సుబ్రమణ్యం for సేల్ (2015)

Sai-Dharam-Tej-Subramanyam-For-Sale-Movie-Posters-15

వారసత్వం కథానాయకుడిని “పరిచయం” మాత్రమే చేస్తుంది. కానీ సినిమాపై అతడికున్న ఆసక్తే పరిశ్రమలో అతడిని నిలబెడుతుంది. అలాంటి వారసత్వంతో పరిచయమై పరిశ్రమలో నిలుదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న కథానాయకుడు “సాయిధరమ్ తేజ్”. తన గతం మొట్టికాయ వేసినా, తన శైలిని మార్చుకోని దర్శకుడు “హరీష్ శంకర్”. అభిరుచి కలిగిన నిర్మాత అని పేరొంది ఇప్పుడు కేవలం వ్యాపారం మీదే దృష్టి పెట్టి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత “దిల్ రాజు”. ఈ ముగ్గురు కలిసి ప్రేక్షకుడికి పెట్టిన బేరమే “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”. మరి ఈ వ్యాపారం విశేషాల్లోకి వెళ్తే…

కథ :

డాలర్ల కోసం ఏ పనైనా చేస్తూ, తనను తాను అమ్ముకోవడానికి కూడా వెనుకాడని ప్రవాస భారతీయుడు సుబ్రహ్మణ్యం (సాయిధరమ్ తేజ్). ఓ రోజు ఓ సమస్యలో ఉన్న సీత (రెజినా) అతడికి పరిచయమవుతుంది. ఆ సమస్య ఏంటి? దాన్ని సుబ్రహ్మణ్యం ఎలా పరిష్కరించాడు? అంతగా డబ్బు సంపాదించడం వెనుక సుబ్రహ్మణ్యం లక్ష్యం ఏంటి? అనేవి కథాంశాలు.

కథనం :

ఇది అతి పాత కథ. కానీ దర్శకుడు హరీష్ తనదైన పాత్రల చిత్రణలతో, మాటలతో దాన్ని నడిపించాడు. తన మునుపటి చిత్రం “రామయ్య వస్తావయ్య” తనకే పాఠం నేర్పలేదు అనుకున్నాడేమో, అతడి చిత్రీకరణ శైలిలో ఏమాత్రం మార్పు కనబడలేదు. కథానాయకుడు మెగా కుటుంబానికి చెందినవాడు కనుక వారి కుటుంబ సభ్యులను అతడి ద్వారా అడుగడుగునా గుర్తు చేస్తూ వచ్చాడు. అలాగే తన పాత అలవాటు అయిన “పేరడీ”, “విమర్శ”లనూ వదలలేదు. ఉదాహరణకు, తన చిత్రంలో వేరే దర్శకులను, వారి చిత్రాలను విమర్శించడం లాంటివి. అలాంటివి చేస్తేనే తన కథానాయకుడి అభిమానులను తృప్తిపరిచినట్టు అన్న తన భావాన్ని ఎప్పుడు వీడతాడో అర్థం కాదు.

ఏది ఏమైనా, కథానాయకుడి పాత్ర చిత్రణలో బాగా శ్రద్ధ వహిస్తాడు హరీష్. అదే ఈ చిత్రంలోనూ చేశాడు. సుబ్రహ్మణ్యం పాత్ర చిత్రణ దాని స్వార్థంతో, పొగరుతో బాగా ఆకట్టుకుంది. దాన్ని అవలీలగా తేజ్ పోషించిన విధానం మరింత బాగుంది. దీనికి పలు ఉదాహరణలు మొదటి సగంలో కనబడతాయి. పాత్రను ప్రేక్షకుడు సొంతం చేసుకునే లోపే తన మరో చెడ్డ అలవాటైన “ద్వందార్థ ప్రయోగాల”ను వాడి ఇబ్బంది పెట్టాడు దర్శకుడు. “సీతతో అంత ఈజీ కాదు!” అని తరచూ పలికే సీత పాత్రపై మాత్రం శ్రద్ధ వహించలేదు. సుబ్రహ్మణ్యం పాత్ర ధాటికి అది కొట్టుకోనిపోయింది. నిక్కచ్చిగా లేని సీతపై జాలి, ప్రేమ లాంటి భావనలు ఏమాత్రం కలగవు. కానీ రెజినాకు “సునీత” ఇచ్చిన గాత్రదానం కాస్త పాత్రను దగ్గర చేసిందనే చెప్పాలి.

