ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన “కమల్ హాసన్” నుండి ఓ చిత్రం వస్తోందంటే, ఆయన అభిమానుల్లో, సినీప్రియులలో ఎదో ఒక ఉత్సాహం. కారణం ఆయన ఏ కథలో నటించినా అందులో ఒక వైవిధ్యం ఉంటుందనే గట్టి నమ్మకం. అలాంటి ఉత్సాహాన్ని రేకెత్తించిన ఓ చిత్రం “చీకటి రాజ్యం”. దాదాపు ఆరేళ్ళ (2009లో వచ్చిన ఈనాడు) తరువాత నేరుగా తెలుగులో కమల్ చేసిన చిత్రం ఇదే. కమల్ అనుచరుడు “రాజేష్ ఎం సెల్వ” దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. “స్లీప్ లెస్ నైట్ (న్యూట్ బ్లాంచే)” (Sleepless Night – Nuit Blanche) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి కమల్ కథనాన్ని సమకూర్చారు. ఈ చీకటి రాజ్యం విశేషాలను వెలుగులోకి తీసుకొని వస్తే…
కథ :
మాదకద్రవ్యాల (Drugs) వ్యాపారాలకు సాయపడే పోలీసు అధికారి దివాకర్ (కమల్ హాసన్) కొడుకు వాసు (అమన్ అబ్దుల్లా) ఓ సందర్భంలో అపహరణకు (kidnap) గురవతాడు. అతడిని అపహరించినది ఎవరు? తన కొడుకును దివాకర్ ఎలా కాపాడుకున్నాడు? అనేవి కథాంశాలు.
కథనం :
ఈ మధ్య వచ్చే కమల్ హాసన్ చిత్రాలు “నాన్న–పులి” కథల్లా మారుతున్నాయి. పులి (కమల్ మార్కు చిత్రం) వచ్చిందనుకొని ప్రతిసారీ నాన్న (ప్రేక్షకుడు) వెళ్ళడం, అది రాక నిరాశతో తిరిగిరావడం జరుగుతోంది. చీకటి రాజ్యం కూడా అలాంటి ఓ పులి అని చెప్పొచ్చు. ప్రధాన కారణం, ఇది థ్రిల్లర్ జోనర్ కు సంబంధించిన చిత్రం అయినప్పటికీ, ఆ థ్రిల్ కు గురిచేసే సన్నివేశాలు ఏమాత్రం లేకపోవడం.
ప్రతీ చిత్రంలో మంచి, చెడు రెండూ ఉంటాయి కనుక ముందుగా మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. కమల్ చిత్రాలు ఎప్పుడూ సహజంగా ఉంటాయి. చీకటి రాజ్యం కూడా అంతే. సన్నివేశాలన్నీ ఎంతో సహజంగా ఉన్నాయి. ఇది కాకుండా, థ్రిల్లర్ కథనానికి సందర్భానుసారమైన హాస్యాన్ని జోడించారు. ఉదాహరణే విట్టల్ రావు (ప్రకాష్ రాజ్) పాత్ర. ఓ ప్రక్క ప్రతినాయకుడిగా కనిపిస్తూనే కాస్త నవ్వించే ప్రయత్నం చేశారాయన. ఎస్తేర్ (మధుశాలిని)ని కాపాడే సన్నివేశం, రచయితలు రామజోగయ్య శాస్త్రి, అబ్బూరి రవి కనిపించే సన్నివేశం లాంటివి నవ్వించాయి. వీటన్నిటినీ మించి, చిత్రమంతా కేవలం ఒకే ప్రదేశంలో (అనగా పబ్బులో) జరిగేలా ఉన్న కథనానికి మార్కులు వేయొచ్చు. ఇవన్నీ నాణానికి ఒకవైపు.
అదే నాణానికి మరోవైపు చూస్తే, చిత్రం మొదలయిన కొద్ది సమయానికే ఈ కథలోని సమస్య అర్థమైపోయింది. థ్రిల్లర్ అయినా ఆ సమస్యలో ఎటువంటి మార్పు రాకపోవడం ఒక బలహీనతగా చెప్పొచ్చు. ఇదే కాకుండా, ఓ వ్యక్తి కారు పార్కు చేసే సన్నివేశాన్ని చిన్న షాట్ లో ముగించకుండా, అతడు రివర్స్ గేరు వేసుకొని కారును చక్కగా పార్కు చేసే పెద్ద షాట్స్ పెట్టడం అనవసరం అనిపించింది. థ్రిల్లర్ చిత్రాల్లో మెలికలుంటేనే ప్రేక్షకుడికి ఉత్కంఠ కలుగుతుంది. కనీసం విరామం సమయానికి కూడా అలాంటి ఓ అంశం లేకపోవడం నిరాశపరిచింది. కనీసం రెండో సగంలోనైనా ఏదైనా ఉందేమో అనుకుంటే, నేమ్మదించిన కథనంతో, పాత్రలను అటు ఇటు పరుగెత్తించాడే తప్ప వాటితో ఏమి చేయించలేకపోయాడు దర్శకుడు సెల్వ. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాల్లో సమస్యను పలురకాలుగా మార్చుకునే సౌలభ్యం ఉన్నా, దాన్ని చిత్రమంతా యథాతథంగా ఎందుకు వదిలేశారో కమల్ మరియు సెల్వలకే తెలియాలి.
