సినీ సమీక్షలు, విశ్లేషణలు వ్రాసే నేను ఎప్పటినుంచో సంగీతంపై కూడా విశ్లేషణ వ్రాద్దామని అనుకుంటున్నాను. కానీ విశ్లేషణలు వ్రాయలనిపించేంత సాహిత్యం, సంగీతం ఈ మధ్య కాలంలో నేను వినలేదు. “క్రిష్” దర్శకత్వంలో రాబోయే “కంచె” చిత్రంలోని గీతాలు మనసారా మంచి సాహిత్యం వినాలనే నా కోరికను తీర్చడమే కాకుండా తెలుగు సినిమా సాహిత్యం ఇంకా “బ్రతికే” ఉందన్న విషయాన్ని కూడా తెలియజేసింది. ఇందుకు కారణం శ్రీ “సిరివెన్నెల” సీతారామశాస్త్రి గారే. అనేక సంవత్సరాలుగా నా హృదయ సామ్రాజ్యాన్ని తన సువర్ణాక్షరాలతో పరిపాలిస్తున్న ఈ కవి మహారాజు మరోసారి తన కలం జూలు విదిల్చి చెలరేగిపోయారు. ఈ నా మొదటి సంగీత విశ్లేషణ ఆయన కలానికి, హృదయానికి నేను అర్పిస్తున్న ఓ చిన్న అంజలి. సంగీత విశ్లేషణలు వ్రాసే అలవాటు లేదు కనుక ఏ విధంగా వ్రాయాలో తెలియదు. మనసుకు అనిపించింది వ్రాస్తున్నాను. పెద్దదిగా అనిపిస్తే పాఠకులు మన్నించగలరు.
ముందుగా, శాస్త్రిగారికి ఇంత మంచి సాహిత్యం అందించే అవకాశం కల్పించిన కథను వ్రాసిన దర్శకుడు క్రిష్ కి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే చిత్రపు కథకు తగ్గట్టుగా భావోద్వేగపు సంగీతాన్ని అందించిన “చిరంతన్ భట్”ని కూడా అభినందిస్తున్నాను. ఇందులోని గీతాల వరుస ప్రకారంగా విశ్లేషణ ప్రారంభిస్తాను…
1) ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో (గానం : అభయ్ జోధ్పూర్కర్, శ్రేయా ఘోషల్) :
ఇది తనకు ఇష్టమైన గీతమని, మిగతా గీతాలతో పాటు దీన్ని కూడా వినమని చిత్రపు గీతాల వేడుకలో శాస్త్రిగారు చెప్పారు. ఈ పల్లవిలాగే ఇది ఓ కమ్మని గీతం. ముఖ్యంగా మొదట అభయ్ “ఇటు ఇటు ఇటు…” అనగానే “ఏమో…” అనే పదం శ్రేయా గొంతుకలో ఎప్పటిలాగే మధురంగా వినిపిస్తుంది. బాణీ కూడా హుషారుగా సాగుతుంది.
ఇద్దరి ప్రేమికుల మనస్తత్వాలను తన కవితా హృదయంతో చెప్పిన తీరు ఎప్పటిలాగే సహజంగానే బాగుంది. దానికి ఉదాహరణే ఈ క్రింది వాక్యాలు…
“ఒకొక్క రోజుని ఒకొక్క గడియగా కుదించే వీలవక
చిరాకుపడి ఎటు పరారయ్యిందో ఈ సమయం కనబడక…”
“ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా
తనోటి ఉందని మనం ఎలాగా గమనించం గనక…”
బాణీ వేగంగా ఉండడంతో బహుశా అందరు ఈ వాక్యాలపై మనసు సారించలేరేమో కానీ ఇది చదివాక సాహిత్య ప్రియులు వాటిపై మనసు పెడితే అక్కడే రచయిత విజయం ఉంది.
2) ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది (గానం : శంకర్ మహదేవన్) :
ఈ గీతం గురించి గీతాల వేడుకలో పెద్దగా వినలేదు. కానీ ఇది మనుసును తాకే ఓ చక్కటి రచన. “శంకర్ మహదేవన్” గాత్రం ఈ గీతాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఇది వినగా, ఊరులో ఓ దేవుడి కళ్యాణ వేడుకను అందరు కలిసి సంబరంగా కలిసే ఘట్టంలా అనిపించింది. ఇందులోనే కథానాయకుడి పాత్ర పరిచయం కూడా ఉండొచ్చు. దేశాల మధ్యే కాదు, మనుషుల మధ్య, వారి మనసుల మధ్య కూడా అనేక కంచెలున్నాయని చెప్పడానికే ఈ చిత్రానికి “కంచె” అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. కనుక అందరు ధన భేదాలు, కులమత భేదాలు లేకుండా కలిసుండాలనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా మనం ఆశించవచ్చు. ఇదే విషయాన్ని ఈ గీతంలోని కొన్ని వాక్యాలు తెలుపుతాయి,
“పెద్దోళ్ళు, పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాల. కానోళ్ళనే మాట లేకుండా పోవాల!”,
“కొడవళ్ళు, నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా!”
