తెలుగులో “తెలుగు” చరిత్రను చూపించిన చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. మనకున్న గొప్ప చరిత్రలలో వీరనారి “రాణి రుద్రమదేవి” కథ ఒకటి. చాలామందికి ఆవిడ రాణిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించి వీరమరణం పొందిన స్త్రీగానే తెలుసు. కానీ ఆవిడ జీవితం చరిత్రలోకి ఎక్కిందంటే దాని వెనుక ఆవిడ పడిన కష్టాలెన్నో ఉన్నాయి. ఆ విషయాలకు దృశ్యరూపం కల్పిస్తూ, సృజనాత్మక దర్శకుడు “గుణశేఖర్” స్వీయనిర్మాణంలో రూపొందించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క ప్రధాన పాత్రలో నటించగా, రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యమేనన్, సుమన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
నేను అభిమానించే దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఆయన రూపొందించిన ఈ చిత్రం గురించి నేను వ్రాస్తున్నది “సమీక్ష” కాదు. ఇది ఓ “విశ్లేషణ”. పెద్దదిగా అనిపిస్తే మన్నించండి.
కథ :
కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వీరనారి “రుద్రమదేవి” (అనుష్క) జీవితం ఆధారంగా తెరకెక్కిన కథ ఇది. రుద్రమ పుట్టుక దగ్గర నుండి ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనలను గురించి, ఆ కాలపు తిరుగుబాటుదారు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) గురించి చర్చిస్తుంది ఈ చిత్రం.
కథనం – దర్శకత్వం :
ముందుగా ఇలాంటి భావోద్వేగపు చరిత్రను ప్రేక్షకుడి కళ్ళకు కట్టాలనుకొని ఎంతగానో పరిశోధించి చిత్రాన్ని తీసిన “గుణశేఖర్”ని మనస్పూర్తిగా అభినందించాలి. కారణం, ఆ చరిత్రలోని కొన్ని అంశాలు నివ్వెరపోయేలా చేశాయి. ఆ చరిత్రను సినిమాగా చూపించాలంటే దానికి ఓ క్రమం కావాలి. అందుకని, సినిమా కోసం జరిగిన సంఘటనల క్రమాన్ని మారుస్తూ, కాస్త నాటకీయత జోడించి, ఎక్కడా చరిత్రను అవమానపరచకుండా కథను వ్రాసుకున్నందుకు “సాహో గుణశేఖర్!”
సరే… ఇప్పుడు గుణశేఖర్ తీసిన “రుద్రమదేవి” అనే “చిత్రం” గురించి మాట్లాడుకుందాం. ఓ కథ చరిత్రగా మిగిలిపోయింది అంటే దానికి కారణం అందులోని భావోద్వేగాలే అని నా అభిప్రాయం. రామాయణం, మహాభారతం ఇలాంటి కథలకు ఆజ్యం పోసి, వాటిని చరిత్రలుగా, ఇతిహాసాలుగా నిలబెట్టింది ఆ భావోద్వేగాలే. కనుక ఓ చరిత్రను చలనచిత్రంగా మలచాలంటే దృష్టిలో పెట్టుకోవాల్సిన మొదటి విషయం ఆ భావోద్వేగాలను ప్రేక్షకుడికి చేరవేయడమే. రుద్రమదేవి గురించి తెలుసుకునే సమయంలో గుణశేఖర్ ఎంత భావోద్వేగానికి గురయ్యాడో, అతడికి ఆ చరిత్ర పట్ల ఎంత గౌరవం ఉందో అతడు వ్రాసుకున్న కథే చెప్తుంది.