ఓ చిత్రంలో నవరసాలు ఉంటే అది ఉత్తమ చిత్రం. అన్నీ ఒకే చిత్రంలో ఉన్నా, కొన్నింటిని ఒకే సన్నివేశంలో తీసుకొని రాకూడదని సినీ పెద్దల అభిప్రాయం. అవే “ఉద్రేకం” (suspense/thrill) మరియు “భావోద్వేగం” (melodrama). ఈ రెండింటినీ ఒకే సన్నివేశంలో చూపించాలన్న ఆలోచన ప్రయోగమో ఏమో అర్థం కాలేదు. ఇదిలావుండగా అసలు నిజం తెలియని దివాకర్ తన లక్ష్యం గురించి తనను అడ్డుకున్న మల్లిక (త్రిష)కు మాత్రమే చెప్పి, అదే విధంగా అడ్డుకున్న కిషోర్ (కిషోర్)కు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదో తెలియలేదు.
అలా చీకటి రాజ్యం 128 నిమిషాల చిత్రమే అయినప్పటికీ నెమ్మదించిన కథనంతో కాస్త సహనాన్ని పరీక్షించింది. కానీ చివర్లో వచ్చిన ప్రచార గీతం మాత్రం ఆకట్టుకుంది.
నటనల విషయానికి వస్తే, కమల్ నటనను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తన చిత్రాలు ఎలా ఉన్నా, నటుడిగా ఆయన ఎప్పుడూ విఫలమవలేదు. అందుకే “లోకనాయకుడు” అయ్యారు. ప్రకాష్ రాజ్ బాగా అలరించారు. ముఖ్యంగా, చివర్లో పొలిసులు ఆయన్ని చుట్టుముట్టిన సమయంలో ఆయన పలికించిన హావభావాలు ఆయన సొత్తు. త్రిషకు ఏమాత్రం విలువలేని పాత్ర లభించింది. మధుశాలినికి విలువ ఉన్నట్టుగా అనిపించినా, నిజానికి అది లేదు. కిషోర్, సంపత్ వారి వారి పాత్రల పరిధిలో నటించారు. కమల్ కొడుకుగా నటించిన అమన్ అబ్దుల్లా బాగానే నటించాడు. మళయాళ నటి ఆశ శరత్ కు చెప్పుకోదగ్గ పాత్ర దక్కలేదు.
ప్రత్యేకతలు :
- సాను జాన్ ఛాయాగ్రహణం (Cinematography). మొత్తం రాత్రి సమయంలో జరిగే ఇలాంటి కథలకు ఛాయాగ్రహణం ఎంతో ముఖ్యం. అందులో వందశాతం విజయాన్ని సాధించారు సాను.
- జిబ్రాన్ నేపథ్య సంగీతం (Background Score). థ్రిల్లర్ కు ఛాయాగ్రహణంతో పాటు నేపథ్య సంగీతం కూడా ఎంతో ముఖ్యం. జిబ్రాన్ దానికోసం పడ్డ కష్టం వృథా పోలేదు.
- ప్రేమ నివాస్ కళాదర్శకత్వం (Art Direction). కథనానికి, అది జరిగే పబ్బు ప్రదేశం సరిగ్గా సరిపోయింది.
- సహజత్వం (Realism). చిత్రంలోని సన్నివేశాలు, పోరాటాలు అన్నీ సహజంగా ఉన్నాయి.
బలహీనతలు :
- నెమ్మదైన కథనం. థ్రిల్లర్ కు ప్రాణమే పరుగెత్తే కథనం. కానీ అది చీకటి రాజ్యంలోని చీకటిలో మెల్లగా నడిచింది.
- షాన్ ముహమ్మద్ కూర్పు. చాలా సన్నివేశాల్లో అనవసరపు షాట్స్ బోలెడున్నాయి. వాటిని కత్తిరించి ఉంటే బాగుండేది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
రెండుసార్లు పులి (మెప్పించే కమల్ చిత్రం) రాలేదని మూడోసారి వెళ్ళడం తండ్రి (ప్రేక్షకుడు) మానుకోకూడదు. మూడోసారి కూడా వెళ్ళాలి. పులి వస్తే ఆనందం, లేదా ఇంకోసారి ప్రయత్నించాలి. అలా, పులి వచ్చేవరకు దానికోసం వెళ్తూనే ఉండాలి ఎందుకంటే, కమల్ ఇదివరకు అందించిన మరుపురాని మరోచరిత్ర, ఆకలి రాజ్యం, విచిత్ర సోదరులు, సాగర సంగమం, స్వాతిముత్యం, భారతీయుడు, దశావతారం, విశ్వరూపం లాంటివి పంచిన వెన్నెలలను కప్పివేయగలవా ఈ “చీకటి రాజ్యాలు”??
– యశ్వంత్ ఆలూరు
Click here for English Version of this Review…
Pingback: Cheekati Rajyam (2015) | Film Criticism