వారసత్వం కథానాయకుడిని పరిచయం మాత్రమే చేస్తుంది. కానీ సినిమాపై అతడి ఆసక్తి పరిశ్రమలో అతడిని నిలబెడుతుంది. అలా మెల్లగా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న కథానాయకుడు “నారా రోహిత్”. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ, మామూలు పంథాకు భిన్నంగా కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వారసుడు ఇతడు. ఈసారి నిర్మాతగానూ మారి, “కృష్ణ విజయ్” అనే దర్శకుడిని పరిచయం చేస్తూ “అసుర” చిత్రంతో తెరపైకి వచ్చాడు.
కథ :
ధర్మాన్ని గెలిపించడానికి అవసరమైతే నియమాలను కూడా అధిగమించగల జైలర్ ధర్మ (నారా రోహిత్). ఇతడు అధికారిగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోకి ఉరిశిక్ష పడ్డ హంతకుడు చార్లీ (రవివర్మ) వస్తాడు. శిక్షని తప్పించుకోవాలని ప్రయత్నించే చార్లీ ఎత్తుగడలను ధర్మ ఎలా ఎదుర్కొని ధర్మాన్ని గెలిపించాడు అన్నది ఈ కథాంశం.
కథనం :
ఇది అతి సాధారణమైన కథ. ఇంత చిన్న కథాంశాన్ని ఈ కొత్త దర్శకుడు నడిపించిన తీరు అభినందించదగ్గది. ఈ చిత్రం మొదట్లో కథానాయకుడితో ఓ కవిత చెప్పించి, ఆ తరువాత తోలుబొమ్మలాటను చూపిస్తూ పేర్లు వేసిన విధానం బాగుంది. ఇక్కడ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ కూడా తన నేపథ్య సంగీతంతో బలాన్ని చేకూర్చాడు.
సినిమా కథనం మూడు భాగాలుగా సాగాలని అనుభవజ్ఞులు చెప్తారు. మొదటి భాగం ప్రధాన పాత్ర “పరిచయం”, రెండోది దానికి ఎదురయ్యే “సమస్య”, మూడవది అది చూపించే “పరిష్కారం”. ఆంగ్ల విశ్లేషకులు (Hollywood Reviewers) వీటిని “ఆక్ట్స్” (Acts) గానూ వర్ణిస్తారు. దర్శకుడు కృష్ణ విజయ్ ఈ అంశాలను మనసులో పెట్టుకొని ఈ కథనాన్ని నడిపించాడు అనిపించింది. ఈ చిత్ర కథనాన్ని ఆక్ట్1 (Act 1) – పరిచయం, ఆక్ట్2 (Act 2) – సమస్య, ఆక్ట్3 (Act 3) – పరిష్కారంగా విభజించవచ్చు.
ఆక్ట్1 (Act 1) – పరిచయం :
చిత్రంలోని ఏ సన్నివేశమూ పైన వ్రాసిన కథను దాటి బయటకు వెళ్ళలేదు. ఎక్కడా అనవసరమైన వ్యాపార సూత్రాలను ప్రయోగించలేదు. కథానాయకుడి పాత్ర పరిచయ గీతంలోనూ కథను నడిపించి బోరు కొట్టించలేదు. మామూలు చిత్రాల్లా, కథానాయకుడు కథానాయికని పరిచయం చేసి, వారిద్దరిని ప్రేమలో పడేసే సన్నివేశాలను పక్కనబెట్టి, వాళ్ళకు ఇదివరకే పరిచయం ఉన్నట్టుగా చూపించాడు. కథానాయిక “ప్రియా బెనర్జీ” కూడా పాత్రకు తగ్గట్టుగా పరిధిలోనే నటించింది. నాయకానాయికల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా తక్కువ నిడివితో (runtime), కాస్త సహజంగానూ సాగాయి. అలా ఆక్ట్1 (Act 1)ని పూర్తి చేశాడు దర్శకుడు.
ఆక్ట్2 (Act 2) – సమస్య :
ధర్మ పాత్రకు సమస్యగా చార్లీ పాత్ర ప్రవేశం. సమస్యకు బలాన్ని పెంచితేనే దాన్ని ఎదుర్కొనే నాయకుడి పాత్రపై బరువు పెరుగుతుంది. ఇది సినిమా రహస్యం. కనుక చార్లీ పాత్రను కథనంతో పాటు బలపరుస్తూ వెళ్ళాడు దర్శకుడు. ఈ పాత్రకు బలం చేకుర్చినవి “మధు సింగంపల్లి” (చక్రవాకం మధు) మరియు సత్యదేవ్ పోషించిన పాత్రలు. అలా కథానాయకుడి పాత్రపై బరువు పెరిగిపోయింది. అయినప్పటికీ అతడి పాత్రలో మార్పు రాకుండా విరామపు సన్నివేశాన్ని చిత్రించాడు దర్శకుడు. ఇది ప్రేక్షకుడికి ఉత్కంఠని కలిగించిన సన్నివేశం. దీని ముందు వచ్చే “పోటెత్తిన తూరుపు సూరీడే” అనే గీతం ధర్మ పాత్ర పడే మనోవేదనని బాగా చూపించగలిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సినది, ఓ పక్క ఊయల మరో పక్క ఉరితాడు, మధ్యలో ధర్మ ఉన్న షాట్. ఇది చాలా విషయాలను తెలిపింది.
