కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)

Courier-Boy-Kalyan-Movie-Latest-Posters1

సినిమాకు కథ ఎంత ముఖ్యమో, కథనం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా థ్రిల్లర్ చిత్రాలకు కథకన్నా కథనమే ముఖ్యం. ఈ ప్రాముఖ్యతలలో సమతుల్యం (balance) పాటించని చిత్రం “కొరియర్ బాయ్ కళ్యాణ్”. నితిన్, యామి గౌతమ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా “ప్రేమ సాయి” దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుప్రసిద్ధ దర్శకుడు “గౌతమ్ మీనన్” ఈ చిత్రానికి నిర్మాత. ఈ కొరియర్ విషయాల్లోకి వెళ్తే…

కథ :

తను ఇష్టపడ్డ కావ్య (యామి గౌతమ్) కోసం కొరియర్ బాయ్ అవుతాడు కళ్యాణ్ (నితిన్). ఓ రోజు ఓ పార్సెల్ అతడి చేతికి వస్తుంది. అందులో ఏముంది? కళ్యాణ్ జీవితాన్ని అది ఎలా మార్చింది? కళ్యాణ్ తన ప్రేమను గెలిచాడా అన్నవి ఈ కథాంశాలు.

కథనం :

ఈ చిత్రపు మూలకథ చిన్నది. ఓ చిన్న పార్సెల్ చుట్టూ తిరిగే ఇలాంటి కథలు మనకు హాలీవుడ్ చిత్రాల్లో అధికంగా వస్తాయి. ఇది భారతీయ చిత్రం కనుక దర్శకుడు ప్రేమ సాయి ఇందులో భావోద్వేగాలను పొందుపరిచాడు. కాబట్టి ఈ చిత్రపు మూలకథకు మార్కులు వేయాలి.

కథనం విషయానికి వస్తే, మొదటి సగంలో ఎక్కడా కొత్తదనం కనబడలేదు. నాయకానాయికల మధ్య సన్నివేశాలు కూడా పెద్దగా పండలేదు. ఈ చిత్రానికి అదనపు మాటలు అందించిన “కోన వెంకట్” కలం మధ్యమధ్యలో కాస్త నవ్వించింది. మొదట్లో సంపూర్ణేష్ బాబుకి పేరడీగా వచ్చిన సప్తగిరి హాస్యం ఏమాత్రం పండలేదు. మొత్తం చిత్రంలో ఉన్నవి నాలుగు గీతాలే, అందులో మూడు మొదటి సగంలోనే అనవసరపు చోట్ల ఇరికించేశాడు దర్శకుడు. కానీ వాటి చిత్రీకరణలు బాగున్నాయి. “మాయా ఓ మాయా” గీతంలో ఛాయాగ్రహణం, “బంగారమ్మా” గీతంలో కళాదర్శకత్వం (Art Direction) బాగున్నాయి. మొదటి సగమంతా ఏ కథనూ సరిగ్గా చూపించకుండా, సన్నివేశాలను అసంపూర్ణముగా ముగించే కూర్పుతో నెట్టుకొచ్చాడు దర్శకుడు.

రెండో సగం మొదటి సగానికన్నా మెరుగైనది. ఇక్కడ కథనం స్పష్టంగా నడిచింది. ఓ క్రమంగా సాగిపోతున్న కథనంలో మళ్ళీ ఓ గీతాన్ని ఇరికించి ఇబ్బందిపెట్టినా, కొన్ని థ్రిల్లర్ అంశాలు బాగున్నాయి. రాత్రి సమయంలో తీసిన సన్నివేశాల్లో ఛాయాగ్రహణం బాగుంది. దీనికి ఛాయాగ్రాహకుడు సత్య పోన్మార్ ని అభినందించాలి. మొత్తానికి ప్రేక్షకుడి ఊహకు అందే థ్రిల్లర్ గా కొరియర్ బాయ్ కళ్యాణ్ పార్సెల్ డెలివరీ చేశాడు.

ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత “నిడివి” (runtime). మొత్తం చిత్రం కేవలం 104 నిమిషాల్లో ముగిసింది. తెలుగు చిత్రాల్లో ఇది చాలా అరుదైన విషయం. ఎలాగు అకాల వర్షాలు కురుస్తున్నాయి కనుక దగ్గరలో సినిమా హాలుంటే వర్షం తగ్గేలోగా ఈ చిత్రాన్ని చూడవచ్చు. పైగా ఈ వారం మరే చిత్రం రావడం లేదు కనుక వినాయక చవితి సెలవులను “కొరియర్ బాయ్ కళ్యాణ్” వాడుకునే అవకాశం ఉంది.

ఇక నటనల విషయానికి వస్తే, నితిన్ నటన మాములుగానే ఉంది. యామి గౌతమ్ కి ఓ మామూలు కథానాయిక లాగే చెప్పుకోదగ్గ పాత్ర దక్కలేదు. అశుతోష్ రాణా, సత్యం రాజేష్, రవి ప్రకాష్, నాజర్, హర్షవర్ధన్, వాసు ఇంటూరి, ఇలా అందరికి మామూలు పాత్రలే దక్కాయి. దివంగత నటి “తెలంగాణ శకుంతల” ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు.

సంగీతం విషయానికి వస్తే, కార్తిక్ స్వరపరిచిన గీతాలు బాగానే ఉన్నాయి. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన “వాలు కళ్ళ పిల్ల” గీతం అతడి మామూలు శైలిలోనే సాగింది.

ప్రత్యేకతలు :

  1. మూలకథ (Basic Plot). పైన చెప్పుకున్న విధంగా, నడిపించిన విధానం ఎలాగున్నా, మూలకథ మాత్రం బాగుంది.
  2. సత్య పోన్మార్ ఛాయాగ్రహణం. గీతాలు, రాత్రి సమయంలో తీసిన సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. థ్రిల్లర్ కథలకు ఛాయాగ్రహణం ఎంతో మేలు చేస్తుంది. ఆ మేలు ఈ చిత్రానికి కూడా చేసింది.
  3. నిడివి (Runtime). 104 నిమిషాలు ప్రేక్షకుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగించని సమయం.
  4. నిర్మాణ విలువలు (Production Values). నిర్మాత గౌతమ్ మీనన్ చిత్రానికి కావలసినంత ఖర్చు సరిగ్గా పెట్టారు. ఏదీ తక్కువ అనిపించలేదు, అలాగని వృథా కూడా అనిపించలేదు.

బలహీనతలు :

  1. కథనం. “థ్రిల్లర్” తరహా చిత్రాలకు కథకన్నా కథనమే ప్రాణం. కథ మీద పెట్టిన దృష్తి దర్శకుడు కథనం మీద పెట్టలేకపోయాడు. దాదాపు అన్ని విషయాలు ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉన్నాయి.
  2. ప్రవీణ్ పూడి కూర్పు (Editing). మొదటి సగంలోని సన్నివేశాలన్నీ అసంపూర్ణమే.
  3. అసందర్భ గీతాలు. ఉన్నవి నాలుగే అయినా, ఈ చిత్రానికి గీతాల సహకారం అవసరం లేదు. ముఖ్యంగా “వాలు కళ్ళ పిల్ల” బొత్తిగా అనవసరం.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

థ్రిల్లర్ తరహా చిత్రాలు తీయాలనుకుంటే, కథకన్నా కథనమే ముఖ్యమని తెలుసుకోవాలి.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

2 thoughts on “కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)

  1. Just avg movie, edo ala ok ok mode lo vellinid chala time waste chesadu hero action lo ki raavadaniki, interval time ke hero chetiki courier vacchi unte inka edanna game laga plan chesukovadaniki undedi,asalu last lo all of a sudden villain scene lo ki raavadm ROFL 😀 😀

    Like

  2. Pingback: Courier Boy Kalyan (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s