ఓకే బంగారం (2015)

ok-bangaram_142658265710

ఎవరికైనా మార్పు చాలా అవసరం. ఆఖరికి అది “మౌనరాగం” ఆలపించి, “నాయకుడు”ని నడిపించి, “గీతాంజలి” పూయించిన “గురు”వు మణిరత్నం అయినా సరే మారాలి. లేకపోతే “కడలి”లో అలలా కొట్టుకోనిపోవాల్సిందే. అందుకే ఈ ఏడాది “ఓకే బంగారం” అంటూ వచ్చారు “మణిరత్నం”. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు “దిల్” రాజు అందించారు.

కథ :

“పెళ్ళి” అనే అంశంపై గౌరవం లేని ఆది (దుల్కర్ సల్మాన్), తార (నిత్య మీనన్) సహజీవనం మొదలుపెడతారు. వారి మనస్తత్వాల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో గణపతి (ప్రకాష్ రాజ్), భవాని (లీలా శాంసన్) పాత్రలు కీలకం.

కథనం :

సాధారణంగా బరువైన కథాంశంతో వచ్చే మణి ఈసారి సున్నితమైన అంశంతో వచ్చారు. దాన్ని అతి సున్నితమైన కథనంతో నడిపించారు.  ఇదే ఆయనలోని మార్పుకి ప్రధాన నిదర్శనం. ప్రస్తుతం ఉన్న యువతీయువకుల మనసులని జల్లెడ పట్టి ఈ చిత్రాన్ని మలిచారనిపించింది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించారు.

దీనికో ప్రత్యేకత ఉంది. చూడనివారికి చూసినవారు కథ మొత్తం క్షుణ్ణంగా వివరించినా, ఈ చిత్రాన్ని చూడగలరు. కారణం చిన్న కథా వస్తువే అయినప్పటికీ మణిరత్నం తనదైన శైలి చిత్రీకరణతో ఆకట్టుకున్నారు. దీనికి మొదటి ఉదాహరణే చర్చిలో ఆది, తార ఫోనులో మాట్లాడుకునే సన్నివేశం. ఇక్కడ దర్శకుడితో పాటు మరో ఇద్దరి పనితనం అద్భుతం. వారే ఛాయాగ్రాహకులు పీ.సీ.శ్రీరాం మరియు ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. ముగ్గురు కలిసి ఈ సన్నివేశాన్ని అద్భుతంగా పండించారు.

మనం చెప్పుకోవాల్సిన పాత్రలు గణపతి, భవాని అనే వృద్ధ దంపతులు. మతిమరుపుతో బాధపడే భార్యని అనుక్షణం కాచుకునే గణపతి పాత్రపై గౌరవం పెరుగుతూనే వెళ్తుంది. భవాని పాత్ర ద్వారా ప్రేక్షకుడు నవ్వుకున్నా దానిపై అగౌరవం కలగదు. అది కూడా మణి గొప్పతనానికి నిదర్శనం.

ఈ చిత్రంలోని దాదాపు సన్నివేశాలన్నీ తరచూ మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య జరిగేవే. వాటిని మరింత అందంగా చిత్రించారు మణి. ఈ చిత్రానికి మరో బలం తారాగణం. దుల్కర్ తెలుగువారికి అపరిచయమైనా, ఆకట్టుకున్నాడు. నిత్య మీనన్ ఎప్పటిలాగే తన నటనతో అలరించింది. కొన్ని సున్నితమైన సన్నివేశాల్లో చక్కటి హావభావాలను ప్రదర్శించింది. అందుకు ఉదాహరణే, కోటను ఫోటో తీస్తూ మధ్యలో ఆది కనపడగానే ఆపే సన్నివేశం. అది నిత్య ప్రతిభకు, మణి శైలికి అద్దం పట్టింది.

ఈ చిత్రం ఓ మూకుమ్మడి కష్టం. చిత్రమంతా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, నటులు పడిన కష్టం కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణ “మెంటల్ మదిలో” గీతం మరియు విరామం షాట్. తార, ఆది బుగ్గ కోరికే షాట్ ని అత్యద్భుతంగా కెమెరాలో బంధించారు పీ.సీ.శ్రీరాం.

