి జగన్నాధ్ చిత్రాలు సంభాషణలకు పెట్టింది పేరు. అతడి సంతకం ఉన్న సంభాషణలు ఇందులో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు మనుషులకు, కుక్కలకు ఉన్న అనుబంధం గురించి వ్రాసిన మాటలు.

3) పోసాని కృష్ణమురళి. ఈ మధ్య కాలంలో ఇలాంటి పాత్ర దక్కలేదు. తన మామూలు ఆహార్యానికి దూరంగా ఈ చిత్రంలో నటించారు. కథానాయకుడిని అడుగడుగునా అడ్డుకునే ఈ పాత్రని పరిధి దాటకుండా పోషించారు పోసాని.

4) మణి శర్మ నేపథ్య సంగీతం. పాత్రలు, సన్నివేశాల ఔన్నత్యాన్ని పెంచడంలో బాగా తోడ్పడింది.

బలహీనతలు :

1) ఆఖరు ఘట్టంలో తప్పిన తర్కం. (నాకు తోచినది)

2) చివరికి పనికిరాకుండా పోయిన ప్రకాష్ రాజ్ పాత్ర.

3) పెద్దగా ఆకట్టుకోలేని అనూప్ రూబెన్స్ సంగీతం.

4) సరిగ్గా పండని అలీ, సప్తగిరిల హాస్యం.

ఈ చిత్రం చెప్పిన పాఠం :

ఏళ్ల తరబడి ఒకే దారిలో ప్రయాణిస్తూ, ఒకే చట్రంలో ఇరుక్కుపోకుండా దారి మార్చుకొని నిజాయితీగా, “కసి”గా కష్టపడితే ప్రేక్షకాదరణ తప్పదు.

– యశ్వంత్ ఆలూరు

One thought on “టెంపర్ (2015)

  1. సూపర్. ఈ సినిమా నాకు నచ్చింది. చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ సినిమాని థియేటర్ లో చూసాను. వరుసగా మూస పాత్రలు చేస్తూ బోర్ కొట్టించిన ఎన్టీఆర్ ఈ సారి కాస్త విభిన్నంగా ప్రయత్నించి విజయం సాదించాడు. ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంది. పూరి మాటలు బాగున్నాయి, అతని మునుపటి సినిమాల కంటే బాగున్నాయి. ఇక సంగీతం విషయానికి వస్తే, మాములుగా విన్నప్పుడు నాకు పాటలు అంతగా నచ్చలేదు కాని సినిమాలో చూసినపుడు పర్వలేదనిపించాయి.

    నువ్వు రాసిన CD కాపీ లాజిక్ నీ విశ్లేషణ చదివే వరకు నాకు తట్టలేదు. అది అంత భూతద్దం లో చూసేంత తప్పు కాదేమో అనిపించింది. ఈ మధ్య కాలంలో ఎన్నో లాజిక్ లేని సినిమాలు చూసాం, దానితో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి తప్పులు మనం నిజ జీవితం లో కూడా చేస్తుంటాం.

    మొత్తానికి నీ విశ్లేషణ బాగుంది.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s