శ్రీమంతుడు (2015)

Srimanthudu Mass Poster

సినిమాకు సామాజిక బాధ్యత ఉంది. సమాజానికి ఓ విషయాన్ని సినిమా చెప్పినంత బలంగా, సులువుగా మరే మాధ్యమం చెప్పలేదు. కానీ చివరికి సినిమా కూడా ఓ వ్యాపారమే. కనుక విషయాన్ని వ్యాపార సూత్రాలతో కలిపి చెప్తే అన్ని విధాలా లాభమని ఓ నమ్మకం. అలాంటి ప్రయత్నమే “శ్రీమంతుడు” చిత్రం. మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి “కొరటాల శివ” దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించారు. దీని ద్వారా మహేష్ బాబు కూడా నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు…

కథ :

వేలకోట్లకు అధిపతైన రవికాంత్ (జగపతిబాబు) కుమారుడు అయినప్పటికీ, సాదాసీదాగా బ్రతికే మనిషి హర్ష (మహేష్ బాబు). చారుశీల (శ్రుతిహాసన్) పరిచయం అతడి జీవితంలో సంతోషాన్ని నింపడంతో పాటు ఓ నిజాన్ని కూడా తెలుపుతుంది. అదేంటి? “దేవరకోట” అనే గ్రామాన్ని దత్తత తీసుకోవాలని హర్ష ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఆ గ్రామానికి ఎటువంటి మేలు చేశాడు అనేవి ఈ చిత్రపు కథాంశాలు.

కథనం :

దర్శక రచయిత కొరటాల శివ వ్రాసుకున్న మూలాంశం చాలా మంచిది. మన అవసరాలకు మించిన డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు దానితో మరొకరిని ఆదుకోవాలి అనే చక్కటి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పారు. అందుకు శివని, ఇలాంటి కథాంశాన్ని భుజాలపై వేసుకున్న మహేష్ బాబుని ముందుగా అభినందించాలి.

మొదట్లో కథానాయకుడి పరిచయం అంతా మామూలే. తరువాత మెల్లగా అతడి పాత్రని, అతడి కుటుంబాన్ని పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఇక్కడ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, హర్ష తన తల్లి (సుకన్య) పాత్రని “అమ్మ” అని సంబోధిస్తూ, తండ్రితో మాత్రం రైలులో తోటి ప్రయాణికుడితో మాట్లాడినట్టు మాట్లాడడం జీర్ణించుకోవడానికి కష్టంగా అనిపించింది. ఇద్దరూ భిన్న ద్రువాలు (opposite poles) కనుక అలాగే ఉంటారేమో అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తరువాత చారుశీల, దేవరకోట గ్రామం, అందులో నారాయణరావు (రాజేంద్రప్రసాద్) పరిచయాలూ మామూలే. కానీ కథానాయకుడు మహేష్ కనుక అతడి శైలిలోనే అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దీనికి మొదటి ఉదాహరణే, మంత్రి వెంకటరత్నం (ముకేష్ రుషి)తో హర్ష మాట్లాడే సన్నివేశం. ఇది మహేష్ నటనాశైలికి అణువుగా ఉన్నది. తరువాత వచ్చే “జత కలిసే” గీతం పెద్దగా వినదగ్గది కాకపోయినా, చిత్రీకరణ బాగుంది. నాయికానాయికల స్నేహమే కాకుండా, మహేష్, శ్రుతిల జంట కూడా బాగుందనిపించింది.