గుణశేఖర్ కు సినిమా అంటే అమితమైన పిచ్చే కాదు, గౌరవం కూడా. అందుకే అతడి చిత్రాల్లో సాంకేతిక విభాగపు ఎంపికలోనూ ఓ మంచి అభిరుచి కనబడుతుంది. అవే అతడి చిత్రాలను ప్రేక్షకుడికి గుర్తుండేలా చేస్తాయి. ఈసారి కూడా రుద్రమదేవి కథను తీయాలనుకున్నప్పుడు అతడికి అలాంటి విషయాలు తోడుగా ఉన్నాయి. ఒక గొప్ప కథ, ఎలాంటి కథకైనా న్యాయం చేయగల అద్భుతమైన “మేస్ట్రో ఇళయరాజా” సంగీతం, ఆ సంగీతానికి “సొంత సోయగాలే బరువైన మేనిలో… వింత సౌరభాలే చిలికించు శ్వాసలో” అని కుదిరిన “సీతారామశాస్త్రి” సాహిత్యం, ప్రేక్షకుడు చూసే విధానాన్ని బట్టి తెరపై చిత్రాన్ని మార్చే “స్టీరియోస్కోపిక్ 3D” (stereoscopic 3D) పరిజ్ఞానం, అందులో పటిమ ఉన్న “అజయ్ విన్సెంట్” ఛాయాగ్రహణం, పలు అవార్డులు గెలుచుకున్న “తోట తరణి” కళాదర్శకత్వం (art direction), తలపండిన “నటబృందం”, కథను ప్రేక్షకుడికి పరిచయం చేసేందుకు గంభీరమైన “మెగాస్టార్” కంఠం, ఇలా ఎన్నో అంశాలు గుణశేఖర్ కి వెన్నుదన్నుగా నిలిచాయి.
గుణశేఖర్ చిత్రాల్లో భావోద్వేగాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. “చూడాలనివుంది”, “ఒక్కడు” చిత్రాల్లో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలైతేనేమి, “అర్జున్”లో సోదరిని కాపాడుకోవాలనే మహేష్ పాత్రలోనైతేనేమి భావోద్వేగాలకు ప్రత్యేక చోటు దక్కింది. ఇప్పుడు ఎంచుకున్న రుద్రమదేవి జీవితంలోనూ సున్నితమైన అంశాలెన్నో ఉన్నాయి. కానీ దాని పరిశోధనలో అతడు లోనయిన భావోద్వేగాలను యథాతథంగా ప్రేక్షకుడికి చేరవేయలేకపోయాడని నా అభిప్రాయం. ఎందుకంటే పైన చెప్పుకున్న చిత్రాలు, పాత్రలలోకంటే ఇందులోని కథకు, పాత్రలకున్న భావోద్వేగాలు ఎన్నో రెట్లు అధికం. పుట్టుకతో స్త్రీ అయి, రాజ్య సంక్షేమం కోసం అందరి దృష్టిలో “రుద్రదేవుడు”గా మెలుగుతూ, ఓ రహస్య ప్రదేశంలో, ఎవరూ చూడని సమయంలో అమ్మాయిగా మెలిగే రుద్రమదేవి పడిన మానసిక క్షోభను మరింత హృద్యంగా చూపించి ఆ పాత్రను నెలకొల్పి ఉంటే ఎంతో బాగుండేది. అలాగని ఈ పాత్రకు అన్యాయం కూడా చేయలేదు గుణశేఖర్. రుద్రమదేవి పాత్ర తెలిసీతెలియని వయసులో ఉన్నప్పుడు ఆ భావోద్వేగాన్ని బాగా పండించాడు. అలాగే “పున్నమి పూవై” గీతం కూడా రుద్రదేవుడికి రుద్రమదేవిగా మెలిగే స్వేచ్చను బాగా ఇచ్చింది. ఈ పాత్ర విషయంలో గుణశేఖర్ చేసిన మరో తప్పుంది. మదగజంతో పోరాడే సన్నివేశంలో సింహాన్ని కాకుండా రుద్రదేవుడినే (అనుష్క) చూపించి ఉంటే ఆ పాత్ర తాలూకు రౌద్రరసం బాగా పండి దానికి న్యాయం జరిగేది.
