భలే భలే మగాడివోయ్ (2015)

BBM Poster

మాములుగా చిత్రసీమలో తప్పటడుగు వేస్తే, దాన్ని వెనక్కు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ దర్శకుడు “మారుతి” విషయంలో అది తప్పని ఋజువయ్యింది. “ఈరోజుల్లో”, “బస్టాప్” లాంటి కథలను సరైన కథనాలతో చెప్పక, చెడ్డపేరు సంపాదించుకున్న మారుతి ఈసారి “భలే భలే మగాడివోయ్” అనే చిత్రంతో తనపై ఉన్న నిందలను తొలగించుకునే ప్రయత్నం చేశాడు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై “బన్నీ వాస్” నిర్మించిన ఈ చిత్రపు విశేషాల్లోకి వెళ్తే…

కథ :

విపరీతమైన మతిమరుపున్న లక్కీ (నాని) అనుకోకుండా నందన (లావణ్య)తో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే తన లోపంతో లావణ్య తండ్రి పాండురంగారావు (మురళి శర్మ) ద్వేషాన్ని చవిచూసిన లక్కీ, తన లోపాన్ని నందనకు తెలియజెప్పడంతో పాటు ఆవిడ తండ్రిని కూడా ఎలా ఒప్పించాడు అన్నది ఈ చిత్రపు కథాంశం.

కథనం :

ఈ చిత్రపు కథాంశం అతి చిన్నది. దర్శకుడు మారుతి దీనికి హాస్యాన్ని జోడించి ఆకట్టుకున్నాడు. మారుతి చిత్రం అనగానే కాస్త చెడు అభిప్రాయం కలిగినప్పటికి, నాని కథానాయకుడు అవ్వడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి. కానీ తన మునుపటి శైలి ఎక్కడా గుర్తుకు రాకుండా జాగ్రత్త పడినందుకు మారుతిని అభినందించాలి. లక్కీ పాత్రని ఎంతో జాగ్రత్తగా చిత్రించాడు. దాని లక్షణాన్ని మొదటి ఇరవై నిమిషాల్లోనే ఒప్పించేలా చెప్పాడు. మొదటి సగం అంతా ఆరోగ్యకరమైన హాస్యంతో లక్కీ పాత్రని బాగా నెలకొల్పాడు. కొన్ని చోట్ల ఇది కాస్త అతిశయోక్తిగా అనిపించినా, నాని తన నటనతో అమితంగా ఆకట్టుకున్నాడు.

ఈ మధ్యలో వచ్చిన గీతాల చిత్రీకరణ ఆకట్టుకుంది. నాకు నచ్చినవి “మొట్ట మొదటిసారి”, “హలో హలో” గీతాల చిత్రీకరణలు. ముఖ్యంగా వీటిలోని ఛాయాగ్రహణం బాగా ఆకట్టుకుంది. షఫీకి ఇక్కడ పూర్తి మార్కులు వేసేయాలి.

రెండో సగంలో వెన్నెల కిషోర్ పరిచయం చిత్రానికి మరింత ఊపందించింది. మొదటి సగంతో పోలిస్తే, రెండో సగం మామూలు “మైండ్ గేమ్” తరహాలో సాగినప్పటికీ బాగా నవ్వించింది. ముఖ్యంగా మురళి శర్మ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళిన సన్నివేశంలో కిషోర్, నానిల నటనలు అద్భుతం. దానికి ముందు అజయ్, మురళి శర్మలను కిషోర్ కలిసే సన్నివేశంలోనూ అతడి హాస్యం బాగా పండింది. ఇలాంటి చోట్ల రచయితగా కూడా మారుతి రాణించాడు. ఆ తరువాత కూడా చాలా సేపు కథనం నవ్వించింది. ఆఖరి ఘట్టంలో కూడా నాని భావోద్వేగపు నటన చాలా బాగుంది. ఇక్కడ గోపి సుందర్ నేపథ్య సంగీతం బాగుంది.

