రాయిలో శిల్పం దాగి ఉంటుంది అనేది అందరు గుడ్డిగా నమ్మే విషయం. నిజానికి, శిల్పం దాగున్నది రాయిలో కాదు, దాన్ని శిల్పంగా మార్చే శిల్పి మనసులో. మామూలు రాయిలాంటి కథను కూడా తెరపై అద్భుతమైన శిల్పంగా మలచగలిగే శిల్పి “రాజమౌళి”. అందుకే చిత్ర పరిశ్రమ అతడిని “జక్కన్న”గా అభివర్ణిస్తుంది. ఈ జక్కన్న వాడే ఉలి “సాంకేతికత”. దీని సాయంతో ఎలాంటి కథనైనా అద్భుతంగా తెరపై ఆవిష్కరించగలడు. ఈసారి తన “బాహుబలి” చిత్రం ద్వారా భారతీయ సినీ ప్రపంచం యావత్తూ మన తెలుగు పరిశ్రమ వైపే చూసే స్థాయికి మన సినిమాను తీసుకొని వెళ్ళాడు. “ఈస్ట్మన్ కలర్” (Eastman Colour), “స్కోప్” (Scope) చిత్రాలు వచ్చిన తరువాత అత్యున్నతమైన సాంకేతికతను వాడిన పూర్తిస్థాయి జానపద చిత్రమిది. “ఆర్క మీడియా” పతాకంపై “శోభు యార్లగడ్డ”, “ప్రసాద్ దేవినేని” నిర్మాణంలో, సుమారు 250 కోట్ల ఖర్చుతో, రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ మొదలైనవారు ప్రధాన పాత్రల్లో నటించారు. దీని మొదటి భాగం “బాహుబలి – ది బెగినింగ్” పేరుతో ఈ నెల 10వ తేదీన విడుదలయ్యింది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మొట్టమొదటి ఆటలో చూసిన నా అనుభూతిని ఈ విశ్లేషణ ద్వారా పంచుకుంటున్నాను. పెద్దదిగానూ, అతిశయోక్తిగానూ అనిపిస్తే పాఠకులు మన్నించగలరు. ఇది మనసు లోతుల్లోంచి వ్రాస్తున్న సమీక్ష…
గమనిక : ఇందులో కనిపించే ఛాయాచిత్రాలు అన్నీ ప్రచార చిత్రాల నుండి సేకరించినవే.
కథ :
ప్రాణాలను తెగించి శివగామి (రమ్యకృష్ణ) కాపాడిన బిడ్డ ఓ గూడెంలో శివుడు (ప్రభాస్)గా ఎదుగుతాడు. తన గూడెంకి దగ్గరున్న కొండపై ఏమున్నదో తెలుసుకోవాలనే కుతూహలంతో చిన్నతనం నుండి అనేకసార్లు ఆ కొండ ఎక్కబోయి విఫలమవుతాడు. కానీ ఓ రోజు అవలీలగా ఎక్కేస్తాడు. అందుకు అతడిని ప్రేరేపించిన అంశం ఏమిటి? ఆ కొండపై శివుడు ఏమి చూశాడు? ఆ తరువాత అతడి జీవితం ఎలా మారిపోయింది? అన్నవి ఈ చిత్రపు కథాంశాలు.
కథనం – దర్శకత్వం :
“మగధీర” చిత్రంతోనే సాంకేతికంగా ఓ మెట్టు ఎక్కిన రాజమౌళి, “ఈగ”తో మరో రెండు మెట్లు ఎక్కాడు. కానీ ఈసారి “బాహుబలి”తో ఏకంగా యాభై మెట్లు ఎక్కేశాడు. తెలుగు సినిమా గర్వించదగ్గ తరహాలో అత్యున్నతమైన సాంకేతికతను ఈ చిత్రంలో వాడాడు.
