“రీమేక్” చిత్రాలు మన చిత్రసీమకు కొత్తేమీ కాదు. అలాంటి చిత్రాలు తీయడం తప్పు కూడా కాదు. కానీ ఓ భాషలోని చిత్రాన్ని మరో భాషలో తీయాలనుకున్నప్పుడు దాన్ని ఆ ప్రేక్షకులు మెచ్చే విధంగా అందులో మార్పులు చేయడం చాలా అవసరం. కన్నడ భాష నుండి మనం అరువుతెచ్చుకున్న చిత్రాలు తక్కువే. అలాంటి వాటిలో ఒకటి “కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ”. కన్నడలో విజయవంతమైన “చార్మినార్” చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చార్మినార్ దర్శకుడైన “ఆర్.చంద్రు” దర్శకత్వం వహించారు. “లగడపాటి శ్రీధర్” నిర్మించారు. సుధీర్ బాబు, నందిత జంటగా నటించారు.
కథ :
కృష్ణాపురంలోని ఓ పాఠశాలకు చెందిన పాత విద్యార్థులు చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ కలుస్తారు. అందులో ఒకరైన కృష్ణ (సుధీర్ బాబు) తన స్నేహితురాలు రాధ (నందిత)తో తనకున్న అనుబంధం గురించి నెమరువేసుకునే జ్ఞాపకాల సమాహారమే ఈ కథ.
కథనం :
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. పైగా, ఈ చిత్రం నచ్చకపోతే ప్రేక్షకులు ఖర్చుపెట్టిన డబ్బు వెనక్కిస్తామని నిర్మాత లగడపాటి సవాలు కూడా చేసినట్టు సమాచారం. ఈ చిత్రం చుసిన తరువాత దీని మాతృక (original) “చార్మినార్” చిత్రం చూశాను. తెలుగు ప్రేక్షకుల కోసం చేసిన “కొన్ని” మార్పులు బాగానే ఉన్నాయి. ఉదాహరణకు, కన్నడలో కృష్ణానదికి చోటే లేదు. కానీ ఇక్కడ కృష్ణానదిని కూడా కథలో ఓ పాత్రను చేశాడు దర్శకుడు చంద్రు. పాత్రల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కన్నడలోని 150 నిమిషాల చిత్రాన్ని ఇక్కడ 133 నిమిషాలకు కుదించాడు.
ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం వెనకున్న నిర్మాత యొక్క ఉద్దేశ్యం మంచిదే. ముఖ్యంగా, ఓ వయసొచ్చాక జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని యువతని (youth) ఉద్దేశించిన కథ ఇది. ఇలాంటి కథాంశాన్ని ఇప్పటి తెలుగు యువతకి ఏ విధంగా చెప్పాలో అధ్యయనం (study) చేసి ఆ విధంగా ఈ చిత్రంలో మార్పులు చేసుంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఇంచుమించు ఇలాంటి కథతోనే “నా ఆటోగ్రాఫ్” చిత్రం ఇదివరకే వచ్చింది. కనుక ఈ చిత్రానికి ఇంకొంచెం పరిశోధన అవసరం అనిపించింది. కానీ నిర్మాతకు మాతృకని ఎక్కువగా మార్పు చేయడం ఇష్టం లేదనిపించింది. అందుకే దాదాపు కథని యథావిధిగానే అందించారు.
ముందుగా మంచి విషయాలు. ఈ చిత్రపు మొదటి సగం ప్రేక్షకులను తమ చిన్ననాటి విషయాలను గుర్తుచేసే ప్రయత్నం చేసింది. నాయకానాయికల పాఠశాల అనుభవాలను బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే “మదన మోహన మాధవ…” అనే గీత చిత్రీకరణ బాగుంది. ఇక్కడ “చంద్రశేఖర్” ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. చిన్నప్పటి కృష్ణ పాత్రలో సాహిదేవ్ విక్రమ్ బాగా నటించాడు. కృష్ణ, రాధ జలపాతం దగ్గరికి వెళ్ళే సన్నివేశంలో కూడా ఛాయాగ్రహణం కనువిందుగా ఉంది. తరువాతి మంచి విషయం, విరామం ముందు, కృష్ణతో తన కాలేజీ ప్రిన్సిపాల్ (పోసాని కృష్ణమురళి) “జీవితం నీదే, నిర్ణయం కూడా నీదే” అని చెప్పే సన్నివేశం. రెండో సగంలో వచ్చే “తుహి తుహి” అనే గీత చిత్రీకరణ, ఉద్యోగం సంపాదించాక కృష్ణ మళ్ళీ తన కాలేజీ ప్రిన్సిపాల్ ని కలిసే సన్నివేశం బాగున్నాయి. చివరలో గురువులను ఉద్దేశించి కృష్ణ మాట్లాడే సన్నివేశాల్లో సంభాషణలు బాగున్నాయి.
