
మనిషి జీవితంలో అనుకోని అతిథి “మృత్యువు”. కానీ దాని రాక ముందే తెలిసినప్పుడు దానికి ఆనందంగా ఆహ్వానం పలకాలి, అప్పుడే జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ అంశాన్ని సూటిగా స్పృశించిన చిత్రం “ఆనంద్”. “హృషికేష్ ముఖర్జీ” దర్శకత్వంలో “రాజేష్ ఖన్నా”, “అమితాబ్ బచ్చన్” ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం అప్పుడప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ ను మంచి పాత్రతో పాటు పురస్కారాలను సైతం ఇచ్చి నిలబెట్టింది.
మొదట ఈ చిత్రంలోని పాత్రలకు కిషోర్ కుమార్, మెహమూద్ లను ఎంపిక చేసుకున్నారు. కానీ అనుకోని మనస్పర్థలవల్ల కిషోర్ గారికి కథ చెప్పలేకపోయారు ముఖర్జీ. క్రమేణా మెహమూద్ కి కూడా అవకాశం దక్కలేదు. దీని చిత్రీకరణ 28 రోజుల్లో ముగిసిందని సమాచారం.
ఈ చిత్రాన్ని మలయాళంలో “చిత్రశలభం” అనే పేరుతో పునర్నిర్మించారు. దీని ప్రేరణ తెలుగులో కృష్ణవంశీ తీసిన “చక్రం”లోనూ కనబడుతుంది.
కథ :
ఉత్తమ రచయిత పురస్కారం సంపాదించిన డాక్టర్ భాస్కర్ బెనర్జీ (అమితాబ్) తనకు ప్రేరణనిచ్చిన మిత్రుడు ఆనంద్ సెహగల్ (రాజేష్ ఖన్నా)తో తనకున్న అనుబంధం గురించి నెమరువేసుకునే జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్రపు కథ.
కథనం :
సుప్రసిద్ధ దర్శకులు “రాజ్ కుమార్ హిరాణి” ఈ చిత్రం గురించి ఓ సందర్భంలో “ఆనంద్ ఎటువంటి సినీ వ్యాకరణాన్ని పాటించని చిత్రం. ప్రతి విషయాన్ని సూటిగా చెప్పే కథనంతో రూపొందింద”ని వ్యాఖ్యానించారు. ఇది అక్షరాలా నిజం. ఈ చిత్రపు కథనం సినీ ఫక్కిలో ఎక్కువగా సాగదు.
ఈ కథనం చాలా సూటిగా ఉంటుంది. మొదటి సన్నివేశంలోనే భాస్కర్ మాటల్లో ఆనంద్ మరణించాడని తెలుస్తుంది. ఇప్పటి దర్శకులు అయితే, ఇక్కడ మరింత నాటకీయతను జోడించేవారు. అలా జ్ఞాపకాల పుటల్లోకి వెళ్ళిన కథనంలో భాస్కర్ పాత్ర పూర్తిగా నెలకొల్పబడుతుంది. ఈ పాత్ర స్వభావం చాలా సూటిగా ఉంటుంది.
ఎప్పుడైనా ఒక పాత్రపై గౌరవాన్ని పెంచాలంటే, దాని ఔన్నత్యాన్ని పెంచే మరో పాత్ర కావాలి. కనుకే మనకు, డాక్టర్ వృత్తిని వ్యాపారంగా భావించే ప్రకాష్ కులకర్ణి (రమేష్ డియో) పాత్ర పరిచయం అవుతుంది. కానీ ఈ పాత్ర ఎక్కడా వ్యర్థం అనిపించదు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆనంద్, భాస్కర్ ల పరిచయానికి కులకర్ణి పాత్రే కారణం.
అలా ఒక్కో పాత్ర పరిచయం అవుతుంది. కానీ చిత్రం మొత్తంలో అతి తక్కువ పాత్రలు కనబడతాయి. కనిపించిన ప్రతి పాత్రకీ ప్రాముఖ్యత ఉంది. ప్రతి పాత్ర మంచిది. మనసు నిండా ప్రేమాభిమానాలు తప్ప ఈర్ష్య, ద్వేషాలకు తావులేనివి.