“కడుపారా ఈ మన్ను కన్నోళ్ళే అంతా, కులమొచ్చి కాదంటదా!?”
సరళమైన మాటల్లో శాస్త్రిగారు ప్రశ్నలను సంధించి, వాటికి సమాధానం కూడా ఇచ్చారు. ఈ గీతంలో నాకు అమితంగా నచ్చిన వాక్యాలివి. ఇవి ఇంతగా నచ్చడానికి శంకర్ గాత్రం మరియు సులువుగా నెమరువేసుకునేలా ఉన్న చిరంతన్ బాణీ కూడా కారణాలు. ఈ ముగ్గురి కృషిని అభినందించాలి.
3) నిజమేనని నమ్మని (గానం : శ్రేయా ఘోషల్) :
సాహిత్యం తక్కువగా ఉన్న ఈ గీతం నిరాశావాదం, ఎదురుచూపుల నుండి పుట్టినదిలా అనిపిస్తుంది. అందుకే “నిజమేనని నమ్మని అవునా అనే మనసుని” అని మొదలవుతుంది. బహుశా కథానాయకుడి కోసం కథానాయిక వేచి చూసే తరుణంలో ఈ గీతం వస్తుందేమో. ఆ విషయం ఈ క్రింది వాక్యాలు చెబుతున్నాయి,
“కనుపాపలోని ఈ కలల కాంతి కరిగేది కానే కాదని
గత జన్మలన్నీ, మరుజన్మలన్నీ ఈ జన్మగానే మారని…నీ జంటలోనే చూడని!!”
తిరిగోస్తాననే నమ్మకాన్ని తన మనసుకు కలిగించమని, అతడి కోసం మరో జన్మ వరకు వేచివుండలేనని, అన్ని సంతోషాలు ఈ జన్మలోనే అతడితోనే పంచుకునే అవకాశం కల్పించమని కథానాయిక పాత్ర కథానాయకుడి పాత్రను అడుగుతోంది. ఇలాంటి రచనలు శాస్త్రిగారికి సిగరెట్ తాగినంత సులువు.
ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్ గాత్రం బాగా దగ్గర చేసింది.
4) భగ భగమని (గానం : విజయ్ ప్రకాష్) :
ఈ గీతం పూర్తిగా శాస్త్రిగారి శైలిలో సాగేది. ఆయన సాహిత్యం ఉపమానాలకు పెట్టింది పేరు. తను చెప్పాలనుకున్న విషయాలను వేరే విషయాలతో పోలుస్తూ (ఎక్కువగా ప్రకృతిలోని అంశాలతో) చెప్పడం ఆయన రచనల్లో ఎక్కువగా కనిపించే అంశం. అదే పోకడ ఈ గీతంలోనూ వినిపిస్తుంది. ఈ చిత్రం ప్రధానంగా యుద్ధ నేపథ్యంలో జరిగేది. ఓ యుద్ధం వల్ల పొందేది ఏమిటో పోయేది ఏమిటో ఈ పాటలో ప్రశ్నించిన వైనం మనకు అర్థమవుతుంది…
“భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో?”
“ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో?”
యుద్ధంలో గెలుపు ఓ “అభివృద్ది” అని, యుద్ధం చేసేది కూడా శాంతి కోసమేనని కొన్ని వాదనలున్నాయి. అవి వారి దృష్టిలో నిజాలే కావొచ్చు కానీ ఎవరి గెలుపు, శాంతుల కోసం? ఓ యుద్ధం వల్ల గెలిచిన దేశ రాజకీయాలెన్నో కానీ చిద్రమయ్యే బ్రతుకులు మాత్రం అనేకం. ఇది చెప్పేవే పై రెండు వాక్యాలు,
“ఏ పంటల రక్షణకీ కంచెల ముళ్ళు?”
