శంకరాభరణం (2015)

Shankarabharanam Poster

దర్శకుల హవా నడుస్తున్న ఇప్పటి సినీ పరిశ్రమలో రచయితకు సరైన గుర్తింపు దక్కడంలేదు. సొంత కథలతో సినిమా తీసే ఏ దర్శకుడైనా మొదట రచయిత అవతారం ఎత్తాల్సిందే. మాతా, పిత, గురువు, దైవం అనే సూత్రాన్ని సినిమా విషయంలో రచయిత, నిర్మాత, దర్శకుడు, ప్రేక్షకుడుగా ఆపాదించాలి. ప్రస్తుత పరిశ్రమలోని పరిస్థితుల్లోనూ తనకంటూ ఓ ముద్ర సంపాదించుకున్న రచయిత “కోన వెంకట్”. రచయితగానే కాకుండా నిర్మాతగానూ మారి ఆయన మలిచిన చిత్రం “శంకరాభరణం”. నిఖిల్, నందిత జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా “ఉదయ్ నందనవనం” దర్శకుడిగా పరిచయం అయ్యారు.

కథ :

అమెరికాలో కోట్లు సంపాదించి దివాళా తీసిన ఓ కోటీశ్వరుడు (సుమన్) కొడుకు గౌతమ్ (నిఖిల్). తండ్రిని ఆదుకోవాలంటే బీహార్లో తన పేరు మీదున్న “శంకరాభరణం” మహలుని అమ్మడమే దారి అని గౌతమ్ తల్లి రజ్జో దేవి (సితార) అతడిని బీహారుకు పంపుతుంది. బీహారులో అడుగుపెట్టిన గౌతమ్ కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఎలాంటి వ్యక్తులను అతడు కలుసుకున్నాడు? అనేవి ఈ చిత్ర కథాంశాలు.

కథనం :

రచయితకు ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతివిశ్వాసం ఉండకూడదు. ఈ చిత్రపు రచయిత, నిర్మాత కోన వెంకట్ విడుదల కాకముందే ఇది పూర్తిగా రచయిత విజయమనే అతివిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఈ విషయంలో ఆయనను పూర్తిగా తప్పు పట్టడం కూడా తప్పే. ఎందుకంటే, ఆయనకున్న విజయాలు బోలెడు. ఆయన జ్ఞానం అమితం. “షర్టుకు జేబు ఎడమవైపే ఎందుకు కుడతారో తెలుసా? అది ఖాళీగా ఉన్నా గుండె ధైర్యం చెబుతుంది కనుక!” అనే లోతైన జీవితపు అనుభవాల్లోంచి పుట్టుకొచ్చిన అంశాలు ఈమధ్య ఆయన రచనల్లో కనుమరుగైపోయాయి. పాడిందే పాట అన్నట్టుగా వ్రాసిందే వ్రాత, తీసిందే తీత అనే ధోరణిలో ఈ చిత్రాన్ని మలిచారు.

ఏదేమైనప్పటికీ, ప్రతి చిత్రంలో మంచి, చెడు రెండూ ఉంటాయి కనుక ముందుగా మంచి విషయాలను చర్చించుకుందాం. కోన వ్రాసిన మూలకథను ఓసారి గుర్తు చేసుకుంటే, అందులో ఎన్నో విషయాలను సృజనాత్మకంగా చెప్పే వీలుంది. డబ్బు మైకం మనిషి చేత ఎలాంటి పనులు చేయించగలదో, సమాజంలో ప్రాణం కన్నా, బంధాల కన్నా డబ్బుకే విలువుందని చెప్పే కథ ఈ శంకరాభరణం. కోన గారు వేదాంతాన్ని, విప్లవాన్ని కూడా హాస్యంతో జతచేసి చెబుతారు. దీనికి ఆయన పని చేసిన పలు చిత్రాలే ఉదాహరణలు. ఈ చిత్రంలోనూ అదే చేశారు. మొదటి పాట మినహా మిగతా పాటలన్నీ విడిగా లేకుండా, కథనంతోనే ప్రయాణం చేశాయి. కోన వ్రాసిన కథలో ఈసారి బ్రహ్మానందం లేకపోవడం చాలా మంచి విషయం.

ఇక మిగతా విషయాలకు వస్తే, ఈ కథకు కోన సమకూర్చిన కథనం ఏమాత్రం ఆకట్టుకోలేదు. థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు కథనం పరుగులు పెట్టాలి. కానీ ఇందులో నత్తనడకన సాగింది. ఇదే ప్రధాన బలహీనత. మధ్యమధ్యలో వచ్చే భావోద్వేగపు సన్నివేశాలు కూడా ఆకట్టుకోలేదు.150 నిమిషాల నిడివి ఈ చిత్రానికి చాలా ఎక్కువ. మొదటి సగం దాదాపుగా గంటన్నర పాటు సాగింది. సప్తగిరి, వైవా హర్ష లాంటి వారు అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు కానీ విరామం సమయానికి ఎలాంటి ఉత్కంఠను కలిగించలేకపోయారు రచయిత కోన మరియు దర్శకుడు ఉదయ్.