ఇక మిగతా విషయాలకు వస్తే, ఈ చిత్రమంతా కథనం చాలా నెమ్మదిగా నడిచింది. ఇలాంటి కథనంలో పంటి కింద రాళ్ళలా అనిపించాయి గీతాలు. ఉన్నవి ఆరే (6) అయినప్పటికీ, మధ్యమధ్యలో అడ్డు రావడంతో చాలా గీతాలున్న భావన కలిగించాయి. కథనం పాతకాలంలో జరుగుతుంటే, గీతాలు ఇప్పటి కాలంలో నడిచాయి. “రాధే రాధే” అనే గీతం పూర్తిగా వ్యర్థం అనిపించింది. కలిసిన ప్రతిసారీ కృష్ణ తన ప్రేమను రాధతో వ్యక్తం చేయాలనుకొని పరిస్థితుల వల్ల చెప్పలేకపోయే అంశాన్ని దర్శకుడు ఇంకొంచెం శ్రద్ధతో మలిచి ఉంటే బాగుండేదేమో అనిపించింది. పలుచోట్ల ఈ అంశాన్ని అతిశయంగా చిత్రించాడు. దీనికి ఉదాహరణే, రాధ తల్లి (ప్రగతి) కృష్ణ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలే సన్నివేశం. ఇక్కడ ఎప్పటిలాగే ప్రగతి అతిశయంగా నటించారు. ఈ చిత్రంలో పోరాటాలు కూడా అనవసరమే అనిపించాయి.
ఈ చిత్రానికి అతి ముఖ్యమైన ఘట్టం, పతాక సన్నివేశం. దీన్ని తప్పుబట్టడం తప్పు, అలాగని అంగీకరించడం కూడా కష్టమే. “ప్రేమంటే బాధ్యత!” అనే అంశాన్ని అక్షరాల తెలిపే సన్నివేశం ఇది. “చార్మినార్” అనే కన్నడ చిత్రం నుండి యథావిధిగా తీసుకున్నదే. కానీ “కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ” అనే తెలుగు చిత్రానికి లక్ష్యం ఇప్పటి తెలుగు యువతే అయితే ఇది వారిని ఏమాత్రం స్ప్రుశించలేని (not touching) సన్నివేశం అనే చెప్పాలి. దీనికి మోతాదు మించిన నాటకీయత (melodrama) కూడా ఓ కారణం. ఇంతటి బరువుని ఇప్పటి తెలుగు యువత మోయగలదా అని ఓసారి నిర్మాత, దర్శకుడు ఆలోచించి ఉంటే బాగుండేదేమో.
మొత్తానికి సున్నితంగా పరిచయం చేసి, బరువుగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (కృష్ణ, రాధలను). ఈ చిత్రం పేరుకి కథ ద్వారా న్యాయం బాగా చేశాడు దర్శకుడు.
ఇక నటనల విషయానికి వస్తే, సుధీర్ నటన బాగానే ఉంది. ముఖ్యంగా చివరలో గురువుల గురించి, రాధ గురించి మాట్లాడే సన్నివేశంలో, రాధను కలిసే చివరి సన్నివేశంలోనూ బాగా నటించాడు. నందిత పాత్రకు తగ్గట్టుగా తన నటనను కనబరిచింది. పోసానికి దక్కిన పాత్ర చాలా గౌరవనీయమైనది. కానీ తన వెక్కిలి ఆహార్యంతో (ఏంటి రాజా లాంటి మాటలతో) ఆ పాత్రని అగౌరవపరిచాడు. ఈ పాత్రకి వేరే నటుడుని తీసుకొని ఉంటే బాగుండేది. లేదా పోసాని చేత కాస్త హుందాగా నటింపచేసి ఉన్నా బాగుండేది. గిరిబాబు గారి పాత్ర మాములుగానే ఉంది. ప్రగతి పోషించిన పాత్ర అతిశయంగా అనిపించింది. సప్తగిరి కనిపించింది అయిదు నిమిషాలే అయినా తన హాస్యంతో ఏమాత్రం ఆకట్టుకోలేదు.
బలాలు :
1) చంద్రశేఖర్ ఛాయాగ్రహణం. దీన్ని చూడదగిన చిత్రంగా మలిచింది ఛాయాగ్రహణమే. పైన చెప్పుకున్న గీతాలు, సన్నివేశాలు ఉదాహరణలు.
2) హరి సంగీతం. చార్మినార్ కి సంగీతం అందించిన హరి అవే రాగాలనే ఇందులోనూ వాడారు. కానీ సంగీతం బాగానే ఉంది. “మదన మోహన మాధవ” మరియు “తుహి తుహి” అనే గీతాలు బాగున్నాయి.
3) ఖదీర్ బాబు సంభాషణలు. అక్కడక్కడ సంభాషణలు బాగానే ఉన్నాయి. ఉదాహరణకు, గురువుల గురించి కృష్ణ మాట్లాడే సన్నివేశం.
3) కృష్ణానదిని ఓ ముఖ్య పాత్రగా మలిచిన విధానం.
బలహీనతలు :
1) తెలుగు ప్రేక్షకులను (యువతను) మెప్పించేలా మార్పులు చేయకపోవడం.
2) మోతాదు మించిన నాటకీయత.
3) అడుగడుగునా వస్తూ ఇబ్బందిపెట్టిన గీతాలు.
4) అనవసరమైన పోరాటాలు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కేవలం ఉద్దేశ్యం మంచిది అయితే సరిపోదు, దాన్ని ప్రేక్షకులకు ఏ విధంగా చెప్పాలో కూడా తెలిసి ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు