ఓ మనిషికున్న మొదటి ఆస్తి అతడి విలువలే. ఈ సృష్టిలో మనిషికే అత్యున్నత గౌరవం దక్కింది కూడా అతడు పాటించే విలువల వల్లే. ఇదే అంశంపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం “s/o సత్యమూర్తి”. అల్లు అర్జున్, సమంత, నిత్య మీనన్ నటించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు.
కథ :
తండ్రి నుండి నేర్చుకున్న విలువలే ఆస్తిగా, కోట్ల ఆస్తిని సైతం వదులుకున్న విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) కథ ఇది. తండ్రి సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) మరణానంతరం సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని అనుక్షణం కాపాడటానికి తపన పడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు, అనుభవాల సమాహారమే ఈ కథ.
కథనం :
త్రివిక్రమ్ చిత్రాల్లో దాదాపుగా అత్యంత బలమైన మూలకథ ఉండదు. కేవలం కథనం, మాటలతో చిత్రాన్ని ఆకట్టుకునేలా మలుస్తాడు. ఈ చిత్రానికీ ఇదే పద్ధతినే అనుసరించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.
ఈ చిత్ర కథనం త్రివిక్రమ్ శైలిలోనే మొదలవుతుంది. ఒకటి నుండి పది అంకెల్లో విరాజ్ ఆనంద్ జీవితాన్ని చెప్పడం “అక్షరాలా” త్రివిక్రమ్ సంతకం కలిగిన సన్నివేశం. తరువాత ప్రవేశించే సత్యమూర్తి పాత్రలోనూ త్రివిక్రమ్ స్పష్టంగా కనిపించాడు. ఏ అంశాన్ని అయినా ఓ కొత్త కోణంలో చూడడం త్రివిక్రమ్ ప్రత్యేకత. దాన్ని మరోసారి చాటుకున్న సందర్భమే సత్యమూర్తి తన కొడుకుతో “నాన్న – పులి” కథ చెప్పడం. అది ఆ పాత్ర ఔన్నత్యాన్ని (eminence) కూడా పెంచింది. ఎప్పటిలాగే త్రివిక్రమ్ కి ఈ విషయంలో మార్కులు వేయాలి.
దీని తరువాత మొదటి సగంలో ఎక్కడా త్రివిక్రమ్ కనపడకుండా మాయమైపోయాడు. నెమ్మదించిన కథనంతో, అవసరం లేని, ఆకట్టుకోలేని పాటలతో ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడనిపించింది. ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ కోసం వెతికే సన్నివేశంలో వచ్చే పోరాట ఘట్టం అనవసరం, పైగా దాని నిడివి (runtime) కూడా బాగా ఇబ్బంది పెట్టింది. తరువాత “అలాంటి గోప్పోడికి ఇలాంటి గొప్పోడే పుడతాడు” అనే చోట త్రివిక్రమ్ తళుక్కున మెరిసి మాయమైపోయాడు విరామం ముందు వచ్చే సన్నివేశం వరకు. సమీర (సమంత) పాత్రని నాటకీయ (dramatic) దృష్టితో చూస్తే ప్రేక్షకుడికి చేరువయ్యే అవకాశం లేదు. అటువంటి లక్షణాలు కలిగిన పాత్ర మనకు నిత్యం కనపడేదే. అదా శర్మ బన్నీని కౌగిలించుకునే షాట్ కెమెరాలో బాగా బంధింపబడింది.
రెండో సగంలో దేవరాజు నాయుడు (ఉపేంద్ర) పాత్రతో త్రివిక్రమ్ మళ్ళీ కథనంలోకి ప్రవేశించాడు. అప్పటివరకు నెమ్మదించిన కథనం ఇక్కడ కాస్త పుంజుకుంది. ఆ పాత్ర ఆహార్యాన్ని (behaviour/body language) బాగా చూపించాడు. అందులో చెప్పుకోవాల్సింది, ఆనంద్, దేవరాజు ప్రాణాలు కాపాడే సన్నివేశం గురించి. ఆ పోరాటం కొద్దిమందికి “అబ్బ..ఛ” అనిపించేలా చేసినా అందులో ఏమాత్రం బెదరకుండా కుర్చీలో కూర్చున్న దేవరాజు పాత్ర చిత్రణ బాగుంది. ఆ తరువాత రవి ప్రకాష్ ని పొడిచే షాట్ ఆ పాత్ర ఔన్నత్యాన్ని పెంచింది. ఇక్కడ రాజేంద్రప్రసాద్ నటన కడుపుబ్బ నవ్వించింది.
