భలే మంచి రోజు (2015)

Bhale Manchi Roju Poster

సరైన కథ, కథనాలు లేని సినిమాలతో చిత్రపరిశ్రమ వాడిపోతోంది. ఇలాంటి సమయంలో దానికి కొత్త ఊపిరి పోయాల్సింది కొత్త దర్శకులే. ఈ మధ్య వచ్చిన కొత్త దర్శకులు తీసిన సినిమాల్లో “భలే మంచి రోజు” ఈ భావనను కలిగించింది. “శ్రీరామ్ ఆదిత్య” అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. సుధీర్ బాబు, వామిఖ గబ్బి జంటగా నటించగా, విజయ్, శశి నిర్మించారు. ఈ రోజు విషయాల్లోకి వెళ్తే…

కథ :

తనను కాదని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపై పగ తీర్చుకోవడానికి బయలుదేరిన రామ్ (సుధీర్) అనుకోకుండా సీత (వామిఖ)ని కిడ్నాప్ చేయాల్సివస్తుంది. దానికి గల కారణం ఏంటి, ఆ తరువాత రామ్, సీతల జీవితాలు ఎలా మారాయి అన్నవి కథాంశాలు.

కథనం – దర్శకత్వం :

నూతన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను కథ మరియు కథనం విషయంలో బాగా అభినందించాలి. దీన్ని ప్రక్కనబెట్టి సమీక్షను ప్రారంభిద్దాం.

మంచి విషయాలు…

కేవలం 24 గంటల సమయంలో నడిచే ఈ కథలో ఎక్కడ చిక్కుముళ్ళు ఉండాలి, వాటిని ఎక్కడ విప్పాలి అనే విషయాల్లో దర్శకుడికి మంచి పట్టుంది. మొదటి సగం కథనం అంతా ఎదో జరుగుతోందన్న ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కొన్నిచోట్ల తన బుర్రకు బాగా పడునుపెట్టాడు అనిపించింది. ఉదాహరణలు,

 1. రామ్ సెల్ ఫోనుని ఇద్దరు దొంగలు దొంగతనం చేసి పారిపోతుండగా, వారిని పట్టుకునే సన్నివేశంలో చుట్టూ పరిసరాలలో కేవలం పసుపు రంగును మాత్రమే ముఖ్యంగా చేసి చూపించిన విధానం (ఆ రంగునే ఎందుకు అలా చూపించాడో సినిమా చూసి తెలుసుకోండి).
 2. సీతను మొదటిసారి కిడ్నాప్ చేసే సన్నివేశం. దీనికోసం దర్శకుడు కథనంలో ఏర్పరుచుకున్న మార్గాలు చాలా అభినందనీయం. స్లో మోషన్ షాట్స్ (Slow Motion Shots) లో దీన్ని చిత్రించిన విధానం కూడా ఆకట్టుకుంది.
 3. విరామం సన్నివేశం. దాదాపుగా ఎవరి ఊహకు అందని విషయం ఇది. దీన్ని తెరపై చూపించిన విధానం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

ఇవే కాకుండా, సాయికుమార్ గారి పాత్ర పరిచయం, ప్రవీణ్, విద్యురామన్ ఇలా మిగతా పాత్రలను మొదటి సగంలో అలరించడానికి బాగా వాడుకున్నాడు దర్శకుడు. రెండో సగం కూడా ఆసక్తిగా మొదలయింది. ఇక్కడ మరిన్ని చిక్కుముళ్ళు వేసుకొని కథనంపై మరింత ఆసక్తిని పెంచాడు. హాస్యనటుడు “పృథ్వీరాజ్” గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. “మల్లె పుష్పం రామారావు” రూపంలో మారోసారి అతడికి మంచి పాత్ర లభించింది. ఆఖరులో పొలిసు వేషంలో అతడు పలికిన సంభాషణలు బాగా నవ్వించాయి.