ఇక కథనం విషయానికి వస్తే, ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇదివరకే చిత్రం చూసేసిన నాలాంటి వాళ్ళు సమీక్షలు వ్రాసి, చూడాలని వేచివున్నవారికి కథేంటో క్షుణ్ణంగా వివరించినా, “జక్కన్న” రాజమౌళి చిత్రీకరణ శైలి అతడికి మళ్ళీ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ముందుగా అతడి శైలిని తెలిపిన పలు సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం.
మొదటిది, పైన చెప్పుకున్న శివగామి సన్నివేశం. ఇక్కడ జోహారులు చెప్పాల్సిన వ్యక్తులు ఐదుగురు. దర్శకుడు “రాజమౌళి”, విజువల్ ఎఫెక్ట్స్(visual effects) “శ్రీనివాస మోహన్”, ఛాయాగ్రాహకుడు “సెంథిల్ కుమార్”, సంగీత దర్శకుడు “కీరవాణి” మరియు శివగామి “రమ్యకృష్ణ”. వీరందరూ కలిసి ఈ సన్నివేశాన్ని మనసులో ముద్ర చేశారు.
రెండొవది, శివలింగాన్ని శివుడు భుజంపై మోసుకుని వెళ్ళే సన్నివేశం. ఇక్కడ వచ్చే “శివుని ఆన” గీతం శివుడి పాత్రను అమాంతం పెంచేసింది. “స్లో మోషన్ షాట్స్”(slow motion shots)తో తీసిన ఈ ఘట్టం అటు కథనాన్ని బలపరచడమే కాకుండా ఇటు చూసే ప్రేక్షకుడిని కూడా అబ్బురపరిచింది. ఆ తరువాత “శివుడు” చేసే నాట్యం ఈ సన్నివేశాన్ని మనసుకు మరింత దగ్గర చేసింది. ఇది తప్పకుండా వెండితెరపై చూడాల్సిన ఘట్టం.
చిత్రపు స్థాయిని పెంచిన మరో ఘట్టం, శివుడు కొండెక్కే సన్నివేశం. ఇక్కడ ఛాయాగ్రహణం, విజువల్ ఎఫెక్ట్స్ అమోఘం.
ఈ సన్నివేశాన్ని ఊహించిన రాజమౌళి, తెరపైన ఆవిష్కరించిన శ్రీనివాస మోహన్ లని మనసారా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి నుండి ఓ అయిదారు నిమిషాలు తన చిత్రీకరణతో ప్రేక్షకుడిని కట్టిపడేశాడు రాజమౌళి. మొదటి సగానికి మొదటి ఆయువుపట్టు ఈ సమయమే అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
తరువాత కథనం మాములుగా సాగినా, ఒక్కసారి దాన్ని తారాస్థాయికి చేర్చింది “భల్లాలదేవుడి (రానా) విగ్రహ ప్రతిష్ఠ”. దీనికి నాంది పలికింది “నిప్పులే శ్వాసగా” అనే గీతం. ఇక్కడ “మాహిష్మతి” రాజ్యాన్ని ఏరియల్ షాట్స్(aerial shots)లో చూపించిన విధానం అద్భుతం. “సాబుసిరిల్” సెట్స్ కోసం పడిన కష్టాన్ని ఈ అయిదు నిమిషాలలో ప్రేక్షకుడి కళ్ళకు కట్టారు. విశాలమైన రాజ్యం, దాని పక్కన గుడారాలు ఇలా చెప్పుకుంటూ పోతే మాహిష్మతి ఓ అద్భుతం. ఆ తరువాత, “కీరవాణి” తన నేపథ్య సంగీతంతో కథనాన్ని ఒక్కో మెట్టు ఎక్కించారు. విగ్రహ ప్రతిష్ఠ సన్నివేశాన్ని 12 రోజులపాటు చిత్రీకరించినట్టు చిత్రబృందం తెలిపింది. ఆ కష్టం ఇందులోని ప్రతీ షాట్ లో కనపడుతుంది.