ఈ చిత్రానికున్న మరో ప్రత్యేకత తక్కువ నాటకీయత (drama). అలాగే మణి తన ఒకప్పటి “సఖి”ని కూడా కొన్ని సందర్భాల్లో గుర్తు చేశారు. ఉదాహరణ, హోటల్లో తార, ఆదితో గొడవపడటం, ఆ తరువాత “నాతో 48 గంటలు మాట్లాడకు” అని వెళ్ళిపోగా ఆది ఆమె వెంట పడే సన్నివేశం. దీనికి ఊతంగా మారాయి రెహమాన్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు. సరిగ్గా ఆది పరుగు మొదలుపెట్టగానే “ఏయ్ అమాయిక” గీతం మొదలుకావడం సన్నివేశాన్ని ఓ మెట్టు ఎక్కించిందని చెప్పాలి. ఆ తరువాత వచ్చే సన్నివేశాలు కూడా తక్కువ నాటకీయతతో సాగిపోయాయి. పది రోజుల ఒప్పందం చేసుకునే సన్నివేశం అందుకు ప్రధాన ఉదాహరణ. ఆ తరువాత వచ్చే గీతాలు, సన్నివేశాలు సున్నితమైన భావోద్వేగాలను చూపించాయి. మరో ముఖ్యమైన సన్నివేశం ఆది, తారకి బహుమతిచ్చే సన్నివేశం.

రెండో సగంలో గణపతి, భవాని పాత్రలు కీలకంగా మారి ఆది, తార పాత్రల్లో మార్పుకి తోడ్పడ్డాయి. ఈ క్రమంలో భవానిని వెతికే సన్నివేశం కాస్త నెమ్మదిగా నడిచింది అనిపించింది. ఆది, తార మధ్య జరిగే సంభాషణ చాలా సహజంగా ఉంది. అది ముందే వచ్చేలా చేసి సన్నివేశాన్ని ముగించి ఉంటే బాగుండేది.

చివరగా ఊహలకు అందుతూనే చిత్రం ముగిసినా, దాన్ని సంచాలన (animation) చిత్రాలతో ముగించడం బాగుంది. మూస చిత్రాలతో విసిగిపోయిన ప్రేక్షకులందరికీ ఇది ఒక కొత్త అనుభూతినిచ్చే చిత్రంగా చెప్పొచ్చు.

నాకు నచ్చిన సన్నివేశాలు :

1) మొదటిసారి ఆది, తార చర్చిలో ఫోనులో మాట్లాడుకునే సన్నివేశం.

2) అహ్మదాబాదులో హోటల్ గదిలోకి వెళ్ళే ముందు ఆది, తారల మధ్య సంభాషణ.

3) “ఎదో అడగనా” గీతం ముందొచ్చే సన్నివేశం.

4) గణపతి, తార మధ్య ఆది గురించి వచ్చే సంభాషణ.

5) ఆది వదిన మరియు తార మధ్య వచ్చే సన్నివేశం.

6) తార అలిగిన తరువాత ఆమె వెంట ఆది పరుగెత్తే సన్నివేశం.

7) భవానిని ఆసుపత్రిలో పరీక్ష చేస్తుండగా, వెనుక “మనసే తీయగా” గీతంలోని కొన్ని వాక్యాలు రావడం భవాని పాత్రపై గౌరవాన్ని మరింత పెంచింది.

8) పావురాల మధ్య ఉన్న తారకి ఆది బహుమతి ఇచ్చే సన్నివేశం.

9) భవానిని వెతికే సన్నివేశంలో ఆది, తారల మధ్య సంభాషణ.

సంగీతం :

మణిరత్నం – రెహమాన్ కలయిక గురించి వారు ఇదివరకు పని చేసిన చిత్రాలే చెప్తాయి. ఈసారి రెహమాన్ సంగీతం మరింత కొత్త అనుభూతిని ఇచ్చింది. పాటలన్నీ ఎంతో వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతంతోనూ రెహమాన్ ఈసారి అలరించారు. కొన్ని ఉదాహరణలు…

1) హఠాత్తుగా రైలులో ఆదిని చూసి తార ఆశ్చర్యపోయిన సన్నివేశంలో వచ్చే సంగీతం.

2) “భావములోనా బాహ్యమునందును” అనే గీతాన్ని పాశ్చాత్య (western) సంగీతంతో కలిపి వినిపించిన విధానం చాలా బాగా ఆకట్టుకుంది.

3) ఆది తన అన్నయ్య కూతురికి తాను చేసిన వీడియో గేమ్ ని చూపించే సన్నివేశంలో వచ్చే సంగీతం.

ఈ మూడు ఘట్టాలలో వచ్చే నేపథ్య సంగీతం రెహమాన్ ప్రతిభని మరోసారి చాటింది.

పాటల చిత్రీకరణ :

1) మెంటల్ మదిలో. కేవలం నాయకానాయికలనే ఫోకస్ చేస్తూ మిగతా వాతావరణాన్ని ఫోకస్ చేయకపోవడం గీత సాహిత్యానికి, కేవలం ఆ క్షణాన్ని ఆనందించే వారి మనస్తత్వాలకు సరిగ్గా సరిపోయింది.

