కేరింత (2015)

Kerantha-Wallpapers-1

సినిమా అనేది ఓ వ్యాపారం. వ్యాపారంలాగే సినిమాకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి చిత్రంతో వస్తే లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులకు చేరువ అవుతుందో తెలియడం చాలా ముఖ్యం. ఈ సూత్రం తెలిసిన నిర్మాత “దిల్” రాజు. వేసవిలో ఎక్కువగా సినిమాలు చూసే యువతని లక్ష్యంగా చేసుకొని “సాయికిరణ్ అడివి” దర్శకత్వంలో “కేరింత”ని నిర్మించారు. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా విషయాలేంటో చూద్దాం…

కథ :

వేర్వేరు కుటుంబాల నుండి వచ్చి, వేర్వేరు మనస్తత్త్వాలతో, వేర్వేరు లక్ష్యాలు కలిగిన కొందరు కాలేజీ స్నేహితుల జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది.

కథనం :

ఇది పక్కా వాణిజ్య చిత్రం (commercial movie). ముఖ్యంగా యువతని (youth) ఆకర్షించేందుకు తీసిన చిత్రం కనుక పాత్రలు వారికి దగ్గరగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు సాయికిరణ్. ఇందులో పలు చిత్రాల ప్రభావం కూడా కనబడింది. ఎక్కువగా కనిపించింది “3 ఇడియట్స్” మరియు “హ్యాపీడేస్”ల ప్రభావం. “3 ఇడియట్స్” తరహాలోనే ఈ చిత్ర కథనాన్ని నూకరాజు (పార్వతీశం) పాత్ర ద్వారా మొదలుపెట్టాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఈ పాత్రని పార్వతీశం చాలా బాగా పోషించాడు. చిత్రంలోని మిగతా పాత్రలను, వాటి ప్రవర్తనలను ఈ పాత్రే పరిచయం చేస్తుంది.

మొదటి సగం అంతా ర్యాగింగ్ (ragging) అంశాన్ని మినహాయించి దాదాపుగా “హ్యాపీడేస్” తరహాలోనే సాగింది కానీ అందులోని పాత్రలకంటే ఇందులోని పాత్రలకే పరిపక్వత (maturity) ఎక్కువగా కనిపించింది. పలు సన్నివేశాలు నవ్వించాయి కూడా. ఆ బాధ్యత అంతా నూకరాజు పాత్రే మోసింది. ఉదాహరణకు, భావన (సుకృతి) కోసం నూకరాజు లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించే సన్నివేశం. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణల ద్వారా భావోద్వేగాలను పండించే ప్రయత్నం కూడా చేశాడు దర్శకుడు. కానీ అవి గుండె బరువును పెంచలేకపోయాయి.

ఈ చిత్రానికి ప్రధాన బలం “విజయ్ చక్రవర్తి” ఛాయాగ్రహణం. జై (సుమంత్ అశ్విన్) మొదటిసారి మనస్విని (శ్రీదివ్య)ని చూసే సన్నివేశం, వర్షంలో నీడ కోసం ఇద్దరు పరుగెత్తే షాట్ లను అద్భుతంగా తీశాడు విజయ్. ఈ షాట్ లో వచ్చే నేపథ్య సంగీతం ఈ పాత్రలు ఎదురుపడే ప్రతీ సన్నివేశంలో వస్తూ మనసుకు హాయిని కలిగించింది.

సిద్ధు (విశ్వంత్), ప్రియ (తేజస్విని) మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సృజనాత్మకంగా (creative) ఉన్నాయి. ఉదాహరణకు, సిద్ధుకి పుట్టినరోజు కానుకలు ఇచ్చే సన్నివేశం. ఇది యువతకి బాగా నచ్చే అంశం. వీరిద్దరి మధ్య వచ్చే విరామపు సన్నివేశం సహజంగా అనిపించింది.

మొదటి సగంతో పోలిస్తే రెండో సగం నెమ్మదిగా నడిచింది. ఈ సగంలో జై, మనస్వినిల మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ మామూలుగానే సాగాయి. వీరిద్దరి పాత్రలను చాలా పరిపక్వత (maturity) కలిగినవిగా ఇక్కడ చూపించాడు దర్శకుడు. ఉదాహరణే, సంకోచంలో (confusion) ఉన్న మనస్వినితో మనసుకు నచ్చింది చేయమని జై చెప్పే సన్నివేశం.

