చలనచిత్ర రంగంలో మార్పు రావాలంటే వేగంతో పాటు ప్రోత్సాహం కూడా అవసరం. అలాంటి ఒక ప్రోత్సాహమే “ఎవడే సుబ్రమణ్యం”. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ద్వారా “నాగ్ అశ్విన్” దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు.
కథ :
ఎన్నో ప్రణాళికలు వేసుకొని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తున్న సుబ్రమణ్యం (నాని) జీవితంలో ఎటువంటి ప్రణాళిక లేకుండా జీవితాన్ని గడిపే తన బాల్యమిత్రుడు రిషి (విజయ్ దేవరకొండ) మళ్ళీ ప్రవేశిస్తాడు. ఎవరెస్ట్ శిఖరం దగ్గరున్న “దూద్ కాశి“కి వెళ్ళాలని బలవంతం చేస్తాడు. ఇంతలో వీరికి ఆనంది (మాళవిక నాయర్) పరిచయం అవుతుంది. ఆ తరువాత వీరి జీవితాలు ఎలా మారాయి అన్నది మిగతా కథాంశం.
కథనం :
కొత్త కథాంశాన్ని కొత్తగా చెప్పడం సహజం. పాత కథాంశాన్ని కూడా కొత్తగా చెప్పడమే సాహసం. అలాంటి సాహసమే ఈ చిత్రంలో చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తనతో పాటు నటులతోనూ ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి సాహసం చేయించారు. ఇందులోని ప్రధాన పాత్రలతో పాటు “దూద్ కాశి” ని కూడా ఓ పాత్రలా ప్రేక్షకుడు ప్రాముఖ్యత ఇచ్చేలా చేశాడు.
నిజానికి ఈ చిత్ర కథాంశంలో ఎంతో వేదాంతం ఉంది. దాన్ని సూటిగా చెప్పకుండా ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే చెప్పాడు. కానీ ఎక్కడా కథనాన్ని మూలకథ నుండి పక్కదారి పట్టించలేదు. పాత్రల ఔన్నత్యాన్ని ఎక్కడా దెబ్బతీయలేదు. ముఖ్యంగా చెప్పుకోవలసింది “రిషి” పాత్ర గురించి. చాలామందికి ఇట్టే చేరువయ్యే పాత్ర ఇది. దీనికోసమే ఎక్కువ కష్టపడ్డాడు అనిపించింది. ఇది వినోదాత్మకంగానే పరిచయం అయినా, చిత్రం చివర్లో దీనిపై గౌరవం కలిగించేలా మలిచాడు. ఇది అభినందించదగ్గ విషయం.
ఈ చిత్రంలో కథకు ముఖ్యమైన ఓ పాత్ర రామయ్య (కృష్ణంరాజు). ఈ పాత్ర తెరపై తక్కువ సమయం కనిపించినా అనవసరం అనిపించలేదు. అలనాటి నటి ‘షావుకారు’ జానకి ఓ చిన్న పాత్రలో కనిపించి అలరించారు.
మొదటి సగమంతా హాస్యంతో నడిపించిన దర్శకుడు రెండో సగంలో “దూద్ కాశి” ప్రయాణాన్ని ప్రధానాంశంగా చేశాడు. ఇక్కడ ఛాయాగ్రాహకులు రాకేశ్, నవీన్ ల పనితనాన్ని మెచ్చుకోవాలి. అద్భుతమైన ఛాయాగ్రహణంతో కట్టిపడేశారు. ఈ ఘట్టాలలో దర్శకుడు కూడా కథనాన్ని ఇంకాస్త బలంగా నడిపించి ఉంటే బాగుండేది. ఈ కొరతని చివరలో వచ్చే “ఇదేరా” అనే గీతంతో తీర్చేశాడు. మంచి సాహిత్యం, అద్భుతమైన చిత్రీకరణ, నాని నటన ఇక్కడ బాగా ఆకట్టుకున్నాయి. రెండో సగంలో వచ్చే “చల్ల గాలి” అనే “ఇళయరాజా” గీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది “ఇళయరాజా” పాట కనుక. చిత్రీకరణ కూడా బాగుంది.
మొత్తానికి ఆరోగ్యకరమైన హాస్యం, కనువిందైన దృశ్యాలు, సహజమైన నటనలతో నిండిన “ఎవడే సుబ్రమణ్యం” చూడదగ్గ చిత్రంలా నిలిచింది.
ప్రత్యేకతలు :
1. రాకేశ్, నవీన్ ల ఛాయాగ్రహణం. ఈ మధ్య కాలంలో ఓ తెలుగు చిత్రంలో చక్కటి ఛాయాగ్రహణం ఇదేనేమో అనిపించింది. సాహసంతో కూడుకున్న వీరి కష్టాన్ని తప్పకుండా అభినందించాలి.
2. రథన్ సంగీతం. చిత్రానికి సరిపోయేట్టుగా మంచి గీతాల్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది “ఇదేరా” గీతం గురించి. ఆడియోలో వినసొంపుగా ఉన్న ఈ గీతం చిత్రం చూశాక మళ్ళీ మళ్ళీ నెమరువేసుకునేలా ఉంది.
3. నాగ్ అశ్విన్ దర్శకత్వం. కొత్త దర్శకుడు అయినప్పటికీ చిత్రానికి ఏమి కావాలో, తను ఏమి చెప్పాలనుకున్నాడో స్పష్టంగా తెలుసుకొని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి ప్రోత్సాహాలు పోను పోనూ మరింత అవసరం చిత్రసీమకి.
4. తారల నటనలు. చిత్రమంతా నాని, విజయ్ ల్లో సుబ్రమణ్యం, రిషిలే కనిపించారు. పాత్రలకు సంపూర్ణమైన న్యాయం చేశారు. తెలుగులో మొదటిసారి నటించిన మాళవిక నాయర్ కూడా మంచి నటన కనబరించింది.
బలహీనతలు :
1. కొన్నిచోట్ల బలహీనంగా ఉన్న కథనం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కథలోని అంశాన్ని సూటి వేదాంతంలా వల్లించేకంటే వినోదాత్మకంగా చెప్తేనే ప్రేక్షకుడిని వేగంగా చేరుకుంటుంది.
– యశ్వంత్ ఆలూరు
Pingback: లయన్ (2015) | Yashwanth Chronicle