సినిమాను చూసి సమాజం నేర్చుకునే కాలం ఒకప్పుడు ఉండేదేమో తెలియదు కానీ ఈ కాలంలో అది పచ్చి అబద్ధం. సినిమాను చూసి తాగుబోతులు, ఆకతాయిలు తయారవుతారు అనేది నమ్మబుద్ది కాని విషయం. నాకు సంబంధించినంత వరకు, సమాజమే సినిమాకు జన్మనిస్తుంది, విమర్శింపచేసుకుంటుంది. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సమకాలీన సమాజానికి అతీతంగా, హిపోక్రసి (hypocrisy) లేని ఓ పాత్ర ద్వారా సూటిగా విమర్శించడం “కె.బాలచందర్” గారి శైలి. అదే శైలిని అలవరచుకున్నారు దర్శకుడు “సుకుమార్”. ఆయన రచయితగా, ఓ నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం “కుమారి 21F”. రాజ్ తరుణ్, హీబా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి “కరెంట్” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన “పల్నాటి సూర్య ప్రతాప్” దర్శకుడు. ఈ కుమారి సంగతేంటో ఓసారి చూస్తే…
కథ :
సింగపూర్లో ఉద్యోగం చేయాలనుకున్న సిద్ధు (రాజ్ తరుణ్)కి కుమారి (హీబా పటేల్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం “ప్రేమ”కు దారి తీసిందా? ఒకవేళ తీస్తే, అది “ఎలాంటి” ప్రేమ? అనేవి కథాంశాలు.
కథనం :
కె.బాలచందర్ గారి చిత్రాల్లో మూలకథ ఇంతే చిన్నగా ఉండేది. ఉదాహరణకు, “అంతులేని కథ”లోని మూలాంశం “మధ్యతరగతి కుటుంబాల జీవితాలు”, “ఆకలిరాజ్యం”లోని మూలాంశం “నిరుద్యోగం”. కానీ, కథనంలో ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఆ చిత్రాలు. పై విషయాన్ని చూసి “కుమారి 21F” కూడా చిన్న కథా వస్తువుగా అనిపించవచ్చు. కానీ కథనం ఎన్నో విషయాలను చర్చించింది. అలాంటి కథను, కథనాన్ని వ్రాసిన సుకుమార్, బాలచందర్ గారిని ఓసారి గుర్తు చేశారు.
సుకుమార్ సృష్టించే పాత్రలు పిచ్చివని, వాటిలో ప్రతినాయక లక్షణాలు ఎక్కువగా ఉంటాయనే విమర్శ ఉంది. కానీ ఆ పాత్రలు హిపోక్రసీకి చాలా దూరంగా ఉంటాయని చాలామంది గుర్తించని విషయం. సాధారణంగా, కథానాయకుడి పాత్రను ఆ విధంగా మలిచే సుకుమార్ ఈసారి కథానాయిక పాత్రను మలిచాడు. కనుక “కుమారి 21F”లో హీబా పటేల్ కథానాయకుడు, రాజ్ తరుణ్ కథానాయిక అనుకోవచ్చు. ఈ పాత్రలను దర్శకుడు సూర్య ప్రతాప్ తెరపై నడిపించిన తీరు చాలా బాగుంది.
సమాజంలోని అంశాలను సూటిగా ఓ పాత్ర ద్వారా విమర్శించే బాలచందర్ గారి శైలిలోని కథనం ఇది. మనసుకు నచ్చింది సిగ్గుపడకుండా చేసే కుమారి, మనసులో ఇష్టం ఉన్నా పలు అనుమానాలతో సతమతమయ్యే సిద్ధు పాత్రాలే దీనికి ఉదాహరణలు. ఇవి కాకుండా, తనకు ముద్దుపెట్టిన విషయాన్ని సిద్ధు తన స్నేహితులకు చెబితే దాన్ని కుమారి సైతం ఆనందించే లాంటి సన్నివేశాలు సుకుమార్ శైలిని తెలిపేవి. ఈ మధ్యలో వచ్చే “మేఘాలు లేకున్నా” మరియు “లవ్ చేయాలా వద్దా?” గీతాల చిత్రీకరణలు ఆకట్టుకున్నాయి.