ప్రతి దర్శకుడికి తన శైలిని, ముద్రని తెలిపే కొన్ని రకాల సన్నివేశాలు ఉంటాయి. అలా, రాజమౌళి ప్రతిభకి, దృక్పథానికి నిదర్శనమే ఈ సన్నివేశం. భావోద్వేగాలను పూర్తిస్థాయిలో కెమెరాలో బంధించిన దీన్ని రాజమౌళి సంతకం కలిగిన సన్నివేశంగా చెప్పొచ్చు. “జోహార్ జక్కన్న!!”
రెండో సగం పూర్తిగా రాజమౌళి శైలిలోనికి వెళ్ళిపోయింది. శివుడు తన లక్ష్యం కోసం ప్రయత్నించే ఘట్టం అద్భుతం. ఇక్కడ “కట్టప్ప – శివుడు” మధ్యనున్న సన్నివేశం, “బాహుబలి” మొదటి భాగానికే ఉత్తమ సన్నివేశం అని ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ కట్టప్పగా సత్యరాజ్ నటన ఎంతో అభినందనీయం.
అటు అనుకున్న కథ నుండి ప్రక్కదారి పట్టకుండా,ఇటు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకునే సన్నివేశాలు రాజమౌళి తప్ప మరొకరి మదిలో మెదిలే అవకాశాలు చాలా తక్కువ అని నా అభిప్రాయం. ఈ విషయాన్ని తన గత చిత్రాలతోనే నిరూపించికున్నాడు. ఈ చిత్రంతో మళ్ళీ “శభాష్!” అనిపించుకున్నాడు.
రెండో సగానికి ప్రధాన బలమిచ్చిన పాత్ర “శివగామి”. రౌద్రం, రాజతంత్రం, న్యాయం కలగలిపిన ఈ పాత్రను రమ్యకృష్ణ పోషించిన విధానం ఆయువుపట్టుగా మారింది.
తరువాతి రెండో సగంలో ముఖ్య ఘట్టం కాలకేయులతో యుద్ధం. దీని ఆరంభం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా “జై మాహిష్మతి” అనే బాహుబలి నినాదం, యుద్ధంలో వారు పన్నే వ్యూహం అన్నీ బాగున్నాయి. కానీ కాలక్రమంగా ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. కారణాలు, నేపథ్య సంగీతం ప్రభావం చూపకపోవడం, నిడివి ఎక్కువగా ఉండడం లాంటివి. ఇక్కడ, ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా కనిపెట్టిన “కిలికిల్” భాష కూడా ఆకట్టుకోలేకపోయింది. అలాగే, కాలకేయ నాయకుడిగా “ప్రభాకర్” తక్కువ ప్రభావమే చూపించాడు.
ఇలా తగ్గిన కథనాన్ని చివరి సన్నివేశంతో మళ్ళీ పెంచేశాడు రాజమౌళి. కథాపరంగా, ఇది చాలా ముఖ్యమైన అంశం. కానీ తరువాతి కథ కోసం మరో సంవత్సరం ఆగల్సిరావడంతో చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇలాంటి ముగింపుని భారతీయ సినిమాలో చూడడం అరుదు, తెలుగు సినిమాలో చూడడం ప్రధమం. బహుశా అందుకే దీన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారేమో అనిపించింది. కానీ మొదటి భాగానికి ఇంతకంటే మంచి ముగింపు, రెండో భాగానికి ఇంతకంటే మంచి ఆరంభం దొరకదు అనే విషయాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటే మంచిది.
పాత్రలు – నటనలు :
స్థాయికి మించిన చిత్రం చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని అక్కడికి చేరవేసే నటులు కూడా ఎంతో అవసరం. ఈ విషయంలోనూ రాజమౌళి విజయం సాధించాడు. తను సృష్టించిన పాత్రలను తను ఎంచుకున్న నటులు మరో స్థాయికి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు వారి గురించి మాట్లాడుకుందాం…
శివుడు, బాహుబలి – ప్రభాస్ :
రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రపు మొదటి భాగానికి ప్రధాన పాత్ర “శివుడు”. ప్రచార చిత్రాల్లో చిత్రబృందం పేర్కొన్నట్టుగా, ఇది శక్తివంతమైనది, అలసిపోనిది కూడా. తన లక్ష్యం కోసం ఏదైనా చేసే ఈ పాత్ర స్వభావాన్ని “శివుని ఆన”, “ధీవర” గీతాల్లో స్పష్టంగా కనబరిచాడు ప్రభాస్. ఇక బాహుబలి పాత్రలోనూ ఒదిగిపోయి నటించాడు, శివుడి పాత్రకు ఏమాత్రం పోలని ఆహార్యాన్ని కనబరిచాడు.
