సైజ్ జీరో (2015)

11233082_10156040562585193_7806341442268315898_o

భూమ్మీద ప్రతి మనిషికి కష్టాలుంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో రకమైన కష్టం అప్పటికి రాజ్యమేలుతుంది. ఈ కాలపు వారిని (ముఖ్యంగా అమ్మాయిలను) పట్టి పీడిస్తున్న సమస్య “బరువు”. దీనివల్ల ఎన్నో కష్టాలు, దీనికోసం ఎన్నో బాధలు. అసలు ఇది భూతద్దంలో చూడాల్సిన సమస్య కాదని, దీనికి పరిష్కారం తమ చేతిలోనే ఉందనే అంశంతో వచ్చిన చిత్రం “సైజ్ జీరో”. “అనుష్క” కథానాయికగా, ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి “అనగనగా ఓ ధీరుడు” చిత్రానికి దర్శకత్వం వహించిన “ప్రకాష్ కోవెలమూడి” దర్శకుడు. ప్రకాష్ భార్య “కనిక కోవెలమూడి” కథ, కథనాలను సమకూర్చారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించారు.

కథ :

“ఆనందంగా ఉన్న అమ్మాయిలే అందమైన అమ్మాయిలు” అనే సూత్రాన్ని పాటిస్తూ శరీర తత్వాన్ని పట్టించుకోని అమ్మాయి సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క). ఇంతలో ఆమెకు పరిచయం అవుతాడు అభి (ఆర్య). అతడి పరిచయం స్వీటీ ధోరణిని, జీవితాన్ని ఎలా మార్చింది? స్వీటీ, అభిలతో సిమ్రాన్ (సోనాల్ చౌహాన్)కు సంబంధం ఏంటి? సత్యానంద్ (ప్రకాష్ రాజ్) “సైజ్ జీరో” సూత్రం స్వీటీకి సాయపడిందా లేదా? అనేవి కథాంశాలు.

కథనం :

కనిక కోవెలమూడి వ్రాసిన ఈ కథలో శరీరబరువు కన్నా “ఆత్మాభిమానం” ప్రధానాంశం. శరీరబరువుని మానసిక బరువుగా మార్చుకొనే ఈ కాలపు అమ్మాయిలను ఉద్దేశించినది ఈ కథ. ముఖ్యంగా పెళ్ళి విషయంలో అమ్మాయిలకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది కనుక ఆ అంశాన్నే ప్రధానంగా తీసుకోవడం మంచి విషయం. దీనికి, రైల్వేస్టేషన్లో బరువుని చూపించే టికెట్లతో స్వీటీ జీవితాన్ని అనుసంధానం చేయడం, కుకీస్ (cookies) ద్వారా అందరికి మంచి సందేశాలు పంపడం వంటి అంశాలను జోడించడం బాగుంది. వీటితో సాగిన మొదటి సగం ఆహ్లాదకరంగా సాగింది. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, “బరువు” అనే అంశంతో రచయిత్రి కనిక, దర్శకుడు ప్రకాష్ కేవలం నవ్వించారే తప్ప స్వీటీ పాత్రను కానీ, బరువుగా ఉన్న అమ్మాయిలను కానీ ఎక్కడా కించపరిచలేదు. ఈ విషయంలో వారికి మార్కులు వేసేయాలి. కూతురికి ఎలాగైనా పెళ్ళి చేయాలని అనుక్షణం తపించే తల్లి (ఊర్వశి) పాత్రను కూడా మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఉండేలా చిత్రించారు. నాకు నచ్చిన మరో అంశం, స్వీటీకి అభిపై ప్రేమ కలిగే సన్నివేశంలో వేరే ప్రదేశాల్లో ఏమి జరుగుతోందో స్టడీ షాట్స్ (steady shots) లో చెప్పిన విధానం.