మొదటి సగాన్ని పూర్తిగా తప్పుబట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పలుచోట్ల ఆకట్టుకున్నాడు, నవ్వించాడు దర్శకుడు. ఇందుకు ఉదాహరణే, మొదటి “మేడ్ ఫర్ ఈచ్ ఆథర్” ఆట. ఇక్కడ నాయికానాయికల నటన బాగుంది. ఇక వాణిజ్య అంశాలైన పోరాటాలు, అరకొరగా నవ్వించే హాస్యం మరియు గీతాలతో ఎలాగో నెట్టుకొచ్చి విరామం ఇచ్చాడు.

రెండో సగంలోని కథనం మొదటి సగంతో పోలిస్తే మెరుగైనది. ఇక్కడ పలు పాత్రలు ప్రవేశమై, కుటుంబ నేపథ్యంలో కథనం ఉంది. ఇది కొత్త రకం కాకపోయినా, మొదటి దానికన్నా ఫరవాలేదనిపించింది. ఇక్కడ తేజ్ కి పూర్తి మార్కులు వేసేయాలి. నటన పట్ల అతడికున్న మక్కువ బాగా కనిపించింది. ఉదాహరణకు, గుడిలో “సీతతో వీజీ కాదు!” అనే హరికథ చెప్పే సన్నివేశంలో చాలా అవలీలగా నటించాడు. ఇతడితో పాటు “ఫిష్ వెంకట్” కూడా తన ఆంగ్ల భాషా ప్రయోగంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి సమయంలో వచ్చిన “గువ్వా గోరింకతో” గీతం కూడా బాగా అలరించింది. 1980ల నాటి అనుభూతిని ఏమాత్రం చెడగొట్టకుండా స్వరపరిచిన ఆ గీతం, దాని చిత్రీకరణ జరిపిన ప్రదేశం, అందులోని నృత్యం అన్నీ కలిసి ఈ చిత్రానికి ఇదే ఉత్తమ గీతంగా నిలిచేలా చేశాయి.

మొదట్లో పరిచయం చేసిన ప్రతినాయకులు, నటులందరినీ చివరకు హాస్యనటులుగా మార్చి, కొన”సాగిన” మెలోడ్రామాతో చిత్రాన్ని ముగించాడు హరీష్ శంకర్. అలా సుబ్రహ్మణ్యం “భలే మంచి బేరం” అనిపించుకోలేకపోయాడు, కానీ తన వ్యాపారం తాను చేసుకొనిపోయేలా అనిపించాడు.

ఇక నటనల విషయానికి వస్తే, ఈ చిత్రమంతా తేజ్ మీదే నడిచింది. పలుచోట్ల పవన కళ్యాణ్ ని అనుకరించినట్టు అనిపించినా, ఎక్కడా నిరాశాపరచలేదు, చిరాకు కూడా తెప్పించలేదు. నటనే కాకుండా నృత్యాలతోనూ బాగా అలరించాడు. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” మరియు “గువ్వా గోరింకతో” గీతాల్లో అతడి నృత్యం చాలా బాగుంది. రెజినాది అటు అద్భుతమైన పాత్ర కాదు, ఇటు తీసేసే పాత్ర కూడా కాదు. కానీ తన పాత్రను మాత్రం బాగా పోషించింది. సుమన్, నాగబాబు, రావురమేష్, అజయ్, బ్రహ్మానందం, నారేష్, ఝాన్సీ ఇలా చాలామంది నటులున్నా వారు వ్యర్థమైపోయి “ఫిష్ వెంకట్” లాంటి వాళ్ళు అలరించారు. అదా శర్మకు అతిథి పాత్ర దక్కింది కానీ మెప్పించలేదు.

