కంచె (2015)

 

Kanche Poster

అది 2012, సురభి నాటకసంస్థలో “అభిమన్యుడు” మరియు “ఘటోత్కచుడు” నాటకాలు వేసిన రోజు. “మన జీవితాలు మేకప్ కంపు కొడుతున్నాయి. అయినా అందరూ నీ కలలే కనాలంటే ఎలా తాత?” అని బీటెక్ బాబు ముసలి చాదస్తాల పట్ల అసహనాన్ని వ్యక్తం చేయగా, “అది కల! నిద్దట్లో కనేది. ఇది కళ! నిద్దర లేపేది. రేయ్! కళంటే బ్రతుకునిచ్చేదే అనుకోకు! బ్రతుకు నేర్పేది కూడా!” అన్నాడు అతడి తాత హరిశ్చంద్రప్రసాద్.

కట్ చేస్తే…

అది 1936, చెన్నపట్నంలోని విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం. తదేకంగా తనవైపు చూస్తున్న ధూపాటి హరిబాబుని “నేనంటే నీకిష్టమా?” అని అడిగింది సీత. “కాదండి ప్రేమ!” అన్నాడు హరిబాబు. “రెంటికి తేడా ఏంటోయ్?” అని మళ్ళీ ప్రశ్నించింది సీత. దానికి “గులాబి పువ్వు ఉందనుకోండి. ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్ళు పోస్తాం!” అన్నాడు హరిబాబు.

కట్ చేస్తే…

ఇప్పుడు వాస్తవంలోకి వద్దాం. భారతదేశంలోని మూడు మతాలలో ఒకటి “సినిమా”. (మిగతావి రాజకీయాలు, క్రికెట్). పరికించి చూస్తే, పై రెండు సన్నివేశాలు ఒకే విషయాన్ని చెబుతాయి. అవి సినిమాకు ఆపాదిస్తే, చాలా సినిమాలు దర్శకులు, రచయితలు నిద్దట్లో కనే కలలు. కానీ “కొన్ని” సినిమాలు మాత్రమే ప్రేక్షకుడిని నిద్దురలేపే ప్రయత్నం చేసే కళలు. సినిమాను ఇష్టపడేవాడు దానితో సొమ్ము చేసుకుంటాడు. అదే సినిమాను ప్రేమించేవాడు దాని గౌరవాన్ని కాపాడతాడు. అలా సినిమాని ప్రేమించి, సినిమాకు కూడా ఓ సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని తరచూ తన సినిమాలతో చెప్పే విలువలున్న దర్శకుల్లో “జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్)” ఒకడు. జయాపజయాలకు అతీతంగా “కళంటే బ్రతుకు నేర్పేది” అనే అంశాన్ని చెబుతూ “గమ్యం”, “వేదం”, “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రాలను తీశాడు. వీటిలో చివరది కాస్త వ్యాపారం వైపు వెళ్ళినందుకు బెడిసికొట్టడంతో మళ్ళీ “కల”ను కాకుండా “కళ”నే నమ్ముకొని “కంచె”ని వేశాడు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో వచ్చిన మొదటి భారతీయ చిత్రం “కంచె”.

కథ :

జర్మన్ నియంత “హిట్లర్” మూర్ఖత్వానికి పుట్టిన “రెండో ప్రపంచయుద్ధం”లో భారతదేశపు సైన్యంలోని కమాండర్ ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్). యుద్ధంలోని తన అనుభవాల గురించి తన ప్రేయసి సీతకి (ప్రగ్యా జైస్వాల్) ఉత్తరాలు వ్రాస్తూ తెలుపుతుంటాడు. అసలు వీరిద్దరి ప్రేమ ఎలా మొదలయింది? హరిబాబు సైన్యంలో చేరడానికి గల కారణమేంటి? ఆ తరువాత అతడి జీవితం ఎలా మారింది? అనే అంశాలపై ఈ కథ నడుస్తుంది.

