చిత్రసీమలో ప్రత్యేకమైన చిత్రాలు రావడం ఎంత “అరుదో”, కమల్ హాసన్ నటించిన ప్రతి చిత్రం ఎదో ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం అంత “సహజం”. ఏ ప్రత్యేకత లేని చిత్రాన్ని కమల్ చేయరు. అలాంటి ఓ ప్రత్యేకమైన చిత్రమే “ఉత్తమ విలన్”. ఈ చిత్రం పేరే ఒక ప్రత్యేకం. దీని కథ, కథనాలను కమలే అందించారు. మరో సుప్రసిద్ధ (famous) నటుడు “రమేష్ అరవింద్” దర్శకత్వం వహించారు. అలనాటి మేటి దర్శకులు కె.బాలచందర్, కె.విశ్వనాధ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులోని విషయాలేంటో చూస్తే…
కథ :
కోట్లాదిమంది అభిమానులున్న నటుడు మనోరంజన్ (కమల్ హాసన్), అతడిని జనం చిరకాలం గుర్తుపెట్టుకోనేలా తనతో ఓ చిత్రం చేయమని, చాలాకాలం తరువాత తన నట గురువు మార్గదర్శి (కె.బాలచందర్) ని కోరతాడు. దానికి గల కారణం ఏమిటి? అసలు మనోరంజన్ వ్యక్తిగత జీవితం ఏంటి? అనేవి ప్రధాన అంశాలు.
కథనం :
ప్రచార చిత్రాలు, ముఖాముఖిల ద్వారా ఈ చిత్రంపై చాలా ఆసక్తిని పెంచారు కమల్. అవి చుసిన ప్రేక్షకులకు ఇందులో చాలా బరువైన కథాంశం ఉందనిపిస్తుంది. కానీ ఇది చాలా చిన్న కథాంశం. ఎంతో తీవ్రత కలిగిన కథలా పరిచయం అయిన ఇది ఒక హాస్యరస (comedy) చిత్రం. అయినా కూడా, బాలచందర్ గారితో కమల్ కలిసి నటించడం, వెయ్యేళ్ళ పూర్వపు కళ అయిన “తెయ్యం”ని ఇందులో పరిచయం చేయడం, కమల్ తన వయసుకు తగ్గ పాత్ర చేయడం, ఇలాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
మొదటి అరగంట కథనం నెమ్మదిగానే నడిచింది. కేవలం మనోరంజన్ పలుకుబడిని, అతడి జీవితాన్ని చూపించడానికే చాలా సమయం వృథా చేశారనిపించింది. మొదటగా వచ్చే “లవ్వే లవ్వా” పాట సహనాన్ని పరీక్షించింది. అందులోని కమల్ నృత్యం, సంతృప్తి లేకుండా కళాకారుడు నటిస్తే ఎలా ఉంటుందో చూపించడానికేమో అనిపించింది. కానీ ఆ గీతం వినసొంపుగా, కనువిందుగా ఏమాత్రం లేదు.
తరువాత పరిచయం అయ్యే జాకబ్ (జయరాం) పాత్ర కథలో ఎదో విషయం ఉందని తెలిపింది. తెరపైన ఎక్కడా కనపడకపోయినా కథతో పాటు అనుక్షణం ప్రయాణించే అత్యంత ముఖ్యమైన “యామిని” పాత్ర చెప్పుకోదగ్గది. ఆ తరువాత పరిచయం అయ్యే మార్గదర్శి పాత్ర కథనం పట్ల సదాభిప్రాయం కలిగించింది. బాలచందర్ – కమల్ మధ్య వచ్చే మొదటి సంభాషణ ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచి, ఎక్కువ నాటకీయత లేకుండా నడిచింది. తరువాత చెప్పుగోదగ్గది, మనోరంజన్ తన భార్య వరలక్ష్మి (ఊర్వశి), మామగారు పూర్ణ చంద్రరావు (కె.విశ్వనాధ్)కి మధ్య వచ్చే సన్నివేశం. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనోరంజన్ మామగారికి కుర్చీలోనుండి లేవడానికి సాయం చేయబోతే అవసరం లేదన్నట్టుగా ఆయన మళ్ళీ కుర్చీలో కూర్చొనే సన్నివేశం. ఇక్కడ విశ్వనాధ్ గారు ఆ పాత్రకున్న దర్పాన్ని ఎంతో చక్కగా చూపించారు.
