మామూలుగా చిత్రాలపై వ్రాసే విశ్లేషణలను పరిచయం చేయడానికి ఎంతో కొంత ఉపోద్ఘాతము అవసరం. కొన్నింటికి అది అవసరం లేదనిపిస్తుంది. అలాంటి చిత్రమే “దోచేయ్”. నాగచైతన్య, కృతి సనన్ జంటగా బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో, “స్వామి రా రా!” చిత్రం ద్వారా పరిచయం అయిన “సుధీర్ వర్మ” దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది.
కథ :
సమాజం నిండా దోచుకునే వారే ఉన్నారు కనుక సమాజాన్ని దోచుకోవడం తప్పు కాదని, దోపిడీలతోనే జీవితాన్ని సాగించే చందు (నాగచైతన్య) కథ ఇది. అతడు అలా మారడానికి గల కారణాలేంటి, అతడి ఆశయాలేంటి అనే అంశాల మీద కథ నడుస్తుంది.
కథనం :
పైన వ్రాసిన విషయాన్ని బట్టి ఈ కథలో కొత్త విషయం ఏదీ లేదని అర్థమైపోతుంది. కానీ కథనంలో కొత్తగా వెళ్ళాలని దర్శకుడు ప్రయత్నించాడు. అందుకోసం తన “స్వామి రా రా”లో వాడిన క్వింటెన్ టారంటినో (Quentin Tarantino) “పల్ప్ ఫిక్షన్” (Pulp Fiction) చిత్ర శైలిని మళ్ళీ వాడాడు. మొదటి సన్నివేశాన్ని అమాంతం ఒక చోట ఆపేసి, మళ్ళీ వేరే కథలోనికి వెళ్ళి, తిరిగి ఈ రెండు కథలని అనుసంధానం చేశాడు.
చందు, అతడి స్నేహితులు చేసే దోపిడీలు కొన్ని కొత్త తరహాలో ఉన్నాయి. ఉదాహరణ, చందు ఓ వ్యక్తికి ఐఫోన్ (iPhone) విక్రయించే సన్నివేశం. సప్తగిరితో ఆడిన ఆటలు నవ్వించాయి. అందులో చెప్పుకోదగినది టీ కోసం వంద రూపాయలు ఇచ్చే సన్నివేశం. ఇలాంటి సన్నివేశాలతో చందు పాత్రని ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
మీరా (కృతి సనన్) పాత్ర కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ చెప్పుకోదగినది కాదు. దీనికి పలు కారణాలు చెప్పొచ్చు. మోతాదుకి మించి నటించిన కృతి, నాగచైతన్య పక్కన ఏమాత్రం సరిపోని ఆవిడ ఆహార్యం. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చెప్పుకోదగినవి కావు.
ఇవే కాకుండా, చందు పాత్రకి ఓ చెల్లి, తండ్రి లాంటి బంధాలను నెలకొల్పి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ బలహీనమైన కూర్పు (editing) అతడి ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ఇందులో రావురమేష్ పాత్ర అతి సాధారణంగా ఉంది. లఘు చిత్రాల (Short Films) ద్వారా పేరొందిన “వైవా” హర్ష లాంటి నటులకు ఈ చిత్రంలో ఎక్కువ నిడివి గల పాత్రలే లభించాయి. పోసానికి హాస్య ప్రతినాయకుడి పాత్ర దక్కింది. హర్ష, పోసాని మధ్య జరిగే సన్నివేశాలు బాగానే నవ్వించగలిగాయి.
మొదటి సగం కాస్త అలరించినా, రెండో సగం సహనాన్ని పరీక్షించింది. మొత్తం చిత్రం నిడివి 138 నిమిషాలే అయినప్పటికీ, ఈ సగంలో నెమ్మదించిన కథనం వల్ల అది ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. చందు దొంగగా మారడానికి కారణమైన అతడి గతం అంత ప్రభావితంగా లేదు. ఈ చిత్రంలో ఓ పేరున్న కథానాయకుడు ఉన్నాడు కనుక ఓ గతం ఉండాలి అని అనుకోని పెట్టిన అంశంలా అనిపించింది. అందులో జామకాయలు దొంగతనం చేసే సన్నివేశం మాత్రం బాగుంది. ఆ తరువాత ఎక్కువ మెలికలతో, ఎంతకీ ముగియని “ఛేజింగ్” సన్నివేశాలతో ఇబ్బంది పెట్టాడు దర్శకుడు.
ఇటువంటి రెండో సగంలో కాస్త నవ్వించగలిగింది మాత్రం బుల్లెట్ బాబు (బ్రహ్మానందం) పాత్ర. వయసు అయిపోయినా, సినిమాల్లో నటించే హీరోగా ఆయన పండించిన హాస్యం బాగుంది. ఆఖరు ఘట్టంలో పోసానిని మాయ చేసే సన్నివేశాలు ఎక్కువ నిడివితో ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. కానీ సప్తగిరి తనదైన శైలి నటనతో కోర్టు సన్నివేశంలో అలరించాడు. “తాగుబోతు” రమేష్ ఉన్న కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు.
మొత్తానికి, ప్రేక్షకుడికి బోరు కొట్టే సమయానికి ఓ హాస్య సన్నివేశాన్ని పెట్టి, ఆ సమయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ చిత్రాన్ని ముగించాడు దర్శకుడు.
పాటల విషయానికి వస్తే “ఒకరికి ఒకరం” అనే గీతాన్ని కాస్త కొత్తగా చిత్రించాడు. మిగతా గీతాలు చెప్పుకోదగినవి కావు.
ప్రత్యేకతలు :
1) రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం. ఈ చిత్రానికున్న ప్రధాన బలం ఇదే అని చెప్పాలి. మొదటి బ్యాంకు దోపిడీ తరువాత వచ్చే “ఛేజింగ్” సన్నివేశాన్ని ఎక్కువ రంగులు వాడకుండా చిత్రించడం బాగుంది. అలాగే లైటింగ్ విషయంలోనూ జాగ్రత్తలు బాగానే తీసుకున్నాడు.
2) అక్కడక్కడ నవ్వించిన హాస్యం, బాగున్న సంభాషణలు.
3) కొత్తగా ఉన్న దోపిడీ సన్నివేశాలు.
బలహీనతలు :
1) కొత్తదనం లేని కథ.
2) నెమ్మదించిన కథనం.
3) వినసొంపుగా లేని సన్నీ సంగీతం. “హాయి హాయి” అనే గీతం ఫరవాలేదనిపించింది కానీ మళ్ళీ మళ్ళీ వినేలా లేదు.
4) కూర్పు. కొన్ని సన్నివేశాలను సరిగ్గా ముగించకుండా ఇబ్బంది పెట్టింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కొన్ని చిత్రాల నుండి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు.
– యశ్వంత్ ఆలూరు