మిగతా విషయాలు…

ఇలాంటి కథనాలను మూడు భాగాలుగా విభజిస్తారు. ప్రతి భాగాన్ని ఒక “ఆక్ట్”గా (Act) అభివర్ణిస్తారు. రెండో ఆక్ట్ (2nd Act) లో సమస్యను, మూడో ఆక్ట్ (3rd Act) లో దాని పరిష్కారాన్ని ప్రవేశపెట్టాలని “సిడ్ ఫీల్డ్” (Syd Field) లాంటి సినీ గురువుల అభిప్రాయం. ఇందులో రెండో ఆక్ట్ చాలా కీలకం. అందులో దర్శకుడు వందశాతం విజయం సాధించాడు. కానీ మూడో ఆక్ట్ ని మాత్రం త్వరగా ప్రవేశాపెట్టేశాడు. రెండో సగం మొదలయిన దాదాపు ఇరవై నిమిషాలకే సమస్యకు పరిష్కారం ఏంటో అర్థమైపోయి కథనం నెమ్మదించిన భావాన కలిగించింది. అప్పటివరకు తెలిసిన సమస్య కాకుండా మరో కొత్త సమస్య మొదలవుతుందేమో అనుకుంటే అలాంటిది ఏమి లేకుండా గడిచిపోయింది. దీనికి తోడు సరైన సందర్భం లేకుండా వచ్చిన పాట ఇబ్బందిపెట్టింది. అసలు ఈ సినిమాలో కథనంలో ఇమిడిపోయి వచ్చే పాటలకు తప్ప డ్యూయెట్లకు స్థానం అవసరం లేదు. నేరుగా మూడో ఆక్ట్ కు వెళ్లిపోవచ్చు. ఎదో నాయకానాయికలకు ఒక డ్యూయెట్ ఉండాలని ఇరికించినట్టుగా అనిపించింది.

ఇక మూడో ఆక్ట్ లో సాయికుమార్, సూర్య (చైతన్య కృష్ణ) మొదలైన పాత్రలు బాగా బలహీనమైపోయాయి. కథనం కూడా చప్పగా మారిపోవడంతో చివరికి మంచి అభిప్రాయం కలిగించలేకపోయింది. దీనికి మరో కారణం కూడా ఉంది. అదే మూడో ఆక్ట్ తరువాత వచ్చే చిట్టచివరి సన్నివేశం. ఇది పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది.

అలా, భలే మంచి రోజు “మంచి” రోజుగా మొదలయి ఓ “మామూలు” రోజుగా ముగిసింది.

నటనల విషయానికి వస్తే, సుధీర్ నటన ఫరవాలేదనిపించింది. వామిఖ పాత్ర సినిమాకు ముఖ్యమైనా, నటనకు ఆస్కారం దక్కలేదు. సాయికుమార్ పాత్రను బాగానే పోషించారు. ప్రవీణ్, వేణు, విద్యురామన్, పోసాని, పరుచూరి గోపాలకృష్ణ మొదలైనవారు తమ పాత్రలను బాగానే పోషించారు. ముఖ్యంగా చెప్పుకోవాలి. మల్లె పుష్పం రామారావు పాత్రలో పూర్తిగా అలరించాడు. ఐశ్వర్య పోషించిన పాత్ర జీర్ణించుకోవడం కష్టంగా అనిపించింది. చైతన్య కృష్ణ బాగానే చేశాడు.

ప్రత్యేకతలు :

 1. కథ, కథనం, దర్శకత్వం (Story, Screenplay & Direction). కొత్త దర్శకుడే అయినా, మూడో ఆక్ట్ లో గాడి తప్పినా, శ్రీరామ్ కు తన కథ, కథనాల విషయాల్లో ఉన్న స్పష్టతకు మార్కులు వేసేయాలి.
 2. శ్యాందత్ ఛాయాగ్రహణం (Cinematography). ఇలాంటి సినిమాకు ఛాయాగ్రహణం ఎంతగా సహాయపడుతుందో ఇతడి పనితనం నిరూపించింది.
 3. రామకృష్ణ కళాదర్శకత్వం (Art Direction). సినిమాకు సరిపోయేలా ఉన్న సెట్స్ కూడా ఓ బలం.
 4. నిర్మాణ విలువలు (Production Values). నిర్మాతలు విజయ్, శశి సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టారు.

బలహీనతలు :

 1. విఫలమైన మూడో ఆక్ట్ (3rd Act). దీని గురించి కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ఒక సంపూర్ణమైన సినిమా అయ్యేది.
 2. పాటలు. సన్నీ అందించిన పాటలు పెద్దగా వినసొంపు అయినవి కావు.
 3. శబ్దగ్రహణం (Sound Recording). నాయకానాయికల డ్యూయెట్లో మరియు చివరి ఘట్టంలో మాటలను రికార్డు చేసిన విధానం బాగోలేదు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే ప్రత్యేకమైన కొలమానాలు లేవు. మంచి కథతో వస్తే అది పెద్ద సినిమా, చెత్త కథతో వస్తే అది చిన్న సినిమా.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

One thought on “భలే మంచి రోజు (2015)

 1. Pingback: Bhale Manchi Roju (2015) | Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s