కొన్ని సినిమాలు హడావుడి లేకుండా వచ్చేస్తాయి. వచ్చాక చాలా బాగుందంట అనే ప్రచారంతో వస్తాయి. అలాంటి సినిమాయే “జత కలిసే”. అశ్విన్ బాబు, తేజస్వి మడివాడ జంటగా నటించిన ఈ సినిమాతో “రాకేశ్ శశి” దర్శకుడిగా పరిచయమయ్యారు. వారాహి చలనచిత్రం, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
కథ :
ఓ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత రుషి (అశ్విన్), ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూకి హాజరు కాబోయే తేజస్వి (తేజస్వి) ఒకే కారులో ప్రయాణం చేయాల్సివస్తుంది. కానీ అంతకముందే వారిరువురి మధ్య ఓ గొడవ జరుగుతుంది. అదేంటి? ఆ కారు ప్రయాణం వారి జీవిత ప్రయాణాలను ఎలా మార్చింది? అనేవి కథాంశాలు.
కథనం :
ఇది ఓ సమకాలీన సినిమా. ప్రస్తుత యువత, సామాజిక అనుసంధాన వేదికల నేపథ్యంలో రూపొందించిన సినిమా. కథ గొప్పగా ఏమి లేదు కానీ అలవాటుగా మన దారిలో మనం వెళ్దాం.
మంచి విషయాలు…
దర్శకుడు రాకేశ్ శశి ఈ సినిమాకు పేర్లు వేసిన విధానం ఆకట్టుకుంది. ఫేసుబుక్ నేపథ్యంలో వేసిన ఆ పేర్లు ఓసారి “ఈ.వీ.వీ.సత్యనారాయణ” గారిని గుర్తుచేశాయి. “పడిపోయానే” పాట చిత్రీకరణ అలరించింది. రెండో సగంలో షకలక శంకర్ కాస్త నవ్వించాడు.
చెత్త విషయాలు…
పైన చెప్పుకున్నట్టుగా కథ పెద్ద గొప్పదేమీ కాదు. దీనికి దర్శకుడు వ్రాసుకున్న కథనం కనీసం ఓ మోస్తరుగా లేకపోగా, చాలా చెత్తగా ఉంది. ఇంకా చెప్పాలంటే, పరిపక్వత లేని కథనం ఇది. పేర్లు భలే వేశాడే అని గౌరవించినంతసేపు దాన్ని నిలబెట్టుకోలేదు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు మరీ బీ గ్రేడ్ కు సంబంధించినవి. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత అయిన కథానాయకుడి పాత్ర చిత్రణ మరియు దేవుడి ప్రసాదం తినకపోతే కుష్టువ్యాది వస్తుందని రుషిని భయపెట్టే సన్నివేశం దర్శకుడి పరిపక్వత ఎంత క్రింది స్థాయిలో ఉందో తెలిపాయి. దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పాల్సిందిపోయి, పూజించకపోతే నష్టం జరుగుతుందని భయపెట్టడం ఏంటో అసలు అర్థంకాలేదు. ఈ సన్నివేశంతో సినిమాపై ఉన్న గౌరవం పూర్తిగా పోయింది.
ఇక రెండో సగంలో తేజస్విని రుషి ఆటపట్టించడం, మళ్ళీ ఆమె సమస్యలను పరిష్కరించడం ఆకట్టుకోలేదు. షకలక శంకర్ కాస్త నవ్వించగా, అతడు చెప్పిన గతం నరకం చూపించింది. మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమాలో సైకిల్ తొక్కడం, “గబ్బర్ సింగ్”లో పవన్ పొలిసు పాత్ర చేయడం వారు చేసిన నేరాలుగా మారిపోయాయి. ప్రతి దర్శకుడు తన సినిమాలో ఆ సన్నివేశాన్ని వాడి చంపేస్తున్నాడు. చివరకు రాకేశ్ శశిలాంటి కొత్త దర్శకులు కూడా పేరడీల మీద బ్రతకడం ఎందుకో అర్థంకాలేదు. పోనీ పేరడీ నవ్వించిందా అంటే సహనాన్ని పరీక్షించింది. డిసెంబర్ నెలలో విడుదలయిన సినిమాల్లో “శ్రీమంతుడు”ని పేరడీ చేసిన నాలుగో సినిమా ఇది.
కథనాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి ఎలాగో ముగించాడు దర్శకుడు. అలా, జత కలిసే ఆకట్టుకోలేకపోయింది.
ఇక నటనల విషయానికి వస్తే, అశ్విన్ తన ఆహార్యంలో దాదాపు పవన్ కళ్యాణ్ ని అనుకరించాడు. తేజస్వి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. స్నిగ్ధ, షకలక శంకర్ ఫరవాలేదు. సప్తగిరి, విద్యురామన్ సహనాన్ని పరీక్షించారు. పృథ్విరాజ్ కూడా ఈసారి ఆకట్టుకోలేదు. అశ్విన్ స్నేహితులుగా నటించిన నలుగురు కూడా వ్యర్థమే. సూర్య, సుప్రియ ఫరవాలేదు.
ప్రత్యేకతలు :
- పేర్లు వేసిన విధానం. ఇది ఒక్కటే ఈ సినిమాకున్న ప్రత్యేకత.
బలహీనతలు :
- కథ, కథనం, దర్శకత్వం. నూతన దర్శకుడు రాకేశ్ శశి ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు.
- నవ్వించని హాస్యం. షకలక శంకర్ తప్ప ఎవరూ నవ్వించలేకపోయారు.
- పేరడీలు. పేరడీ చేసిన విధానం బాగోకపోగా, అస్తమానం శ్రీమంతుడు, గబ్బర్ సింగ్ లను వాడుకొని బ్రతకడం తుచ్చం. మళ్ళీ దానికి పెద్ద హడావుడి ఎందుకు చేస్తారో తెలియదు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
మొదటి సినిమా “మొదటి” సినిమాలా ఉండాలి తప్ప ఎవరో తీసిన సినిమాను వాడేసుకొని ఇది నా “మొదటి” సినిమా అనకూడదు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Jatha Kalisey (2015) | Film Criticism