తెలుగు చిత్రసీమలో అరుదైన కథాంశాలతో చిత్రాలు రూపొందడం అరుదే. అలాంటి అంశాలను ప్రేక్షకులకు చేరువయ్యే అంశాలను జోడించి చెప్తే ప్రేక్షకాదరణ తప్పదని కొన్ని చిత్రాలు ఋజువు చేశాయి. ఆ కోవకు చెందినదే “సూర్య vs సూర్య”. నిఖిల్, త్రిధ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా “కార్తికేయ” చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పని చేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అయ్యారు. మల్కాపురం శివకుమార్ నిర్మించారు.
కథ :
“పోర్ఫిరియా” అనే జన్యు సంబంధిత వ్యాధితో బాధపడే సూర్య (నిఖిల్) సూర్యకాంతిలో తిరగలేడు కనుక రాత్రి జీవితాన్నే గడుపుతుంటాడు. అతడు బుల్లితెర వ్యాఖ్యత అయిన సంజన (త్రిధ చౌదరి) ని ప్రేమిస్తాడు. తన ఆరోగ్య పరిస్థితిని తన ప్రేయసికి ఎలా తెలియజేశాడు, ఆమె ప్రేమని ఎలా గెలిచాడు అన్నది కథాంశం.
కథనం :
మన తెలుగు కథానాయకుడు ఓ వ్యాధితో బాధపడుతున్నాడు అంటే దానికి సంబంధించిన బలమైన గతాన్ని కానీ, అతడి జీవితం “పగ”తో ముడిపడి ఉండటం కానీ సాధారణంగా మనం చూసే విషయాలు. ఈ చిత్రాన్ని ఆ పోకడకి చాలా దూరంగా మలిచాడు దర్శకడు. ఓ మామూలు యువకుడికి ఓ వ్యాధి ఉంటే అతడి జీవితం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాడు. కథానాయకుడికి వ్యాధి ఎందుకు వచ్చిందో లోతైన విశ్లేషణ చేయకుండా ఓ చిన్న సన్నివేశంలో దాని గురించి చెప్పేశాడు. అలాగని ఆ అంశాన్ని ఎక్కడా వదల్లేదు. కథంతా దీని చుట్టూనే తిరుగుతున్నా అది మాత్రం అంతర్లీనంగా ఉండేలా చూసుకున్నాడు. ఇది బాగా అభినందించదగ్గ విషయం. ఇక్కడ దర్శకుడికి మార్కులు వేయాల్సిందే.
ఇలాంటి అరుదైన విషయం ఉన్న ఈ చిత్రంలో వాణిజ్యపరమైన అంశాలు కూడా ఉన్నాయి. సందర్భానుసారంగా వచ్చే హాస్యం ప్రేక్షకుడిని బాగానే నవ్వించింది. ముఖ్యంగా చెప్పాల్సింది ఎర్రసామి (తనికెళ్ళ భరణి), ఆటో అరుణ (సత్య) పాత్రల గురించి. పెద్ద వయసుగల వీరు సూర్యకి స్నేహితులు కావడం, వీరి కలయికలో వచ్చిన సన్నివేశాలు ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సూర్య సంజనని మెప్పించడానికి అరుణ ఇచ్చిన సలహాలను పాటించే సన్నివేశం.
ఇక భావోద్వేగానికి గురిచేసే ప్రయత్నం చేసింది సూర్య తల్లిగా మధుబాల పోషించిన పాత్ర. రెండో సగంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశంలో తల్లి ప్రేమకంటే గొప్పది మరేది లేదన్న విషయాన్ని తక్కువ నాటకీయతతో చెప్పాడు దర్శకుడు. ఆ తరువాత కథనం నెమ్మదించింది. పతాక సన్నివేశం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మొత్తానికి ఓ అరుదైన కథాంశం, సాధారణ కథనం, సందర్భానుసారమైన హాస్యం కలిస్తే “సూర్య vs సూర్య” చిత్రం. ఓ మంచి ప్రయత్నం.
ప్రత్యేకతలు :
1. కథానాయకుడు నిఖిల్. అరుదైన కథాంశాలను ఎంచుకోవడమే కాకుండా నటనలోనూ పరిణితి సాధిస్తున్నాడు. తనకున్న వ్యాధి గురించి తన ప్రేయసికి చెప్పలేని బాధని రెండో సగంలో స్మశానంలో ఉన్న సన్నివేశంలో బాగా పలికించాడు. పాత్ర కోసం తన దేహాన్ని, ఆహార్యాన్ని కూడా మార్చుకున్నాడు. ఇలాగే అరుదైన కథాంశాలు ఎంచుకుంటే భవిష్యత్తులో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది.
2. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం. దర్శకుడిగా కన్నా ఛాయాగ్రాహకుడిగానే కార్తీక్ కష్టం ఎక్కువ. “పోర్ఫిరియా” వ్యాధి ఉన్నవారిలో రక్తం తక్కువగా ఉండటం వల్ల మామూలు మనుషులకన్నా ఎక్కువ తెల్లగా కనపడతారు. తెర మీదున్న మిగతా నటులకంటే నిఖిల్ ని తెల్లగా చూపించటానికి లైటింగ్ విషయంలో అతడు పడ్డ కష్టం బాగా కనిపించింది.
3. సత్య మహావీర్ సంగీతం. కథకి, కథనానికి సరిపోయే పాటలను, నేపథ్య సంగీతాన్ని అందించాడు. కొన్ని రోజులవరకు ఈ చిత్రపు పాటలు గుర్తుపెట్టుకునేలా ఉన్నాయి. “ప్రేమే సంతోషం” అనే గీతం చెవులకు సొంపుగానూ కంటికి ఇంపుగానూ ఉంది.
బలహీనతలు :
1. సందర్భానుసారమైన హాస్యం. చిత్రం చూస్తున్నంతసేపు ప్రేక్షకుడిని నవ్వించినా, కేవలం ఒక్కసారి చూడదగ్గ చిత్రంగా చేసింది ఆ హాస్యం.
2. నెమ్మదిగా నడిచే కథనం, ఆకట్టుకోలేకపోయిన పతాక సన్నివేశం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
అరుదైన కథాంశాన్ని అరుదైన కథనంతోనే చెప్పాలి అనుకోకుండా సహజంగా కూడా చెప్పొచ్చు.
– యశ్వంత్ ఆలూరు