“ఏ బ్రతుకుని పెంచుటకీ నెత్తుటి జల్లు?“
“కంచె” వేసేది పంటల రక్షణ కోసం. ఇక్కడ “కంచె” అనే పదం ఉద్దేశ్యించింది దేశాల మధ్యనున్న “సరిహద్దులు”. వీటికోసం జరిగే యుద్ధాల వల్ల అవి భౌగోళిక కంచెలుగానే కాకుండా మానసిక కంచెలుగానూ మారుతున్నప్పుడు, అటువంటి “కంచె”లతో ప్రజలను కాపాడాలనుకునే మూర్ఖత్వాన్ని, యుద్ధంలో గెలుపొంది తమ శక్తిని చాటుకొని అదే అభివృద్ధి అని విర్రవీగే దేశాల వెర్రితనాన్నిఎత్తి చూపేవి పై రెండు వాక్యాలు.
“ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు!
ఏ దాహము తీర్చవు ఈ కారుచిచ్చులు!”
చరిత్రలో యుద్ధం జరిగి కొన్ని వేల ప్రాణాలు పోయిన తరువాత ఆయా దేశాలు సంధికి దిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత స్నేహం కోసం చేతులు కలిపే ఆ మూర్ఖత్వపు కక్షలు నిజంగా స్నేహాన్ని కోరవనే సత్యాన్ని చెప్పేవి పై రెండు వాక్యాలు. ఈ రెండో వాక్యానికి స్ఫూర్తి భారతంలోని “ఖాండవ దహనం” ఘట్టమని తెలుస్తుంది.
“చావులో విజయం వెతుకు ఈ వినోదం పొందదే ఎపుడు మేలుకొలుపు”
సినిమాను కేవలం వినోదం కోసం చూసేవాడు దాన్నుండి పాఠాలు నేర్చుకోవాలి అనుకోడు. అలాగే, ఎదుటివాడి చావుని ఆనందించేవారికి ఆ “చావు” ద్వారా ఎప్పటికీ మేలుకొలుపు కలగదన్న విషయాన్ని ఈ వాక్యంలో చెప్పారు.
ఇక ఈ గీతంలో కొన్ని క్లిష్ట వాక్యాలున్నాయి. “విధాత తలపున ప్రభవించినది…” అనే పదాలను తన మొదటి చిత్రంలోనే వ్రాస్తే, ప్రేక్షకుడు తన స్థాయిని పెంచుకొని, అర్థం చేసుకొని ఆదరించాడని “ఇప్పుడు” కూడా అలాగే వ్రాసినా ఫరవాలేదని, ప్రేక్షకుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడని దర్శకుడు క్రిష్ శాస్త్రిగారితో అన్నారట. కానీ సినిమా పాటలో సంగీతంతో పాటు సాహిత్యం కూడా ఉంటుందని, అందులో ఓ భావన, ఓ వేదన ఉంటాయని ఇప్పటి తరం గుర్తించే స్థితిలో ఏమాత్రం లేదు. వాటిని అర్థం చేసుకోవడానికి తమ సమయాన్ని, తెలివిని ఖర్చుపెట్టరు కనుక ఆ వాక్యాలను, వాటి అర్థాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను,
“నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం
మృదులాలస స్వప్నాలస హృత్కపోత పాతం
పృథువ్యధార్త పృథ్విమాత నిర్ఘోషిత చేతం
నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం
ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం?”
“నిశి” అంటే “చీకటి”, “నిషాదం” అంటే “వేటగాడు”, “భూజం” అంటే “వృక్షం”. ఇక్కడ ప్రస్తావించిన చీకటి “అజ్ఞానం”. మనుషుల్లోని అజ్ఞానమే వారిమధ్య ఏర్పడ్డ “కంచె”లకు కారణమని చెబుతూ ఓ యుద్ధపు పరిణామాలను తెలిపే వాక్యాలు ఇవి. నాకు అర్థమైన భావం ఇదే. తప్పైతే విమర్శించండి.
“ఈ యుద్ధం ఓ అజ్ఞానుడైన వేటగాడు వదిలిన బాణం. మనసు కన్న మధురమైన కలలన్నీ ఆ బాణం తగిలిన పావురంలా రాలిపోయాయి. తన బిడ్డల శవాలను మోస్తున్న భూమి ఎంతో వ్యధతో ఆర్తనాదం చేస్తోంది. ఈ యుద్ధపు పరిణామం కష్టమైన నిశ్వాసంతో (వదిలే ఊపిరి) ఆలపిస్తున్న నిశ్చేష్టిత (మాటరాని) గీతం లాంటిది. అనగా, అది చేసిన నష్టం అందరు ఖంగు తినేలా చేసింది. ఏ విషపు విత్తనం పెంచింది ఈ విషాద వృక్షం?”