ప్రభాస్ లాంటి నటుడు ఓ పాత్రని మోస్తున్నప్పుడు, రచయితలకు, దర్శకులకు వారి మదిలో మెదిలే ఊహలను, నిజాలని ప్రేక్షకుడిని నమ్మించే అవకాశం లభిస్తుంది. దీనికి ఉదాహరణే, “బల్గేరియా”లో తీసిన దృశ్యాలు. ఇక్కడ ప్రభాస్ తప్ప వేరే మనిషిని ఊహించుకోవడం అతికష్టం. కాలకేయులతో యుద్ధంలోని పలు షాట్స్ కేవలం తనపైనే తీయగలరు అని నిరూపించాడు ప్రభాస్. అతడు పడ్డ కష్టం అడుగడుగునా ఈ చిత్రంలో కనిపిస్తుంది.
భల్లాలదేవుడు – రానా దగ్గుబాటి :
నాయకుడి బలం ఎప్పుడూ ప్రతినాయకుడి మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతినాయకుడు ఎంత బలవంతుడైతే నాయకుడు అంత బలవంతుడుగా ఎదగగలడు. కనుకే, ప్రభాస్ లాంటి నాయకుడికి రానా లాంటి ప్రతినాయకుడే సరైనవాడు. ఈ భాగంలో రానా నటనకి పెద్దగా ఆస్కారం లేదు. బహుశా రెండో భాగంలో ఉండొచ్చు. కానీ దున్నతో పోరాడే సన్నివేశంలో రానాను చూపించిన విధానం చాలా బాగుంది.
దేవసేన – అనుష్క :
ఈ పాత్ర చేసినందుకు మొదట అనుష్కని మెచ్చుకోవాలి. అందంగా కనిపించే ఆస్కారం ఏమాత్రం లేని పాత్ర ఇది. కానీ తన నటనతో అనుష్క ఎంతగానో మెప్పించింది. ఇందుకు ఉదాహరణే, మొదటి సగంలో “దేవసేన – కట్టప్ప” మధ్యనున్న సన్నివేశం. ఇందులో ఒక్కసారిగా అనుష్క ముఖాన్ని చూపించిన షాట్ లో ఆమె ముఖకవళికలు అద్భుతం. అలాగే విగ్రహ ప్రతిష్ఠ సన్నివేశంలోనూ ఆమె నటన ఆకట్టుకుంది.
అవంతిక – తమన్నా :
ఒక లక్ష్యం కోసం పని చేసే ఈ పాత్ర యొక్క గమనం శివుడి పాత్ర వల్ల హఠాత్తుగా మారిపోతుంది. దాంతో దీనికి పెద్ద ప్రాముఖ్యత లభించలేదు. కానీ ఉన్నంతవరకు తమన్నా మంచి నటనే కనబరిచింది. “ఈ కన్నీళ్లు పిరికితనానికి ప్రతీకలు కావు” అనే చెప్పే సన్నివేశంలో చక్కగా నటించింది తమన్నా.