తరువాత మొదలయ్యే “ఉత్తమ విలన్” చిత్రమే ఈ చిత్రపు ప్రధాన అంశం. అందులోని మొదటి “తెయ్యం” కళాప్రదర్శన అయిన “అర్జునుడు పాశుపతాస్త్రమును పొందిన కథ” చెప్పుకోదగ్గది. అందులో కమల్ చేసిన నృత్యం అటు ఆయన ప్రతిభను, ఇటు, మనోరంజన్ పాత్రనూ నెలకొల్పింది. మొదటి పాటలో “హీరో”గా నాట్యం చేసిన మనోరంజన్ ఈ ప్రదర్శనలో “నటుడు”గా నాట్యం చేశాడని చూపించిన ప్రయత్నం ఇది. దీనితో పాటు “ఉత్తముడి కథ”ని చెప్పే గీతంలోనూ హాస్యం కాస్త నవ్వించగలిగింది.
“ఉత్తమ విలన్” చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ముత్యాల రాజు (నాజర్) పాత్ర గురించి. రాజుగా నాజర్ అభినయం అద్భుతం. ఆయన పండించిన హాస్యమే చిత్రానికి ప్రధానం అని చెప్పాలి.
ఇక రెండో సగంలో హాస్యంకన్నా భావోద్వేగాలే ఎక్కువ. తన గురించి తన మామగారికి చెప్పడానికి వచ్చే సన్నివేశాన్ని విశ్వనాధ్ గారి నటన పండించింది. ఆ తరువాత మనోరంజన్, అతడి కొడుకు మనోహర్ (అశ్విన్) మధ్య వచ్చే సన్నివేశం భావోద్వేగాన్ని బాగానే కనబరిచింది. కమల్ – ఊర్వశి మధ్య ఆసుపత్రిలో వచ్చే సన్నివేశం అటు భావోద్వేగాన్ని, ఇటు హాస్యాన్ని సమంగా పంచింది.
“ఉత్తమ విలన్” చిత్రంలో భాగమైన “కానుకే బొండుమల్లి” గీతాన్ని అటు వినసొంపుగా వినిపించారు, ఇటు కనువిందుగానూ చిత్రించారు. ఇందులో పూజ కుమార్ నృత్యమే ఆకర్షణ.
ఈ చిత్రానికి అతి ముఖ్యమైనది, దీని విడుదలని వివాదాల్లోకి నెట్టింది ఇందులోని “హిరణ్యకశిపుడు – ప్రహ్లాద” తెయ్యం కళాప్రదర్శన. అది నిరాశాపరిచిందనే చెప్పాలి. మునుపటి ప్రదర్శనకన్నా చిత్రం ఆఖరి ఘట్టంలో వచ్చే ఈ ప్రదర్శనే ఆయువుపట్టు. కానీ ఎక్కువ ప్రభావాన్ని చూపలేకపోయింది. “అర్జున..” ప్రదర్శన నిడివి తక్కువై నిరాశాపరిస్తే ఇది ప్రభావం తక్కువై నిరాశపరిచింది.
ఇక చిట్టచివరి ఘట్టంలో మళ్ళీ “మామూలు” కమలే కనిపించారు. ఇక్కడ “మామూలు”కి అర్థం ఎప్పటిలాగే కథ కోసం ఏదైనా చేసే ఆయన “నిబద్ధత” (dedication). ఆయన నటన గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవల్సిన అవసరం లేదు. ఈ ఘట్టానికి అత్యంత బలాన్నిచ్చింది జిబ్రాన్ నేపథ్య సంగీతం.
