కొన్ని ప్రయాణాలు ఒక దారిలో మొదలుపెట్టినప్పుడు, అదే దారిలో సాగిపోవడమే మంచిది. మధ్యలో దారి మారుస్తే ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి చిత్రమే “రాక్షసుడు”. సూర్య, నయనతార జంటగా “వెంకట్ ప్రభు” దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా నిర్మాత.
కథ :
ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్ అలియాస్ మాస్ (సూర్య)కి అనుకోకుండా చనిపోయిన వారి ఆత్మలు కనబడతాయి. వాటిని వాడుకొని డబ్బు సంపాదిస్తూ మాలిని (నయనతార)ని పెళ్ళి చేసుకొని జీవించాలనుకున్న ఇతడికి అనూహ్యంగా “శివ” అనే ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఆత్మ ఎవరిది? అది మాస్ జీవితంలో ఎందుకు ప్రవేశించింది అనేది మిగతా కథాంశం.
కథనం :
నేను వ్రాసిన ఈ చిన్న కథా వస్తువే చాలా ఆసక్తికరంగా ఉంది. వాణిజ్య చిత్రాల్లోనూ (commercial movies) ఇలాంటి వైవిధ్యాన్ని అందించడం దర్శకుడు వెంకట్ ప్రభు అలవాటు. ఈ చిత్రంలోనూ అదే పోకడను అనుసరించే ప్రయతం చేశారు ప్రభు.
మొదటి ఇరవై నిమిషాలు ప్రేక్షకుడికి మాస్ పాత్రని పూర్తిస్థాయిలో పరిచయం చేయడానికి ఉపయోగించినా, ఆ తరువాత మొదటి సగమంతా దాదాపు ఆసక్తికరమైన కథనంతోనే నడిపించాడు దర్శకుడు. తనకు ఆత్మలు కనబడుతున్నాయని మాస్ తెలుసుకునే సన్నివేశం దగ్గర నుండి చిత్రం ఓ స్థాయిలో నడిచింది. వాటి ద్వారా కాస్త భయపెట్టే ప్రయత్నం కూడా చేశాడు దర్శకుడు. ఆ తరువాత అతడికి “శివ” ఆత్మ పరిచయం అయ్యే సన్నివేశాన్ని మరింత అద్భుతంగా చిత్రించాడు. విరామపు సన్నివేశంలో మాస్ నడుపుతున్న కారు పైన శివ ఆత్మ నిలబడి అతడికి దారి చెప్పే సన్నివేశం ఈ చిత్రం మొత్తానికి చెప్పుకోదగ్గ సన్నివేశం.
పైన చెప్పిన అంశాల నిడివి (runtime) చాలా తక్కువ కనుక మొదటి సగంలో అనవసరమైన విషయాలు చొప్పించాడు దర్శకుడు. సూర్యకు తెలుగులో ఉన్న పలుకుబడిని కూడా గుర్తుంచుకొని అటు తమిళ ప్రేక్షకులను, ఇటు తెలుగు ప్రేక్షకులను సమానంగా అలరించే ప్రయత్నం చాలానే చేశాడు. ఇతడికి తోడయ్యాడు మాటల రచయిత “శశాంక్ వెన్నెలకంటి”. అడుగడుగునా ఇతర చిత్రాలను అనుకరిస్తూ, వాటిలోని గీతాలను వాడుకుంటూ, కథకు అనవసరమైన సన్నివేశాలు పెట్టి ఇబ్బంది పెట్టాడు. దీని మూలంగా నాయకానాయికల మధ్య సరైన ప్రేమ సన్నివేశం కానీ, ఓ మంచి యుగళ గీతం (duet) కానీ లేకుండా పోయింది.