ఈ చిత్రానికి ప్రధాన పాత్ర “ఆనంద్”. “కాన్సర్” తన చావును ముందే నిర్ధారించినా, చిరునవ్వుతో దాన్ని ఆహ్వానించి తన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచే ఈ పాత్ర చిత్రణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకరచయితలు. మాములుగా ఒక సమస్యతో బాధపడే వ్యక్తి మనస్తత్వం గురించి, గతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. కానీ ఆనంద్ పాత్ర విషయంలో ఆ ఆసక్తి ప్రేక్షకుడికి కూడా కలిగించకుండా జాగ్రత్తపడ్డార. ఆనంద్ జీవితం ముగిసిపోయేదని చివరి ఘట్టం వరకు ప్రేక్షకుడికి స్పురణ రాదు. ఆనంద్ పాత్ర ఎంతో పరిపక్వత కలిగినది. తన సమస్య ఎదుటివారికి జాలి కలిగించేది కనుక అది ఏమాత్రం కోరుకోని వ్యక్తిత్వం. స్వతహాగా తన జీవితం మీద ప్రేమ లేని ఆనంద్ అంటే అతడి చుట్టూ ఉన్నవారికి ఎంతో ప్రేమ. ఎవరినైనా యిట్టె కలుపుగోగల మనస్తత్వం అతడిది. ఈ పాత్రను రాజేష్ ఖన్నా పోషించిన తీరు మరింత అద్భుతం. ఇంతటి అందగాడికి అంతటి కష్టం ఉండదని చూసే ప్రేక్షకుడికి సైతం అనిపించే నటుడాయన.
సినిమాల్లో “ప్రతినాయకులు” ప్రత్యేకంగా ఉంటారు. కానీ నిజజీవితంలో మాత్రం పరిస్థితులే ప్రతినాయకులు. ఆనంద్ లో కూడా అంతే. పరిస్థితే ప్రతినాయకుడు. అందరూ స్వచ్ఛమైన మనుషులు. ఆనంద్ సమస్య దూరం కావాలని మిగతా పాత్రలన్నీ ప్రయత్నిస్తుంటే, బహుశా మన సమాజంలో కూడా మనుషుల మధ్య ఇంతటి ప్రేమాభిమానాలే ఉంటే, “వసుధైక కుటుంబం” సాధ్యపడి ఉండేదనిపిస్తుంది.
పేరుకు తగ్గట్టే, ఆనంద్ ముఖంలో ఆనందానికి తప్ప బాధకు చోటు లేదు. కానీ ఒక్క సన్నివేశంలో ఓ క్షణకాలం బాధపడతాడు. కులకర్ణి భార్య సుమన్ కులకర్ణి (సీమా డియో) అతడిని తన అన్నగా అభివర్ణించి ఆశీస్సులు అందించమంటే, “ఏమని ఆశీర్వదించను! నా ఆయుష్షు కూడా పోసుకొని జీవించు అనేటంత ఆయుష్షు లేదు నాకు” అని. ఓసారి సూర్యాస్తమయం సమయంలో తనలో దాగున్న భావాలను “కహీ దూర్” అనే పాటగా పాడగా, దాన్ని రహస్యంగా విన్న భాస్కర్ “ఇన్నాళ్ళు నీ ఆనందాన్ని పంచుకున్నావు, ఈ ఒక్క రోజు నీ బాధను నాతో పంచుకో” అంటాడు. అప్పుడు “అది మాత్రం ఎప్పటికీ జరగదు బాబు మోషాయ్!” అని వెళ్ళిపోతాడు ఆనంద్. ఇలాంటి పలు సన్నివేశాలు ఆనంద్ పాత్ర యొక్క పరిపక్వతని తెలుపుతాయి.
ఒంటరిగా బ్రతికే భాస్కర్ జీవితానికి ఓ తోడు కావాలని, అతడు గోప్యంగా ప్రేమించే రేణు (సుమిత సన్యాల్)తో అతడి ప్రేమను తెలిపి వారిద్దరినీ ఒకటి చేస్తాడు. ఇక్కడ “ధారా సింగ్” ఓ అతిథి పాత్రలో కనిపిస్తారు. కేవలం కాసేపు పరిచయం ఉన్న ఇసా భాయ్ (జానీ వాకర్), ఆనంద్ ని తన మానస పుత్రుడిగా భావించిన మ్యాట్రన్ (లలితా పవార్)లు అతడి ప్రాణం కోసం ప్రార్థన చేసే స్థాయిలో అతడి ప్రేమ ఉంటుంది. ఆనంద్ గతంలో ఓ ప్రేమకథ ఉంటుంది. దాని గురించి క్లుప్తంగా రేణుకి చెబుతాడు.
ఇందులో ఓ టేప్ రికార్డరుకి కూడా ముఖ్య పాత్ర ఉంది. ఆనంద్ చివరి రోజుల్లో భాస్కర్ దగ్గర తన జ్ఞాపకాన్ని వదిలి వెళ్ళే సన్నివేశంలో ఈ రెండు పాత్రల పట్ల గౌరవం మరింత పెరుగుతుంది. ఇక్కడ భాస్కర్ చెప్పిన “మౌత్ తూ ఏక్ కవితా హై” అనే కవితను గుల్జార్ రచించారు.

