ఏ దర్శకుడైనా తన ప్రతి సినిమాను పూర్తి మనసుపెట్టి తీస్తాడు. కానీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మాత్రం తమ మనసును ఓ సినిమాలో ఉపయోగిస్తారు, మరో సినిమాలో ఉపయోగించరు. ఒకవేళ ఉపయోగిస్తే, “నేనింతే”, “టెంపర్” లాంటి సినిమాలు పుడతాయి. లేకపోతే “జ్యోతిలక్ష్మి”, “హార్ట్ ఎటాక్”లు వస్తాయి. విచిత్రంగా, పూరి ఈసారి “సగం” మనసుపెట్టి ఓ చిత్రం తీశాడు. అదే “లోఫర్”. వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు. మరి, ఆ లోఫర్ సంగతేంటో చూస్తే…
కథ :
చిన్నప్పుడే రాజా (వరుణ్ తేజ్)ని తన తల్లి లక్ష్మి (రేవతి) నుండి వేరుచేసి పెంచి దొంగను చేస్తాడు అతడి తండ్రి మురళి (పోసాని కృష్ణమురళి). పారిజాతం అలియాస్ మౌని (దిషా పటాని)తో ప్రేమలో పడ్డ రాజాకు ఓరోజు, తండ్రి చనిపోయందని చెప్పిన తల్లి లక్ష్మి కనబడుతుంది. ఆ తరువాత అతడు తన తల్లి ప్రేమను, తన మౌని ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం.
కథనం :
నిజానికి ఈ కథాంశం కొత్తదేమీ కాదు. పూరి “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” తీసిన పదేళ్ళ తరువాత “అమ్మ” గురించి ఓ సినిమా తీశాడంతే. “ముకుంద”, “కంచె” లాంటి చిత్రాలతో తన అభిరుచిని చాటుకున్న వరుణ్ ఈసారి పూరి కథను ఒప్పుకున్నాడు కాబట్టి ఇందులో కొత్త అంశం ఏదైనా ఉంటుందేమో అన్న సందేహం కలిగింది. ఆ తరువాత, సెంటిమెంటుకు దొరకనంత దూరంలో ఉండే “రాంగోపాల్ వర్మ” లాంటి వాడే ఈ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్నాడనే వార్త వచ్చింది కనుక ఇది నూటికి నూరుశాతం కొత్త చిత్రమే అయ్యుంటుంది అనే నమ్మకం కలిగింది.
అందుకే, ముందుగా పూరి ప్రయత్నించిన కొన్ని కొత్త/మంచి విషయాలను గురించి మాట్లాడుకుందాం…
మొదటిది తల్లి పాత్రకు “రేవతి”ని ఎంపిక చేసుకోవడం. జయసుధ లాంటివారు బోరు కొట్టేసిన తరుణంలో ఈ ఎంపిక కొత్తగా అనిపించింది. రెండవది, కథానాయిక. సాధారణంగా, తన కథానాయిక పాత్రలకు ఎదో ఒక ప్రత్యేకతను జోడించే పూరి ఈసారి ఓ మామూలు పాత్రను తెరపైకి తీసుకొచ్చాడు. ఆమెను తన కథానాయకుడు “మీరంతా ఆర్డినరియే!” అని చులకనగా మాట్లాడలేదు. కళ్ళల్లో పెప్పర్ స్ప్రే (pepper spray) కొట్టినా కూడా క్షమించేసి ప్రేమించాడు. దొంగ అయిన తనను ఏదో మంత్రమేసి మార్చమన్నాడు. ఆమె కోసం తన కన్నతండ్రి మాటను కూడా కాదన్నాడు.
“అమ్మ” అనేది ఎన్ని సినిమాలు తీసినా, ప్రేక్షకుడి ఆదరణ ఎప్పటికి కోల్పోని గొప్ప అంశం. దాన్ని తక్కువ చేసో, లేక చెడ్డదాన్ని చేసో చూపించగల మనసు ఎవరికీ ఉండదు. అది వర్మలాంటి తీవ్రవాదులను సైతం కదిలించగలదు. చివరకు, తలపొగరు కలిగిన పూరి కథానాయకులైనా, “సువ్వి సువ్వాలమ్మా” అంటూ తల్లి ప్రేమకోసం తపిస్తారు. తన టీచర్ పరిభాషలో, ఓ తల్లి తన బిడ్డకోసం పడే వేదనను, లక్ష్మి పాత్ర ద్వారా పూరి తెలిపిన విధానం చూస్తే అనిపించింది, అది పూరి మనసు లోతుల్లోంచి వచ్చిన సన్నివేశమని.
“ఇడియట్” రవితేజ, “పోకిరి” మహేష్, “టెంపర్” తారక్, “జ్యోతిలక్ష్మి” ఛార్మి, “లోఫర్” వరుణ్ తేజ్. వీరందరిలో ఉన్న ఒక పోలిక వారి “ఆహార్యం”. అది పూరిదే. ఈ విషయంలో పూరిలో మార్పు రాలేదు. మంచి విషయం ఏమిటంటే, అది ఇంకా బోరుకోట్టలేదు. ఉదాహరణకు, రాజా తన తల్లిని కలుసుకునేలా చేసిననందుకు మౌనికి కృతజ్ఞతలు చెప్పే సన్నివేశంలో పూరి కొట్టొచ్చినట్లు కనిపించాడు. ఇదిలావుండగా, రెండో సగపు కథనమంతా పరుగులు పెడుతూ సాగింది. కనుక మొదటి సగాన్ని కాస్త మరిపించగలిగింది.