ఆ తరువాత మళ్ళీ సహనాన్ని పరీక్షించింది “జల్దీ జారుకో…” అనే గీతం. దీనికి సందర్భం ఉన్నా, ఆ విధంగా ఎందుకు చిత్రించాడో అర్థం కాలేదు. ఇలాగే “అత్తారింటికి దారేది”లోనూ “బాపు గారి బొమ్మ” గీతంతో నిరాశపరిచాడు త్రివిక్రమ్. తరువాత బ్రహ్మానందం పాత్ర ప్రవేశం ఊరట కలిగించింది. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన చేసిన హాస్యం బాగా పండింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది “మీరెవరు?” అని రాజేంద్రప్రసాద్ అడగ్గా తన భార్యని కేకేసి “దాని మొగుడిని” అని చెప్పే సన్నివేశం గుర్తుపెట్టుకొని నవ్వేలా ఉంది. అందులో త్రివిక్రమ్ సంతకం ఉంది.
తరువాత కథనం అతి సాధారణంగా మారిపోయింది. చివర్లో దానికో చిన్న పిట్టకథని అనుసంధానం చేసి చిత్రాన్ని ముగించాడు త్రివిక్రమ్. ఇందులో వ్యర్తమైపోయినది సంపత్ రాజ్ పోషించిన పాత్ర. పతాక సన్నివేశంలో తనదైన శైలి మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తండ్రి ఇచ్చిన విలువలే ఆస్తిగా బ్రతికిన విరాజ్ ఆనంద్ పాత్రని బాగా నెలకొల్పాడు.
ఈ చిత్రం మొత్తం చుసిన తరువాత అనిపించిన మొదటి విషయం ఇందులోని చాలా పాత్రలు, నటులు వ్యర్థం అయ్యారని. కొన్ని పాత్రలకు అంత పెద్ద నటులు అనవసరం అనిపించింది. ఉదాహరణలే నిత్య మీనన్, స్నేహ. వారి ప్రతిభలకు తగిన పాత్రలు దొరకలేదనిపించింది. ఆఖరులో ఆ ఒక్క సంభాషణ పలకడానికే కోట శ్రీనివాసరావు గారి పాత్ర అన్నట్టుగా ఉంది. సినిమాకన్నా నటులపైనే ఎక్కువ ఖర్చు చేశారనిపించింది.
ఇక పాటల విషయానికి వస్తే తెరపై “శీతాకాలం…” పాట కాస్త కనువిందుగా ఉంది. “సూపర్ మచ్చి…” అనే గీత చిత్రీకరణ అన్నింటిలోకి చెప్పుకోదగినది. కథనం జరిగే వాతావరణాన్ని ప్రస్పుటంగా చూపించిన గీతం ఇది.
మాటలు :
త్రివిక్రమ్ చిత్రాలపై వ్రాసే విశ్లేషణల్లో ఈ భాగం తప్పనిసరి. మునుపటి చిత్రాలకంటే ఈ చిత్రంలో మాటలు కూడా కాస్త నిరాశపరిచాయి, కానీ కొన్ని మచ్చుతునకలు లేకపోలేదు. అవి ఇవే…
1) మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు.
2) ఏడిస్తేనే నాన్న మీద ప్రేమ ఉన్నట్టా? అలాగైతే జీవితాంతం ఏడ్చినా మా నాన్న మీద నాకున్న ప్రేమకు సరిపోదు.
