“ప్రోత్సాహం” అనే అంశంపై ఇదివరకే ఓసారి మాట్లాడుకున్నాం. ప్రోత్సాహానికి “ధైర్యం” కూడా కావాలి. అలాంటి ధైర్యం ఉన్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. “లెజెండ్” లాంటి చిత్రం తరువాత “సత్యదేవ” అనే ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి “లయన్”గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. రుద్రపాటి రమణారావు నిర్మించారు.
కథ :
కోమాలో నుండి బయటపడిన వ్యక్తి (బాలకృష్ణ) “గాడ్సే”గా గుర్తింపబడతాడు. కానీ అతడిని ఎదో గతం వెంటాడుతూ ఉంటుంది. అదేంటి? సీబీఐ అధికారి సుభాష్ చంద్రబోస్ (బాలకృష్ణ) కి అతడికి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్ర కథాంశం.
కథనం :
ఈ చిత్రపు ప్రచార చిత్రాలు (trailers) చూశాక “కొత్త” దర్శకుడైనా, ఇందులో కొత్తదనం ఏమీ లేదనిపించింది. కానీ చిత్ర బృందం చెప్పినట్టుగా ఇది బాలయ్య చేసిన ఓ కొత్త కథాంశమే. అది పలుచోట్ల కనబడుతుంది కూడా. మొదటిదే కథానాయకుడి పాత్ర పరిచయం. మాములుగా బాలకృష్ణ చిత్రాల్లో, ఆయన పాత్రని పరిచయం చేసే సన్నివేశం అత్యంత బలంగానూ, కథకి అసలు సంబంధం లేకుండానూ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అలాంటి హంగులు లేకుండా పాత్రని మొట్టమొదటి సన్నివేశంలోనే, కథతో పాటే సాధారణంగా పరిచయం చేశాడు దర్శకుడు సత్యదేవ. ఇది ఎంతగానో అభినందించదగ్గ విషయం. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, కథానాయకుడికి పరిచయ గీతం (introduction song) లేకపోవడం. “అనగనగా” అనే గీతం వినసొంపుగా ఉండడంతో పాటు, అందులో తన పాత్రకున్న బాధను కూడా బాలకృష్ణ బాగా చూపించారు.
ఆ తరువాత కథ నుండి అప్పుడప్పుడు ప్రక్కకు వెళ్తూ, మళ్ళీ అప్పుడప్పుడు కథలోకి ప్రవేశిస్తూ, ఎలాగో విరామం సన్నివేశం వరకు లాగించాడు దర్శకుడు. మూలకథకు దూరంగా ఉన్న సన్నివేశాలు బాగానే ఇబ్బంది పెట్టాయి. బాలకృష్ణ, త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు ఏమాత్రం పండలేదు. వాటిలో నటించడానికి బాలయ్య ఇబ్బందిపడ్డారు అనిపించింది. సహనాన్ని బాగా పరీక్షించింది, త్రిష స్నేహితులను అదుపు చేయడానికి బాలయ్య పరిమళ ద్రవ్యం (perfume) వాడే సన్నివేశం. బహుశా, ఇలాంటి సన్నివేశాల్లో తుపాకి వాడడం పాత రకమనుకొని దర్శకుడు పరిమళం వాడాడేమో అనిపించింది. ఈ సన్నివేశమే లేకుంటే బాగుండేది అనిపించింది. కాస్త చిత్రపు నిడివి అయినా తెగ్గేది. ఇలాంటి మరో సన్నివేశమే, పిడిగుద్దుతో పూర్తి వాహనాన్నే దూరంగా నెట్టడం. ఈ రోజుల్లోనూ ఇలాంటి సన్నివేశాలకు ఎంత ఆదరణ లభిస్తుందో తెలియదు.
ఇలాంటి కథనాన్ని భరించే ప్రేక్షకుడిని, “ఆకాశం దిగొచ్చింది తారక” గీతంతో సంతోషపరిచి, విరామం సమయానికి మళ్ళీ అసలు కథలోకి తీసుకొని వెళ్ళి ఉత్కంఠపరిచాడు దర్శకుడు. చిత్రానికి మొదటి ఆయువుపట్టు అయిన ఈ సన్నివేశం బాగా వచ్చింది. ఇక్కడ వచ్చే పోరాటం కూడా బాగుంది. ఇక్కడ ఛాయాగ్రాహకుడు “వెంకట ప్రసాద్” పనితనమూ బాగుంది.
ఇక రెండో సగం దాదాపు దర్శకుడి పరిశోధనతో సాగుతూ, ఏవో కొన్ని సన్నివేశాల్లో తప్ప మరెక్కడా నిరాశాపరచలేదు. దర్శకుడు “బోస్” పాత్రపై ఎక్కువ దృష్టి సారించాడు. కథతో ప్రయాణం చేస్తూనే, ఇది పలికే సంభాషణల ద్వారా బాలయ్య అభిమానులను కూడా సంతోషపరిచే ప్రయత్నం చేశాడు. బోస్ పాత్ర చేసే మొదటి సీబీఐ రైడ్ చెప్పుకోదగ్గ సన్నివేశం కానీ ఇందులో కృష్ణదేవరాయలు గురించి చెప్పిన సంభాషణ నిడివి (length) కాస్త ఎక్కువైంది. తరువాత వచ్చే “పిల్లా నీ కళ్ళకున్న కాటుక” అనే గీతాన్ని బాగా తెరకెక్కించారు. ఇది సంగీతం, నృత్యం మరియు ఛాయాగ్రహణం యొక్క సమిష్టి కృషి (collective effort) ఫలితం. ముఖ్యంగా ఈ గీతం మధ్యలో వచ్చే ఆంగ్ల పదాలకు నృత్యం చేసే షాట్ మరియు ముగింపు షాట్లను చాలా బాగా తీశాడు ఛాయాగ్రాహకుడు.
