మన దేశంలో జనాభా ఎంతుందో కులమతాలు, ఆచారాలు అన్ని ఉన్నాయి. వాటిని అలవాట్లుగా కాకుండా హోదాగా, పరువుగా భావించేవారే ఎక్కువ. పరువు కోసం కన్నబిడ్డలను సైతం చంపుకునే పోకడ ఉత్తరభారతదేశంలో ఇంకా ఉంది. ఆ అంశాన్ని స్పృశిస్తూ, స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే కథే “టైగర్”. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ద్వారా “వి.ఐ.ఆనంద్” దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు.
కథ :
చిన్నతనంలో అనాధాశ్రమంలో ఒకరికొకరు పరిచయమవుతారు టైగర్ (సందీప్ కిషన్), విష్ణు (రాహుల్ రవీంద్రన్). వేరే ఇంటికి దత్తత వచ్చి హైదరాబాద్ లో పెరిగిన విష్ణు, వారణాసికి చెందిన గంగ (సీరత్ కపూర్) ప్రేమలో పడతారు. ఇది తెలుసుకున్న గంగ కుటుంబసభ్యులు వారిద్దరినీ చంపే ప్రయత్నం చేస్తారు. ఈ సమస్య నుండి టైగర్ తన స్నేహితుడిని ఎలా కాపాడాడు అన్నది మిగిలిన కథాంశం.
కథనం :
ట్రాఫిక్కులో చిక్కుకొని ఈ చిత్రపు మొదటి ఇరవై నిమిషాలు చూడలేకపోయాను. కనుక నేను చుసిన సన్నివేశం నుండి ఈ విశ్లేషణ మొదలుపెడుతున్నాను…
నేను చుసిన మొదటి సన్నివేశం, రోడ్డుమీద గాయాలతో పడిన విష్ణు తన గతాన్ని గుర్తుచేసుకునే సన్నివేశం. ఇది బాగా ఆకట్టుకుంది. సహజంగానూ ఉంది. రోడ్డుమీద గాయాలతో ఉన్న మనిషికి సాయం చేయడానికి స్నేహితుడో, బంధువో అవసరం లేదు, సాటి మనిషైతే చాలు అనే సందేశాన్ని ప్రముఖ గాయకుడు సాందీప్ పోషించిన పాత్ర ద్వారా చెప్పాడు దర్శకుడు ఆనంద్.
మొదటి సగంలో కథనం నెమ్మదిగా సాగింది. కానీ “ఛోటా.కె.నాయుడు” తన ఛాయాగ్రహణంతో ఎంతాగానో ఆకట్టుకున్నారు. దీనికి మొదటి ఉదాహరణే, “హల్లాబోల్” అనే గీతం. ఇందులో పలు షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మచ్చుకు గీతం మొదట్లో ఓ క్లాక్ టవర్ దగ్గర పూలమొక్కల మధ్యలో విష్ణు నడిచే షాట్. ఇలాంటి మరిన్ని షాట్స్ “వద్దురా మావ” అనే గీతంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ గీతంలో లైటింగ్ అద్భుతం. ఛాయాచిత్రపు నాణ్యత (picture quality) చాలా బాగుంది. అలాగే, ఓ పాత భవనంలో ఉన్న గంగను చూపించిన ట్రాలీ షాట్ కూడా బాగుంది.
సన్నివేశాల విషయానికి వస్తే, విష్ణు, గంగ ప్రేమలో పడే సన్నివేశాలు మామూలుగానే ఉన్నాయి. కనిపించింది కాసేపే అయినా, సత్య తన “సాఫ్ట్వేర్(software)లో అంతే సార్!” అనే మాటతో బాగా నవ్వించాడు. తరువాత విష్ణు, టైగర్ విడిపోయే సన్నివేశం కాస్త ఆర్య2ని గుర్తుచేసింది. ఇక్కడ దర్శకుడు సందీప్ కిషన్ నుండి భావోద్వేగాలను రాబట్టే ప్రయత్నం గట్టిగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. చాలా బరువైన సన్నివేశాన్ని ఏమాత్రం మార్పులేని గొంతుకతో, కవళికలు లేని ముఖంతో పలికిన తీరు ఆ సన్నివేశపు బరువుని తగ్గించేసింది. ఇక్కడ రాహుల్ నటన బాగానే ఉంది. ఇక విరామం ముందోచ్చే గీతం పూర్తిగా అనవసరం అనిపించింది. కథనం ఉత్కంఠతతో సాగిపోతున్న సమయంలో, ప్రేక్షకులకు ఇదివరకే పరిచయమైన టైగర్ పాత్ర గురించి ఓ పరిచయ గీతం పెట్టాలని దర్శకుడికి ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. ఇక్కడ అమాంతం ప్రేక్షకుడు తన మనసుని మార్చుకోవాల్సి వచ్చింది. ఎదిగిన టైగర్ పాత్రని కథానుగుణంగా ఓ అరగంట తరువాత పరిచయం చేసిన దర్శకుడు, ఇలాంటి గీతాన్ని కూడా అప్పుడే పెట్టుంటే బాగుండేది. అక్కడ కథను గౌరవించి మెప్పించి, ఇక్కడ నటుడిని గౌరవించి నిరాశపరిచాడు.