ఓ సగటు భారతీయుడు ఒప్పుకోలేని కొన్ని అంశాలు రుద్రమదేవి జీవితంలో జరిగాయి. చిత్రం చూస్తున్నప్పుడు అవి నివ్వెరపోయేలా చేశాయి. చరిత్రను యథాతథంగా చూపించాలి. కానీ సినిమా కోణంలోంచి చూస్తే, ఆ నిజాల్లోనూ నాటకీయతను పండించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకు రుద్రదేవుడు ముక్తాంబను (నిత్యమేనన్) పెళ్ళాడే సమయంలో అతడి (ఆమె) భావోద్వేగాన్ని, నిజం తెలిసి కూడా అంతటి త్యాగానికి పూనుకున్న ముక్తాంబ పరిపక్వతను (maturity) ప్రేక్షకుడికి “అయ్యో పాపం!” అనే భావన కలిగించేలా చేసుంటే ఎంతో బాగుండేది. ఓ “లాంగ్ షాట్” (long shot)తో పెళ్ళితంతుని చూపించి, “ఆడదాన్ని! మరో ఆడదాని స్పర్శని గుర్తించలేనా?” అనే చిన్నమాటతో ముక్తాంబ పాత్రను, ఆ ఘట్టాన్ని తెగ్గొట్టేశాడు గుణశేఖర్. తాళికట్టే సమయంలో, ఓ క్లోజప్ షాట్ (close-up shot) తో రుద్రదేవుడిలోని మనోవేదనను, “స్పర్శ”తో కాకుండా మరో బలమైన కారణంతో ముక్తాంబకు న్యాయం చేసుంటే ఆ ఘట్టం గుండెలో నిలిచిపోయేది.
రుద్రమదేవి అన్నింటినీ మించిన వాణిజ్య (commercial) చిత్రమని గుణశేఖర్ అన్న మాట నిజమే. ఇందులోని “గోన గన్నారెడ్డి” పాత్ర దానికి మంచి ఉదాహరణ. పైగా దాన్ని అల్లు అర్జున్ లాంటి స్టార్ పోషించిన విధానం అదనపు బలాన్నిచ్చింది. ఆ పాత్రకు వ్రాసిన మాటలు మరో ప్రత్యేకం. ముఖ్యంగా “గమ్మునుండవోయ్!” మరియు “నా మొలతాడులా తాయత్తు” అనే మాటలు జనాల నోళ్ళలో కొన్ని రోజులు బాగా నానుతాయి అనడంలో సందేహం లేదు. నీరసించే కథనానికి ఓ కొత్త ఊపిరిని పోసింది ఈ పాత్ర పరిచయం. కానీ విరామపు సన్నివేశాన్ని ఒప్పించేలాగా, అలాగే కథనపు ఔన్నత్యాన్ని (eminence) పెంచేలా తీసుంటే ఇంకా బాగుండేది. తరువాత రెండో సగంలో గన్నారెడ్డి మీదున్న సన్నివేశాలను బాగా తీశాడు గుణశేఖర్.
రెండో సగంలో పలుచోట్ల చిత్రం మనసుకి దగ్గరగా వచ్చింది. దానికి ఓ కారణం మహామంత్రి శివదేవయ్య (ప్రకాష్ రాజ్) పన్నే రాజతంత్రం (political game). దీనికి తోడు “అంత:పురంలో అందాల చిలక” గీతం ఓ చక్కని ఉపశమనం. అనుష్క, నిత్యమేనన్, కేథరిన్ లాంటి అందగత్తెలపై చిత్రీకరించిన ఈ గీతం రాజాగారి ప్రతిభను, గుణశేఖర్ అభిరుచిని మరోసారి రుచి చూపించింది. చిత్రం మొత్తంలో నన్ను భావోద్వేగానికి గురిచేసింది “రుద్రమదేవి పట్టాభిషేకం” ఘట్టం. ఇక్కడ పరుచూరి వారి మాటలు, ప్రకాష్ రాజ్ నటన, గుణశేఖర్ కథనం బాగా పండాయి. ఈ చిత్రానికి ఉత్తమ సన్నివేశంగా దీన్నే చెప్పొచ్చు. ఇది పాత్రల ఔన్నత్యాన్ని కాకుండా చిత్రపు ఔన్నత్యాన్నే పెంచేసింది. “అల్లకల్లోలమయే దేశమ్ము నేడు” అనే గీతం ప్రకాష్ రాజ్ నటనాప్రతిభను చాటడమే కాకుండా, శివదేవయ్య పాత్రకు ఆయనని మించిన ఎంపిక ఉండదని తెలిపింది.
