గోపీచంద్, రేజీనా జంటగా రూపొందిన సినిమా “సౌఖ్యం”. “ఏ.ఎస్.రవికుమార్ చౌదరి” దర్శకత్వం చేయగా, శ్రీధర్ సిఫాన, కోన వెంకట్, గోపీమోహన్ ర”చించ”గా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, భవ్య క్రియేషన్స్ పతాకంపై “ఆనంద్ ప్రసాద్” ఈ సినిమాని నిర్మించారు.
కథ :
కొడుక్కి పెళ్ళి సంబంధం చూడాలనే తన తండ్రి (ముకేష్ రుషి) కోరికకు ఎప్పుడూ అడ్డు చెప్తుంటాడు శ్రీనివాస్ (గోపీచంద్). దానికి కారణం అతడు మర్చిపోలేని శైలజ (రేజీనా). శ్రీనివాస్, శైలజ ఎలా పరిచయమయ్యారు, ఎలా దూరమయ్యారు, తిరిగి ఎలా కలుసుకున్నారు అనేవి ఈ చిత్ర కథాంశాలు.
కథనం :
ఇది కొత్త కథ కాదు అని విడుదలకు ముందే దర్శకుడు రవికుమార్ చెప్పేశారు కనుక కథ విషయంలో క్షమించవచ్చు. కానీ కథనం కట్టిపడేసేలా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. తీసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ తీస్తుంటే వ్రాసిన సమీక్షలే మళ్ళీ మళ్ళీ వ్రాయాల్సి వస్తోంది. సౌఖ్యం సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలేవి లేవు. కానీ మంచి, చెడులను చెప్పాలి కాబట్టి వ్రాయడం జరుగుతోంది.
మంచి విషయాలు…
ఈ మధ్య తెలుగు సినిమా కథ, కథనాల్లో లోపించినా, సాంకేతికంగా బాగా అభివృద్ది చెందింది. సౌఖ్యం కూడా దీనికి ఓ ఉదాహరణే. ఎందుకంటే, మంచి ఛాయాగ్రహణం, అందమైన ప్రదేశాలు, మంచి నిర్మాణ విలువలు ప్రేక్షకుడికి కాస్త సౌఖ్యాన్ని కలిగించే ప్రయత్నం చేశాయి.
మిగతా విషయాలు…
గతంలో తగిలిన గాయాలను “పిల్లా నువ్వులేని జీవితం” సినిమాతో నయం చేసుకున్న దర్శకుడు రవికుమార్ ఈసారి ఎంత జాగ్రత్తగా సినిమా తీయాలో ఎవరైనా ఊహించవచ్చు. కానీ శ్రీధర్ సిఫాన, కోన వెంకట్, గోపీమోహన్ లను రచయితలుగా ఎంచుకొని “మళ్ళీ అదేనా!” అనిపించే కథనంతో రావడం ఏంటో ఏమాత్రం అర్థంకాని విషయం. ఓ సన్నివేశం తీసి మానిటర్ లో చూసుకున్నప్పుడు ఇది ఫలానా సినిమాలో మనమే తీశాం కదా అనే భావన దర్శకరచయితలకు ఎందుకు కలగలేదో మరి. బహుశా మనం ఏది తీసినా ప్రేక్షకుడు చూసేస్తాడులే అన్న అహంకారమేమో అనిపిస్తుంది.
తెలివైన కథానాయకుడు, కథానాయికను ప్రేమలో దింపడానికి వెధవ వేషాలు, కథానాయికను విడిపించడానికి ప్రతినాయకుడిని ఆటపట్టించడం, నాయకానాయికలు కౌగిలించుకున్నప్పుడల్లా ఓ పాట, కథానాయకుడి చేతిలో ఓ బకరా, చివరకు ఓ పోరాటంతో సినిమా సుఖాంతం.
ఈ విషయాలే ప్రధానంగా ఎన్ని సినిమాలు తీస్తారో అర్థం కావడంలేదు. ఈ పోకడను మొదలుపెట్టిన శ్రీనువైట్ల లాంటివారికే కష్టాలు తప్పడంలేదు. ఆ దారిలోనే వెళ్ళే మనకు ఎలాంటి ఫలితం వస్తుందో సినిమా మొదలుపెట్టే ముందు దర్శకులు ఎందుకు బేరీజు వేసుకోరో మరి! హాస్యం మీద ఆధారపడతారు. ఈ సినిమా విషయానికి వస్తే, ఏదైనా సన్నివేశంలో నేను మనస్పూర్తిగా నవ్వినట్టు ఎంత ఆలోచించుకున్నా గుర్తురావడం లేదు. హాస్యమంటే ఆరోగ్యకరమైనది, స్వతంత్రమైనది కూడా కాదు. హిట్టు సినిమాకు పేరడీ మాత్రమే. “ఏంటి ఇప్పుడు నవ్వమంటారా?” అనే భావన మనసులో కలిగించే హాస్యం అది. ప్రభుత్వాన్నే వణికించగల పీ.ఆర్ (రాజన్) పాత్ర కేవలం ఒక చెంపదెబ్బకు మారిపోయిందంటే, ఇంతకాలం ఇన్ని సినిమాల్లో అంతమంది ప్రతినాయకులను మార్చడానికి ఆయా కథానాయకులు ఎందుకంత ఇబ్బందిపడ్డారో పాపం!
ఇలా వ్రాసుకుంటూపోతే, నా సమీక్ష కూడా మీకు బోరుకోట్టేస్తుంది కాబట్టి ముగిస్తున్నాను. మొత్తానికి, సౌఖ్యం ప్రేక్షకుడి 142 నిమిషాల సౌఖ్యాన్ని హరించే సినిమా.
నటనల విషయానికి వస్తే, గోపీచంద్ ఈ సినిమాను మనసుపెట్టి చేసినట్టు ఒక్క సన్నివేశంలో కూడా అనిపించలేదు. “నా ప్రయాణంలో ఇది గుర్తుండిపోయే సినిమా” అని ఏ కథానాయికైనా చెప్తే సందేహం లేకుండా అందులో ఆమెకు పాత్ర లేదని చెప్పేయొచ్చు. ఇక ఇందులో రేజీనా పాత్రేంటో మీకే వదిలేస్తున్నాను. ప్రదీప్ రావత్ లాంటి పిచ్చి పట్టిన ప్రతినాయకులు, అవసరం లేకున్నా కూడా చెవులు బద్దలయ్యేలా అరిచే పోసాని, పేరడీలు చేసుకునే పృథ్విరాజ్, పాత్ర చిత్రణ బాగోలేకపోతే నరకం చూపించే బ్రహ్మానందం ఇలా అందరున్నారు. ముకేష్ రుషి ఇందులో ఓ మంచి తండ్రి.
ప్రత్యేకతలు :
- ప్రసాద్ మురెళ్ళ ఛాయాగ్రహణం. బాగుంది.
- నిర్మాణ విలువలు. భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ దగ్గర డబ్బులు బాగున్నాయి.
బలహీనతలు :
- కథ, కథనాలు. అసలు బాగోలేవు.
- కోన మాటలు. ప్రాసలు తప్పించి మాటలు ఎక్కడా లేవు.
- రవికుమార్ దర్శకత్వం. అదో రకం.
- హాస్యం. నవ్వించడం మానేసి ఏడిపించింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ప్రేక్షకుడు “ఇక చాలు!” అనేలోపే మనమే చాలించేయడం గౌరవప్రదం.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Soukhyam (2015) | Film Criticism