“సినిమాకు కావాల్సింది ఇద్దరే. ఒకరు నిర్మాత, మరొకరు ప్రేక్షకుడు” అని ఓ కార్యక్రమంలో “దాసరి నారాయణరావు” అన్నారు. అది అక్షరాలా నిజం. నిర్మాతే సినిమాకు పునాది. అతడిచ్చే ఖర్చు, ప్రోత్సాహాలే సినిమా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అలాంటి నిర్మాణ సంస్థల్లో “యు.వి.క్రియేషన్స్” సంస్థని ఒకటిగా చెప్పుకోవచ్చు. వీరు నిర్మించిన “మిర్చి”, “రన్ రాజా రన్” చిత్రాలు వారి ప్రోత్సాహానికి ఉదాహరణలు. ఇప్పుడు గోపీచంద్, రాశి ఖన్నా జంటగా ఈ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన “జిల్” చిత్రం ద్వారా “రాధాకృష్ణ కుమార్” దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులోని అంశాల్లోకి వెళ్తే…
కథ :
అగ్నిమాపక శాఖలో అధికారిగా పని చేసే జై (గోపీచంద్) కి ఓ కళాశాల విద్యార్థి అయిన సావిత్రి (రాశి ఖన్నా) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలావుండగా ముంబై మాఫియాకు చెందిన ఛోటా నాయక్ (కబీర్ సింగ్) తోనూ జై కి పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ రెండు పరిచయాలు అతడి జీవితాన్ని ఎలా మార్చాయి అన్నది మిగిలిన కథ…
కథనం :
ఓ సాధారణ కథా వస్తువుని అత్యంత సాధారణమైన కథనంతో ప్రేక్షకులకు అందించాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ పేరున్న కథానాయకుడు, ప్రతిభావంతులైన సాంకేతిక బృందం, ఎంత ఖర్చయినా వెనుకాడని నిర్మాణ సంస్థ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి కథతో రావాల్సిన అవసరం ఏంటో తెలియలేదు. కథనం అంతా కేవలం పాత్రల స్వభావాలనే చూపించే ప్రయత్నం చేశాడు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రతినాయకుడు “ఛోటా నాయక్” పాత్ర గురించి. ముంబై మాఫియా డాన్ అనగానే ఆ పాత్రకు మాములు ఎంపికలైన “సోనూ సూద్”, “ప్రదీప్ రావత్” లాంటి వాళ్ళను కాకుండా ఓ కొత్త ముఖాన్ని పరిచయం చేశాడు. అతడి ఆహార్యం, వేషధారణ మొదలైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు. పాత్ర విషయంలోనూ ఓ ముఖ్యమైన జాగ్రత్త తీసుకున్నాడు అనిపించింది. తెలుగు సినిమాల్లో డాన్ అనగానే, కూర్చున్న సోఫాకు ఇరువైపులా అతడిని శాంతపరిచే రెండు విదేశీ అందాలు, క్రూరుడే అయినా, వొళ్ళో కూర్చొని అతడి ప్రేమను అనుక్షణం ఆస్వాదించే మరో విదేశీ అందం సర్వ సాధారణం అయిపొయింది. కానీ వీటికి దూరంగా, అతడికి తన లక్ష్యం, అహమే ముఖ్యం అని, వాటికోసం చివరకు ఓ ఆడపిల్లని కూడా కనికరం లేకుండా చంపగలడు అని చూపించాడు. తెలుగు సినిమాలో నాయకుడే కాదు ప్రతినాయకుడు కూడా కేవలం లక్ష్యం కోసమే పని చేయాలి అని చెప్పే ఈ పాత్ర చిత్రణని మెచ్చుకోవాలి. కానీ పలు చోట్ల ఈ పాత్ర యొక్క క్రూరత్వం మోతాదు మించినట్టు అనిపించింది.
“జై” పాత్రకన్నా, అది పోషించిన “గోపీచంద్” మీదే ఎక్కువ శ్రద్ధ చూపించాడు దర్శకుడు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అతడిని అందంగా చూపించాడు. అతడి వేషధారణ దగ్గర నుండి మాట్లాడే తీరు వరకు అన్నీ కొత్తగా ఉన్నాయి. అలా గోపీచంద్ ఈ చిత్రానికి ముఖ్యమైన ప్రత్యేకత అయిపోయాడు.
“సావిత్రి” లాంటి పాత్ర పాత రకమే అయినప్పటికీ, అది పోషించిన “రాశి ఖన్నా” దాన్ని ప్రేక్షకులకు దగ్గర చేసిందని చెప్పాలి. మునుపటి చిత్రాలకంటే ఇందులో మరింత అందంగా కూడా కనిపించింది. దాదాపు మొదటి సగమంతా తన భుజాలపైనే నడిపించింది.