తరువాత చెప్పుకోదగ్గది “రంపచోడవరం అడవుల్లో తీసిన పోరాటం”. ఈ చిత్రంలో ఇదే ఉత్తమ పోరాటమని చెప్పొచ్చు. ఇక్కడ కితాబు (praising) ఇవాల్సిన వ్యక్తులు “రామ్-లక్ష్మణ్” మరియు “వెంకట ప్రసాద్”. ఆ తరువాత వచ్చే ప్రతినాయకుడి (ప్రకాష్ రాజ్) వ్యూహరచన పెద్దగా ఒప్పించలేకపోయింది. సాంకేతిక పరిశోధనతో పాటు ఈ విషయంలోనూ దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ఇక ఆఖరి ఘట్టం మరో ఆయువుపట్టు. ఇక్కడ ప్రేక్షకుడికి బాగా ఉత్కంఠ కలిగించాడు దర్శకుడు. కానీ ఆ “ఛేజింగ్” సన్నివేశాన్ని కాస్త కత్తిరించి ఉంటే బాగుండేది.
మొత్తానికి ప్రచార చిత్రాలు చూసి వేసుకున్న అంచనాలకు అందకుండా బాలయ్య చిత్రాల్లో ఓ కొత్త అనుభూతిని కలిగిస్తూ, చూడగలిగే చిత్రంగా “లయన్” ముగిసింది. అక్కడక్కడ తర్కం (logic) తప్పినప్పటికీ, “సత్యదేవ” కొత్త దర్శకుడు కనుక, మన భౌతిక (Physics), రసాయన (Chemistry) ప్రేక్షక శాస్త్రవేత్తలు అతడిని క్షమించవచ్చు.
నటుల విషయానికి వస్తే చిత్రమంతా బాలకృష్ణే ఎక్కువగా కనిపిస్తారు. పాత్రలోని పలు కోణాలను తగినట్టుగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మునుపటి చిత్రాలకంటే ఇందులో మంచి దుస్తుల్లో స్టైలిష్ గా కనిపించారు. త్రిష కూడా మునుపటికంటే అందంగా కనిపించింది. రాధిక ఆప్టే పాత్ర నిడివి తక్కువైనా, ముఖ్యమైనది. మిగతా నటులందరికీ మామూలు పాత్రలే దక్కాయి. చాలా కాలం తరువాత నటి “ఇంద్రజ” ఓ ముఖ్య పాత్రలో కనిపించారు.
ప్రత్యేకతలు :
1) కొత్త కథ, కథనాలు. విడిగా చూస్తే కొత్తగా అనిపించకపోయినా, బాలకృష్ణ చేసిన చిత్రాల్లో ఇదో కొత్త ప్రయత్నం.
2) మణిశర్మ సంగీతం. చాలా కాలం తరువాత, పూర్తి స్థాయిలో మణిశర్మ సంగీతాన్ని వినిపించిన చిత్రం ఇది. పైన చెప్పుకున్న మూడు గీతాలు కాకుండా నేపథ్య సంగీతంతోనూ మణిశర్మ ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. అన్నింటిలోకి మొదట్లో పేర్లు పడే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం ఉత్తమమైనది.
3) వెంకట్ ప్రసాద్ ఛాయాగ్రహణం. పైన చెప్పుకున్న సన్నివేశాలు, గీతం ఉదాహరణ.
4) రామ్-లక్ష్మణ్ పోరాటాలు. పలు పోరాటాలను బాగా చిత్రించి, మొదటిసారి బాలకృష్ణ చిత్రంలో పోరాటాలను సైతం మెచ్చుకునేలా చేశారు.
5) నిర్మాణ విలువలు (Production Values). చివరగా చెప్తున్నప్పటికీ, ఇదే పైన చెప్పుకున్న ప్రత్యేకతలకు కారణం. ఓ కొత్త దర్శకుడిని నమ్మి బాగా ఖర్చు పెట్టి, చక్కటి నిర్మాణ విలువలతో చిత్రాన్ని నిర్మించారు రుద్రపాటి రమణారావు.
బలహీనతలు :
1) కథకు దూరంగా వచ్చి ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు.
2) ఏమాత్రం పండని బాలకృష్ణ-త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు.
3) నవ్వించలేకపోయిన అలీ, ఎమ్మెస్ నారాయణల హాస్యం.
4) ఎక్కువ నిడివిగల సన్నివేశాలు మరియు సంభాషణలు.
5) కథానాయకుడి పైన వేసిన ప్రతినాయకుడి వ్యూహం ఒప్పించలేకపోయింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ప్రోత్సాహాన్ని పొందడమే కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవడమూ తెలియాలి… (ఇది విమర్శ కాదు)
– యశ్వంత్ ఆలూరు
ఇది సంగీతం, నృత్యం మరియు ఛాయాగ్రహణం యొక్క సమిష్టి కృషి (collective effort) ఫలితం.. idi balayyababu gurinchi yetakkaarama
LikeLike