అంతా బాగున్నా, ఈ కథనంలోనూ ఓ వ్యర్థ పదార్ధం ఉంది. అదే “అజయ్” పాత్ర. నిజానికి ఈ పాత్ర కథకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కేవలం ఓ పోరాట సన్నివేశం కోసం అన్నట్టుగా ఉంది. మొదట్లో ఎదో చేస్తుంది అనుకున్న ఈ పాత్ర చివరకు వ్యర్తమైపోయింది. దీన్ని సృష్టించడం వల్ల చిత్రపు నిడివి ఓ అరగంట అనవసరంగా పెరిగింది. దీని సాయం లేకుండా “విక్కి డోనార్” తరహాలో చిత్రాన్ని ముగించి ఉంటే బాగుండేదేమో అనిపించింది.

ఇక నటనల విషయానికి వస్తే, నాని నటన ఎప్పటిలాగే సహజంగా అద్భుతంగా ఉంది. అతడికి మంచి భవిష్యత్తు ఉందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. లావణ్య దక్కిన పాత్రను బాగా పోషించింది. చిన్మయి గాత్రదానం మరింత ఊతాన్నిచ్చింది. చాలా రోజుల తరువాత వెన్నెల కిషోర్ కడుపుబ్బ నవ్వించాడు. మురళి శర్మను ఇలాంటి ఓ తండ్రి పాత్రలో చూడటం కొత్తగా అనిపించడంతో పాటు, అతడి నటన కూడా బాగుంది. నరేష్, సితార తమ తమ పాత్రలను బాగా పోషించారు. అప్పుడప్పుడు కనిపించే భద్రం కూడా ఫర్వాలేదనిపించాడు.

ప్రత్యేకతలు :

  1. కథనం మరియు దర్శకత్వం. ఓ చిన్న కథాంశాన్ని తన పూర్వ చిత్రాల ప్రభావం లేకుండా మారుతి తెరకెక్కించిన తీరు అభినందనీయం. రాబోయే చిత్రాలు కూడా ఇలాగే తీస్తే, మారుతికి మరింత మంచి పేరు సాధించే అవకాశం ఉంది.
  2. నాని నటన. పరిచయపు షాట్ లో “నాచురల్ స్టార్” అని వేసిన బిరుదుకి నూరు శాతం న్యాయం చేశాడు నాని.
  3. నిజార్ షఫీ ఛాయాగ్రహణం. ఈ చిత్రంలోని అన్ని సన్నివేశాలు కనులకు ఇంపుగా అనిపించాయి. ముఖ్యంగా గీతాల్లో ఉన్న లైటింగ్ చాలా బాగుంది.
  4. గోపి సుందర్ సంగీతం. గీతాలే కాదు నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది ఈ చిత్రంలో. గోపి సుందర్ కి భవిష్యత్తులో ఇలాంటి ప్రోత్సాహం ఎంతైనా అవసరం.
  5. నిర్మాణ విలువలు. గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఈ చిత్రం కోసం బాగా ఖర్చుపెట్టింది. చిత్రమంతా కనువిందైన ప్రదేశాల్లో చిత్రించారు.

బలహీనతలు :

  1. పోరాట సన్నివేశాలు. ఇలాంటి కథకు ఏమాత్రం అవసరం లేని పోరాటాలు ఈ కథనానికి అతుకుల్లా అనిపించాయి.
  2. అజయ పాత్ర. పైన చెప్పుకున్న విధంగా ఇది ఓ వ్యర్థ పదార్ధం ఈ చిత్రానికి.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

చెడ్డపేరు ఎంత సంపాదించినా, మంచి కథ, కథనాలతో వస్తే అది ఒక్క చిత్రంతోనే పటాపంచలు అయిపోతుంది.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

2 thoughts on “భలే భలే మగాడివోయ్ (2015)

  1. Good Movie, but nenu 2nd half baga disappoint ayya, vennla kishore intro two scenes hilarious, tehn after okka pre climax emotional scene tappa nenu connect avalekapoya. First half matram hilarious asala hero characterisation establish cheyadam chala perfect ga jarigindi, manam aaditho conect aipoi konni saarlu tittukuntam, okasari jalipadatam paapam ra babu ani ala journey laaga cheyalsina movie 2nd half lo routine confusion comedy trakc pettadam valla inka better movie ayye chance miss aindi, at least nuvvu annattu aa ajay role lekunda climax lo heroine and heroine father ni hero explain chesi emotional ending icchi unte bagundedi 🙂

    Like

  2. Pingback: Bhale Bhale Magadivoy (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s