ఇక రెండో సగానికి వచ్చేసరికి కథనం పూర్తిగా వేరే దారిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి దీర్ఘంగా సాగే కథనంతో మళ్ళీ ఇబ్బంది పెట్టాడు దర్శకుడు. ఇక్కడ, అనూహ్యంగా “జర్నీ” చిత్రం నుండి “జై” పాత్ర ఆత్మను వాడుకోవడం కొంచెం అతిశయోక్తిగా అనిపించింది. తరువాత ప్రవేశపెట్టిన ఓ ముఖ్యమైన మెలిక (twist) ఆశ్చర్యపరిచింది కానీ అది క్షణకాలమే. ఆ తరువాత సర్వ సాధారణమైన కథనంతో సాగుతూ చివరకు ప్రతీకారం అనే అంశం మీద సాగిపోయింది. కానీ ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండో సగంలో కథాపరంగా సూర్య, ప్రణీతల మధ్య ఓ గీతం ఉంది. ఇంకెక్కడా ఓ గీతం కావాలి అని ప్రేక్షకుడికి అనిపించకుండా దర్శకుడు కథనాన్ని నడిపించాడు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం.
ఇవన్నీ పక్కన పెడితే, ఓ ప్రమాదం వల్ల వచ్చిన ఓ అరుదైన శక్తి మళ్ళీ మరో ప్రమాదం వల్ల పోవడం అనే అంశం సరైన విశ్లేషణ మరియు వివరణ లేక ఆకట్టుకోలేకపోయింది. దీన్ని కూడా పట్టించుకోవడం మానేస్తే, చివరి పోరాట సన్నివేశంలో, తలకు దెబ్బ తగిలిన పోలీసు అధికారి విక్రమ్ (పార్తిబన్)కి ఉన్నట్టుండి ఆత్మలు కనబడటం, మళ్ళీ మరో దెబ్బ తగలగానే ఆత్మలు కనబడకుండా పోవడం, అసలు ఆ అంశాన్నే చాలా లోకువ చేసింది. ఇలాంటి సన్నివేశం పెట్టేసరికి ఈ చిత్రంలో తర్కాన్ని వెతకాలి అనిపిస్తుంది. మరి ఇది చివరి క్షణాల్లో హాస్యం పండించడానికి చేసిన ప్రయత్నమో తెలియదు కానీ అప్పటివరకు ఉన్న గౌరవాన్ని మాత్రం పోగొట్టిందనే చెప్పాలి.
అలా “రాక్షసుడు” ఓ మామూలు చిత్రంలాగే ముగిసింది. ఇంతవరకు, లేదు అనుకున్న నాయకానాయికల యుగళ గీతం ఆఖరులో కనబడింది. కానీ దాన్ని చూసే వీలు అందరు ప్రేక్షకులకు దక్కలేదు.
పాత్రల విషయానికి వస్తే ఇందులో ఎక్కువ సూర్య మరియు అతడి స్నేహితుడిగా చేసిన అమరెన్ పాత్రలే ఎక్కువ. ప్రణీతకి ఒప్పుకోదగ్గ పాత్ర లభించింది కానీ నయనతారకి ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రే దొరికింది.
ప్రత్యేకతలు :
1) సూర్య. రెండు కోణాలున్న పాత్రల్లో నటించడమే కాకుండా వాటికి తగ్గ ఆహార్యాన్ని కూడా చూపించాడు. ఎప్పటిలాగే ఎంతో అందంగానూ ఉన్నాడు.
2) యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం. ఒక్కో పాత్రకు ఒక్కో రకమైన నేపథ్య సంగీతాన్ని ఇచ్చి బాగానే అలరించే ప్రయతం చేశాడు.
3) ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రహణం. రెండో సగంలో వచ్చే సూర్య, ప్రణీతల మధ్యనున్న గీతాన్ని బాగా చిత్రించాడు.
బలహీనతలు :
1) ఒక దారిలో మొదలై మరో దారిలోకి వెళ్ళి మూలాంశంపై (original plot) గౌరవం పోగొట్టిన కథనం.
2) వ్యర్తమైపోయిన నాయిక పాత్ర.
3) పలుచోట్ల వివరణే లేని కొన్ని అంశాలు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఓ అరుదైన కథాంశం అనుకున్నప్పుడు దానికి తగ్గ కథనంతోనే సాగిపోవాలి. వ్యాపారం కోసం అవసరం లేని అంశాలు జోడించి మూలంశాన్ని చెడగొట్టడం చాలా పెద్ద తప్పు.
– యశ్వంత్ ఆలూరు