చరిత్రను చెప్పుకోవడానికి మరో కారణం అందులోని “యుద్ధాలు”. అది కథాపరంగా బాగుంది కానీ, కథనపు పరంగా నిరాశపరించింది. దీనికి, నాణ్యత లేని విజువల్ ఎఫెక్ట్స్ (visual effects), ప్రభావం లేని పోరాటాలు లాంటి పలు కారణాలున్నాయి. దీనికి తోడు, యుద్ధ నేపథ్యంలో “సింఫనీ ఆర్కెస్ట్రా”ని (symphony orchestra) వాడడం సబబు కాదనిపించింది.
మొత్తానికి, రుద్రమదేవి కథాపరంగా అద్భుతమైన పరిశోధన కలిగిన చారిత్రాత్మక చిత్రం. “తెలుగోడిని” అని చెప్పుకునే ప్రతి తెలుగోడు తన చరిత్రను తెలుసుకోవాడానికి ఈ చిత్రాన్ని చూడాలి. నేను దీన్ని 2D మరియు 3Dలోనూ చూశాను. 2D కన్నా 3Dలోనే చిత్రపు నాణ్యత (quality) బాగుంది. ఇది తీయడమే 3Dలో జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు 3Dలోనే చూడాలని మనవి చేసుకుంటున్నాను.
ఇక నటనల విషయానికి వస్తే, అనుష్క రుద్రమదేవిగా బాగా సరిపోయింది. మరో కథానాయికను ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా ఆ పాత్ర అనుష్కకు నప్పింది. కానీ తన పాత్రను ఇంకాస్త నెలకొల్పే ప్రయత్నం చేసుంటే బాగుండేది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటన అందరికన్నా చెప్పుకోదగినది. ఈ పాత్ర తాలూకు అన్ని విషయాల్లో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ వహించాడు. కొన్ని చిత్రాలకు “స్టార్” చేసే మేలెంతో చూపించింది ఈ పాత్ర. చాళుక్య వీరభద్రుడిగా రానా సరిపోయినా నటనకు ఎక్కువ ఆస్కారం లేని పాత్ర అది. పైన చెప్పుకున్నట్టుగా, శివదేవయ్యగా ప్రకాష్ రాజ్ సరైన ఎంపిక. రుద్రమ తండ్రి గణపతి దేవుడిగా కృష్ణంరాజు గారికి చెప్పుకోదగ్గ పాత్ర లేదు. ఇక హరిహర దేవుడు, మురారి దేవుడుగా సుమన్, ఆదిత్య మేనన్ లకు పెద్ద పాత్రలే దక్కాయి కానీ అస్తమానం ఒప్పించలేని క్రూరత్వంతో అవి తేలిపోయాయి. పాత్ర పెద్దగా నెలకొల్పబడినది కాకపోయినా, ముక్తాంబగా నిత్యమేనన్ నటన బాగుంది. ముఖ్య ప్రతినాయకుడైన మహాదేవుడి పాత్రలో విక్రంజీత్ సరైన ఎంపిక కాదనిపించింది. అతడి నటన ఏమాత్రం ఆకట్టుకోలేదు. కేవలం “బొమ్మాలి రవిశంకర్” గాత్రంపైనే (dubbing) ఆధారపడింది. ఇక మిగతా పాత్రలన్నింటిలో అనుభవుజ్ఞులైన నటులే ఉన్నప్పటికీ, అవి చెప్పుకోదగ్గ పాత్రలు కావు.