ఇక కథనం విషయానికి వస్తే పలు చోట్ల నిరాశపడక తప్పదు. నాయకుడి పాత్రను ప్రతినాయకుడి పాత్రకు అనుసంధానం చేసిన ఘట్టంలో దర్శకుడిలోని పరిపక్వత ఏమాత్రం కనిపించలేదు. అలాగే “ఉన్న” కథలోని పలు పాత్రలు అనవసరం అనిపించాయి. ముఖ్య ఉదాహరణ “అవసరాల శ్రీనివాస్” పాత్ర. పోసానికి మళ్ళీ మామూలు పాత్రే దొరికింది. రెండో సగంలో ప్రభాస్ శ్రీనుతో కలిసి ఆయన చేసిన హాస్యం సహనాన్ని పరీక్షించింది. ఇవెలా ఉన్నా, నాయకానాయికల మధ్య వచ్చే సన్నివేశాలను మాత్రం బాగా చిత్రించాడు దర్శకుడు. ఈ చిత్రానికి ఇవి కాస్త బలాన్ని చేకూర్చినా, దాదాపు సన్నివేశాలు కేవలం కథనంలో పాటలకి చోటివ్వదానికే అన్నట్టుగా ఉన్నాయి. మరో విశేషమేమిటంటే, ఫలానా సన్నివేశం చూస్తున్నప్పుడు తరువాత వచ్చేది పాటే అని ప్రేక్షకుడు ముందుగానే పసిగాట్టేలా ఉన్నాయి ఆ సన్నివేశాలు. కానీ మొదటి పాట మినహాయించి అన్నీ పాటల చిత్రీకరణలు ఆకట్టుకున్నాయి. వాటిలో ఛాయాగ్రాహకుడు “శక్తి శరవణన్” పనితీరు అద్భుతం.
మొత్తానికి దర్శకులందరూ వాడేసిన కథతో, ప్రేక్షకులందరూ ముందే ఊహించగల కథనంతో, నాయకానాయికల అందాలతో “జిల్” చిత్రం ముగుస్తుంది.
ప్రత్యేకతలు :
కథ, కథనాలు ఎలా ఉన్నా ఈ చిత్రంలో ప్రత్యేకతలు లేకపోలేదు. పైన చెప్పుకున్న పాత్రలు, నటులు కాకుండా ఈ చిత్రంపైన గౌరవాన్ని పెంచే అంశాలు మరికొన్ని ఉన్నాయి :
1) నిర్మాణ విలువలు. ఓ అతి సాధారణమైన కథకు ఇంత చక్కటి నిర్మాణ విలువలను చూడటం చాలా అరుదు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ అవి కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. కళా దర్శకత్వం నుండి నటుల దుస్తుల వరకు ఎక్కడా సర్దుకుపోకుండా ఖర్చు పెట్టారు నిర్మాతలు వంశీ, ప్రమోద్. ఇందుకు వారిని మెచ్చుకోవాలి.
2) శక్తి శరవణన్ ఛాయాగ్రహణం. ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇతడి పనితనం పాటల్లోనే కాకుండా పలు సన్నివేశాల్లో బాగా కనిపించింది. మొదటి ఉదాహరణ వర్షం పడుతున్న సన్నివేశంలో గోపీచంద్ రాశి ఖన్నాని ముద్దు పెట్టుకోబోయే సన్నివేశం. రెండొవది విరామ సమయంలో వచ్చే పోరాటం. మూడవది రెండో సగంలో స్మశానంలో వచ్చే పోరాట సన్నివేశం. ఇక్కడ ఆ ప్రదేశాన్ని, నటులను మరియు పలు షాట్స్ ని అద్భుతంగా బంధించాడు శక్తి. అభినందనీయం.
3) మహమ్మద్ జిబ్రాన్ సంగీతం. పాటలు ఫర్వాలేదనిపించినా, నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. మొదటి ఉదాహరణ, నాయకానాయికలు మొదటిసారి కలుసుకునే సన్నివేశంలో వచ్చే నేపథ్య సంగీతం. ఆ తరువాత అక్కడక్కడ వస్తూ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. రెండొవది, ప్రతినాయకుడిపై నాయకుడు తిరగబడటం మొదలుపెట్టే ఘట్టంలో వచ్చే సంగీతం. “దమ్ము” చిత్రంలో కీరవాణి గారి తరువాత రౌద్రరసం పండించే సన్నివేశంలో వయోలిన్ వాడింది జిబ్రానే.
4) పాటల చిత్రీకరణ. అన్నీ అద్భుతంగా చిత్రించినా, “ఏమైంది ఈ వేళ” అనే గీతాన్ని వినూత్నంగా చిత్రించి ఆకట్టుకున్నాడు దర్శకుడు.
5) అనిల్ అరసు పోరాటాలు. విరామ సన్నివేశపు పోరాటం మరియు స్మశానంలోని పోరాటం ఆకట్టుకున్నాయి.
బలహీనతలు :
1) అతి పాత కథ.
2) సాధారణమైన, ఊహించగల కథనం.
3) కూర్పు (editing). అక్కడక్కడ బాగోలేని కూర్పు కొన్ని సన్నివేశాల్ని అసంపూర్ణం చేసినట్టుగా అనిపించింది.
4) వ్యర్తమైన పాత్రలు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
సినిమా స్థాయి పెరగాలంటే నిర్మాణ విలువల కన్నా ముందు “అంతకు మించి”న కథ, కథనం ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు