సినిమా అంటే అన్ని శాఖల సమిష్టి కృషి అనేది ఎప్పుడూ వినబడే మాట. కానీ కొన్ని చిత్రాల్లో కేవలం కొన్ని శాఖల కృషి మాత్రమే కనబడుతుంది. అలాంటి చిత్రమే “పండగ చేస్కో”. “గోపీచంద్ మలినేని” దర్శకత్వంలో రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ నటించగా యునైటెడ్ మూవీస్ పతాకంపై “పరుచూరి కిరీటి” నిర్మించారు. ప్రముఖ హాస్య రచయిత “కోన వెంకట్” కథనం, మాటలను అందించారు.
కథ :
వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి విదేశాల్లో అనుష్క (సోనాల్ చౌహాన్)ని నిశ్చితార్థం చేసుకున్న కార్తిక్ (రామ్) ఓ పని మీద హైదరాబాదు వస్తాడు. అక్కడ అతడికి దివ్య (రకుల్ ప్రీత్) పరిచయం అవుతుంది. ఆమె ప్రేమలో పడ్డ కార్తిక్ ఆ తరువాత ఏమి చేశాడు, అసలు అతడిని హైదరాబాదు రప్పించిన విషయం ఏంటి అనేది కథాంశం.
కథనం :
ఈ కథ వ్రాయటానికి కథకుడు “వెలిగొండ శ్రీనివాస్” పడ్డ కష్టం పెద్దగా ఏమి లేదు. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. కనుక ఈ చిత్రంలో కథనానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ బరువును రచయితలు కోన మరియు అనిల్ రావిపూడి భుజాలపై వేసుకున్నారు. తమదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను కుర్చీలో కుర్చోబెట్టే ప్రయత్నం బాగానే చేశారు.
మొదటి ఇరవై నిమిషాల్లోనే ఈ చిత్రం విషయం అర్థమైపోతుంది. ఇలాంటి సమయంలోనే “వీకెండ్ వెంకట్రావు” (బ్రహ్మానందం) పాత్ర పరిచయమై నవ్వించడం మొదలుపెడుతుంది. ఇతరులకు సలహాలు ఇచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కునే వ్యక్తిలాంటి పాత్రలు చేయడం బ్రహ్మానందం కి కొట్టినపిండి లాంటిది. పైకి నవ్వించినా, అంతర్లీనంగా, ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు అనే సందేశాన్ని ఈ పాత్ర ద్వారా అందించారు.
కార్తిక్ పాత్ర హైదరాబాదు రాగానే “కొండయ్య” (వెన్నెల కిషోర్) పాత్ర పండించిన హాస్యం అద్భుతం. అందులో చెప్పుకోవాల్సింది రెండు సన్నివేశాలు. తేజస్వి ఇంటిముందు ఉన్న చెట్టుకొమ్మని విరగ్గొట్టి రకుల్ తో గొడవపడే సన్నివేశం మరియు “లెజెండ్” చిత్రం చూస్తూ “బాలయ్య… బాలయ్య” అని అరిచే సన్నివేశం. ఇవి రెండు మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ నవ్వేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వెన్నెల కిషోర్ పూర్తిస్థాయిలో నవ్వించిన పాత్ర ఇది. ఇదే మొదటి సగంలో కడుపుబ్బ నవ్వించింది జయప్రకాష్ రెడ్డి పాత్ర. ఎమ్మెస్ నారాయణ గారి పాత్ర కూడా ద్వంద్వార్థాల (double meaning) సంభాషణలతో ఒకటి, రెండుసార్లు నవ్వించినా తరువాత అది బోరు కొట్టేసింది.
ఇక రెండో సగం తప్పనిసరిగా “మైండ్ గేమ్” తరహాలో సాగాల్సిందే. ఇక్కడ “వీకెండ్ వెంకట్రావు” మళ్ళీ ప్రవేశించి పలు సన్నివేశాల్లో పొట్ట చెక్కలు చేయించాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుష్క పాత్ర అతడిని చెంపదెబ్బ కొట్టిన ప్రతిసారీ ఆమె చేతిని ముద్దు పెట్టుకునే సన్నివేశం. ఇక్కడ నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇతనికి తోడుగా రఘుబాబు, బ్రహ్మాజీ కూడా నవ్వించే బాధ్యత తీసుకున్నప్పటికీ పృధ్విరాజ్, షకలక శంకర్ లతో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పేరడీ చేయించి కథనాన్ని కాస్త క్లిష్టంగా మార్చి దాన్ని చాలా బాగా అమలు చేశారు రచయిత కోన మరియు దర్శకుడు గోపీచంద్.
ఇంతటి హాస్య కథనంలో భావోద్వేగాలకు కూడా చోటిచ్చారు. అందులో చెప్పుకోవాల్సింది, సాయి రెడ్డి (సాయికుమార్)కి అతడి చెల్లెళ్ళు వీడుకోలు పలికే సన్నివేశంలో అతడి పెద్ద చెల్లెలు (శైలజ ప్రియ) కళ్ళతో వీడుకోలు పలికే షాట్. మరొకటి, భూపతి (సంపత్ రాజ్), అతడి తమ్ముళ్ళు తమ చెల్లెలు సరస్వతి (పవిత్ర లోకేష్)తో ఇంటి దస్తావేజులపై సంతకం చేయమని అడిగే సన్నివేశం. “మనం దాని మీద పాతికేళ్ళ పగ పెంచుకుంటే, అది మనమీద వందేళ్ళ ప్రేమ పెంచుకుంది” అని రఘుబాబు చెప్పే మాట ఆ సన్నివేశాన్ని చాలా బాగా ముగించింది.
ఇక పతాక సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు అక్షరాల అందే విషయం. పలు చోట్ల ఇది “అత్తారింటికి దారేది” చిత్రాన్ని గుర్తుచేయడమే కాకుండా ఎక్కువ నిడివితో కాస్త ఇబ్బంది పెట్టింది. ఇంతవరకు వ్యర్తమైపోయింది అనుకున్న సాయికుమార్ పాత్రకు అక్కడ విలువ దొరికింది. ఈ క్రమంలో ఆదిత్య మీనన్ పాత్ర పూర్తిగా వ్యర్తమైపోయింది.
మొత్తానికి ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి కథకి హాస్యం జోడించి ఈ చిత్రాన్ని నెట్టుకొచ్చారు. ఒకవేళ ఈ చిత్రం విజయం సాధిస్తే అందులో ఎక్కువ భాగం కోన వెంకట్ కి, కాస్త భాగం గోపీచంద్ మలినేనికి దక్కాలి.
ప్రత్యేకతలు :
1) కోన వెంకట్ కథనం, మాటలు. పైన చెప్పుకున్న మాట కాకుండా ఇందులో పలు చోట్ల కోన అద్భుతమైన సంభాషణలను వ్రాశారు.
2) సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం. సాంకేతికంగా ఇది అద్భుతం. ముఖ్యంగా గీతాల్లో సమీర్ పనితనం బాగా కనబడుతుంది.
3) బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డిల హాస్యం. వీటి గురించి పైనే మాట్లాడేసుకున్నాం.
బలహీనతలు :
1) ఎన్నేళ్ళు గడిచినా మారని వెలిగొండ శ్రీనివాస్ అందించిన మూస కథ.
2) ఎప్పటిలాగే తమన్ సంగీతం. ఒక్క పాట కూడా నెమరువేసుకునేలా లేదు. నేపథ్య సంగీతం కూడా ఎప్పటిలాగే సన్నివేశానికి సంబంధం లేకుండా ఉంది. తన పనితీరు గురించి “తమన్ లాగ డప్పులు కొట్టి…” అని “ఏయ్ పిల్లా పిల్లా” గీతంలో తనే పాడుకున్నాడు.
3) అనవసరపు మరియు అతిశయపు పోరాటాలు. ఈ పోకడ తెలుగు సినిమాల్లో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
బలం లేని మూలకథ వ్రాసుకొని కథనం, హాస్యం మీద ఆధారపడితే గుర్తింపు దక్కకపోవడమే కాదు అనవసరపు ఖర్చు కూడా.
– యశ్వంత్ ఆలూరు