కథనం – దర్శకత్వం :

హాలీవుడ్ లో రెండో ప్రపంచయుద్ధం మరియు హిట్లర్ పై “సేవింగ్ ప్రైవేట్ రియాన్” (Saving Private Ryan), “ఫ్యురి” (Fury) లాంటి అనేక చిత్రాలొచ్చాయి. మొట్టమొదటిసారిగా “కంచె” రూపంలో భారతీయ తెరపై ఈ నేపథ్యంలో ఓ చిత్రం వచ్చింది. “యుద్ధం” చరిత్ర కనుక దాన్ని యథాతథంగా చూపించాలి. ఇది భారతీయ చిత్రం కనుక మనకు కావాల్సిన భావోద్వేగాలను ఆ యుద్ధానికి జోడించి కథను వ్రాసుకున్నందుకు క్రిష్ కి నూటికి నూరు మార్కులు వేసేయాలి. ఓ పెద్ద సినీ కుటుంబం నుండి వచ్చి కూడా ఇలాంటి విలక్షణమైన కథను ఎంపిక చేసుకున్నందుకు కథానాయకుడు వరుణ్ ని కూడా అభినందించాలి. వ్యాపారం సరిగా చేస్తుందో లేదో తెలియని ఇలాంటి కథను నమ్మి ఎక్కడా వెనుకాడకుండా ఖర్చుపెట్టిన నిర్మాతలనూ మెచ్చుకోవాలి.

కథనం విషయానికి వస్తే, ఈ చిత్రపు నిడివి 126 నిమిషాలను దర్శకుడు క్రిష్ ఎక్కడా వృథా చేయలేదు. యుద్ధభూమిలో ఉన్న హరిబాబు తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండగా ప్రేక్షకుడిని రెండు కాలాల్లో ప్రయాణం చేయించే కథనంతో చిత్రాన్ని నడిపించాడు. ఓ కాలం నుండి మరో కాలానికి సరైన సమయంలోనే తీసుకొని వెళ్ళాడు.

చరిత్రను సినిమాగా తీయాలి అనుకుంటే మనసులో పెట్టుకోవాల్సిన మొదటి విషయం “భావోద్వేగాలు”. 1936నాటి ఎదుగుదల లేని సమాజంలో వాటిని చూపించే అవకాశం దర్శకుడికి బాగా దొరికడంతో దాన్ని బాగా వాడుకున్నాడు. ఆ కాలపు జమీందారీ వ్యవస్థ, కులమత భేదాలు, ఇలా అనేక అంశాలను ఎవరిని నొప్పించకుండా స్పృశించాడు. కనులకు ఇంపుగా పాటలను కూడా చిత్రించాడు. “ఊరు ఎరయ్యింది” అనే పాట వినసొంపుగానూ ఉంది, కనువిందుగానూ ఉంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి యుద్ధ సన్నివేశాలు. రెండో ప్రపంచయుద్ధంలో వాడిన ఆయుధాలనే వాడి, హాలీవుడ్ స్థాయిలో అసలైన పోరాట సన్నివేశాలను చిత్రించాడు దర్శకుడు. పైన చెప్పుకున్నట్టుగా ఓ సగటు భారతీయుడి మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా “అవసరాల శ్రీనివాస్” పాత్రని మలిచాడు. దాన్ని అతడు పోషించిన విధానం కూడా బాగుంది. చరిత్రని తెలుసుకుంటే ఆ పాత్ర సహజంగా అనిపిస్తుంది. రెండో ప్రపంచయుద్ధంలో పోరాడడానికి మామూలు మనుషులను కూడా సైనికులుగా మార్చారు. అందులో రచయితలు సైతం ఉండేవారు. అలాంటి ఓ పాత్రే అవసరాలది కూడా. “ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని అనుకున్నాను. అమ్మతనం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని తెలుసుకున్నాను” అని అతడు చెప్పే సన్నివేశంలో భావోద్వేగాలు బాగా పండాయి. నాకు నచ్చిన మాటల్లో ఇది ఒకటి అందుకే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