రెండో సగమైనా మెరుగ్గా ఉంటుందేమో అనుకుంటే అది కూడా ఇదే పంథాలో సాగింది. సమాజంలోంచి పుట్టిన సినిమా సమాజాన్ని విమర్శించాలి, నిజమే. కానీ ఎంతవరకు అన్నది రచయితలు ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు అధికంగా ఉంది. ముఖ్యంగా, కోన రచనలు ఎక్కువగా విమర్శించేవే ఉంటాయి. ఒకటి, రెండుసార్లు అది నవ్వించడమో, ఆలోచింపజేయడమో చేస్తుంది కానీ ప్రతిసారి అలాగే ఉంటే బోరుకోట్టేస్తుంది. రెండో సగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కృష్ణభగవాన్ పోషించిన పాత్ర, “ప్రవాసభారతీయుడివని సినిమాను ఊరికే విమర్శించకు, వీలైతే సినిమా తీసి చూపించు” అని చెప్పే గిరి పోషించిన బజరంగి పాత్ర దీనికి ఉదాహరణలు. పాతబడిన విషయాలను మళ్ళీ తవ్వితీయడం అవసరమా అనిపించింది.

ఇలా సాగుతున్న కథనంలో పరమేష్ పాత్రలో పృథ్వీరాజ్ బాగా అలరించాడు. అతడి కామెడీ టైమింగ్ చిత్రానికి బాగా ఉపయోగపడింది. మున్నీగా అంజలి ప్రవేశం ఆకట్టుకోకపోగా, స్త్రీలు పురుషులను అధిగమించాలి అనే అంశాన్ని కొంచెం జుగుప్సాకరంగా చెప్పారనిపించింది. ఎలాగో మూస చిత్రంలా శంకరాభరణాన్ని ముగించారు దర్శకరచయితలు.

అలా, శంకరాభరణంకు మూలకథ మిత్రుడు అయితే, మూస కథనం బద్ద శత్రువుగా మారి ఇబ్బందిపెట్టింది.

సంగీతం విషయానికి వస్తే, ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఒకట్రెండు పాటల్లో బాగుందనిపించింది కానీ నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది కాదు.

నటనల విషయానికి వస్తే, ప్రవాసభారతీయుడిగా నిఖిల్ ఫరవాలేదనిపించాడు. అతడి ఆహార్యం, తెరపై కనిపించిన విధానం అన్నీ పాత్రకు సరిపోయాయి. నందిత కూడా బాగానే చేసింది. పృథ్వీరాజ్, సప్తగిరి, వైవా హర్ష లాంటివారు అలరించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా బిహారీ గూండాగా సరిపోయినప్పటికి ఆయన పూర్తిగా నోరు తెరిచి సంభాషణలు పలికినట్టు దాదాపు కనబడలేదు. అంతా డబ్బింగ్ లో చూసుకున్నట్టుగా ఉంది. అంజలి “మున్నీ” పాత్రకు సరిపోయినట్టు కానీ, ఆ పాత్ర కథనానికి ఉపయోగపడినట్టు కానీ ఏమాత్రం అనిపించలేదు. రావురమేష్, సుమన్, సితార ఇలా మిగతావారికి మామూలు పాత్రలే దక్కాయి. సంపత్ రాజ్ పాత్ర కూడా ఆకట్టుకోలేదు.

ప్రత్యేకతలు :

  1. కోన వెంకట్ మూలకథ (basic plot). ఈ చిత్రానికి కోన అందించిన మూలకథ బాగుంది.
  2. సాయి శ్రీరాం ఛాయాగ్రహణం (cinematography). ఈ చిత్రానికి ప్రధాన బలం ఇదే. బీహారులోని ప్రాంతాలను చాలా చక్కగా కెమెరాలో బంధించారు.
  3. నిర్మాణ విలువలు (production values). చిత్రానికి పెద్దగా ఖర్చు అయినట్టు అనిపించకపోయినా, నాణ్యత విషయంలో నిర్మాత సత్యనారాయణ ఎక్కడా రాజీ పడలేదు.

బలహీనతలు :

  1. మూస కథనం (routine screenplay). మూలకథలోని “మైండ్ గేమ్” అంశాన్ని కొత్తగా కాకుండా పాత పద్ధతిలోనే చూపించారు కోన వెంకట్.
  2. అతి విమర్శలు (over criticism). పైన చెప్పుకున్నట్టుగా, విమర్శల మోతాదు ఈ చిత్రంలో మించింది.
  3. నిడివి/కూర్పు (runtime/editing). ఈ చిత్రానికి 150 నిమిషాల నిడివి అత్యధికం. కాస్త కత్తెరకు పని చెప్పుంటే బాగుండేది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

ఓ స్థాయికి వచ్చాక మనం ఏది వ్రాసినా, ఏది తీసినా జనం చూసేస్తారన్న అతివిశ్వాసం, అహంకారం రచయితలకు, దర్శకులకు పనికిరాదు.

– యశ్వంత్ ఆలూరు

Click here for English Version of this Review…

One thought on “శంకరాభరణం (2015)

  1. basic plot super, oka 2 hrs length lo manchi comedy with few twists laaga teeyalsina cinemani

    unnecessary elements anni kalipi pulihora chesesadu

    interest undali cinemalo okko kidnapper ki same plan esi escape ayye scenes super fun undali but ala em anipiyaledu

    climax baga drag chesadu

    saptagiri , prudhvi iddaru bagane navvincharu punch la tho

    sarigga teeste matuku manchi entertainer ayyedi

    Anjali role vammo

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s