మొత్తానికి, ఓ నటుడికి విజయంకన్నా సంతృప్తినిచ్చిన చిత్రమే ముఖ్యమనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఇది కమల్ హాసన్ చేసిన “ఉత్తమ” చిత్రం అనేకంటే తన “మార్గదర్శి” బాలచందర్ గారికి ఆయనిచ్చిన “ఉత్తమ” గురుదక్షిణగా చెప్పొచ్చు.
ప్రత్యేకతలు :
1) కమల్ హాసన్. దీని గురించి విశ్లేషణ అనవసరం.
2) జిబ్రాన్ సంగీతం. ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించాడు జిబ్రాన్. ఇందులో జరిగే రెండు కథలకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించడంలో ఉత్తీర్ణుడయ్యాడు (succeeded). ఇతడి ప్రతిభ మరికొన్ని సంవత్సారాలు మనకు ఇతడి పేరు వినబడేలా చేస్తుంది.
3) నాజర్ నటన. “ఉత్తమ విలన్” చిత్రానికే పరిమితమైన ఈయన పాత్ర మొత్తం చిత్రంలో ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా నటించారు.
4) విజయ్ శంకర్ కూర్పు (editing). చిత్రంలో జరిగే రెండు కథలను సమాంతరంగా (balanced) చూపించింది.
5) కె.బాలచందర్ గారు. ఈ దర్శక దిగ్గజం ఎక్కువ నిడివిగల పాత్రలో కనిపించడం ఇది రెండోసారి మరియు చివరిసారి. ఈయనకి “హరికిషన్” అరువిచ్చిన గాత్రం (dubbing) ప్రేక్షకులకు ఆ పాత్రని దగ్గర చేసింది. ఆయనపై ఉన్న అభిమానం ఈ చిత్రాన్ని చూసేలా చేస్తుంది.
బలహీనతలు :
1) అధికమైన నిడివి. మొదటి సగంలో దాదాపు అరగంట పైన సమయం వృథా అయిపొయింది. దాదాపుగా మూడు గంటల నిడివిగల చిత్రం ఇది.
2) “లవ్వే లవ్వా” గీతం. ఇంత అత్యంత బలహీనమైన గీతం చిత్రం మొదట్లోనే పలకరించి ఇబ్బంది పెట్టింది. పైగా ఇటువంటి గీతానికి కమల్ గాత్రం ఏమాత్రం సరిపోలేదు. బహుశా వేరే గాయకుడు పాడి ఉంటే జనానికి కాస్త దగ్గరగా వచ్చేదేమో.
3) భాష. ఇది అనువాద చిత్రమని చాలా సందర్భాల్లో ప్రేక్షకుడికి అనిపించేలా కొన్ని సన్నివేశాల్లోని మాటలు, పాటల్లోని పదాలు ఉన్నాయి.
4) ఉత్తముడిని పులి వెంటాడే సన్నివేశంలో నాణ్యత లేని గ్రాఫిక్స్.
ఈ చిత్రం చూసి పాఠంలా తీసుకోకూడని విషయం :
కమల్ అనుభవంలో ఎన్నో విషయాలు చూశారు,చేశారు కనుక ఇది ఆయన చేసిన తప్పని చెప్పడం పెద్ద తప్పు. ఈ చిత్రాన్ని తన గురువు బాలచందర్ గారికి ఆయనిచ్చిన గురుదక్షిణగా ప్రారంభించారు కనుక ఆయన కోసం తీసిన చిత్రం ఇది.
ప్రతి చిత్రం నుండి ఓ పాఠం నెర్చుకునే నాలాంటి వాళ్ళు, కథ కోసం, పాత్ర కోసం వ్యక్తిని చూసుకోవాలి కానీ వ్యక్తి కోసం పాత్రని, కథని వ్రాసుకోకూడదు అనే విషయాన్ని మనసులో ఉంచుకోవాలి.
– యశ్వంత్ ఆలూరు
Pingback: Uttama Villain (2015) | Film Criticism