ప్రత్యేకతలు :
- కథ (story). చరిత్రలో జరిగిన పలు సంఘటనలను సినిమాకు అనుగుణంగా గుణశేఖర్ మార్చిన తీరు ఎంతో అభినందనీయం. ఇక్కడే అతడికి నూటికి నూరు మార్కులు వేసేయాలి.
- అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణం (cinematography). చారిత్రాత్మక చిత్రాలకు ఛాయాగ్రహణమే ప్రాణం పోస్తుంది. పైగా స్టీరియోస్కోపిక్ 3D పరిజ్ఞానంతో పరిచయం కలిగిన అజయ్ విన్సెంట్ పనితనం ఈ చిత్రానికి బాగా ఉపయోగపడింది.
- గోన గన్నారెడ్డి పాత్ర. ఈ చిత్రాన్ని బాగా బలపరిచింది ఈ పాత్ర మరియు ఇందులో అల్లు అర్జున్ నటన.
- తోట తరణి కళాదర్శకత్వం (art direction). చిత్రం కోసం వేసిన వేయి స్తంభాల గుడి సెట్ మరియు రుద్రమదేవి రహస్య అంత:పురం బాగా ఆకట్టుకున్నాయి.
- శబ్దగ్రహణం (sound recording). పలు సన్నివేశాల్లో గుర్రపు డెక్కల చప్పుడు, కత్తుల శబ్దాలు బాగా రికార్డు చేశారనిపించింది.
- చిరంజీవి గాత్రదానం (narration). చాలా రోజుల తరువాత, చాలా సేపు ఓ చిత్రంలో చిరంజీవి గొంతు వినిపించింది. కథ ఆయన గొంతులో వినిపించిన విధానం దాని మీద ఓ బలమైన ముద్రను వేసిందని చెప్పాలి.
- నిర్మాణ విలువలు (production values). చిత్రం కోసం తానే నిర్మాతగా మారి ఖర్చులో ఎక్కడా వెనుకాడలేదు గుణశేఖర్.
బలహీనతలు :
- కరువైపోయిన భావోద్వేగాలు (emotions). చరిత్రంటే భావోద్వేగాలు, భావోద్వేగాలే చరిత్రలో మిగిలిపోయాయి. వాటిని చేరవేయడంలో కాస్త తడబడ్డాడు గుణశేఖర్.
- నేపథ్య సంగీతం (background score). యుద్ధానికి సింఫనీ ఆర్కెస్ట్రా వాడకం దాని ఔన్నత్యాన్ని పెంచలేకపోయింది.
- నెమ్మదించిన కథనం (screenplay). ఒకసారి చెప్పిన విషయాలే వివిధ పాత్రల చేత మళ్ళీ మళ్ళీ చెప్పిస్తూ నెమ్మదిగా నడిచింది కథనం.
- విజువల్ ఎఫెక్ట్స్ (visual effects). పైన చెప్పుకున్నట్టుగా 2D కన్నా 3Dలోనే గ్రాఫిక్స్ బాగున్నాయి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కథను వ్రాసే దర్శకుడు భావోద్వేగానికి లోనయితే సరిపోదు, ప్రేక్షకుడు కూడా లోనయ్యేలా కథనాన్ని నడపాలి.
– యశ్వంత్ ఆలూరు
Avg movie, initial ga manchi impact undindi but slow ga aa effect poindi, esp 2nd half nil asalu edo jarugutundi scree meeda anthey, manam RD Character tho erakamga connect kaamu, aa twist anthasepu daachi time waste chesadu, interval ke nijam telisi akkada nitya and other charcters tho RD ni elevate chesi unte baagundedi
Gonagannareddy commercial hero type character tho janaalaki bagane nacchayi aa scenes,
rana waste asalu endukunnado teliyadu movie lo
LikeLike
I think second half only connects the audience to characters!
LikeLike