మొదటి సగమంతా కాస్త నవ్విస్తూ సాగినా, రెండో సగం పూర్తిగా అసలు కథా వస్తువుని పరిచయం చేసింది. బంధాల్లోని “అనుమానాలు” మరియు వాటిలో మనుషులకు ఉండాల్సిన పరిపక్వతను (maturity) గురించి పలు సన్నివేశాల్లో చర్చించిన తీరు చాలా సూటిగా ఉంది. ముఖ్యంగా, “ప్రేమంటే మనం ప్రేమించిన వారిని సంతోషపరచడమే” అని సిద్ధుని మరో అమ్మాయి దగ్గరికి కుమారి పంపే సన్నివేశం మరియు “తప్పు చేస్తే తప్పు చేసిన కుమారిని ప్రేమించాలి, తప్పు చేయకపోతే తప్పు చేయని కుమారిని ప్రేమించాలి…” అని చెప్పే సన్నివేశం మనుషుల్లోని హిపోక్రసిని బలంగా దెబ్బకొట్టినట్టు అనిపించింది. అలాగే, కుమారి పాత్రపై గౌరవాన్ని కూడా అమితంగా పెంచేసింది. ఈ విషయంలో దర్శకరచయితలను అభినందించకుండా ఉండడం చాలా కష్టం. ఇదే కాకుండా, సిద్ధు – కుమారి లాంటి కథనే కుడిఎడంగా సిద్ధు తల్లిదండ్రుల మధ్య నడిపిన తీరు కూడా ఆకట్టుకుంది.
ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది పతాక ఘట్టం గురించి. నిజమైన పరిపక్వత, ప్రేమలకు అర్థం చెప్పిన ఆ ఘట్టం ఈ చిత్రంపైనే గౌరవాన్ని పెంచేసింది. కుమారి వ్రాసిన ఉత్తరాన్ని సిద్ధు చదవిన తరువాత, ఆవిడ గతం గురించి కూడా తెలిసిన అతడు తీసుకున్న నిర్ణయానికి “సాహో!”. ఈ కాలంలో ఇలాంటి సూటి చిత్రాలను తీయడమే ఓ సాహసం అనుకుంటే, దానికి ఇంత మంచి ముగింపుని ఇచ్చిన దర్శకరచయతలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటికే విందుభోజనంలాంటి కథనంతో కడుపు నిండినా, చిట్టచివరి సన్నివేశం ఆ భోజనం తరువాత ఓ పుల్లారెడ్డి మిఠాయిని తిన్నంత తృప్తిని కలిగించింది. ఓసారి నేమరువేసుకుంటే, మొదటి నుండి చిత్రంలో చర్చించిన ఏ విషయాన్ని వదలకుండా, దర్శకరచయితలు అన్నింటికీ సంపూర్ణ న్యాయం చేశారనిపించింది.
మొత్తానికి, “కుమారి 21F” అక్కడక్కడ నవ్విస్తూ, కొన్నిచోట్ల ఆశ్చర్యపరుస్తూ, తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పి సరైన పరిపక్వత లేక బంధాలను నిలబెట్టుకోలేకపోతున్న మనుషులకు మంచి పాఠం చెప్పింది. కనుక ఈ చిత్రాన్ని చూడమని అందరికి సిఫార్సు చేస్తున్నాను.
నటనల విషయానికి వస్తే, కథలోని ముఖ్య పాత్రలకు రాజ్ తరుణ్, హీబా పటేల్ సరిగ్గా సరిపోయారు. పాత్రకున్న అమాయకత్వాన్ని, అనుమానాన్ని రాజ్ తరుణ్ పలికించిన తీరు ఆకట్టుకుంది. తన పాత్రకున్న పరిపక్వతను హీబా ప్రదర్శించిన తీరు ఈ చిత్రానికి తననే కథానాయకుడిగా నిలేబట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజ్ తరుణ్ స్నేహితులుగా నటించిన నోయల్, నవీన్, సుదర్శన్ పాత్రలకు సరిపోవడమే కాకుండా బాగా నటించారు కూడా. తల్లి పాత్రకు అతిశాయాన్ని పండించే ప్రగతిలాంటి వారిని కాకుండా హేమను తీసుకోవడం అభినందనీయం. పాత్రాకు లోబడే నటించారు హేమ.
ప్రత్యేకతలు :
- సుకుమార్ అందించిన కథ, కథనం మరియు మాటలు (Story & Screenplay). తను వ్రాసుకున్న మూలకథకు తగిన కథనాన్ని, మాటలను సూటిగా అందించారు. కథలో పరిచయం చేసిన ఏ విషయాన్ని వదలకుండా పూర్తి చేశారు.
- పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం (Direction). ఈ చిత్రానికి సంబంధించిన ఘనతను కేవలం సుకుమార్ కే ఇచ్చేస్తే అది తప్పు. ఇలాంటి కథను తెరకెక్కించాలానే సాహసం చేసినందుకు, కథను ఎక్కడా చెడగొట్టకుండా కథనాన్ని, పాత్రలను నడిపినందుకు సూర్య ప్రతాప్ ను అభినందించాలి.
- దేవీశ్రీప్రసాద్ సంగీతం (Music). ఈ మధ్య కాలంలో వచ్చిన గీతాల్లో “మేఘాలు లేకున్నా” గీతాన్ని ఉత్తమ గీతంగా చెప్పుకోవచ్చు. ఈ గీతపు రాగాన్నే వయోలిన్ వాద్యంతో నేపథ్యంలో వాడిన తీరు కథనాన్ని హృదయానికి దగ్గర చేసింది.
- రత్నవేలు ఛాయాగ్రహణం (Cinematography). ఇతడి ఛాయాగ్రహణంలో ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది లైటింగ్ ని. సన్నివేశానికి ఎంత ఉపయోగిస్తే అది పండుతుందో సరిగ్గా తెలిసిన ఛాయాగ్రాహకుడు రత్నవేలు. దీనికి ఉదాహరణలు, “మేఘాలు లేకున్నా” గీతం, చివర్లో సిద్ధు ఉత్తరం చదివే సన్నివేశం మరియు రాత్రి సమయంలో వచ్చే ప్రతీ సన్నివేశం.
- నిర్మాణ విలువలు (Production Values). ఎక్కువ కాదు, తక్కువ కాదు. చిత్రానికి ఎంత కావాలో అంత ఖర్చుపెట్టారు నిర్మాతలు విజయ్ ప్రసాద్ మరియు థామస్ రెడ్డి.
- రాజ్ తరుణ్, హీబా పటేల్ నటనలు (Performances). పైన చెప్పుకున్నట్టుగా, పాత్రలాకు వీరిద్దరూ సరిగ్గా సరిపోయారు.
- ముగింపు (Conclusion). ఈ చిత్రపు చిట్టచివరి సన్నివేశం నూటికి రెండొందల శాతం ఈ కథకు సరైన ముగింపు.
బలహీనతలు :
- వయోజన హాస్యం (Adult Comedy). ఈ చిత్రం మనుషుల్లోని అంతర్ముఖాలకు సంబంధించింది కనుక ఇలాంటి హాస్యాన్ని, కథనాన్ని అందించారు. దీన్ని అందరూ ఆమోదిస్తారో లేదో కొన్నిరోజులు వేచిచూడాలి.
- సెన్సార్ బోర్డు కత్తెరలు (Censor Cuts). చిత్రానికి “A” సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ పలు సన్నివేశాల్లోని మాటలు, గీతాల్లోని వాక్యాలు ఇలా 17 పైచిలుకు చోట్ల కత్తెరలు వేశారు. సూటిగా వెళుతున్న కథనానికి ఇవి అడ్డుకట్టలుగా మారి మొదటి సగంలో బాగా ఇబ్బందిపెట్టాయి.
ఈ చిత్రం నేర్పిన పాఠాలు :
- కథలో పరిచయం చేసిన ఏ విషయాన్ని వదలకూడదు.
- ఎప్పటికైనా కథనే నమ్ముకోవాలి కానీ నటులను, వ్యాపారాన్ని కాదు.
- కొన్ని కథలు, కథనాలు సూటిగా ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Avg movie, heroine character ni inka baga design cheyocchu, main point enti ante ammai manchidi ani manaki clarity istune hero point of view lo vaadiki doubt vacchindi ani choopinchali anthey gani heroine pai audience ki kooda doubt vastundi aa rate lu adagatamento, chinna pillala mundu nadmu meeda macchalu, malli bonus ga cigarette taagadam endho emo teesadu ishtamocchinattu but last 20 mins cinema ki highlight 🙂
LikeLike
This is what called subjective narration. You can’t accept the ending unless you suspect Kumari along with Sidhdhu 🙂
LikeLike
Pingback: Kumari 21F (2015) | Film Criticism