సినిమాకి కథ ఎంత ప్రాణమో కథనం మరియు దర్శకత్వం కూడా అంతే ముఖ్యం. ఏ కథకు ఎలాంటి దర్శకుడు న్యాయం చేయగలడో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ లెక్కలు తప్పిన చిత్రం “కిక్ 2”. 2009లో వచ్చిన “కిక్” తరహా పాత్రను కొనసాగిస్తూ, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా అప్పటి కిక్ దర్శకుడు “సురేందర్రెడ్డి” దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి నటుడు “కళ్యాణ్ రామ్” నిర్మాత. దీని విషయాల్లోకి వెళ్తే…
కథ :
“కిక్” కోసం తన జీవితాన్ని గడిపిన “కిక్” కళ్యాణ్ (రవితేజ) కొడుకు అయిన రాబిన్ హుడ్ (రవితేజ) తన జీవితం ఎప్పుడూ “కంఫర్ట్”గా ఉండాలని కోరుకుంటాడు. ఆ జీవిత సూత్రం అతడితో ఎలాంటి ప్రయాణం చేయించిందో, అదే ఈ చిత్ర కథాంశం.
కథనం :
నేను వ్రాసింది ఒక్క వాక్యమే అయినప్పటికీ, ఈ చిత్రపు మూలకథలో ఎంతో భావోద్వేగం ఉంది. అలాంటి కథను హాస్యం తప్ప భావోద్వేగాలను సరిగ్గా పండించలేని సురేందర్రెడ్డి లాంటి దర్శకుడి చేతిలో పెట్టడం కథకుడు వక్కంతం వంశీ చేసిన పెద్ద తప్పు. అతడిని నమ్మి కొన్ని కోట్లు ఖర్చుపెట్టడం నిర్మాత కళ్యాణ్ రామ్ చసిన తప్పు. ఈ కథకు “కిక్ 2” అనే పేరు పెట్టడం కూడా మరో తప్పు. బహుశా ఈ పేరు ప్రేక్షకులను థియేటర్ల వరకు వచ్చేలా చేసిందేమో కానీ తెరపై బొమ్మ పడిన తరువాత మాత్రం ఆ “కిక్” ఇవ్వలేకపోయిందనే చెప్పాలి.
ఈ చిత్రం ఆరంభం మునుపటి “కిక్” శైలిలోనే సాగి పెద్దగా ఆకట్టుకోలేదు. రాబిన్ పాత్ర పరిచయం ప్రభావితంగానూ లేదు. ఎదో అలా సాగిపోతున్న కథనంలో పండిట్ రవితేజ (బ్రహ్మానందం) పాత్ర ప్రవేశం ఒకట్రెండు షాట్స్ లో తప్ప పెద్దగా నవ్వించలేదు. ఆ తరువాత ప్రత్యక్షం అయ్యే పలు పాత్రలు కూడా బోరు కొట్టించేశాయి. ఉత్తమ ఉదాహరణ “పోసాని కృష్ణమురళి” పాత్ర. దీనితో నవ్వించబోయి, గురి తప్పి సహనాన్ని పరీక్షించేశాడు దర్శకుడు. కానీ రాబిన్ పాత్ర ద్వారా “ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాలి, అప్పుడే ఎవరికీ ఏ సమస్య ఉండదు” అనే చక్కటి నీతి మాత్రం బాగా చెప్పాడు. “మమ్మీ” గీతాన్ని విదేశాల్లో చిత్రించాల్సిన అవసరం ఏంటో అసలు అర్థం కాలేదు.
ఇలా సాగిపోతున్న కథనంలో ఒక మంచి ఉపశమనం “నువ్వే నువ్వే” గీతం. ఇది అటు వినసొంపుగానూ, ఇటు కనువిందుగానూ ఉంటూ అలరించింది. ఈ గీతంలోని ప్రదేశాలు, ఛాయాగ్రహణం బాగా ఆకట్టుకున్నాయి. తరువాత కథ అసలు ప్రదేశమైన “విలాస్ పూర్”కి వెళ్ళాక తనికెళ్ళ భరణి పాత్ర ద్వారా కాస్త భావోద్వేగం బాగానే పండింది. ఇది మరియు గ్రామం మొత్తం దీపాలు వెలిగించి పూజలు చేసే సన్నివేశాలు “తమన్” నేపథ్య సంగీతం వల్ల పండాయి. విరామం సన్నివేశంలోనూ ప్రభావితమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు తమన్.
ఇక కథనం పూర్తిగా అసలు కథలోకి వెళ్ళిన రెండో సగంలో కథానాయకుడి పాత్రని బాగా నెలకొల్పాడు కథకుడు వంశీ. కానీ సురేందర్ మాత్రం తన కథనంతో దానికి న్యాయం చేయలేకపోయాడు. తమన్ ఎంతో కష్టపడి స్వరపరిచిన “జండాపై కపిరాజు” గీతాన్ని గొప్పగా ఊహించుకున్న ప్రేక్షకుడికి నిరాశే మిగిల్చాడు. ఊరంతా ఓ లక్ష్యం కోసం పని చేసే క్రమంలో, ప్రతినాయకుల అరాచకానికి బలైపోయిన ఓ అమాయకురాలి పాత్ర తాలూకు ముఖ్యమైన సన్నివేశం సురేందర్రెడ్డి దర్శకత్వం ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయలేదని స్పష్టంగా తెలిపింది.