ఇలా ప్రతీ వాక్యాన్ని వివరించుకుంటూ పోతే ఒక్క విశ్లేషణ సరిపోదు కనుక ఈ గీతం గురించి ఇంతటితో ముగిస్తున్నాను. ఈ గీతంలో లోతుతో పాటు ఓ లోటు కూడా ఉంది. అదే గాయకుడి ఎంపిక. “కృష్ణం వందే జగద్గురుమ్”లోని దశావతారములు సంకలనానికి “బాలు” గారు సరైన ఎంపిక. ఇక్కడ “విజయ్ ప్రకాష్” ఈ గీతం కోసం ఎక్కువగా కష్టపడినట్టు అనిపిస్తోంది. పైగా అతడి గానం మరియు ఉచ్చారణ ఈ గీతానికి సరిగా అతికినట్లు అనిపించలేదు. ఒకవేళ ఇది నేపథ్య గీతమైతే, “బాలు” లాంటి స్వచ్ఛమైన ఉచ్చారణ ఉన్న గాయకుడిని ఎంపిక చేసుంటే బాగుండేదేమో అనిపించింది.
5) రా ముందడుగేద్దాం (గానం : విజయ్ ప్రకాష్, కీర్తి సగాతియా) :
ఇది ఈ చిత్రానికే అతి ప్రత్యేకమైన గీతం. “కృష్ణం వందే జగద్గురుమ్”లో దశావతారముల సంకలనం కన్నా గొప్పగా స్పృశించిన గీతం. ఇందులోని ప్రతి వాక్యం మేలుకొలుపు కలిగించేదే.
“విద్వేషం పాలించే దేశం ఉంటుందా?
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?
ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?
అడిగావా భూగోళమా? నువ్వు చూశావా ఓ కాలమా?”
“మనిషి అంటేనే మంచోడు” అనే మాటను స్పృశించేలా ఉన్న ఈ గీతపు వాక్యాలు ఈ చిత్రానికి ఇదే అత్యుత్తమ గీతంగా నిలబెట్టాయి అనడంలో అతిశయోక్తి లేదు.
“రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం
రాబందుల రెక్కల సడియే జీవన వేదం”
“పిడివాదం” అనే పదం యుద్ధాన్ని సూచిస్తుంది. అంటే యుద్ధాన్ని నమ్ముకొన్న మనుషులంతా జాలి, దయలేని రాక్షసుల్లా మారిపోతారు, వారు పుట్టించిన శవాలను తినే రాబందుల రెక్కల చప్పుడే నిత్యం చెవులకు వినబడుతుంది. ఆ రాక్షసత్వమే మనిషి జీవితానికి పరమార్థంగా మారిపోతుందని ఆ మాటల భావమని అనుకోవచ్చు. లేదా, రెండో వాక్యాన్ని “మనిషిని మనిషి చంపుకోవడమే జీవిత పరమార్థం” అని కూడా అర్థం చేసుకోవచ్చు.
“రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందాం
నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం”
ఈ మాటలు కూడా చాలా బరువైనవి. నేటి తరానికి బ్రతుకు మీద ఆశ, బ్రతకడానికి ధైర్యం ఉంటేనే రేపటి తరం వస్తుంది. ప్రపంచయుద్ధంలో చిద్రమైన బ్రతుకులకు “రేపు” ఉందనే నమ్మకం కలిగించాలి. అందుకే “రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందాం” అన్నారు శాస్త్రిగారు. ఓ శిశువు ఆరోగ్యకరమైన జీవితానికి దోహదం చేసే మొదటి అంశం “తల్లి పాలు”. రేపటి తరం భూమిపైకి వచ్చిన తరుణంలో ఈ ప్రపంచంలో సంతోషంగా బ్రతికగలిగే భరోసాను ఇవ్వాలన్న ఆలోచనను “ఆశల స్తన్యం” అనే మాటతో చెప్పారేమో అనిపిస్తుంది.
“ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం
ఆ తలపే మన గెలుపని అందాం”
ఈ రెండు వాక్యాల్లో వసుధైక కుటుంబాన్ని గురించి ప్రస్తావించారు. భూగోళం అంతా ఒకటే దేశమే ఉండి, అందరు కలిసిమెలసి ఉండే ప్రయత్నం చేయాలని (ఇది ఎలాగు అసాధ్యం), ఆ ప్రయత్నం చేయాలనే “ఆలోచన” చాలు, అదే వసుధైక కుటుంబానికి నాంది అని ఈ వాక్యాల భావం.