ధర్మ పాత్ర స్వభావాన్ని కవితల ద్వారా కూడా బాగా చెప్పగలిగాడు దర్శకుడు. దీనికి ప్రధాన ఊతాన్నిచ్చింది (strength) నారా రోహిత్ గొంతుక. గంభీరమైన గొంతుకతో పలికిన విప్లవ కవితలు ఆకట్టుకున్నాయి. అలాగే దర్శకుడిపై శ్రీశ్రీ గారి ప్రభావం బాగా ఉన్నట్టు తెలిపింది. రెండో సగంలో, పాండు పాత్ర చనిపోయిన సన్నివేశంలో, “అడుగు ఆగింది…” అనే కవిత అన్నింటిలోకి ఉత్తమ కవితగా చెప్పొచ్చు.
ఇదే రెండో సగంలో కథనం కూడా కాస్త నెమ్మదించింది. అన్ని దారులు మూసుకుపోయాక ఇక ధర్మ పాత్ర ఏమి చేస్తుంది అనే భావన ప్రేక్షకుడికి కలిగించి ఆక్ట్2 (Act 2)ని ముగించాడు దర్శకుడు.
ఆక్ట్3 (Act 3) – పరిష్కారం :
చివరి ఘట్టం. ధర్మ పాత్ర బలాన్ని పెంచింది. సమస్యని ధర్మ పరిష్కరించిన విధానం బాగుంది. అప్పటివరకు పెరిగిపోతున్న చార్లీ పాత్ర బలాన్ని ధర్మ అణచిన తీరు ఈ చిత్రానికి చక్కటి ముగింపునిచ్చింది. అలా ఆక్ట్3 (Act 3) కూడా పూర్తయ్యింది.
పాటల విషయానికి వస్తే, ప్రతీ పాట కథనంలో భాగంగా వస్తూ కథను నడిపించింది. సాయి కార్తీక్ సంగీతం కూడా కథకు తగ్గట్టుగా ఉంటూ ఆకట్టుకుంది. చిత్రీకరణ విషయానికి వస్తే, పైన చెప్పినట్టుగా, “పోటెత్తిన తూరుపు సురీడే” అనే గీతం చెప్పుకోదగ్గది.
ప్రత్యేకతలు :
1) నారా రోహిత్. ఇతడికి ఉన్న పెద్ద బలం ఇతడి గొంతుక. గంభీరమైన గొంతుకలో పలికిన కవితలు కథనానికి బాగా బలాన్ని చేకూర్చాయి. కథల ఎంపికలోనూ తనదైన ముద్ర వేసుకున్న కథానాయకుడు. బరువు తగ్గితే మరిన్ని వైవిధ్యమైన కథల్లో నటించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి కథలకే పరిమితం అయిపోయే ప్రమాదం ఉంది.
2) ఎస్.వి.విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం. ఈ చిత్రానికి ఇది మరో బలం. చిత్రం నాణ్యత ఎక్కువగా ఉంది. ఇతడి పనితనం పాటల్లో బాగా కనబడుతుంది. పైన చెప్పుకున్న “పోటెత్తిన తూరుపు సూరీడే” గీతంలోని షాట్ మరియు మొదటిసారి తలారి ఉరితాడుని అమర్చిన తరువాత దాన్ని చూపించే తక్కువ కోణపు (Low Angle) షాట్ చెప్పుకోదగినవి.
3) సాయి కార్తీక్ సంగీతం. మొదట్లో పేర్లు పడే సన్నివేశంలోని నేపథ్య సంగీతానికే ఇతడికి పూర్తి మార్కులు వేసేయాలి. పాటలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా చిత్రానికి బలాన్నిచ్చింది.
4) నిర్మాణ విలువలు (Production Values). పరిమితి దాటి ఎక్కడా ఖర్చు పెట్టలేదు. చిత్రానికి కావలసినంత ఖర్చే పెట్టి తీశారనిపించింది.
5) తక్కువ నిడివి (less runtime). చిత్రం 122 నిమిషాల్లో ముగిసింది. ప్రేక్షకుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగించని ఈ నిడివి కూడా చిత్రానికి బలంగా మారింది.
బలహీనతలు :
1) రెండో సగంలో నెమ్మదిగా నడిచిన కథనం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
అభిమానులున్న కథానాయకుడి వెంటపడడం కంటే ఆసక్తి ఉన్న కథానాయకుడి వెంటపడితే ఫలితం దక్కుతుంది.
– యశ్వంత్ ఆలూరు