బ్రూస్ లీ – The Fighter (2015)

Ram-Charan-BruceLee-Movie-Audio-Success-Posters-2

ఓ పనిని సంకల్పిస్తే దాన్ని పూర్తిగా చేయాలి. సగంలో వదిలేస్తే మొదటికే మోసం. “శ్రీనువైట్ల” లాంటి దర్శకుడి నుండి “మార్పు” అందరూ కోరుకున్నారు. అతడు కూడా మారాలని సంకల్పించాడు. దాన్ని ఎంతవరకు సాధించాడన్నది “బ్రూస్ లీ – The Fighter” చిత్రం చెప్తుంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. దాదాపు ఆరేళ్ళ విరామం తరువాత “మెగాస్టార్ చిరంజీవి” ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించారు.

కథ :

తన సోదరి కావ్య (కృతి కర్బంధ) కలను నెరవేర్చడం కోసం చిన్నప్పటినుండి శ్రమిస్తుంటాడు కార్తీక్ (రామ్ చరణ్). సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పనిచేస్తున్న కార్తీక్ కి తన సోదరి ఓ సమస్యలో చిక్కుకుందన్న విషయం తెలుస్తుంది. దాన్ని అతడు ఎలా పరిష్కరించాడు? దాంతో అతడి జీవితంలో, కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చాయి అన్నవి ఈ కథాంశాలు.

కథనం :

శ్రీనువైట్ల చిత్రాలు ఎప్పుడూ లెక్కలతో వస్తాయి. అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను, ఇలా అన్ని వర్గాలను మెప్పించాలనే ఉద్దేశ్యంతో కథను పండుగ భోజనంలాగా అనేక అంశాలతో వండుతాడు. దీనికి “కోన వెంకట్” మరియు “గోపీమోహన్”ల సాయం ఎలాగూ ఉంది. కనుక ఈసారి కూడా అదే పోకడను అనుసరించాడు. కాకపోతే తన “మార్కు”గా చెప్పుకునే కొన్ని విషయాలనుండి బయటపడ్డాడు.

శ్రీనువైట్లలో కాస్త మార్పు వచ్చిందని మొదటి సగం చూపించింది. అందులో హాస్యం కన్నా భావోద్వేగాల మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. అవి బాగా పండాయి కూడా. ఎనిమిది చిత్రాలు చేసినప్పటికీ, నటుడిగా చరణ్ ఎప్పుడు నిరూపించుకోలేదు. కానీ శ్రీనువైట్ల చరణ్ నుండి నటనను రాబట్టే ప్రయత్నం చేశాడు. దీనికి ఉదాహరణే టీవీలో మాట్లాడే హీరో బ్రహ్మాజీ (బ్రహ్మాజీ) మాటలకు స్పందించే సన్నివేశం. మరో ఉదాహరణ, తన తండ్రి రామచంద్రరావు (రావు రమేష్)తో ఉన్న సన్నివేశాలు. చరణ్ కి కాస్త “కామెడీ టైమింగ్” ఉందన్న విషయం ఈ చిత్రం ద్వారా అర్థమయ్యింది. దీనికి తోడు రెండు కోణాల్లో కనిపించే జయప్రకాష్ రెడ్డి నటన నవ్వించింది.

ఇది కాకుండా అదనపు ఆకర్షణగా గీతాలను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా “రియా” గీతం బాగా ఆకట్టుకుంది. ఇందులోని చరణ్ నృత్యం, “మనోజ్ పరమహంస” కెమెరా పనితనం, చిత్రీకరించిన ప్రదేశం కనువిందుగా ఉన్నాయి. ఈ చిత్రానికి ఇదే ఉత్తమ గీతంగా చెప్పుకోవచ్చు. “కుంగ్ ఫు కుమారి” గీతంలో కూడా నృత్యం చాలా బాగుంది. అలాగే, మొదటి సగంలోని పోరాటాలు కూడా ఆకట్టుకున్నాయి. కథానాయకుడు స్టంట్ మ్యాన్, పైగా “బ్రూస్ లీ” అభిమాని కనుక ఈ అంశాలను వాడుకుంటూ మంచి పోరాటాలను చేశాడు “అనల్ అరసు”. ఇలా మొదటి సగం అటు కనువిందుగా ఉంటూ ఇటు బోరు కొట్టకుండానూ సాగింది.

ఎంత చెప్పుకున్నా, అంతా అల్పసంతోషమే. శ్రీనువైట్ల మారాడని విరామం సమయంలో మాట్లాడుకున్నంత సేపు మెలగలేదు అతడిలోని మార్పు. రెండో సగంలో మళ్ళీ “మైండ్ గేమ్”ని నడిపించే పాత శ్రీనుయే కనిపించాడు. దానికి ఓ బకరా కావాలి కాబట్టి సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడీ అలియాస్ “బ్రహ్మానందం” పరిచయమవుతాడు. అలాగని మునుపటి శ్రీను చిత్రాల హాస్యం కూడా కనిపించలేదు. దీన్ని అందరూ విమర్శించారు. కానీ నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే, మునుపటి చిత్రాల్లో బ్రహ్మానందం పాత్ర ప్రవేశిస్తే ప్రేక్షకుడు అతడి హాస్యాన్నే ఆనందిస్తాడు తప్ప అంతర్లీనంగా ఓ కథ జరుగుతోందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోడు. దానికి తోడు శ్రీనువైట్ల కేవలం బ్రహ్మానందం మీదే బ్రతికేస్తాడన్న నిందను కూడా మోస్తున్నాడు. బహుశా అందుకేనేమో ఈసారి బ్రహ్మానందాన్ని కాకుండా చరణ్ నే ఎక్కువగా వాడుకున్నాడు శ్రీను. దీన్ని మెచ్చుకున్నా, అతడి “మైండ్ గేమ్” పోకడను మాత్రం ఇక మెచ్చుకోలేను. ఒక సమస్య ఓ మనిషిని ఓసారైనా ఓడిస్తే కానీ తెలియదు దాని తీవ్రతెంతో. శ్రీను “మైండ్ గేమ్” కథానాయకుడిని అడుగడుగునా గెలిపిస్తూ, ఆ తీవ్రతను ప్రేక్షకుడు అనుభవించకుండా చేస్తుంది. దీన్ని బ్రహ్మానందం పాత్ర కప్పివేయడంతో ఇన్నాళ్ళు అతడి చిత్రాలు ఎలాగో నెట్టుకొచ్చాయి. ఈసారి అలాంటి పోకడకు దూరంగా వచ్చినందుకు ఇలాంటి విషయాన్ని పరిగణించి ఉంటే బాగుండేదేమో అనిపించింది.

ఈ మధ్యలో “లేచలో” గీత చిత్రీకరణ, అందులోని రకుల్ అందం ఉపశమనం కలిగించినా, రెండు పిల్లుల పోరు ఓ పిట్ట తీర్చింది అన్నట్టు కార్తీక్-రామచంద్రరావు సమస్యను ప్రతినాయకుడు జయరాజ్ (సంపత్) పరిష్కరించడంతో తెలుగు సినిమాలో ప్రతినాయకులు కూడా మంచే చేస్తారని అర్థమయ్యింది. దీని వల్ల ఆ పాత్రకు ఒరిగిందేమీ లేదు.

ఇదిలావుండగా, శ్రీనువైట్ల మారలేదేంటని ఆలోచిస్తుండగా, ఓ మెరుపు మెరిసింది. అదే, “మెగాస్టార్ చిరంజీవి”. “ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని…ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని” అని చిరంజీవి మీద వ్రాసిన మాటను మళ్ళీ నిరూపిస్తూ, అప్పటివరకున్న నిరాశను పటాపంచలు చేస్తూ, ఆరేళ్ళ తరువాత తెరపై మెగాస్టార్ మెరిసిన విధానం అద్భుతం. ఆ సమయంలో ఆయన పలికిన మాటలు, చేసిన పోరాటం, గుర్రపు స్వారీ ఇలా అన్ని విషయాలు ఆయన తీసుకున్న విరామాన్ని మరిచిపోయేలా చేశాయి. మళ్ళీ పూర్తిస్థాయిలో మెగాస్టార్ చిత్రాన్ని చూడాలనే కుతూహలాన్ని కలిగించాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయంలో అభినందించాల్సిన వ్యక్తులు మరో ముగ్గురున్నారు. కథనం నీరసించిన సమయంలో ఈ ఘట్టాన్ని తీసుకొచ్చిన శ్రీనువైట్ల, మెగాస్టార్ ని అద్భుతంగా చూపించిన ఛాయాగ్రాహకుడు మనోజ్ మరియు ఆయన పాత్ర ఔన్నత్యాన్ని (eminence) తన నేపథ్య సంగీతంతో పెంచిన తమన్.