మరిన్ని ప్రత్యేకతలు :
- పూర్తిస్థాయి తెలుగు సాహిత్యం. దీనికి ముందుగా దర్శకుడు క్రిష్ ని అభినందించాలి. చరిత్రను స్పృశించే కథను ఎంచుకున్నందున ఈ చిత్రంలోని అన్ని గీతాలు పూర్తిస్థాయి తెలుగు భాషలో ఉంటాయి. ఎక్కడా ఒక్క పరభాషా పదం లేని సాహిత్యం ఇది.
- చిరంతన్ భట్ సంగీతం. చిత్రపు కథ జరిగే కాలానికి తగ్గట్టుగా ఎంతో బరువైన సంగీతాన్ని అందించారు.
బలహీనత :
సరిగా లేని ఉచ్చారణ. బాణీలు బాగున్నా, సంగీత దర్శకుడు తెలుగువాడు కాకపోవడం వల్ల ఇంతటి సాహిత్యం పట్ల పూర్తి అవగాహన లేకపోయి ఉండొచ్చు. పైగా ఎంచుకున్న గాయకులెవరూ తెలుగువారు కాకపోవడంతో పదాల ఉచ్చారణ పలు చోట్ల బాగోలేదు. ఉదాహరణకు, “భగ భగమని” గీతంలో “పుడమి వొళ్ళు” అనే మాట “పుడమి వొల్లు”గా వినిపించింది. అలాగే “రా ముందడుగేద్దాం” గీతంలో “మారణహోమం” అనే పదం “మారనహోమం”గా వినిపించింది. ఇక ఒత్తులు, పొల్లులు మొత్తానికే మాయమైపోయాయి. ఈ విషయంలో దర్శకరచయితలు కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది.
చివరి మాట :
ఇంతగా ఈ సాహిత్యం గురించి విశ్లేషణ వ్రాశానంటే, అది నన్ను ఎంతగానో కదిలించిందని అర్థం. నిద్రిస్తున్న ఓ మనిషిలోని మానవత్యాన్ని, అజ్ఞానాన్ని అంతమొందించే జ్ఞానాన్ని తట్టి లేపే శక్తి ఒక్క సాహిత్యానికే ఉంది. పైగా నా విషయంలో శాస్త్రిగారి సాహిత్యం పలుమార్లు ఆ పని చేసింది. వేటూరి గారి తరువాత తెలుగు సినిమాకు దొరికిన అత్యద్భుతమైన కవి “సీతారామశాస్త్రి”. ఇప్పటి తీరిక లేని బ్రతుకుల్లో సంగీతం కేవలం ఉపశమనానికి వింటున్నారే తప్ప అందులో ఓ సాహిత్యం ఉంటుందని, దానికి ఓ భావం ఉంటుందని చాలామంది గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అందుకే సినిమా సంగీతం అంటే సంగీతంతో పాటు సాహిత్యం కూడా ఉంటుందని చెప్పడానికే ఇంత పెద్ద విశ్లేషణ వ్రాయల్సివచ్చింది.
శాస్త్రిగారి గురించి మరికొంత :
శాస్త్రిగారు పూర్తి కథ వినకుండా ఎప్పుడూ పాటలు వ్రాయలేదట. కథ మొత్తం విని, తాను వ్రాసే పాటల్లో అ కథ తాలూకు సారాంశాన్ని ఇమిడింపజేయడం ఆయన అలవాటని విన్నాను. బహుశా అందుకే ఆయన పాటలు వింటే, అది కథలో ఎలాంటి సమయంలో వస్తుందో, ఆ కథ ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఊహించవచ్చు. అంటే, చిత్రం చూడటానికి వెళ్ళే ప్రేక్షకుడికి ముందే ఆ కథను పరిచయం చేసి అతడి మనసుని దానిపై స్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆయన సాహిత్యం వల్ల ఓ చిత్రం సులభంగా మనసకు దగ్గరవుతుంది.
ఈ విశ్లేషణ ఆయన కనే కలలకు, వాటిని మనకు చేరవేసే ఆయన కలానికి అంకితం. తప్పులుంటే మన్నించి క్రింద విమర్శిస్తే సరిచేసుకుంటాను.
ఈ చిత్రపు గీతాలను ఇక్కడ వినవచ్చు,
https://www.youtube.com/watch?v=QyvKrU9jP8Q
– యశ్వంత్ ఆలూరు
Good analysis :thumb:
LikeLike