అఖిల్ – The Power of Jua (2015)

Akhil-Movie-Audio-Posters-7

మామూలుగా సినిమాకు తెర వెనుక దర్శకుడు (తీసేవాడు), తెర ముందు ప్రేక్షకుడు (చూసేవాడు) ఉంటారు. కొన్ని సినిమాలకు తెరముందున్న ప్రేక్షకుడు కూడా దర్శకుడిగా మారుతాడు. సినిమాను చూసే ప్రేక్షకుడిలోనూ ఓ దర్శకుడు ఉంటాడన్న విషయాన్ని తమ సినిమాల ద్వారా తెలిపిన దర్శకుల్లో “వి.వి.వినాయక్”కు అగ్రతాంబూలం ఇవ్వాలి. కథ, కథనాలతో సంబంధం లేకుండా సినిమాను ఎలాగైనా నడిపించి మాస్ ప్రేక్షకుడి నాడి తెలిసిన స్టార్ దర్శకుడిగా పేరొందిన వినాయక్ ఈసారి అక్కినేని వంశపు వారసుడు “అక్కినేని అఖిల్”ను పరిచయం చేస్తూ అఖిల్ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. తెలుగు “దేవదాసు” మనవడి ప్రక్కన హిందీ “దేవదాసు” మనవరాలు “సాయేషా సైగల్”ను కథానాయికగా ఎంచుకున్నాడు. సుప్రసిద్ధ నటుడు “నితిన్” మొదటిసారి నిర్మాతగా మారి తన స్నేహితుడు అఖిల్ మొదటి చిత్రాన్ని నిర్మించాడు.

కథ :

భూగోళాన్ని కాపాడే శక్తి గల ఓ గోళాన్ని ఆఫ్రికా ఖండంలోని ఓ గిరిజన జాతి “జువా” అనే పేరుతో పూజిస్తుంటారు. దాన్ని చేజిక్కించుకుని ప్రపంచాన్ని జయించాలన్న కోరికతో ఉన్న ఓ రష్యన్ ముఠా దాడిలో అది చేయిజారిపోతుంది. ఇదిలావుండగా, హైదరాబాదులో వీధి గొడవల్లో పాల్గొంటూ జీవనం సాగిస్తుంటాడు అఖిల్ (అఖిల్ అక్కినేని). ఓ రోజు దివ్యని (సాయేషా సైగల్) చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను ఎలా గెలిచాడు? చేయిజారిపోయిన జువాకు అఖిల్ తో సంబంధం ఉందా? అనేవి కథాంశాలు.

కథనం :

ముందుగా వెలిగొండ శ్రీనివాస్ వ్రాసిన ఈ కథ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు చదివిన చందమామ కథలాంటి ఈ కథను వ్రాయడానికి అతడు ఎంతగా శ్రమించాడో తెలియదు కానీ ఆ చందమామ కథల్లోని పదోవంతు సామర్థ్యం కూడా ఈ కథకు లేదనేది వాస్తవం. దీనికి వినాయక్ లాంటి దర్శకుడు కథనాన్ని సమకూరిస్తే అదే అఖిల్ చిత్రం అవుతుంది.

మొదటి రెండు నిమిషాల్లోనే ఈ 130 నిమిషాల చిత్రం ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. ఆ తరువాత ఎప్పటిలాగే అర్థంలేని, తర్కంలేని వినాయక్ శైలిలోకి కథనం వెళ్తుంది. వినాయక్ ఎప్పుడూ ప్రేక్షకుల అంచనాలను అందుకునే సినిమాలు తీస్తాడన్నది ఈ సినిమాతో మరోసారి ఋజువయ్యింది. అతడి చిత్రాలకు సంబంధించినంత వరకు, ప్రేక్షకుడి అంచనాలను అందుకోవడమంటే ప్రేక్షకుడిని కూడా ఓ దర్శకుడిని చేయడమే. అదే చేశాడు ఈ సినిమాలో కూడా. ఎక్కడ పాట వస్తుందో, ఎక్కడ విరామం వస్తుందో, ఎక్కడ పోరాటం వస్తుందో ప్రేక్షకుడు యిట్టె పసిగట్టేలా చేసి అతడికి కూడా దర్శకుడి హోదా కల్పించే సామర్థ్యం వినాయక్ లాంటి వారికే ఉంది. ఈ విషయాలన్నింటికి ఉదాహరణే మొదటి సగం.

ఈ చిత్రపు నిడివి 130 నిమిషాలే అయినప్పటికీ చాలా సేపు నడిచిన భావన కలిగింది. ఏమాత్రం ఆకట్టుకోలేని నీరసమైన కథనమే దీనికి కారణం. ఏదేమైనా, చివరగా “అక్కినేని” గీతంలో వేసవి కాలపు వర్షంలా ఓ నిమిషం పాటు కనిపించిన “అక్కినేని నాగార్జున” కాస్త శక్తినిచ్చారు. తన హలో బ్రదర్ చిత్రంలోని “కన్నె పెట్టరో కన్ను కొట్టరో” సంగీతానికి నృత్యం చేసి ఊరటనిచ్చారు. ఆయన ప్రవేశంతో ఆ ఒక్క నిమిషం తెరంతా అందంగా మారిపోయింది. ఓ సామాన్య ప్రేక్షకుడి అంచనాలకు అందని విషయం ఈ చిత్రంలో ఏదైనా ఉందంటే అది ఇదే. ఆ తరువాత తనలోని దర్శకుడిని ప్రేక్షకుడు మళ్ళీ తృప్తి పరుచుకునేలా చిత్రాన్ని ముగించాడు ఈ చిత్రపు అసలు దర్శకుడు వినాయక్.