రీళ్ళ పరిభాషలో చెప్పాలంటే “బ్రూస్ లీ” మొదటి సగపు రీళ్ళు మరియు చివరి మూడు రీళ్ళతో మార్కులు కొట్టేశాడు కానీ శ్రీనువైట్ల ఇలాంటి అతుకుల బొంతలు కుట్టడం మానేసి, “ఆనందం”లాంటి ఓ స్వచ్చమైన కథతో వస్తే చూడాలనివుంది.

నటనల విషయానికి వస్తే, రామ్ చరణ్ ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డాడు. పోరాటాలు, నృత్యాల కోసం బాగా శ్రమించాడు. “కామెడీ టైమింగ్”లోనూ పరిణితి సాధించాడు. రకుల్ ప్రీత్ ఎప్పటిలాగే ప్రాధాన్యంలేని పాత్ర దక్కించుకుంది. కానీ మరో మూడేళ్ళు ఈవిడ పేరు వినబడుతుంది. రావురమేష్ నటన బాగుంది. కృతి కర్బంధ కూడా పాత్రకు సరిపోయింది. ప్రతినాయకుడిగా “అరుణ్ విజయ్” ప్రతిభను దర్శకుడు సరిగా వాడుకోలేదు. మూస (routine) ప్రతినాయకుడిగా సంపత్ రాజ్ బోరుకోట్టడం మొదలెట్టాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, పోసాని, పృథ్వీరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, జయప్రకాష్ రెడ్డి ఆకట్టుకున్నాడు. నదియాకు ఎప్పటిలాగే ఓ మంచి పాత్ర దొరికింది.

ప్రత్యేకతలు :

 1. రామ్ చరణ్. తన తొమ్మిదవ చిత్రానికి నటించే “ప్రయత్నం” చేశాడు. పోరాటాలు, నృత్యాలలో ఎంతగానో శ్రమించాడు కనుక ముందుగా అతడినే చెప్పుకోవాలి.
 2. మెగాస్టార్ మెరుపు. చిత్రానికి కొత్త ఊపిరి పోసింది.
 3. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం (cinematography). చిత్రాన్ని కనువిందుగా చూపించింది.
 4. తమన్ సంగీతం. పాటలు ఫరవాలేదు కానీ నేపథ్య సంగీతం చిత్రానికి బాగా సహాయపడింది.
 5. అనల్ అరసు పోరాటాలు (fights). కథానాయకుడి పాత్రకు బాగా సరిపోయాయి.
 6. నిర్మాణ విలువలు (production values). నిర్మాత దానయ్య పెట్టిన ఖర్చు పై విషయాలన్నీ సాధ్యపడేలా చేశాయి.

బలహీనతలు :

 1. మార్పు లేని శ్రీనువైట్ల కథనం. “మైండ్ గేమ్”లు పూర్తిగా మానేసి “మైండ్” పెట్టి మంచి కథలతో వస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
 2. కరువైన హాస్యం. మొదటిసారిగా శ్రీనువైట్ల చిత్రంలో గుర్తుపెట్టుకోలేని హాస్యం ఉంది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

మార్పు అనేది పూర్తిగా రావాలి. సగం సగం మార్పు పనికిరాదు.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

2 thoughts on “బ్రూస్ లీ – The Fighter (2015)

 1. Below avg movie, first half decent ga undhi but 2nd half twists start aina daggarinunchi down aipotune undhi, comedy assalu workout avaledu full bore kottinid, chivarlo chiru entry superb but adi kooda villain ni munde pattinchi vaadu nannu jail lo vesav kaanee nee lover ni ela kaapadukuntaav ee patiki danni champestaru ane dialouge kotti emavutundo anna tension petti appudu chiru entry icchi aa gurram shot ye final shot ga petti unte at least aa guest role ki konchem manchi peru vacchi undedi and also fans ki memorable moment ga undedi aa final shot of the movie 🙂

  Like

 2. Pingback: Bruce Lee – The Fighter (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s