
కళాభిమానానికి భాష, ప్రాంతం లాంటివి ఎప్పుడూ ఎల్లలు కావు. ఒకప్పుడు సినిమాలు చూడడం హాబీగా ఉన్న నాకు అది అలవాటుగా మారిన తరుణంలో, ఆ అలవాటు ఆంధ్ర దేశాన్ని దాటి, భారతదేశాన్ని దాటి అమెరికా వరకు చేరింది. ఇవే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లోనూ సినిమాలు చూసే అలవాటు జనాలకు ఉందని తెలిసింది. అలా ఓ స్నేహితుడి సిఫార్సుతో చూసిన మొదటి “ఇరానీ” చిత్రం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”. “మజిద్ మజిడి” దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చూసి కొంతకాలం గడిచినా సమీక్ష వ్రాయాలని అనుకోలేదు. కానీ ఈ మధ్య “నవతరంగం”లో ఈ చిత్రాన్ని గురించి పేర్కొన్న వ్యాసం చదివాక ఈ చిత్రపు సన్నివేశాలు ఓసారి కళ్ళ ముందు కదిలాయి… కాదు… స్కూలుకు టైం అయి అన్నయ్య వేచివుంటాడని కాలువలో కొట్టుకుపోయే “షూ” కోసం పరుగెత్తే జాహ్రాలా… ఎలాగైనా “షూ” గెలుచుకోస్తానని చెల్లెలికి మాట ఇచ్చిన అలీలా పరుగులు పెట్టాయి
సరే! ఇక సూటిగా మాట్లాడుకుందాం సుత్తి లేకుండా!
“సిడ్ ఫీల్డ్” లాంటి స్క్రీన్ ప్లే గురువులు సినిమా కథనాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి “పరిచయం”, “సమస్య” మరియు “పరిష్కారం”. మొదటి భాగంలో కథలోని ముఖ్య పాత్రలను పరిచయం చేయాలి. రెండో భాగంలో వాటికి ఓ సమస్యను సృష్టించాలి. మూడో భాగంలో ఆ పాత్రల ద్వారా ఆ సమస్యను పరిష్కరించాలి అని ఆయన అభిప్రాయం.
అసలు “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్” సంగతేమిటంటే… ఓ మధ్యతరగతి తల్లిదండ్రులకు జన్మించిన వారు అలీ (అమీర్ ఫర్రోఖ్) మరియు జహ్రా (బహారే సెద్ధికి). తాను దగ్గరుండి కుట్టించిన చెల్లెలి బూట్లను కోల్పోయిన అలీ పరిహారంగా చెల్లెలు జహ్రాతో ఓ ఒప్పందం చేసుకుంటాడు. తనకున్న ఏకైక జత బూట్లను వేసుకోమని, స్కూలు ముగియగానే వాటిని తనకు తిరిగిచ్చేయమని. ఈ ఒప్పందం నడుస్తుండగా, అలీకి తన స్కూలులో పరుగుపందెం ఉందని, అందులో మూడవ స్థానంలో నిలిచినవారికి బూట్లను బహుకరిస్తారని, ఎలాగైనా వాటిని గెలుచుకొని తనకిస్తానని జహ్రాకు మాటిస్తాడు. వాటిని అతడు గెలుచుకున్నాడా లేదా అన్నది కథాంశం.
ఈ చిత్రంలో “పరిచయం” కన్నా “సమస్య” గురించే మాట్లాడుకోవాలి. మధ్యతరగతి కుటుంబ వాతావరణాన్ని, అందులోని వ్యక్తులను పరిచయం చేసిన విధానం మామూలే. అసలు “సమస్య” అలీ – జహ్రా ఒప్పందంతోనే మొదలవుతుంది. మొదట, ఇంత చిన్న సమస్యతో కూడా కథనాన్ని నడిపించగలరా అని సందేహం కలిగింది. అక్కడే ప్రేక్షకుడి దృక్పథం మార్చుకోవాలి అని కూడా అర్థమైంది. ప్రేక్షకుడి కోణంలోంచి చూస్తే, కనిపించే సమస్య అసలు ఓ సమస్యే కాదు. అదే అలీ, జహ్రాల కోణంలోంచి చూస్తే జురాసిక్ పార్కులోని డైనోసార్ అంత పెద్దదిగా కనబడుతుంది. దీనికి పలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాలువలో కొట్టుకుపోయే బూటు కోసం జహ్రా లంకించే పరుగులో, ప్రతీ రోజు స్కూలుకు ఆలస్యంగా వెళ్తూ మాస్టారుకు భయపడే అలీ కళ్ళల్లో, పరుగుపందెంలో బూట్లను గెలవాలని అలీ పడే ఆరాటంలోనూ ఆ సమస్య తీవ్రత ఎంతో అర్థమవుతుంది. ఇవన్నీ ప్రేక్షక కోణంలోంచి కాక, పాత్రల కోణంలోంచి చూసేలా చేసిన దర్శకుడికి జోహార్లు చెప్పకుండా ఎలా ఉండగలం?
ఇవే కాకుండా, ఈ చిత్రం ఇంకొన్ని విషయలాను కూడా తెలుపుతుంది. ఎండలో రోడ్డుమీద సైకిల్ పై వెళ్తున్న అలీ, అతడి తండ్రిని చూపించే ఓ షాట్ ధనిక, పేద వర్గాల మధ్య తేడాను, తోటమాలి పనికోసం అలీ మాట్లాడే సమయంలో అతడి తండ్రి గురయ్యే ఆనందంలో చదువు మనిషికిచ్చే ధైర్యం గురించి చెప్పకనే చెబుతుంది.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ కథలోని సమస్యకు జహ్రాకు బూట్లు దక్కడం పరిష్కారం. అయితే వాటిని తన తండ్రి తీసుకోని వస్తే అది ఓ పరిష్కారమే కానీ సరైన పరిష్కారం కాదు. నాటకీయతను పండించాలి అనుకుంటే అదే ముగింపు అవుతుంది. కానీ సమస్య అలీ, జహ్రాల మధ్య కనుక వాటిని అలీ ఇస్తేనే లెక్క సరిపోయినట్టు. బహుశా అందుకే, దర్శకుడు బూట్లు కొన్న తండ్రిపై కాకుండా వాటిని సంపాదించలేకపోయిన అలీ మీదే చిత్రాన్ని ముగించాడేమో అనిపిస్తుంది. ఒకవేళ దీని తరువాత ఏదైనా సన్నివేశం ఉంటే అది జహ్రా తండ్రి ఆమెకి బూట్లు ఇచ్చేదే అయ్యుండాలి. తన సమస్యను పరిష్కరించలేకపోయిన అలీ యొక్క చిరిగిన బూట్లు మరియు గాయపడిన అతడి పాదాల మీద చివరి షాట్లు పెట్టడం ఓ సంపూర్ణమైన నాటకీయ ముగింపుని కోరుకునే ప్రేక్షకులకు గిట్టదేమో. ఈ ముగింపు మాత్రం అలీ పాత్రను, అతడి కోణంలోంచి ఉన్న సమస్యను అగౌరవపరచలేదని నా అభిప్రాయం.
– యశ్వంత్ ఆలూరు
17/11/2015
“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.