మొదటి సగంలో ఓ మాదిరిగా వెళ్ళిన కథ, కథనాల తీరు రెండో సగంలో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు స్వీటీ పాత్ర ప్రధానంగా ఉన్న చిత్రం ఉన్నట్టుండి మరో సమస్యను ప్రధానంగా చేసింది. ఇక్కడే, కథనం బాగా నెమ్మదించి గాడి తప్పినట్టు అనిపించింది. మధ్యలో, స్వీటీకి తన తాతయ్య (గొల్లపూడి మారుతీరావు) ఓ ఖాళీ టికెట్టు ఇచ్చి “ఇది నీ తలరాత, నీకు నచ్చినట్టు రాసుకో” అని చెప్పే సన్నివేశం బాగుంది. అంతటి అనుభవజ్ఞుడైన నటుడిని ఎంపిక చేసుకున్నందుకు ఆయనకు గౌరవాన్ని కూడా ఇచ్చింది. ఇక, నాగార్జున, రానా, తమన్నాలాంటి పలువురు ప్రముఖ తారలు చేసిన అతిథి పాత్రలు కథనపు బరువుని పెంచలేకపోయాయి. బరువెంత ఉన్నా, అమ్మాయిలు తమ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనేదే ఈ కథ ఉద్దేశ్యం అయితే, చివర్లో పెళ్లి తప్పించుకోవడానికి స్వీటీ చేసిన పని ఎంతమాత్రం ఆ విషయానికి న్యాయం చేకూర్చిందో ఓసారి దర్శకరచయితలు ఆలోచించి ఉంటే బాగుండేదేమో.

మొత్తానికి సైజ్ జీరో, తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడం కోసం విపరీత చర్యలు చేయకూడదని, దానికోసం కష్టపడాలని, మనం మనకు నచ్చినట్టు జీవించడమే నిజమైన అందమనే బరువైన వేదాంతాన్ని తేలికైన కథనంతో చెప్పింది.

సంగీతం విషయానికి వస్తే, కీరవాణి ఈసారి బరువైన బాణీలను ఇవ్వలేకపోయినా, నేపథ్య సంగీతంతో సన్నివేశాల బరువుని పెంచారు. తెరపై “మెల్ల మెల్లగా” గీతం బాగుంది. “ఇన్నావా ఇన్నావా” గీత చిత్రీకరణ నెమ్మదిగా ఉండి బోరు కొట్టించింది. మిగతా గీతాల చిత్రీకరణలు చెప్పుకోదగినవి కావు.

నటనల విషయానికి వస్తే, అనుష్క ఈ చిత్రం కోసం పడిన కష్టం మరెవ్వరు పడలేరనిపించింది. చేతిలో దేవసేనలాంటి బలమైన పాత్ర ఉండగా, స్వీటీలాంటి బరువైన పాత్రను ఎంపిక చేసుకోవడం, దానికోసం కష్టపడడం సినిమా పట్ల ఆమెకున్న ప్రేమను కూడా తెలిపింది. అభి పాత్రకు ఆర్య సరిగ్గా సరిపోయాడు. తెలుగులో తన సంభాషణలు తనే చెప్పుకున్నట్టుగా అనిపించింది. సోనాల్ చౌహాన్ పాత్ర కేవలం కథను దారి మార్చడానికే తప్ప పెద్దగా ఉపయోగపడలేదు. సత్యానంద్ పాత్రను ఎవరైనా పోషించగలరు. బహుశా, శ్రీశ్రీ గేయాలను స్పష్టంగా, ధృడంగా పలుకగలడు, పైగా తెరపై తెలివిగా కనిపించగలడు కనుక ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసుకున్నారేమో అనిపించింది. అతడి ప్రతిభకు ఇది తగిన పాత్ర కాకపోయినా, ఉన్నంతలో దాన్ని బాగా పండించాడు. గొల్లపూడి మారుతీరావు గారికి గౌరవనీయమైన పాత్ర దక్కింది. బ్రహ్మానందం, అలీలు మెప్పించలేకపోయారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది “ఊర్వశి” గారి గురించి. తల్లి పాత్రకు సరిగ్గా సరిపోవడంతో పాటు, తన తమిళ యాస సంభాషణలతో, సహజమైన చలాకీ నటనను ప్రదర్శించారు. దీనికి పలు ఉదాహరణలున్నాయి కానీ స్వీటీ తపనను గుర్తించిన తరువాత తన అవివేకాన్ని ఒప్పుకునే సన్నివేశం ఆవిడ ప్రతిభకు అద్దం పట్టింది. స్వీటీ తమ్ముడు యాహూగా ఎదిగిన “మాస్టర్ భరత్” కూడా బాగా చేశాడు.