రెండో సగం కాస్త నెమ్మదించింది. ఇక్కడ కులరాజకీయాలు చేసే కల్లోలాన్ని హఠాత్తుగా మొదలెట్టి అవలీలగా తెగ్గొట్టేశాడు దర్శకుడు. అలా కాకుండా ఓ ఇద్దరి మధ్య సంభాషణతో దాన్ని మొదలెట్టి ప్రజల్లోని అవివేకాన్ని ఇంకాస్త చూపించి ఉంటే బాగుండేదేమో. “నిజమేనని నమ్మని” అనే పాటను హరిబాబు కోణంలోంచి ఎందుకు తీశాడో మొదట అర్థం కాకపోయినా తరువాతి సన్నివేశాల్లో దానికి సరైన సమాధానం చెప్పాడు దర్శకుడు. ఆ పాటలోని సాహిత్యాన్ని కథనానికి అనుగుణంగా వ్రాసినందుకు శాస్త్రిగారిని మరోసారి అభినందించాలి. పాట చిత్రీకరణ కూడా అందంగా ఉంది.

“యుద్ధంలోనూ ప్రేమ ఉంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది”, “ఇది కూడా మన ఊరి కథే. అక్కడ జరిగింది ఇక్కడ మళ్ళీ జరగకూడదు” అని ప్రచార చిత్రాల్లో హరిబాబు అన్న మాటలను, వాటి భావాలను సన్నివేశాల ద్వారా బాగా చేరవేశాడు దర్శకుడు. ఇదే కాకుండా రెండో సగంలో అవసరాల శ్రీనివాస్ తో హరిబాబు మాట్లాడే సన్నివేశం కూడా అర్థవంతంగా బాగుంది. “శభాష్ సోదరా! ఇన్నాళ్ళు సైన్యంలో ఉన్నావు. ఇప్పుడే సైనికుడు అయ్యావు” అనే మాట వచ్చే సన్నివేశం ఓ సైనికుడు ఎలా ఉండాలో తెలిపింది.

చిత్రానికి ముఖ్య ఘట్టమైన పతాక సన్నివేశాన్ని చాలా బాగా చిత్రించాడు కానీ “రా ముందడుగేద్దాం” అనే పాటలోని వాక్యాలకు, తెరపై దృశ్యాలకు అక్కడక్కడ సంబంధం లేదనిపించింది. “ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం” అనే వాక్యం చిట్టచివరి సన్నివేశంలో ఉంచుంటే సాహిత్యం యొక్క ఉద్దేశ్యం బాగా చేరువయ్యేది. ఏదేమైనా చివరి సన్నివేశంతో కంటతడి పెట్టించాడు క్రిష్. ఈ చిత్రానికి ఇదే సరైన ముగింపు కూడా. చిత్రంలోని కథానాయకుడిని, అతడి అభిమానులను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం కథానుసారంగా చిత్రాన్ని ముగించడంతో క్రిష్, వరుణ్ తేజ్ మార్కులు కొట్టేశారు. ఒక్క పతాక సన్నివేశమే కాదు చిత్రమంతా నటులు కాక వారి పాత్రలే కనబడ్డాయి.

“ధూపాటి హరిబాబు! I salute” అని ఈశ్వర్ (నికితిన్ ధీర్) సెల్యూట్ చేసే సన్నివేశం మనసును తాకి మరోసారి కంటతడి పెట్టించింది.

మొత్తానికి “కంచె” అనే పేరుకి, దాని అర్థానికి చిత్రం ద్వారా పూర్తి న్యాయం చేశాడు దర్శకుడు క్రిష్. ఇలాంటి చిత్రాలు వ్యాపారం ఎలా చేసినా, మంచి చిత్రాలుగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాను “ప్రేమించే” ప్రతి ఒక్కరికి ఈ చిత్రాన్ని చూడమని సిఫార్సు చేస్తున్నాను.

ఇక నటనల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈసారి నటించే ప్రయత్నం చేశాడు. తన మునుపటి చిత్రం “ముకుంద”లా కాకుండా ఇందులో కాస్త భావోద్వేగాలను పండించే ప్రయత్నం చేశాడు. ఉదాహరణే, “ఇది మనవూరి కథే…” అని చెప్పే సన్నివేశం. కథానాయిక ప్రగ్యా జైస్వాల్ పాత్రకు బాగా సరిపోవడంతో పాటు దాన్ని బాగా పోషించింది కూడా. నికితిన్ ధీర్ స్థానంలో ఓ తెలుగు నటుడినే తీసుకొని ఉంటే బాగుండేది. కానీ పతాక సన్నివేశంలో బాగా నటించాడు. గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి లాంటి అనుభవజ్ఞులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అవసరాల శ్రీనివాస్ నటన అక్కడక్కడ నవ్విస్తూనే చివర్లో భావోద్వేగానికి గురిచేసింది. పోసానికి మంచి పాత్ర దొరికింది కానీ దానిపై దర్శకుడు ఎక్కువగా దృష్టి సారించలేదు. దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఓ అతిథి పాత్రలో మెరిశారు.

సంభాషణలు :

త్రివిక్రమ్ తరువాత ఆలోచింపజేసే సంభాషణలను సాయిమాధవ్ బుర్రా వ్రాస్తున్నారు. అందుకే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సివస్తోంది. నాకు నచ్చిన మాటలు ఇవే,

 1. గులాబి మొక్క ఉందనుకోండి. దాన్ని ఇష్టపడితే పువ్వుని కోస్తాం, ప్రేమిస్తే దానికి నీళ్ళు పోస్తాం!
 2. పగిలిన తలకాయల పక్కన నిలబడితే మనది పెద్ద తలకాయ అవుతుంది.
 3. ఇన్నాళ్ళు సైన్యంలో ఉన్నావు. ఇప్పుడే సైనికుడు అయ్యావు. (ఇది సందర్భానుసారంగా…)
 4. ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని అనుకున్నాను. అమ్మతనం ఎక్కడైనా ఒకేలా ఉంటుందని తెలుసుకున్నాను.
 5. కులం అంటే పని. నువ్వెవరు అని అడిగితే నువ్వేం చేస్తుంటావని! నీ నేత్తురెంటి అని కాదు. అలా అడిగినవాడు మనిషే కాదు.

ఇలా చాలా మాటలు చిన్నవిగా ఉంటూ పెద్ద అర్థాలను చేరవేశాయి.

మరిన్ని ప్రత్యేకతలు :

 1. కథ, కథనం, దర్శకత్వం. యుద్ధాన్ని యథాతథంగానూ, హాలీవుడ్ స్థాయిలో తీస్తూ, భారతీయ భావోద్వేగాలను స్పృశించే కథను, దానికి తగ్గ కథనాన్ని నడిపిన క్రిష్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
 2. సీతారామశాస్త్రి సాహిత్యం (lyrics). ఈ కథలోని భావోద్వేగాన్ని తన సాహిత్యంతో ముందుగానే పరిచయం చేశారు శాస్త్రిగారు. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో వచ్చిన అత్యుత్తమ సాహిత్యం ఈ చిత్రంలోనే ఉంది.
 3. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం (cinematography). ఇలాంటి చిత్రాలకు ఛాయాగ్రహణమే ప్రాణం. యుద్ధ సన్నివేశాలలో, పాటలలో ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది.
 4. చిరంతన్ భట్ సంగీతం. పాటలు మాత్రమే కాదు నేపథ్య సంగీతం కూడా చిత్రానికి సరిగ్గా సరిపోయింది.
 5. సాహి సురేష్ కళాదర్శకత్వం (art direction). కథ నడిచే కాలానికి, యుద్ధభూమికి సరిపోయే విధంగా సెట్స్ వేశారు.
 6. వరుణ్ తేజ్. పతాక సన్నివేశాల్లో నటించే ప్రయత్నం బాగా చేశాడు. దానికంటే, మెగా కుటుంబం నుండి వచ్చి ఇలాంటి చిత్రాలను ఎంచుకోవడం తన అభిరుచిని తెలుపుతుంది. ఈ విషయానికే ఎక్కువ మార్కులు వేయాలి.
 7. నిడివి (runtime). కేవలం 126 నిమిషాల నిడివి ఈ చిత్రానికి మరో ప్రత్యేకత.
 8. నిర్మాణ విలువలు (production values). నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు కేవలం కథని, దర్శకుడిని నమ్మి చిత్రానికి ఏ లోటు రాకుండా అన్ని ఇచ్చారు. వీరిని ఎంతగానో అభినందించాలి.

బలహీనతలు :

 1. అవలీలగా తెగ్గోట్టేసిన కులమతాల గొడవ.
 2. సాహిత్యానికి, దృశ్యానికి అక్కడక్కడ తెగిపోయిన సంబంధం.

ఈ చిత్రం నేర్పిన పాఠాలు :

 1. మనం చూసే సమాజంలోనే ఓ సినిమా కథ ఉంది. ఎప్పటికైనా సినిమాకు సామాజిక బాధ్యత ఉంది.
 2. సినిమాను ఇష్టపడేవాడు వ్యాపారి అవుతాడు. సినిమాను ప్రేమించేవాడు నటుడవుతాడు. (ఇది నటుల కోణంలో)
 3. ఏదేమైనా కథనే నమ్ముకోవాలి. కథ నుండి పక్కదారి పట్టకపోవడంలోనే విజయం ఉంది కానీ వ్యాపారంలో కాదు.

ఈ చిత్రంపై వచ్చిన విమర్శ :

సినిమాను “ఇష్టపడే” ప్రేక్షకులు “కంచె” డాక్యుమెంటరీలా (documentary) ఉందని, సినిమా తీస్తున్నాం అని చెప్పి డాక్యుమెంటరీ తీశారని అంటున్నారు. నాకు తెలిసి, నేను చూసినంత వరకు “డాక్యుమెంటరీ” ఎప్పుడు ఓ కల్పిత కథను చెప్పలేదు. నిజంగా జరిగిన సంఘటనలను చూపిస్తూ వాటి గురించి పలువురి అభిప్రాయాలను, అనుభవాలను పొందుపరచడం డాక్యుమెంటరీ ఉద్దేశ్యం. కనుక “కంచె” ఓ మంచి ఉద్దేశ్యంతో తీసిన ఓ కల్పిత “ఫీచర్ ఫిలిం” (feature film). డాక్యుమెంటరీ అన్న మాటతో నేను ఏకీభవించను.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

4 thoughts on “కంచె (2015)

 1. Movie baagundi, but just good, inka next level ki vellaledu, naa varaku Vedam Kummadu Krish andulo sagam undi kanche anthey, emotional connect undadu manaki main characters tho thats the main minus

  2nd half lo pelli scene nundi telipoindi cinema,anta strong scene petti, aa taruvata kulam dialouge tho heights ki lepi ventane heroine character ala end cheyadam silly ga undhi, ala kaakunda at least valla pelli valal oorlo godavalu aite hero ni save cheyadaniki heroine addu vacchi chanipoinattu, manam kaliste manchi jarugutundante ila aindenti type dialogue pedite addripoyedi

  villain role ye mana telugu actors ajay & Co gang lo evaraina chesi unte baagundedi, nikithin dheer height n personality paramga saripoyadu but as an actor could not impress, anduke last scene lo aa impact telekapoyadu, daniki director kooda oka reason mundugane anukunnatu manaki main characters tho emotional connect undadu ,becuase war backdrop tho elagoo direct relation ledu, at least oorilo aa godavalu establish chesinantha strong ga end cheyalekapoyadu

  Like

 2. Story Good , But 2nd half care teesukovalsindi esp last 30 mins, we wont feel for the main characters ,adhey main minus

  Pelli scene anta baaga teesi, malli ventante kulam meeda addiripoye dialouge petti aa 2 mins lone heroine character en cheyadam all of a sudden looked silly, ala kaakunda valal pelli valal oorilo kulala godava jarigi, aa godavallo hero ni kaapadenduku heroine chanipoinattu choopinchi unte konchemanna baagundedi

  villain role ki aa tangabali gaadu set avaledh, voice dominated his performance and appearance, mana telugu lo ye Ajay & gang lo evarikicchina baagundedi 🙂

  Like

 3. Pingback: Kanche (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s