3) కొన్నిసార్లు కోరుకోవటం కన్నా వదులుకోవటం మంచిది. గెలవడం కన్నా ఓడిపోవడం మంచిది.
4) హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో పది పైసలే వేస్తారు.
5) భార్యను గెలవాలంటే కప్పుని పగలకొట్టడం కాదు, ముందు ఆ గోడను బద్దలుకోట్టండి (ఇది సందర్భానుసారంగా…).
6) అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టింది.
7) కత్తి ఎత్తితే కొత్త కోయగలవు. దాన్ని దించి చూడు కొత్త రాత రాయగలవు.
ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి కానీ ఇవి బాగా గుర్తుండిపోయేవి.
ప్రత్యేకతలు :
1) అల్లు అర్జున్ నటన. బన్నీ నటనలో బాగా పరిణితి సాధిస్తున్నాడు. ఈ చిత్రంలో అతడి నటనే ముఖ్యమైనది. కనిపించే తీరులో, మాటతీరులో హుందాతనం కనిపించింది. అక్కడక్కడ మంచు లక్ష్మీప్రసన్నని అనుకరించి నవ్వించాడు. మొదటి సగంలో సమంతతో తండ్రి గురించి చెప్పే సన్నివేశంలో చాలా బాగా నటించాడు.
2) ఉపేంద్ర పాత్ర చిత్రణ.
3) బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ ల హాస్యం.
బలహీనతలు :
1) దేవీశ్రీప్రసాద్ సంగీతం. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించినా పాటలతో ఈసారి ఏమాత్రం సంతోషపరచలేదు దేవీ.
2) ప్రసాద్ మురెళ్ళ ఛాయాగ్రహణం. పెద్దగా చెప్పుకునేలా లేదు. రెండో సగంలోని ఓ సన్నివేశంలో కెమెరా ఊరికే అటు ఇటు కదులుతూ ఏ ముఖాన్నీ స్పష్టంగా చూపించక ఇబ్బంది పెట్టింది.
3) వ్యర్తమైన పాత్రలు, నటులు. చిన్న పాత్రల్లో కూడా అనుభవజ్ఞులైన నటులు కనిపించారు.
4) నెమ్మదించిన కథనం.
5) మోతాదు మించిన వేదాంతం. ఆనంద్ పాత్ర చిత్రమంతా వేదాంతం వల్లిస్తూనే ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది.
6) కథనానికి అనవసరమైన పాటలు.
ఈ చిత్రం నేర్పిన పాఠాలు :
1) మూలకథ ఎలాగు బలంగా లేనప్పుడు కథనమైనా బలంగా నడపాలి.
2) సినిమాలో ఎక్కువమంది నటులను తీసుకోవడం ప్రచారానికి ఉపయోగపడుతుంది. కానీ వారికి, వారి పాత్రలకి సరయిన న్యాయం చేయకపోతే ఫలితానికి గండి పడుతుంది.
3) ఖర్చులో ఎక్కువ భాగం నటుల మీద కన్నా కథ, కథనాల మీద పెట్టడం సమంజసం.
త్రివిక్రమ్ గురించి కొంత :
మన చిత్ర పరిశ్రమలో రచయిత విలువని మరో మెట్టు ఎక్కించిన వ్యక్తి త్రివిక్రమ్. ఎంతో జ్ఞానం కలిగినవాడు. అందరిలా కాకుండా ఒక సమస్యని, విషయాన్ని వేరొక కోణంలో చూడగలిగే దార్శనికుడు. మనందరి జీవితాల్లో తను వ్రాసిన మాటల ద్వారా ఒక భాగమైపోయాడు. ఇంత గుర్తింపు, గౌరవం వచ్చాక మూస చిత్రాలు చేయకుండా, తనకున్న ప్రతిభతో ఓ కొత్త కథకు శ్రీకారం చుట్టి, ఇప్పుడు ఇరుక్కున్న చట్రం నుండి ఇకనైనా బయటపడితే మంచిదని నా అభిప్రాయం.
– యశ్వంత్ ఆలూరు