ప్రత్యేకతలు :

 1. స్వీటీ పాత్ర చిత్రణ (characterization). నిజజీవితంలో ఓ బరువైన అమ్మాయిని చూస్తే మనలో చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి పాత్రను ముఖ్యపాత్రగా తీసుకొని, సగటు ప్రేక్షకుడికి ఎక్కడా అగౌరవం కలగకుండా మలిచిన ఈ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ప్రత్యేకత.
 2. ఊర్వశి, అనుష్కల నటన (performances). పైన చెప్పుకున్నట్టుగా ఈ చిత్రంలోని రెండు ముఖ్యమైన పాత్రలకు ఈ ఇద్దరు నటీమణులు ప్రాణం పోశారు.
 3. నిరవ్ షా ఛాయాగ్రహణం (cinematography). చిత్రంలోని ప్రతి దృశ్యం కంటికి ఇంపుగా ఉందంటే దానికి నిరవ్ పనితనమే కారణం.
 4. కిరణ్ సంభాషణలు (dialogues). ఎక్కువ కాదు, తక్కువ కాదు. సరైన బరువుగల సంభాషణలను అందించారు కిరణ్. “ఇన్నాళ్ళు నేను నీ కూతురు అనుకున్నాను. కష్టం అని ఇప్పుడే అర్థమైంది” లాంటి సంభాషణలు బాగున్నాయి.
 5. పీవీపీ నిర్మాణ విలువలు (production values). ఓ చిన్న చిత్రం కావాల్సిన సైజ్ జీరోని పెద్ద చిత్రంగా మలిచింది పీవీపీ సంస్థ యొక్క నిర్మాణ విలువలే.

బలహీనతలు :

 1. కథనం. ఈ చిత్రానికున్న ఒకే ఒక్క బలహీనత, అతి బరువైన బలహీనత కథనమే. మొదటి సగంలో ఓ దారిలో, రెండో సగంలో మరో కొత్త దారిలోకి వెళ్ళి ఇబ్బందిపెట్టింది. చిత్రపు నిడివి 131 నిమిషాలే అయినా నెమ్మదిగా నడవడం వల్ల చాలాసేపు కూర్చున్న భావన కలిగించింది. అక్కడక్కడ బాగుంది, పలుచోట్ల బలహీనంగా ఉంది.
 2. కూర్పు. ఇది పూర్తిగా దర్శకుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. “ఇన్నావా ఇన్నావా” గీతాన్ని మొత్తం ఉంచకుండా కత్తెర వేసుంటే బాగుండేది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

కేవలం నటులలో బరువుని పెంచితే సరిపోదు, కథ, కథనాల్లో కూడా పెంచాలి.

– యశ్వంత్ ఆలూరు

Click here for English Version of this Review…

2 thoughts on “సైజ్ జీరో (2015)

 1. Avg movie, yes 2nd half entento try chesadu anta strong scenes levu, mother role lo urvashi kummesindi, anushka taruvata anta perforamnce scope unnadi aame role ke, tana mother gurinchi cheppe scene lo baaga chesindi

  yes cliax lo asalu adivi sesh gaadu propose daggare ledu ani arya ni love chestunna ani cheppocchu ga,endho aa lat minute pellillu aagipoye scenes enni saarlu pedataro ento 😦

  Liked by 1 person

 2. Pingback: Size Zero (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s