శివగామి – రమ్యకృష్ణ :
బాహుబలి మొదటి భాగంలో ఎక్కువగా అభినందనలు తెలపాల్సిన పాత్ర ఏదైనా ఉందంటే అది “శివగామి”. ఈ పాత్రకి అంత గౌరవం దీన్ని పోషించిన రమ్యకృష్ణ వల్లే లభించింది. రౌద్రం, రాజతంత్రం, న్యాయం కలబోసిన పాత్రకు రమ్యకృష్ణని ఎంచుకున్నందుకు రాజమౌళిని కూడా అభినందించాలి. ముఖ్యంగా, రెండో సగంలో ఈ పాత్రపై ప్రేక్షకుడికి ఎంతో గౌరవం కలుగుతుంది. ప్రేక్షకుడికి ఈ చిత్రం గుర్తున్నంత కాలం ఈ పాత్ర కూడా గుర్తుండిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
కట్టప్ప – సత్యరాజ్ :
ఇది ఎంతో ముఖ్యమైన పాత్ర. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసినందువల్ల ఇరు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమైన సత్యరాజ్ ని ఎంపిక చేసుకోవడం మంచి అభిప్రాయమే అనిపించింది. ఈయనకి గొంతుకని అరువిచ్చిన రవిశంకర్ ఈ పాత్రని ప్రేక్షకుడికి మరింత దగ్గర చేశాడు. ప్రచార చిత్రాల్లో చెప్పిన విధంగా ఈ పాత్ర రాజ్యపు కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుంది. ఆ పరిమితుల్లో, సత్యరాజ్ పాత్రని పోషించిన విధానం చాలా బాగుంది. దీనికి ఉదాహరణ రెండో సగంలో కనబడుతుంది.
బిజ్జలదేవుడు – నాజర్ :
శరీరంలోనే కాదు, మనసులోనూ కుళ్ళు, కుతంత్రాలు అనే అవిటి లక్షణాలు కలిగిన పాత్రకు ఈ నాజర్ సరైన ఎంపిక. కానీ కథాపరంగా, ఈ భాగంలో ఆయనకు ఎక్కువ నటన కనబరిచే అవకాశం లేదు. బహుశా రెండో భాగంలో ఈ పాత్ర మెప్పించవచ్చు.
కాలకేయుడు – ప్రభాకర్ :
ఈ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధని తీసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. దీనికోసం “కిలికిల్” అనే కొత్త భాషని రూపొందించారు. కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. పాత్రలో క్రూరత్వం కూడా ఎక్కువగా లేదు. కానీ దీన్ని పోషించిన ప్రభాకర్ కష్టం మాత్రం బాగా కనపడింది.
అస్లాం ఖాన్ – సుదీప్ :
ఇది అతిథి పాత్రే అయినప్పటికీ, కట్టప్ప పాత్ర ఔన్నత్యాన్ని(eminence) బాగా పెంచింది.
సంగీతం :
రాజమౌళి చిత్రాలకు కీరవాణి ఎంతటి బలాన్నిస్తారో వారిద్దరూ ఇప్పటివరకు చేసిన చిత్రాలే చెప్తాయి. ఈ చిత్రంలోనూ కీరవాణి తన సంగీతంతో రాజమౌళికి ఎంతగానో సహకరించారు. కొన్ని మచ్చుతునకలు ఇవే,
1) మొదట్లో వచ్చే శివగామి సన్నివేశంలోని నేపథ్య సంగీతం.
2) “నిప్పులే శ్వాసగా” గీతం తరువాత వచ్చే నేపథ్య సంగీతం.
3) విగ్రహ ప్రతిష్ఠ మరియు విరామపు సన్నివేశంలోని నేపథ్య సంగీతం.
4) కట్టప్ప – శివుడు మధ్యనున్న సన్నివేశంలోని నేపథ్య సంగీతం.
గీతాల చిత్ర్రీకరణ :
1) శివుని ఆన. పైన చెప్పుకున్నట్టుగా ఇది పాత్ర ఔన్నత్యాన్ని పెంచిన గీతం. ఇందులోని “స్లో మోషన్ షాట్స్” అద్భుతం.
2) ధీవర. ఈ చిత్రం మొత్తానికి ఇదే ఉత్తమ గీతం. ముఖ్యంగా, ఈ గీతం చివర్లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ అమోఘం.
3) పచ్చ బొట్టేసిన. ఈ గీతంలో రాజమౌళిపై తన గురువు “రాఘవేంద్రరావు” ప్రభావం బాగా కనిపించింది. ఇందులో వేసిన సెట్స్ చాలా బాగున్నాయి.