2) మాయేదో చేయవా. ఓ చిన్న గదిలోని మంచాన్ని మాత్రమే వాడుకొని చిత్రించిన ఈ గీతమే అన్నీ గీతాల్లోకి చెప్పుకోదగినది. మణిరత్నం గారికి ఇక్కడ మార్కులు వేయక తప్పదు.

3) ఏయ్ అమాయిక. మణి శైలిలోనే సాగుతూ ఆకట్టుకున్న గీతం ఇది.

4) నీతో అలా. మణిరత్నం సంతకం కలిగిన ఈ గీతం “యువ” చిత్రంలోని “హేయ్ గూడ్బై ప్రియా” గీతాన్ని గుర్తుచేసింది.

ఛాయాగ్రహణం :

ఈ చిత్రానికి దిగ్గజ ఛాయాగ్రాహకులు పీ.సీ.శ్రీరామ్ పనిచేశారు. ఇది ఈ చిత్రంలోని మరో ముఖ్యమైన అంశం. ఆయన కెమెరాలో బంధించిన ప్రతి సన్నివేశమూ అద్భుతమే. మచ్చుకు కొన్ని…

1) ఆది, తారను మొదటిసారి రైళ్ళ మధ్య నుండి చూసే షాట్.

2) ఆది, తార చర్చిలో ఫోనులో మాట్లాడుకునే సన్నివేశం.

3) తార కోసం బస్సు వెనక ఆది పరుగు మొదలు పెట్టే షాట్.

4) ఆది మీద అలిగిన తార టాక్సీ ఎక్కే సమయంలో వచ్చే ఓ షాట్, కాస్త “బ్లాక్ అండ్ వైట్” తరహాలో ఉండి ఆకట్టుకుంది.

5) పది రోజుల ఒప్పదం చేసుకునే సన్నివేశం.

6) పైన చెప్పుకున్న గీతాలు.

ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో…

మరిన్ని ప్రత్యేకతలు :

1) సిరివెన్నెల సాహిత్యం. ఇది అనువాద చిత్రమే అయినప్పటికీ, సాహిత్యాన్ని అనువదించకుండా, కేవలం ఆ భావం స్ఫురించేలా తనదైన పదాల్లో సాహిత్యాన్ని అందించారు.

2) కిరణ్ సంభాషణలు. “కేడి” చిత్ర దర్శకుడైన కిరణ్ ఈ చిత్రానికి మాటలు అందించారు. కొన్ని మాటలు సన్నివేశాల బరువుని పెంచాయి. “లైఫ్ లో దేనికి సెకండ్ ఛాన్స్ రాదు. దొరికినప్పుడు పట్టేసుకోవాలి”, “బాధగా ఉంటే నిద్రపట్టదు. మరీ సంతోషంగా ఉన్నా కూడా పట్టదు” లాంటివి ఉదాహరణలు.

3) శ్రీకర్ ప్రసాద్ కూర్పు. చిత్రంలోని ఏ సన్నివేశమూ అసంపూర్ణంగా అనిపించలేదు.

4) తారల నటనలు. దుల్కర్, నిత్య చాలా సహజంగా నటించారు. చిత్రమంతా వారి పాత్రలే తప్ప వారెక్కడా కనిపించలేదు. ప్రకాష్ రాజ్, లీలా నటనలు వారి పాత్రలపై గౌరవాన్ని పెంచాయి.

5) నాని గాత్రదానం. చివరగా చెప్తున్నా, ఇది చాలా ముఖ్యమైనది. మనకు అపరిచితుడైన ఓ మళయాళ నటుడిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరగా తెచ్చింది నాని గాత్రమే.

బలహీనతలు :

1) రెండో సగంలో కాస్త నెమ్మదించిన కథనం.

2) మణిరత్నం తన ఇదివరకటి శైలిలోకి మళ్ళీ వెళ్ళినా, ఈ చిత్రం కేవలం యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన చిత్రం కావడంతో వారి ఆదరణ తప్పకుండా లభిస్తుంది. అది ఓ పది రోజులకు ముగుస్తుంది. ఓ మంచి చిత్రంగా నిలిచినప్పటికీ, వసూళ్ళ పరంగా విజయం సాధించడం కాస్త కష్టమే. కానీ మణిరత్నం అభిమానులకు మాత్రం కడుపు నింపే చిత్రం అని బలంగా చెప్పొచ్చు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

చిత్ర పరిశ్రమలో మార్పుకి దర్శకుడే నాంది పలకాలి. చివరకు అది దిగ్గజ దర్శకుడు “మణిరత్నం” అయినా సరే మారాల్సిందే.

– యశ్వంత్ ఆలూరు

One thought on “ఓకే బంగారం (2015)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s