పతాక సన్నివేశాన్ని రచించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆనంద్ భాస్కర్ ని చివరిచూపు చూసుకోలేక టేప్ పెట్టమని చెబుతాడు. మునుపటి సన్నివేశంలో భాస్కర్ పలికిన కవిత వింటూ ఆనందంగా కన్ను మూస్తాడు ఆనంద్. అతడు మరణించిన తరువాత “ఏదైనా మాట్లాడు” అని భాస్కర్ రోదిస్తూ ఉండగా, “బాబు మోషాయ్” అని టేప్ పలకడం, అప్పటివరకు నిత్యం తన మాటలతో అలరించిన ఆనంద్ అంటే తనకు ఎంత అభిమానమో ఓ చిన్న హావభావంతో అమితాబ్ పలికించిన తీరుకే బహుశా ఫిలింఫేర్ ఆయనను వరించిందేమో అనిపిస్తుంది. ఇక్కడ దర్శకుడు వాడిన తర్కం ముచ్చటేస్తుంది. తమ గొంతులను రికార్డు చేసుకునే సన్నివేశంలో, రికార్డు బటన్ నొక్కిన వెంటనే భాస్కర్ మాట్లాడడం మొదలుపెడతాడు. ఆనంద్ వంతు వచ్చేసరికి, టేప్ రికార్డరు నడుస్తూ ఉన్నా, కొంత సమయం తీసుకొని తన మాటలు రికార్డు చేస్తాడు ఆనంద్. ఈ క్రమంలో టేప్ మొత్తం అయిపోతుంది.

ఇదే షాట్ ని రోదిస్తున్న భాస్కర్ ఆనంద్ గొంతు విన్న తరువాత మళ్ళీ చూపించడం ఎంతో భావాన్ని పలికిస్తుంది. ఇక్కడ మాటలతో పని లేదు. అంటే, మునుపటి సన్నివేశంలో వ్యర్థం అయిన టేప్ మరియు సమయం ఇక్కడ ఉపయోగపడిందన్న మాట. టేప్ అయిపోవడం ఆనంద్ మాటలిక వినబడవన్న విషయాన్ని ఎంతో చక్కగా చేరవేసింది. ఇలాంటి సన్నివేశం వ్రాసుకున్నందుకు దర్శకరచయితలను అభినందించక తప్పదు.
ఎప్పుడు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ హృదయాల్లో నిలిచిపోయిన ఆనంద్ కి మరణం లేదు అన్న భాస్కర్ మాటతో చిత్రం ముగుస్తుంది.
మిగతా విషయాలకు వస్తే, ఇందులో కేవలం నాలుగు గీతాలు మాత్రమే ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చినది “మైనే తేరే లియే హీ సాత్ రంగ్ కి సప్నే” అనే గీతం.
మరిన్ని విశేషాలు :
- కథనపు రచన. ఈ చిత్రానికి కథనం, మాటలు మరియు రెండు పాటలు వ్రాశారు గుల్జార్. ఈయనతో పాటు కథనం వ్రాసిన హృషికేష్ ముఖర్జీ, బిమల్ దత్తా మరియు డి.ఎన్.ముఖర్జీలను అభినందించాలి. ఎక్కువ మాటలు లేకుండా, కేవలం సన్నివేశాలతో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పిన తీరు అద్భుతం.
- పాత్రల చిత్రణ. చెడు ఆలోచనలున్న ఒక్క పాత్ర కూడా లేకుండా డ్రామాను పండించిన తీరు అమోఘం.
- నటనలు. రాజేష్ ఖన్నా, అమితాబ్ తమ పాత్రలకు ప్రాణం పోశారు.
- నిడివి. కేవలం రెండు గంటల వ్యవధిలో చిత్రం ముగుస్తుంది కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు.
- ఆనంద్ పాత్రకి ప్రేరణ “రాజ్ కపూర్” అని సమాచారం. ఓసారి కపూర్ అస్వస్థతకు గురయినప్పుడు, ముఖర్జీ ఈ కథ వ్రాశారట. ముఖర్జీని కపూర్ “బాబు మోషాయ్” అని పిలిచేవారట. అందుకే ఈ చిత్రాన్ని రాజ్ కపూర్ మరియు బొంబాయి ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు చిత్రం ఆరంభంలో వేశారు.
ముగింపు :
ఈ చిత్రం, సినిమా నుండి కేవలం వినోదాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుడిని మెప్పించలేదేమో కానీ నిజమైన సినీప్రియులకు మాత్రం గుర్తుండిపోతుంది, ఇందులోని పాత్రల చిత్రణ, కథనాన్ని నడిపించిన తీరు సినిమా కథలు వ్రాసే ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఓ పాఠం.
– యశ్వంత్ ఆలూరు
29/08/2015
“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.