దర్శకుడు శివ మహేష్ ని చాలా సున్నితంగా వాడుకున్నాడు. “శ్రీమంతుడు” అనే చిత్రం పేరుకి న్యాయం చేసే విధంగా అతడి పాత్రలో పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అది పోరాటాల్లోనూ స్పష్టంగా కనిపించింది. ఉదాహరణే, పెళ్ళి మండపంలోని పోరాటం. హర్ష (మహేష్) ఆహార్యానికి సరిగ్గా సరిపోయిన ఈ పోరాటాన్ని చిత్రించినందుకు “అనిల్ అరసు”ని అభినందించాలి. ఆ తరువాత “చారుశీల” గీతం వెండితెరపై చాలా బాగా వచ్చింది. ఇందులో “ప్రకాష్” కళా దర్శకత్వానికి (Art Direction) మార్కులు వేయాలి. అలాగే మహేష్ ని ఎంతో అందంగా చూపించిన చాయాగ్రాహకుడు “మది”ని కూడా మెచ్చుకోవాలి. అలా, మొత్తానికి మొదటి సగం కాస్త బోరు కొట్టినప్పటికీ, మహేష్ అందం, ఆహార్యంతో నెట్టుకొచ్చాడు దర్శకుడు.

ఇక్కడే ఒక బలహీనత కూడా కనిపించింది. దేవరకోటకి బయలుదేరిన హర్ష సైకిల్ పై వెళ్ళే షాట్స్ గ్రాఫిక్స్ సాయంతో ఎందుకు చూపించాల్సి వచ్చిందో అర్థం కాలేదు. బహుశా, మహేష్ లాంటి అందగాడిని ఒంటరిగా సైకిల్ పై రోడ్డుమీదకు వదలడం సురక్షితం కాదనుకున్నాడేమో దర్శకుడు. ఏదైమైనా, ఆ గ్రాఫిక్స్ లో నాణ్యత ఏమాత్రం లేదు.

రెండో సగంలో కథనం అసలు కథలోనికి వెళ్ళింది. “జాగో జాగోరే జాగో” అనే గీతం చిత్రానికి ఆయువుపట్టు. “వెతికా నన్ను నేను, నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి” అనే “రామజోగయ్యశాస్త్రి” గారి సాహిత్యానికి తెరపై న్యాయం చేశాడు దర్శకుడు. ఆ తరువాత పల్లెటూరు వదిలి పట్నం వెళ్లిపోవాలనుకున్న నారాయణరావు తమ్ముడి కుటుంబాన్ని ఆపే సన్నివేశంలో సంభాషణలు బాగున్నాయి. ఇక్కడ మరియు దీనికి ముందు ఏడిద శ్రీరాం, రాజేంద్రప్రసాద్ మధ్య పొలంలో వచ్చే సన్నివేశంలో మాత్రమే రాజేంద్రప్రసాద్ గారి పాత్రకు గౌరవం దక్కిందనిపించింది.

హర్ష తన తండ్రికి సంబంధించిన ముఖ్య విషయం తెలుసుకున్నాక ఆయనకు ఫోను చేస్తాడు. నిజానికి “తండ్రికొడుకులవి భిన్న మనస్తత్వాలు (Different Mentalities)” అని వ్రాసుకొని, ఈ సన్నివేశంపై దృష్టి సారించాల్సింది. కానీ అలా కాకుండా దీన్ని ఓ మామూలు సన్నివేశంగా మలిచాడు దర్శకుడు. ఓ సగటు ప్రేక్షకుడిగా చూస్తే, కనీసం ఇక్కడైనా హర్ష తన తండ్రిని “నాన్న” అని పిలుస్తాడేమో అన్న ఆశ కలిగింది. కానీ “తరువాత చేస్తాన”ని హర్ష ఫోను కట్టేయడంతో, బహుశా తరువాత అనుకున్నది జరుగుతుందేమోనన్న చిరు ఆశతో మిగిలిపోవాల్సి వచ్చింది.

ఈ చిత్రానికి మరో ముఖ్య ఘట్టం “మామిడి తోటలో పోరాటం”. ఒక శ్రీమంతుడు(కథానాయకుడు) ఏ హంగులు లేకుండా ప్రతినాయకుల దగ్గరికి సైకిల్ పై రావడం, అతడి వెనుక ప్రతినాయకుల మనుషులు వచ్చే షాట్, ఆ తరువాత వారి మధ్య సంభాషణ మరియు పోరాటం ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ చిత్రానికి ఇదే ఉత్తమ ఘట్టమని చెప్పొచ్చు. ఓ సందేశాత్మక చిత్రంలో ఇలాంటి వాణిజ్య సూత్రాన్ని సరైన సమయంలో ప్రయోగించినందుకు దర్శకుడిని అభినందించడంతో పాటు, అనిల్ అరసు, మది మరియు మహేష్ లకు కూడా మార్కులు వేయాలి.