ప్రత్యేకతలు :

 1. సాయిధరమ్ తేజ్. ఈ చిత్రాన్ని మొత్తం తనే మోశాడు. నటన పట్ల అతడికి ఆసక్తి ఉంది. నృత్యాలలో పట్టుంది. తన కుటుంబ సభ్యులను అనుకరించడం ఈ చిత్రం వరకు బాగుందేమో కానీ భవిష్యత్తులో దాన్ని పక్కనబెట్టి తనకంటూ ఓ ఆహార్యాన్ని సంపాదించుకొని నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటే అతడికి మంచి భవిష్యత్తు ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
 2. రాంప్రసాద్ ఛాయాగ్రహణం. ఈ చిత్రానికి ప్రధాన బలం. కథ, కథానాలు ఎలా ఉన్నప్పటికీ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. “గువ్వా గోరింకతో” గీతంలో ఉన్న కొన్ని ఏరియల్ షాట్స్ (aerial shots) బాగున్నాయి. అలాగే అమెరికాలో తీసిన సన్నివేశాలను కూడా బాగా కెమెరాలో బంధించారు రాంప్రసాద్.
 3. మిక్కీ జే. మేయెర్ సంగీతం. మొదటిసారి మిక్కీ మాస్ గీతాలను స్వరపరిచాడు ఈ చిత్రం కోసం. గీతాలన్నీ వెండితెరపై బాగున్నాయి.
 4. నిర్మాణ విలువలు (Production Values). దిల్ రాజు నిర్మాణ విలువలు ఈ చిత్రానికి మరో ఊతం. చిత్రాన్ని గ్రాండ్ కెన్యాన్ లాంటి అందమైన ప్రదేశాల్లో, మంచి సెట్స్ లో తీశారు.

బలహీనతలు :

 1. హరీష్ శంకర్ కథ, మాటలు, దర్శకత్వం. వీటిలో ఏ మార్పు కనబడలేదు. అవే అనుకరణలు, అవే పేరడీలు, అవే విమర్శలు. ఎప్పుడూ వేరే దర్శకుల గురించి, చిత్రాల గురించి ప్రస్తావిస్తూ అదే తన ముద్రను చేసుకున్నాడు తప్ప ఓ కొత్త దారిలో ప్రయాణించాలని అనుకోవడం లేదు. ఇదే ఈ చిత్రానికి, అతడికి ఉన్న పెద్ద బలహీనత. ఇకనైనా స్వతంత్రంగా సినిమాలు తీస్తే మంచిది.
 2. వ్యర్థమైపోయిన నటులు, పాత్రలు.
 3. సమస్యను బలంగా పరిచయం చేసి చివరగా వెక్కిలిగా మార్చిన వైనం.
 4. పండని మెలోడ్రామాతో మెప్పించలేకపోయిన పతాక ఘట్టం.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

గతంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకొని మారే ప్రయత్నం చేయాలి.

ఇదే విషయాన్ని హరీష్ శంకర్ లాగే వేరొకరి చిత్రాన్ని వాడుకొని చెప్పాలంటే, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో రావురమేష్ అన్నట్టు, “వ్యక్తిత్వాలు మార్చుకొండ్రా అంటే అబ్బే మేం మారం, ఇలాగే ఉంటాం అంటే ఎవడికి నష్టం?” అని టక్కున అనేయాలి.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this review…

2 thoughts on “సుబ్రమణ్యం for సేల్ (2015)

 1. Rod Movie asalu evo okati rendu scens bagunnai anthey, rao ramesh character bagundi, mian villain charcter chesesi unte bagundedi aa role ki konchem lentgh penchi

  hero heroine iddaru bagane chesaru but strong ga ye emotion gaani feel kaani workout avaledu aa tokalo senti scenes ki pagalabadi navvaru janaalu, naaku aite aa last lo pinni maaripoye scene abbo ROFL

  basic ga hero heroine love lo padadam anedi 2nd half starting time lone establish chesi aa dabbu kosam natinchadam etc dialogues lekunda pettunte bagundedi

  asalu suman starting lo edo build up istadu kaanee asalu em importance ye ledu aa role ki

  Like

 2. Pingback: Subramanyam For Sale (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s