తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళ జీవితాల్లో ఇది తరచుగా వస్తుంది. “ఒక రాజు ఒక రాణి”తో పరిచయమై, “చింతకాయల రవి”తో సుప్రసిద్ధమైన దర్శకుడు “యోగేష్”, “ఊహలు గుసగుసలాడే”తో ఆకట్టుకున్న “నాగశౌర్య” మాస్ చిత్రాలు కూడా చేయగలరు అని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నమే “జాదూగాడు” అనే చిత్రం. నాగశౌర్య, సోనారిక జంటగా నటించగా, సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మించారు.
కథ :
ఎలాగోలా ఓ కోటి రూపాయలు సంపాదించాలన్న ఆశతో పాలమూరు నుండి హైదరాబాదుకి వస్తాడు కృష్ణ (నాగశౌర్య). ఆ తరువాత అతడి జీవితం ఎలా మారిపోయింది అన్నది ఈ చిత్ర కథాంశం.
కథనం :
ఇది పక్కా వాణిజ్య చిత్రం. ఖర్చుపెట్టిన నిర్మాతకి నాలుగు డబ్బులు మిగల్చడానికి, దర్శకుడు మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవడానికి తీసిన చిత్రమే తప్ప దీనికి మరో ఉద్దేశ్యం లేదు. సినిమా ఎలా తీసినా, చివరకు అది ఓ వ్యాపారమే అన్న విషయాన్ని నిరూపించిన సినిమా ఇది.
కథ, కథనాల విషయానికి వస్తే, వాటిలో కొత్తదనం ఏమాత్రం లేదు. మొదటి సగం అంతా దాదాపు ఎత్తుపల్లాలు (Ups and Downs) సాగిపోయింది. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు. కనిపించింది తక్కువే అయినప్పటికీ, శ్రీనివాసరెడ్డి, సత్య తమ హాస్యంతో బాగానే నవ్వించారు. ఈ సగంలో పోరాటాలు కూడా ఎక్కువ నిడివి (runtime) కలిగి ఇబ్బందిపెట్టాయి. నాయకానాయికల మధ్య సరైన ప్రేమ సన్నివేశం కూడా లేదు. కేవలం ముద్దులతో నడిపించి పాటలను కథనంలో ఇరికించేశాడు దర్శకుడు. కృష్ణ, పార్వతి (సోనారిక)ని మొదటిసారి ముద్దు పెట్టుకునే సన్నివేశం కుర్రకారుకు బాగా నచ్చే అంశం. “విరామం” అని పడే దగ్గర ప్రేక్షకుడు పెద్దగా ఆసక్తిని చూపించే అంశం ఏదీ లేదు.
రెండో సగం మొదటి దానికన్నా కాస్త నయమనిపించింది. క్రమంగా కృష్ణ పాత్ర యొక్క బలాన్ని తగ్గించేస్తూ, మిగతా పాత్రల బలాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. కానీ ఈ చిత్రం పేరు “జాదూగాడు” కనుక కృష్ణ చివరకు ఎదో ఒకటి చేసి గెలుస్తాడన్న ఊహ మాత్రం ప్రేక్షకుడి మనసులో మెదులుతూనే ఉంటుంది. మొత్తానికి, కృష్ణ చేసిన “జాదూ” బాగానే ఉంది. ఈ మధ్యలో “సప్తగిరి” ప్రవేశించి ప్రేక్షకుడిని తన హాస్యంతో బాగా అలరించాడు. ముఖ్యంగా, అతడు తప్పు చేసినప్పుడల్లా, అతడి ఆత్మ అతడిని చితకబాదే సన్నివేశాలు చక్కిలిగింతలు పెట్టాయి. ఈ రెండో సగంలో చెప్పుకోదగ్గ మరో హాస్య అంశం శ్రీనివాసరెడ్డి, పృథ్వీరాజ్ చదరంగం (chess) ఆడే సన్నివేశం. చిన్నదే అయినప్పటికీ, గుర్తుపెట్టుకొని నవ్వుకునే సన్నివేశం ఇది.
ఈ చిత్రం మొత్తంలో మెచ్చుకోగలిగే ఒకే ఒక మాట ఉంది. కృష్ణతో విడిపోదామని పార్వతి నిర్ణయించుకున్న తరువాత ఏమైందని తన స్నేహితురాలు అడగ్గా, “నిన్న ఓ కల వచ్చింది. ఈరోజు మెలకువ వచ్చింది” అని పార్వతి పలికే మాట.
సంగీతం విషయానికి వస్తే, మణిశర్మ తనయుడు “సాగర్ మహతి” ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన తండ్రితో పోల్చకపోయినా, ఇందులోని గీతాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎంతటి మాస్ ప్రేక్షకుడైనా మధురగీతాలను (melodies) కూడా ఆస్వాదిస్తాడు. ఈ చిత్రంలో అదే కరువైపోయింది. గీతాల చిత్రీకరణ కూడా మాములుగానే ఉంది.
నటనల విషయానికి వస్తే, నాగశౌర్య నటన బాగుంది. సోనారికకి పాత్ర ఎప్పటిలాగే పెద్దగా విలువలేనిది. కేవలం ముద్దులకు, గీతాలకే పరిమితం (confined) అయ్యింది. కోట శ్రీనివాసరావు గారికి కూడా మామూలు పాత్రే లభించింది. రవి కాలే, ఆశిష్ విద్యార్ధిల పాత్రలు అతిశయంగా అనిపించాయి.
మొత్తానికి, ఓ మామూలు కథలో ఓ “మైండ్ గేమ్”ని పొందుపరిచి “జాదూగాడు”ని ముగించాడు దర్శకుడు యోగేష్. వ్యాపారపరంగా, ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించకపోవచ్చు, మామూలు థియేటర్లలో కొంతకాలం నెట్టుకొస్తుంది.
ప్రత్యేకతలు :
1) నాగశౌర్య నటన. ప్రేమికుడు పాత్రలే కాదు, మాస్ పాత్రలను కూడా పోషించగలడని నిరూపించాడు ఈ చిత్రంతో. అక్కడక్కడ పలువురు నటులను అనుకరించినట్టు అనిపించినప్పటికీ ఫరవాలేదనిపించింది.
2) శ్రీనివాసరెడ్డి, సప్తగిరిల హాస్యం.
3) చివరి ఘట్టం (Climax).
బలహీనతలు :
1) పాత కథ, పాత రకమైన కథనం.
2) కరువైపోయిన సరైన ప్రేమ సన్నివేశాలు.
3) ఆకట్టుకోలేకపోయిన సంగీతం మరియు గీతాల చిత్రీకరణ.
4) ఎక్కువ నిడివిగల పోరాటాలు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఏ పాఠం నేర్పకుండా తన వ్యాపారం తాను చేసుకుపోయింది ఈ చిత్రం.
– యశ్వంత్ ఆలూరు
click here for English review on this movie…
Pingback: Jadoogadu (2015) | Film Criticism