కథ, కథనాల విషయంలో మరుగునపడుతున్న తెలుగు సినిమా సాంకేతికంగా మెరుగుపడుతోంది. ఆ విషయం “పడేశావే” పాటలో మరోసారి అర్థమయ్యింది. ఇది కనువిందుగా కనిపించడానికి ప్రధాన కారణం ఛాయాగ్రాహకుడు “అమోల్ రాథోడ్”.

ఇక నటనల విషయానికి వస్తే, అక్కినేని అఖిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తన చుట్టూ ఉన్న నటులంతా తనకంటే ఎంతో పెద్దవారు అయ్యేసరికి వారిని మించగల పెద్దరికాన్ని, కమర్షియల్ సినిమాకు కావాల్సిన ధృడత్వాన్ని చూపించలేకపోయాడు. కానీ నృత్యాలలో బాగా ఆకట్టుకున్నాడు. అక్కినేని కుటుంబంలో ఉత్తమ నృత్యకారుడు అఖిలే అని చెప్పొచ్చు. దిలీప్ కుమార్ వారసురాలు సాయేషాకు అక్కినేని వారసుడి పక్కన చెప్పుకోదగ్గ పాత్ర దక్కలేదు. మామూలు కమర్షియల్ కథానాయికలా కేవలం పాటలకే పరిమితమయ్యింది. ఈవిడ నటన గురించి మాట్లాడుకోకూడదు కానీ నృత్యాలు బాగా చేసింది. రాజేంద్రప్రసాద్, మహేష్ మంజ్రేకర్ లాంటి అనుభవజ్ఞుల అనుభవం ఈ చిత్రానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక ఎప్పుడూ వినాయక్ ని కాపాడే బ్రహ్మానందం ఈసారి అతడికి పెద్దగా సాయం చేయలేకపోయాడు. వెన్నెల కిషోర్, సప్తగిరిలు కాస్త శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ప్రత్యేకతలు :

  1. అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం (Cinematography). ఇలాంటి ఖండాంతరాల (Intercontinental) కథలకు మేలయిన ఛాయాగ్రహణం చాలా అవసరం. ఆ విషయంలో అమోల్ రాథోడ్ కి మార్కులు వేయాలి. ముఖ్యంగా విరామ ఘట్టంలోని ఏరియల్ షాట్స్, ఆఫ్రికాలోని సన్నివేశాలు బాగున్నాయి.
  2. నిర్మాణ విలువలు (Production Values). కథ, కథనాల్లో విషయం లేకపోయినప్పటికీ అక్కినేని వారసుడి పరిచయ చిత్రం కాబట్టి నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నితిన్ లు ఖర్చులో ఎక్కడా వెనుకాడలేదు.
  3. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). వయసు పెరిగినా అందం తరగని ఏకైక అక్కినేని వారసుడు నాగార్జునే అన్న విషయం ఆ అందమైన ఒక్క నిమిషం తెలిపింది.

బలహీనతలు :

  1. వెలిగొండ శ్రీనివాస్ కథ. మూస కథలు అందించడంలో ఇతడికి సాటి మరొకరు రాలేరు అని ఈ అఖిల్ చిత్రంతో నిర్ధారణ చేసుకోవచ్చు.
  2. వినాయక్ కథనం, దర్శకత్వం. తనలో ఇంకా మార్పు రాలేదని ఓ మూస ఫార్ములానే జపించే ఈ స్టార్ దర్శకుడు మరోసారి తన దర్శకత్వంతో స్పష్టం చేశాడు.
  3. కోన వెంకట్ మాటలు. కేవలం ప్రాసల కోసం ఎన్నో ప్రయాసలు పడ్డాడే కానీ నవ్వించలేకపోయాడు.
  4. ఆకట్టుకోలేకపోయిన వారసులు. అక్కినేని వారసుడు మరియు దిలీప్ కుమార్ వారసురాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు.
  5. అనూప్, తమన్ ల సంగీతం. ఇద్దరు కలిసినా ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించలేకపోయారు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

వినాయక్ చిత్రాలు ఎప్పుడూ చెప్పే ఒకే పాఠం, “వినాయక్ లాగా సినిమాలు తీయకూడదు” అని.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review

2 thoughts on “అఖిల్ – The Power of Jua (2015)

  1. Bad movie, first half was ok, template ala vellipotundi but 2nd half aim less ga vellipoyadu ala time pass type narration ki aa main story emotion ki set kaaledu, inka climax aite abbooo

    Like

  2. Pingback: Akhil – The Power of Jua (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s