ఇక మిగతా విషయాలాకు వస్తే…
మొదటి సగం నెమ్మదైన కథనంతో సాగింది. పూరి జోధ్పూర్ లో ఎంతటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపినా, “సునీల్ కశ్యప్” సంగీతం కాస్త వినసొంపుగా ఉండుంటే మొదటి సగాన్ని ప్రేక్షకుడు సులభంగా క్షమించేయగలడు. ఇక్కడే పూరి గాడి తప్పాడనిపించింది. అలాగే, మొదటి సగంలోని ఓ సన్నివేశం నివ్వెరపోయేలా చేసింది. బహుశా, తల్లి విలువ తెలియని ఎంతోమంది మూర్ఖులు ఈ సమాజంలో ఉన్నారు కనుక, వారి స్వభావాన్ని చూపించడానికి ఆ సన్నివేశాన్ని పూరి వ్రాసుకొని ఉండొచ్చు. పాత్రలను నెలకొల్పడానికి అది కథనానికి అవసరమైనదే కావొచ్చు. కానీ అమాంతం తెరపైకి వచ్చేసరికి చాలా జుగుప్సగా అనిపించింది. ఏదేమైనా, విరామం సమయానికి మళ్ళీ మెప్పించాడు పూరి.
అలా మొత్తానికి “లోఫర్” సగం హృదయంతో తీసిన సినిమాగా చెప్పొచ్చు. చూసిన ప్రేక్షకుడు కాస్త ఆనందించి బయటికి రావొచ్చు.
ఇక నటనల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ పోషించిన రాజా పాత్ర ఈ చిత్రానికి ఆయువుపట్టు. సినిమా సినిమాకు అతడి నటనలో వస్తున్న మార్పు చూస్తుంటే ఆనందంగా ఉంది. ముఖ్యంగా, “సువ్వి సువ్వాలమ్మా” పాటలో అతడు పలికించిన భావోద్వేగాలు చాలా బాగున్నాయి. వ్యాపారంతో సంబంధం లేకుండా, మంచి కథలను ఎంచుకుంటూ పోతే, భవిష్యత్తు అతడిని ఓ మంచి “నటుడు”గా చెప్పుకుంటుంది అనడంలో సందేహం లేదు. దిషా పటాని పాత్రకు సరిపోవడంతో పాటు దానికి సరిపడా నటనను ప్రదర్శించింది. తల్లి పాత్రకు రేవతి సరైన ఎంపిక. తన పాత్రను కూడా బాగా పోషించారు ఆవిడ. ఇక పోసాని పాత్ర మంచిదే అయినప్పటికీ, అతడి ఆహార్యంలో మార్పు చేయకపోవడంతో, అతడి గావుకేకలు చిరాకు తెప్పించాయి. ముఖేష్ ఋషి మరియు మిగతా ప్రతినాయకులు సరిపోయారు. అలీ, బ్రహ్మానందం, సప్తగిరి, ధనరాజ్, భద్రం లాంటి వారికి ఎక్కువ ఆస్కారం లేకపోవడంతో వారి హాస్యం పండలేదు.
ప్రత్యేకతలు :
- రెండో సగపు కథనం (Second Half). చిత్రాన్ని ఇదే నిలబెట్టిందని చెప్పాలి. ఇందులో చెప్పిన అమ్మ సెంటిమెంట్ బాగా పండింది.
- వరుణ్ తేజ్ (Varun Tej). పైన చెప్పినట్టుగా, మంచి భవిష్యత్తున్న నటుడుగా కనిపిస్తున్నాడు వరుణ్.
- పీ.జీ.విందా ఛాయాగ్రహణం (Cinematography). చిత్రమంతా అందంగా ఉండడానికి ప్రధాన కారణం ఇదే.
- నిర్మాణ విలువలు (Production Values). దాదాపు చిత్రం సెట్స్ లో తీయకుండా, మంచి ప్రదేశాల్లో తీయడానికి సరిపడా ఖర్చుపెట్టారు నిర్మాత కళ్యాణ్.
బలహీనతలు :
- మొదటి సగపు కథనం. కథ ఏమాత్రం లేని ఈ సగంలో జాగ్రత్తలు పాటించి ఉంటే బాగుండేది.
- సునీల్ కశ్యప్ సంగీతం. సువ్వి సువ్వాలమ్మా పాట మినహా ఏ పాట వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతం ఫరవాలేదు.
- పండని హాస్యం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఓ దర్శకుడు కానీ రచయిత కానీ పూర్తి శ్రద్ధతో పని చేస్తే మంచి “టెంపర్” ఉన్న కథ పుడుతుంది. లేకపోతే “హార్ట్ ఎటాక్” వస్తుంది. సగం సగం శ్రద్ధతో చేస్తే, అది “లోఫర్”లా మిగిలిపోతుంది.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Loafer (2015) | Film Criticism