4) నిప్పులే శ్వాసగా. కథనం స్థాయిని మరోసారి పెంచిన గీతం ఇది. “దేవసేన” పాత్ర పడే వేదనను, మాహిష్మతి రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు ఈ గీతంలో.
5) మమతల తల్లి. ఈ గీతం “శివగామి” పాత్ర ఔన్నత్యాన్ని అమాంతం పెంచేసింది. ఇందులోని పలు షాట్స్ రాజమౌళి సంతకం కలిగినవి.
ఛాయాగ్రహణం :
ఈ చిత్రానికి రాజమౌళి తరువాత మరో ఊతం సెంథిల్ కుమార్. అతడి ఛాయాగ్రహణం అద్భుతం. “మాహిష్మతి” రాజ్యాన్ని చూపించిన ప్రతి ఏరియల్ షాట్ (aerial shot) అద్భుతం. నాకు నచ్చిన మరిన్ని షాట్స్ ఇవే,
1) శివగామి “మహేంద్ర బాహుబలి”ని రక్షించే సన్నివేశం.
2) శివలింగాన్ని మోసే శివుడి నీడను నీటిలో చూపించిన షాట్.
3) భల్లాలదేవుడు దున్నతో పోరాడే సన్నివేశం.
4) శివుడు అవంతికతో “నీ ఆశయం ఇక నుండి నాది” అని చెప్పే సన్నివేశం.
5) కట్టప్ప – శివుడు మధ్యనున్న సన్నివేశం.
6) రెండో సగంలో కాలకేయులతో చేసే యుద్ధంలో పలు షాట్స్.
మరిన్ని ప్రత్యేకతలు :
విడివిడిగా ప్రతి ఒక్క విభాగం గురించి చెప్పుకుంటూ పోతే, ఒక్క సమీక్ష సరిపోదు. అందుకే మిగతావారి గురించి ఒక్కో వాక్యంలో చెబుతున్నాను.
1) నిర్మాణ విలువలు. దర్శకుడి కష్టం ఎంతున్నా, నిర్మాతలు ముందుకు రాకపోతే ఎటువంటి చిత్రమైనా సాధ్యపడదు. ఎంతో ధైర్యంగా, దర్శకుడి మీద నమ్మకంతో, అంత ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన శోభు, ప్రసాద్ లను మొదట అభినందించాలి.
2) సాబుసిరిల్ కళా దర్శకత్వం(Art Direction). మాహిష్మతిని నిర్మించడానికి ఈయన పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్రం కోసం వేసిన ప్రతి ఒక్క సెట్ అద్భుతం.
3) శ్రీనివాస మోహన్ విజువల్ ఎఫెక్ట్స్(Visual Effects). రాజమౌళి ఊహలను యథావిధిగా తెరపై ఆవిష్కరించారు. చిత్రం మొత్తం “గ్రీన్ మేట్”(Green Mat) సాయంతో చిత్రించినా, అన్ని సన్నివేశాలూ సహజంగానే అనిపించాయి.
4) పీటర్ హేన్స్ పోరాటాలు. ఇలాంటి చిత్రాల్లో ప్రేక్షకుడిని అలరించగల మరో అంశం పోరాటాలు. ఆ విషయంలో పీటర్ హేన్స్ విజయం సాధించాడు. కాలకేయ యుద్ధంలో ఇతడి కష్టం ప్రస్ఫుటంగా కనిపించింది.
5) దుస్తులు(Costumes). రమా రాజమౌళి, ప్రశాంతి రూపొదించిన దుస్తులు ఆయా పాత్రలకు, కథ జరిగే కాలానికి సరిగ్గా సరిపోయాయి.
6) భాష. చారిత్రాత్మక చిత్రాల్లో గ్రాంధిక భాషని వాడడం సహజం. కానీ రాజమౌళి తన “మగధీర” లాగే ఆ పోకడకి దూరంగా పూర్తిగా ఇప్పటి వాడుక భాషనే ఉపయోగించారు.