మితిమీరిన తర్కాలకు (logics), అసందర్భ గీతాలకు సురేందర్రెడ్డి పెట్టింది పేరు. వాటితోనే చిత్రాన్ని ముగించాడు. ఇన్ని అవలక్షణాలున్నా, రాబిన్ పాత్రని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. బహుశా దర్శక-రచయితలకు ఇక్కడ కొన్ని మార్కులు వేయచ్చేమో.
ఇక నటనల విషయానికి వస్తే, రాబిన్ హుడ్ పాత్ర చిత్రణ బాగున్నప్పటికీ దాన్ని రవితేజ పోషించిన విధానం మాత్రం మాములుగానే ఉంది. బహుశా కొత్తగా నటించే అవకాశం ఇక రవితేజకు దక్కదేమో అనిపిస్తుంది. ముఖంలో వయసు ఎంత కనిపిస్తున్నా, శరీరంలో మాత్రం పూర్వపు శక్తినే నింపుకున్నాడు. కథానాయిక “రకుల్ ప్రీత్ సింగ్”కి నటించడానికి ఆస్కారం దొరక్కపోయినా, మునుపటి చిత్రాల్లోకంటే అందంగా కనిపించింది. ముఖ్యంగా “నువ్వే నువ్వే” గీతంలో. బ్రహ్మానందం పాత్ర రవితేజ చేతిలో తన్నులు తినడానికే తప్ప వేరే మేలు చేయలేదు. ప్రతినాయకుల పాత్రలు యథాతధం. తమ సంభాషణలు తామే చెప్పుకునే ప్రతినాయకులే కరువైపోయారు తెలుగు సినిమాలో. అందరికి ఉన్న ఒకే దిక్కు “బొమ్మాలి” రవిశంకర్. ఆయన గాత్రాన్ని చెవులు అదిరేలా అరవడానికే ఉపయోగిస్తున్నారు దర్శకులు. ప్రతినాయకుడు అంటే “మహా క్రూరుడు” అనే భావన రచయితల్లో ఎప్పుడూ పోతుందో వేచిచూడాలి.
ప్రత్యేకతలు :
- వక్కంతం వంశీ మూలకథ. ఈ చిత్రానికి కేవలం మూలకథ మాత్రమే బరువైనది. సురేందర్రెడ్డి కథనం, దర్శకత్వం దాన్ని వెక్కిలిగా మార్చింది.
- మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం. ఈ చిత్రంలోని సన్నివేశాలను అవి జరిగే ప్రదేశాలకు తగ్గట్టుగా కెమెరాలో బందించారు.
- తమన్ సంగీతం. మొట్టమొదటిసారిగా తమన్ పనితనం బాగుంది. ఈ చిత్రంలో పండిన కొన్ని సన్నివేశాల్లో అతడి కృషి ఎంతైనా ఉంది.
- నిర్మాణ విలువలు (Production Values). సెట్స్ మరియు ప్రదేశాల విషయాలలో, చిత్రం కోసం బాగా ఖర్చు పెట్టారు నిర్మాత కళ్యాణ్ రామ్. ఓ కథానాయకుడు నిర్మాతగా మారి మరో కథానాయకుడి కోసం ఇంత ఖర్చుపెట్టడం ఓ మంచి విషయం.
బలహీనతలు :
- సురేందర్రెడ్డి కథనం మరియు దర్శకత్వం. చిత్రానికి ప్రధాన బలహీనత ఇదే.
- పండని భావోద్వేగాలు మరియు హాస్యం.
- బోరు కొట్టించే మూస పాత్రలు.
- నిడివి. కథనం పలుచోట్ల నెమ్మదించి, దీన్ని 161 నిమిషాల చిత్రాన్ని చేసింది.
ఈ చిత్రం నేర్పిన పాఠాలు :
- భారతీయ సినిమా అంటే భావోద్వేగపు సినిమా కనుక దాన్ని ప్రేక్షకుడికి సరిగ్గా చేరవేసే దర్శకుడి ఎంపిక చాలా ముఖ్యం.
- చిత్రం యొక్క పేరుని కొనసాగిస్తే దాని ఫలితం కూడా కొనసాగుతుంది అనుకోవడం పొరపాటు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English review on this movie…
Avg movie, story line bagundi kaani connect cheyalekapoyadu, hero-villain face off maree late chesadu, aa last half n hour fast ga lakkelladu but appatike late aipoindi.
anta emotional backdrop ki Comedy narration set avvaledu, irritate vastundi aa janala gola endo emo anta sepu kakunda 2nd half starting 10-15 mins lo ne hero villain edurupaddattu choopinchi unte bagundedi
asalu temple fight scene ki lead scene worst, aa kamalabhai kooturu rape scene ki link chesi unte emotion baga set ayyedi
Naaku aite Hero land kabja ki villaspur/villain ki link petti unte inka manchi story set ayyedi, first half land kosam hero aa village tho comedy, tana swardham tanu chooskukounda maradam aa time lo jenda pai kapiraju song ala vacchi manchi heights ki elle narration vacchedi anipinchindi 🙂
LikeLike
Pingback: Kick 2 (2015) | Film Criticism