పైన చెప్పుకున్న ఘట్టమే మాట్లాడుకోదగ్గ చివరి విషయం. తరువాత కథనం బాగా నెమ్మదించింది. చెరువు దగ్గరి పోరాటంలోనే ప్రతినాయకులను అంతం చేసి ఆ తరువాత తండ్రికొడుకుల మధ్య సంభాషణతో చిత్రాన్ని ముగించి ఉంటే ఈ చిత్రంపై గౌరవం అలాగే నిలబడిపోయేది. కానీ మళ్ళీ కథనాన్ని కొనసాగించి బాగా బోరు కొట్టించేశాడు దర్శకుడు. తండ్రితో సంభాషణలో మహేష్ నటన ఎంత బాగున్నా, నెమ్మదించిన కథనం దానిపై దృష్టి సారించేలా చేయలేకపోయింది.

హర్ష తన తండ్రిని ఒక్కసారైనా “నాన్న” అని పిలుస్తాడన్న నా ఆశను అడియాశను చేస్తూ చిత్రం ముగిసింది.

ఇక పాత్రలు, నటనల విషయానికి వస్తే, చిత్రమంతా హర్ష పాత్రే ఎక్కువగా కనిపిస్తుంది. మహేష్ దాన్ని పోషించిన విధానం అద్భుతం. ఆ పాత్రకి తను తప్ప మరో కథానాయకుడు న్యాయం చేయలేడన్న రీతిలో నటించాడు. దీనికి పలు ఉదాహరణలున్నాయి. శ్రుతిహాసన్ పోషించిన పాత్ర కూడా చెప్పుకోదగ్గదే. చివర్లో ఆసుపత్రిలోని సన్నివేశంలో బాగా నటించింది. నృత్యాలు కూడా బాగా చేసింది. రవికాంత్ పాత్ర ఎంతో కీలకమైనది కానీ జగపతిబాబు లాంటి నటుడు దాన్ని పోషించినప్పుడు దాని నుండి ప్రేక్షకుడు ఎంతోకొంత ఆశిస్తాడు. కానీ దర్శకుడు కథ, కథనాలను కేవలం హర్ష పాత్ర చుట్టూ తిప్పి జగపతికి నటించే అవకాశమే లేకుండా చేశాడు. ఇదే పరిస్థితి రాజేంద్రప్రసాద్ గారి పాత్రది కూడా. దానికి ఆ స్థాయి నటుడు అవసరం లేదనిపించింది. రాహుల్ రవీంద్రన్ పాత్రకి కాస్త ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మహేష్ ధాటికి అది కొట్టుకొనిపోయింది. సుకన్య గారి పాత్ర సరేసరి. కేవలం చివర్లో ఒక్క సంభాషణ కోసమే అన్నట్టుగా ఉందే తప్ప తల్లీకొడుకుల మధ్య ఒక్క చెప్పుకోదగ్గ సన్నివేశం కూడా లేదు. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించగలిగినా, అలీ పూర్తిగా వ్యర్థమైపోయాడు.

ప్రతినాయకుల గురించి కాస్త మాట్లాడుకోవాలి. వెంకటరత్నం (ముకేష్ రుషి), శశి (సంపత్)లవి పురాతన పోకడ (trendy) పాత్రలు. అంటే, మన తెలుగు సినిమాల్లో పోషించే నటులు మారుతున్నారే తప్ప పాత్రలు కాదు. ఒకప్పటి సోనుసూద్ స్థానంలో సంపత్, కోట గారి స్థానంలో ముకేష్ రుషి వచ్చారే తప్ప పాత్రల స్వభావాలు మాత్రం మారలేదు.

