
భాగ్యనగరం వేదికగా ఈ ఏడాది జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పలు దేశాలకు సంబంధించిన చిత్రాలు ఈ నెల 14వ తేది నుండి పలుచోట్ల ప్రదర్శించబడుతున్నాయి. వాటిలో 15వ తేది ఉదయం 10 గంటలకు కూకట్పల్లిలోని శివపార్వతి ధియేటరులో నెథర్లాండ్ కు చెందిన “Dummie De Mummie” ప్రదర్శించబడినది.
“టోస్కా మెంటన్” (Tosca Menten) అనే డచ్ రచయిత్రి రచించిన “Dummie De Mummie” అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి “టిస్ వాన్ మార్లే” (Tijs van Marle) కథనాన్ని సమకూర్చగా “పిమ్ వాన్ హోవే” (Pim van Hoeve) దర్శకత్వం వహించారు. జూలియన్ రాస్ (Julian Ras), యహ్య గఎర్ (Yahya Gaier) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 9, 2014న నెథర్లాండ్ లో విడుదలయింది. పాల్ వూర్తుయ్సేన్ (Paul Voorthuysen) దీనికి నిర్మాత.
ఈజిప్ట్ కు చెందిన ఓ సజీవ మమ్మీ (యహ్య గఎర్) ఓ గ్రామంలోని గూస్ గట్స్ (జూలియన్ రాస్) అనే బాలుడికి లభ్యమవుతుంది. దానికి డుమ్మీ అని నామకరణం చేసి దానితో స్నేహం చేస్తాడు గూస్. ఆ తరువాత బలపడే వారిద్దరి స్నేహం గురించిన కథ ఈ చిత్రం.
77 నిమిషాల నిడివిగల ఈ చిత్రంలో డుమ్మీని గూస్ మచ్చిక చేసుకోవడం, దాన్ని తనతో పాటు స్కూలుకు తీసుకొని వెళ్ళడం, తోటి విద్యార్థులతో ఆ మమ్మీ కలిసిపోవడం లాంటి విలక్షణమైన అంశాలను, పసందైన కథనంతో రూపొందించారు దర్శకుడు పిమ్ వాన్ హోవే. అనుకోకుండా ప్రాణం కోల్పోయిన డుమ్మీని గూస్ తిరిగి ఎలా బ్రతికించాడు అన్న అంశంతో చిత్రం ముగుస్తుంది. హాస్యంతో పాటు సున్నితమైన భావోద్వేగాలకు కూడా ఇందులో చోటిచ్చారు.
అందమైన ప్రదేశంలో చక్కటి నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది. కనువిందైన గైడో వాన్ గెన్నేప్ (Guido van Gennep) యొక్క ఛాయాగ్రహణం, మాట్టిస్ (Matthijs) మరియు మార్టిన్ (Martijn) ల వినసొంపైన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.
– యశ్వంత్ ఆలూరు
15/11/2015
“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.