సినిమా విమర్శించని అంశం ఈ సమాజంలో దాదాపుగా లేదు. కానీ ఎవరి శైలిలో వారు విమర్శిస్తారు. అందులో “పూరి జగన్నాథ్” శైలి ప్రత్యేకం. అందుకే ఈసారి సమాజంలో నలిగిపోయే ఓ వేశ్య ద్వారా విమర్శించాడు. ఆవిడే “జ్యోతిలక్ష్మీ”. ఛార్మి నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం పలువురు చిన్న నటీనటులకు నటించే అవకాశాన్ని ఇచ్చింది. దీని విషయాల్లోకి వెళ్తే…
కథ :
వేశ్య అయిన జ్యోతిలక్ష్మి (ఛార్మి)ని ప్రేమించి పెళ్ళాడతాడు సత్య (సత్యదేవ్). దానికి గల కారణం ఏమిటి? ఆ పెళ్ళి జ్యోతిలక్ష్మి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ చిత్ర కథాంశం.
కథనం :
పూరి జగన్నాథ్ లెక్కలు చూసుకొని దర్శకుడు. ఎందుకంటే, ఒక విజయవంతమైన చిత్రం తీసిన తరువాత అలాంటి చిత్రమే తీయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. “టెంపర్” లాంటి చిత్రం తరువాత ఇలాంటి చిత్రం తీయడం, దాదాపు తెరమరుగయిన (Faded Out) ఛార్మిని ఎంచుకోవడం జయాపజయాలను (Success and Failure) అతడు పట్టించుకోడని తెలిపింది.
ఇక చిత్రం విషయానికి వస్తే, ఇది “మాల్లది వెంకట కృష్ణమూర్తి” వ్రాసిన కథ. దీనికి పూరి తనదైన శైలి కథనాన్ని జోడించాడు. ఇందులో కనిపించే నటులు దాదాపు చిన్నవారే. చిత్రపు మొదటి సన్నివేశం బాగా తీశాడు పూరి. అమాయకులైన అమ్మాయిలను ఈ సమాజం ఎలా మోసం చేస్తుందో ఇక్కడ కళ్ళకు కట్టాడు. తరువాత మొదటి ఇరవై నిమిషాలు ద్వందార్థ సంభాషణలతో ఇబ్బంది పెట్టాడు. అవి కుటుంబ ప్రేక్షకులకు మరియు ఆడవాళ్ళకు నచ్చడం కష్టమే. కానీ ఎక్కడా అశ్లీల (vulgarity) సన్నివేశాలు తీయలేదు. బ్రహ్మానందం పాత్ర ఇక్కడ పెద్దగా నవ్వించలేకపోయింది.
మొదటి సగం అంతా ఎత్తుపల్లాలు (Ups and Downs) లేకుండా సాగిపోయింది. అసలు సత్య, జ్యోతిలక్ష్మిని ఎందుకు పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడు అనే అంశాన్ని ఈ సగంలో ప్రేక్షకుడికి ప్రశ్నలా వదిలేశాడు పూరి. విరామపు సన్నివేశం చాలా ముఖ్యమైనది. సమాజ ధర్మానికి అతీతంగా బ్రతికే ఒక వేశ్యకు సమాజంలోని కట్టుబాట్ల పట్ల గౌరవం లేదని చెప్పే ఈ సన్నివేశంలోని మాటలు ఇంకొంచెం ప్రభావితంగా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది.