ఇక అనుకున్న విధంగానే చిత్రాన్ని ముగించాడు దర్శకుడు. నూకరాజు – భావనల కథ పూర్తిగా “హ్యాపీడేస్”లో నిఖిల్ – గాయత్రి పాత్రల తరహాలో ముగిసింది. సిద్ధు – ప్రియల మధ్య వచ్చే భావోద్వేగపు సన్నివేశాలు బాగానే ఉన్నాయి. పిల్లల అభిప్రాయాలను తల్లిదండ్రులు గౌరవించాలన్న సందేశాన్ని కూడా ఇచ్చాడు. యువత లక్ష్యంగా స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే కథ కనుక స్నేహితులకు, ప్రేమికులకు మాత్రమే ఈ చిత్రం నచ్చుతుంది. అక్కడే అనుకున్నది సాధించారు నిర్మాత, దర్శకుడు.

నటనల విషయానికి వస్తే, సుమంత్ అశ్విన్ నటన బాగుంది. మునుపటి చిత్రాలకంటే ఇందులో పరిణితి సాధించాడు. అలాగే తేజస్విని నటన కూడా. ముఖ్యంగా, చివర్లో సిద్ధు నుండి విడిపోయే సన్నివేశంలో బాగా నటించింది. శ్రీదివ్య నటన ఫరవాలేదు. పార్వతీశం నటనే అందరికంటే బాగా పండినదని చెప్పాలి. ఎటువంటి సన్నివేశంలోనైనా యాస పోకుండా అతడి పాత్రకు వ్రాసిన మాటలు బాగున్నాయి. “ఓలాయ్” అని పిలిచే తీరు యువతకి బాగా నచ్చుతుంది. సిద్ధుగా విశ్వంత్ బాగా సరిపోయాడు. పిల్లలను అదుపులో పెట్టే సిద్ధు తల్లిగా ప్రగతి నటన మాములుగానే ఉంది.

గీతాల విషయానికి వస్తే, మిక్కీ జే మెయెర్ ఎప్పటిలాగే తనదైన శైలిలోనే సంగీతాన్ని అందించాడు. వినగలిగేవి “మిల మిల…”, “సుమ గంథాల తేలింది…” మరియు చివరి గీతం “ఏ కథ…” అనే గీతాలు. గీతాల చిత్రీకరణ విషయానికి వస్తే, “మిల మిల”, “థాంక్స్ టు జిందగీ” ఆకట్టుకున్నాయి.

ప్రత్యేకతలు :

1) విజయ చక్రవర్తి ఛాయాగ్రహణం. చిత్రమంతా కనువిందుగా ఉంది. పైన చెప్పిన సన్నివేశాలు, గీతాలు ఉదాహరణలు.

2) కాస్ట్యూమ్స్ (Costumes). సుమంత్ అశ్విన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. “ఆరంజ్”లో రామ్ చరణ్ తరువాత మళ్ళీ ఇందులోనే ఆకుట్టుకునే కాస్ట్యూమ్స్ చూడడం.

3) నిర్మాణ విలువలు (Production Values). దిల్ రాజు నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ఇంకో ప్రత్యేకత.

బలహీనతలు : 

1) రెండో సగంలో నెమ్మదిగా నడిచిన కథనం.

2) సాధారణమైన కథా వస్తువు.

3) ఇతర చిత్రాల ప్రభావం.

4) కూర్పు (Editing). ఒకట్రెండు సన్నివేశాలలో ఇది బలహీనంగా అనిపించింది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

చిత్రాలు తీయడమే కాదు ఏ చిత్రం ఎప్పుడూ తీయాలో, కథకు ఎలాంటి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవాలో తెలుసుకొని వాటికి అనుగుణంగా తీయాలి. అప్పుడే అనుకున్న వ్యాపారం జరుగుతుంది.

– యశ్వంత్ ఆలూరు

One thought on “కేరింత (2015)

  1. bhayya, bhavana character chesina sukruthi gurinchi cheppaledu ??? amedhe andarikante natural ga unnindi, firist lo mamoolu ga unna mellamelalga aa character ni manam like chesela untundi narration 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s