మొదటి సగంతో పోలిస్తే రెండో సగం చాలా రెట్లు మేలు. ఇక్కడ తను స్ప్రుశించాలనుకున్న అంశానికి నేరుగా వెళ్ళిపోయాడు దర్శకుడు. ఈ అంశం మీద హిందీలో ఇదివరకే “NH10” అనే చిత్రం వచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం వారికి చేరువయ్యే అంశాలతో కథనం నడిచింది. విష్ణుని చంపడానికి వచ్చిన మనుషులను టైగర్ అడ్డుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఇక్కడ తాగుబోతు రమేష్ బాగానే నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత కథనాన్ని ఎక్కడా ఓ గీతం లేకుండా సూటిగా నడిపించాడు దర్శకుడు.
ఇక చివరి దశలో కథనం మరింత పటిష్టంగా సాగింది. అక్కడ వచ్చే పోరాట ఘట్టమూ బాగుంది. ఇక్కడ మళ్ళీ ఛోటా పనితనమే ఎక్కువ కనిపించింది. ఇందులో నాకు నచ్చింది, ఎదురుగా వస్తున్న మనుషులను చూసి టైగర్ చిటికె వేసే షాట్. కేవలం, చిటికేసే అతడి చేతిని, ఆ చేయి విదిల్చే ధూళిని మాత్రం ఫోకస్ చేసి, ఎదురుగా పరుగెత్తుకుంటూ వచ్చిన మనుషులను ఫోకస్ చేయకపోవడం, కనువిందుగానే కాకుండా పాత్ర యొక్క ఔన్నత్యాన్ని (eminence) కూడా పెంచింది. ఆ తరువాత వచ్చే సన్నివేశాన్ని, సంభాషణలను సందీప్ కిషన్ నటన మళ్ళీ చెడగొట్టింది. చివరి నిమిషాల్లో వచ్చే ఈ సన్నివేశంలో భావోద్వేగాలు బాగా పలికించి ఉంటే, ఈ చిత్రానికి ప్రేక్షకుడు తప్పకుండా తన కంటతడితో అభినందనలు తెలిపేవాడు.
అలా, “మంచి” విషయంతో వచ్చిన “టైగర్” పౌరుషంగా గాండ్రించకుండా, అలాగని నిరాశాపరచకుండా ఫరవాలేదనిపించాడు.
నటనల విషయానికి వస్తే, సందీప్ కిషన్ కావాల్సిన చోట భావోద్వేగాలు పలికించలేక ఏమాత్రం మెప్పించలేకపోయాడు. రాహుల్ నటన బాగుంది. సీరత్ కపూర్ నటించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది కానీ అది ఫలించలేదు.
ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపించింది.
ప్రత్యేకతలు :
1) ఛోటా.కె.నాయుడు ఛాయాగ్రహణం. లైటింగ్ విషయంలో కానీ, షాట్స్ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడలేదు ఛోటా. ఈ చిత్రానికి ఈయన పనితనమే ప్రధాన ఊతం అనడంలో అతిశయోక్తి లేదు. పైన చెప్పుకున్న ఉదాహరణలతో పాటు, గంగానదిపై పడవలో ఉన్న రాహుల్, సీరత్ లపై తీసిన కొన్ని షాట్స్ కూడా ఆకట్టుకున్నాయి.
2) కథాంశం. దర్శకుడు ఆనంద్ ఎంచుకున్న మూలాంశం చాలా బరువైనది. దానికి స్నేహం అనే అంశాన్ని జోడించడం బాగుంది.
3) రెండో సగంలోని కథనం. సమయంతో పాటు చాలా పటిష్టంగా నడిచింది.
4) నిడివి. ఈ చిత్రపు మొత్తం నిడివి 120 నిమిషాలు. ఈ కాలానికి ఇది సరిగ్గా సరిపోయే నిడివి.
బలహీనతలు :
1) సందర్భం లేని కథానాయకుడి పరిచయ గీతం.
2) భావోద్వేగాలు పలికించలేక సన్నివేశాల బరువుని తగ్గించిన సందీప్ కిషన్ నటన.
3) నెమ్మదిగా నడిచిన మొదటి సగం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఎంచుకున్న కథాంశం మంచిదైతే సరిపోదు, దాన్ని ప్రేక్షకులకు బాగా చేరవేసే నటులను ఎంచుకోవడం కూడా తెలియాలి.
– యశ్వంత్ ఆలూరు