7) కిలికిల్ (Kilkil) భాష. కేవలం ఒక్క పాత్ర కోసం ఓ కొత్త భాషని రూపొందించడం భారతీయ సినీ చరిత్రలోనే మొదటిసారి. దిగ్గజ తమిళ రచయిత వైరముత్తు కుమారుడు “మదన్ కర్కి” దీని రూపకర్త.
8) ఆయుధాలు (Weapons). ఈ చిత్రంలో దాదాపు ఇరవై వేల ఆయుధాలను రూపొందించారు. అన్నింటిలోకి, భల్లాలదేవుడు వాడిన ఆయుధాలు ఆకట్టుకున్నాయి.
క(అ)నిపించిన బలహీనతలు :
1) ప్రేక్షకుడి అంచనాలు. ఇదే ప్రధానమైన బలహీనత. ప్రేక్షకులు పెంచుకున్న విపరీతమైన అంచనాలను చిత్రం అందుకుందో లేదో కొన్ని రోజుల తరువాత తెలుస్తుంది.
2) నెమ్మదిగా సాగిన మొదటి సగపు కథనం.
3) పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ – తమన్నాల మధ్య సన్నివేశాలు.
3) కొద్దిసేపటికే ప్రభావాన్ని కోల్పోయి, పెద్దదిగా అనిపించిన యుద్ధ ఘట్టం.
4) ఎక్కువ ప్రభావం చూపలేకపోయిన “కిలికిల్” భాష.
ఈ చిత్రం నేర్పిన పాఠాలు :
1) సహనం(Patience). ఒక పెద్ద చిత్రం చేయాలనుకున్నప్పుడు, ఎంతో ఓర్పు కావాలి. అది మొదట దర్శకుడికే ఉండాలి. ముఖ్యంగా, ఎంతోమంది చేత పని చేయించగలగాలి. ఆ విషయంలో రాజమౌళికి జోహార్లు.
2) ఉత్సాహం(Energy). ఇంత పెద్ద చిత్రాలు చాలా సమయం తీసుకుంటాయి. అన్ని రోజులూ ఉత్సాహంగా పని చేయడం, మిగతా విభాగాల్లో ఉత్సాహం నింపడం ఎంతో ముఖ్యం.
3) ఎవరి ఘనత వారిదే, ఎవరి గెలుపు వారికే. చలనచిత్రం అనేకమంది సమిష్టి కృషితోనే సాధ్యం. కనుక ఎవరి కృషి ఫలితాన్ని వారికే చెందేలా చేయాలి.
4) కృషితో నాస్తి దుర్భిక్షం.
– యశ్వంత్ ఆలూరు
Click here for English review on this movie…
nice explanation about this movie..all the best
LikeLiked by 1 person
The only defect i feel in this movie is , rajamouli planned story for 5hs and divided into two.. but not planned as two parts.
LikeLiked by 1 person
Kiikili language unna scenes ki sub titles vaadi unte bagundedi, effect undedi
cinema ki minus ante sivudu/avantika love track, chinnappatnunch oka dream laga hero ki und aa konda ekkalane pointn ni just tamanna ni oohinchukuni ekkinattu kaakunda
nijamga aame edo fight lo debbalu tini padipotune appudu prabhas aa waterfalls daati aameni kaapadinattu choopinchi unte bagundedi, appude aame ki love ani direct ga cheppakunda aame ni valla group daggariki cherchi asalu matter telusukuni ,devasena ni nenu teesukostanu ninnu love chestunnanu ani cheppi unte love track ekkadiko elledi, 2 parts pettina daniki reasonable ga undedi
war episode nacchaleda ??? chaala bits manchi kick ni icchayi naaku aite, movie pai janalaki unna hype ki aa episode satisfy chesindi
LikeLiked by 1 person
@aditya Good comment bro… 🙂
Yes, I felt war has lost its impact while reaching its end!!
LikeLike
Pingback: Bahubali – The Beginning (2015) | Film Criticism