ప్రత్యేకతలు :

  1. మహేష్. పైన పలుమార్లు చెప్పుకున్నప్పటికీ, మళ్ళీ మళ్ళీ చెప్పక తప్పదు. ఎందుకంటే మహేష్ నటన, అందం మరియు దుస్తులు, ఆహార్యం ఈ చిత్రానికి అంత ముఖ్యం కనుక.
  2. మది ఛాయాగ్రహణం. ఈ చిత్రానికి ప్రధాన ఊతం. చిత్రపు నాణ్యతకు, మహేష్ అందానికి ఇదే కారణం.
  3. ప్రకాష్ కళాదర్శకత్వం. చిత్రానికి కావాల్సిన సెట్స్ అన్ని బాగా వేశారు. “చారుశీల” మరియు “దిమ్మతిరిగే” గీతాల్లోని కళాదర్శకత్వం చెప్పుకోదగ్గది.
  4. నిర్మాణ విలువలు (Production Values). మొదటి చిత్రమే అయినప్పటికీ నిర్మాతలు నవీన్, మోహన, రవిశంకర్ ఈ చిత్రాన్ని మేటిగా మలిచేందుకు కావాల్సిన ఖర్చు పెట్టడంలో వెనుకాడలేదు.
  5. అనిల్ అరసు పోరాటాలు. పైన చెప్పుకున్నవి ఉదాహరణలు.
  6. అక్కడక్కడ బాగున్న సంభాషణలు.

బలహీనతలు :

  1. వ్యర్థమైపోయిన నటులు, వారి పాత్రలు.
  2. పెద్దగా పండని హాస్యం. ఈ చిత్రంలో దానికి చోటు అనవసరం.
  3. నిడివి (Runtime). నెమ్మదించిన కథనం మూలంగా ఈ చిత్రం 163 నిమిషాల నిడివితో నడిచి కాస్త ఇబ్బందిపెట్టింది.
  4. అవసరం లేని, నాణ్యత లేని గ్రాఫిక్స్ వాడకం

ఈ చిత్రం నేర్పిన పాఠాలు :

  1. కథనం మొత్తం ఒక్క పాత్ర చుట్టు మాత్రమే తిరగాలి అన్నప్పుడు మిగతా పాత్రలకు పెద్ద నటులను ఎంచుకోకూడదు. ఒకవేళ ఎంచుకుంటే, వారికి న్యాయం చేయకుండా వదలకూడదు.
  2. (రీళ్ళ పరిభాషలో) చిత్రానికి చివరి రెండు రీళ్ళు ఎంతో కీలకం. ప్రేక్షకుడి మనసుపై ప్రభావం చూపే వాటిని జాగ్రత్తగా మలచాలి.

– యశ్వంత్ ఆలూరు

Click here for English Review on this film…

2 thoughts on “శ్రీమంతుడు (2015)

  1. Chaala Nacchindi naaku movie :), mahehs performance siva direction superb .pace through out slow ga undi movie dhi, naaku adi pedda problem emi kaadu nachite 🙂 Father-Son scenes anni superb, but last lo jaggu marina taruvata ooriki athanu kooda vacchi atani meeda padina nindaki justification type lo oori vallatho scene petti unte bagundedi, asalu Hospital daggare RP ki manchi scene petti Jaggu ni convince chesinattu, already interval lo reporters scene link undi kabatti aa proofs tho villains ni arrest cheinchinattu choopiste bagundedi, ento routine fight tho end chesadu .

    Trivi,Vaitla taruvata ordinary or blink n miss roles ki kooda notable actors ni pettadam koratala shiva chestunnatu unnadu, but RP n JB iddaru aa roles ki set ayyaru, esp JB Ki pedda scope ledu kani RP Jeevinchadu, but sukanya and subbaraju etc la ki anta scope ledu ,subbaraju character etakaramga bhale pelindi aa comed 😀

    Mahesh andi ane mannerism baaga nacchindi 🙂

    Liked by 1 person

  2. Pingback: Srimanthudu (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s