రెండో సగం ఎక్కువ కథ లేనందున నెమ్మదిగానే నడిచింది. ఇందులో మొదట చెప్పుకోవాల్సింది, జ్యోతిలక్ష్మి, ఆసుపత్రిలో మంజు (టార్జాన్)పై తిరగబడే సన్నివేశం. ఈ చిత్రం మొత్తంలో ఇదే ఉత్తమ సన్నివేశంగా చెప్పొచ్చు. అంతేకాదు, ఇది జ్యోతిలక్ష్మి పాత్రపై గౌరవాన్ని కూడా పెంచింది. ఇక్కడ ఛార్మి నటన కూడా బాగుంది. చిత్రానికి మరింత ముఖ్యమైన అంశం, జ్యోతిలక్ష్మిని ప్రేమించాడానికి సత్య చెప్పిన కారణం ఎక్కువ ప్రభావం చూపలేకపోయింది. ఆ తరువాత కథనం పూర్తిస్థాయి పూరి శైలిలోకి వెళ్ళిపోతుంది. తన మునుపటి చిత్రాల్లోలాగే సమాజంపై వ్యంగ్యాస్త్రాలను (sarcasm) సంధించాడు పూరి. కానీ ఎంచుకున్న అంశం మాత్రం పాతదే. జ్యోతిలక్ష్మిని చంపే ప్రయత్నం చేసే సన్నివేశం మోతాదుకు మించి హింసాత్మకంగా ఉంది. అంత హింస, క్రూరత్వం అవసరం లేదనిపించింది.
చివరి ఘట్టంలో పలువురు హాస్యనటుల పైన చిత్రించిన సన్నివేశం బాగా నవ్వించింది. దీనిలో ఎక్కువ భాగం బ్రహ్మానందం మరియు సంపూర్ణేష్ బాబులదే. ఇక్కడ జ్యోతిలక్ష్మి చెప్పిన మాటలు బాగున్నాయి కానీ ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపలేకపోయాయి. ఇక్కడ ఛార్మి ఆహార్యంలో పూరి పూర్తిస్థాయిలో కనిపించాడు.
చివరగా, తన శైలిలో ఓ సందేశాన్ని చెప్పి చిత్రాన్ని ముగించాడు పూరి. ఇక మిగతా విషయాలకు వస్తే, ఇందులో గీతాలు అనవసరమనే చెప్పాలి. సాగిపోతున్న కథనానికి అడ్డుకట్టలుగా అనిపించాయి. నటనల విషయానికి వస్తే, ఛార్మి చాలా సునాయాసంగా నటించింది. సత్యదేవ్ నటన ఫరవాలేదనిపించింది.
ప్రత్యేకతలు :
1) పూరి సంభాషణలు. కొన్నిచోట్ల సంభాషణలు కథకు బాగా సరిపోయాయి. ఉదాహరణకు, “కోడి పిల్ల ఉన్నది కోసుకోవడానికి, ఆడపిల్ల ఉన్నది ఆడుకోవడానికి”, “ఎక్కువ ప్రేమించినా డెసిషన్ (Decision) తీసుకోకూడదు, ఎక్కువ అసహ్యం వేసిన కూడా డెసిషన్ (Decision) తీసుకోకూడదు” లాంటివి.
2) పి.జి.విందా ఛాయాగ్రహణం. చిత్రపు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తీశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది “వద్దు వద్దు…” అనే గీతం ఓ సగం సూర్యాస్తమయంలో (Sunset), మరో సగం పూర్తి సూర్యకాంతిలో (Sunlight) తీసిన విధానం బాగా ఆకట్టుకుంది.
3) తక్కువ అశ్లీల సన్నివేశాలు. వేశ్య పాత్ర చుట్టూ తిరిగే కథలో అశ్లీలతని ఎక్కువగా చొప్పించడం మామూలే. కానీ అది మాటల వరకే పరిమితం చేసి దృశ్యాల్లో లేకుండా జాగ్రత్తపడ్డారు. బహుశా అందుకే ఈ చిత్రానికి “U/A” లభించింది.
బలహీనతలు :
1) సునీల్ కశ్యప్ సంగీతం. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
2) మోతాదు మించిన హింస.
3) కథనానికి అవసరం లేని పాటలు.
4) రెండో సగంలో నెమ్మదిగా నడిచిన కథనం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
నటులకే కాదు దర్శకులకు కూడా “ఇమేజ్” (Image), “ట్రెండ్” (Trend) అనే చట్రాలు ఉంటాయి. వాటినుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండాలి ఆ దర్శకుడు.
– యశ్వంత్ ఆలూరు