నేను.. శైలజ… (2016)

Nenu Sailaja Poster

“మనకు నచ్చిన సినిమాలు చేయడం కాదు, మనకు నప్పే సినిమాలు చేయాలి!” అనే మాట ఎక్కడో ఎవరో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. “రామ్” విషయంలో ఈ వాక్యం అక్షరాల ఋజువైంది. “పండగ చేస్కో”, “శివమ్” లాంటి మూస సినిమాలతో విసిగించేసిన రామ్ ఈసారి ఓ చక్కని పసందైన ప్రేమకథతో వచ్చాడు. అదే, కీర్తి సురేష్ తో జంటగా నటించిన “నేను..శైలజ..”. 2015 ఆఖరులో వచ్చిన చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కూడా 2016 మొదట్లో ఓ మంచి భావనను కలిగించిన సినిమా ఇది. “సెకండ్ హ్యాండ్” సినిమాతో దర్శకుడిగా పరిచయమైన “కిషోర్ తిరుమల” ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. “శ్రీ స్రవంతి మూవీస్” పతాకంపై “రవికిషోర్” ఈ సినిమాని నిర్మించారు.

కథ :

ప్రేమించిన ప్రతి అమ్మాయితోనూ ప్రేమలో విఫలమైన హరి (రామ్)కు అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితురాలు శైలజ (కీర్తి) పరిచయమవుతుంది. ఇప్పుడు శైలజకు తన ప్రేమను గురించి ఎలా తెలిపాడు? వారిద్దరూ ఎలా ఒకటయ్యారు అన్నది ఈ కథాంశాలు.

కథనం :

ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది అతి సాధారణమైన ప్రేమకథ. కానీ దర్శకుడు కిషోర్ వ్రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు ఈ సినిమాపై చాలామంచి భావనను కలిగించాయి. అందుకే ముందుగా మంచి విషయాలు చెప్పుకుందాం.

మంచి విషయాలు…

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి “యు” సర్టిఫికేట్ లభించింది. ఈ మధ్యనున్న సెన్సార్ బోర్డు ఓ సినిమాకు “యు” ఇవ్వడం చాలా కష్టమైన విషయం. అదీ రామ్ లాంటి పేరున్న స్టార్ సినిమాకు. ఎక్కడ కూడా రవ్వంతైనా అసభ్యకరమైన సన్నివేశాలు, ద్వందార్థ సంభాషణలు, మూస పేరడీలు, నవ్వురాని హాస్యం ఈ సినిమాలో నాకు కనబడలేదు. మొదటి సగమంతా ఓ ఇళయరాజా మెలోడిలా సాగిపోయింది. ఈ చిత్రం నాకు నచ్చడానికి ప్రధాన కారణం దీని స్వతంత్రమైన కథనం. కథను బట్టే సన్నివేశాలు, మాటలున్నాయే తప్ప, తన సినిమాతో మరో సినిమాను గురించి, దర్శకుడి గురించి ప్రస్తావించడం, వాటి పేరడీలు చేయడంపై దర్శకుడు ఆధారపడలేదు. హరి పాత్ర చిత్రణ ప్రస్తుత యువతకు అద్దం పట్టింది. అందులో రామ్ ప్రదర్శించిన నియంత్రిత నటన ఆ పాత్ర ఔన్నత్యాన్ని పెంచింది. శైలజ పాత్ర చిత్రణ కూడా ఓ మధ్యతరగతి అమ్మాయిని ప్రతిబింబించేలా ఉంది. దర్శకుడు తీసుకున్న నాటకీయ స్వేచ్చ హరి కుటుంబం విషయంలోనే. అది కూడా జాగ్రత్తగా చేశాడు. అందుకే ఎక్కడా అతిశయోక్తిగా అనిపించలేదు.

హరి, శైలజల చిన్ననాటి స్నేహాన్ని చూపించిన విధానం, ఆ పాత్రలకు దర్శకుడు ఎంచుకున్న బాలనటులు, ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక్కడే శైలజకు తన తండ్రి శ్రీనివాసరావు (సత్యరాజ్)తో ఉన్న అనుబంధాన్ని కూడా బాగా చూపించాడు దర్శకుడు.

మొదటి సగంలో చాలా సన్నివేశాలు యువతను చాలా ఆకట్టుకుంటాయని అనడంలో ఆశ్చర్యం లేదు. “క్రేజీ క్రేజీ ఫీలింగ్” పాట చిత్రణ, అందులోని నృత్యం చాలా అందంగా ఉంది. అలాగే “మస్తి మస్తి” పాట కూడా. “శైలజ శైలజ” పాట పాటలు విడుదలయిన సమయం నుండే బాగా ఆకట్టుకున్నది. దీన్ని తెరపై చూపించిన విధానం కూడా బాగుంది. కథనం నుండి బయటికి తీసుకొని వెళ్ళే విదేశీ ప్రాంతాల్లో డ్యూయెట్లు లేవు. నిజానికి, నాయకానాయికల మధ్య ఒక్క డ్యూయెట్ కూడా లేదు. ఆ అవసరం కూడా కనిపించలేదు. ప్రతి పాట కథనానికి ఉపయోగపడేదే. ఇది మరింత అభినందనీయం.

మామూలుగా పిచ్చి పట్టిన ప్రతినాయకుడిగా కనిపిస్తూ బోరు కొట్టించేసిన “ప్రదీప్ రావత్”ను పిచ్చి ప్రేమికుడు “మహర్షి” పాత్రలో వాడుకోవడం దర్శకుడిని బాగా మెచ్చుకునేలా చేసింది. నిజానికి ఈ సినిమాలో పోరాటాలు, ఓ ప్రతినాయకుడు అనవసరం. కానీ దర్శకుడు తెలివిగా వాటిని త్వరగా తెగ్గోట్టేసి, వాటికి కథనంలో ప్రాముఖ్యతను కూడా కల్పించిన విధానం అభినందనీయం.

ఏమాత్రం పేరు పెట్టలేని మొదటి సగం మినహా నాకు ఈ సినిమాలో అమితంగా నచ్చిన విషయాలు రెండో సగంలో ఉన్నాయి.

  1. శైలజ సంగీత్ లో హరి ప్రదర్శించే వీడియోలు. మామూలు సినిమాగా మారి బోరు కొడుతోందా అనిపించే సమయంలో ఈ సన్నివేశం వచ్చి మనసుకు హత్తుకుంది. మితిమీరిన మెలోడ్రామా లేకుండా చక్కని సంభాషణలతో వ్రాసుకున్న ఈ సన్నివేశం దర్శకుడిలోని రచయితపై గౌరవాన్ని పెంచేసింది. ముఖ్యంగా, “పెళ్ళిచేసి అమ్మాయిని వేరే ఇంటికి పంపాలని ఎవడు రాశాడో తెలియదు కానీ, ఖచ్చితంగా వాడికి అమ్మాయి మాత్రం పుట్టుండదు” అని సత్యరాజ్ పలికిన సంభాషణ చాలా బాగుంది. ఈ సన్నివేశానికి వెంటవచ్చిన “నా మనసున చోటు చిన్నది” అని సీతారామశాస్త్రి గారి రచనతో, చిత్ర గారి గాత్రంలో వచ్చిన పాట పాత్రల ఔన్నత్యంతో పాటు సినిమా ఔన్నత్యాన్ని కూడా పెంచేసింది.
  2. పతాక సన్నివేశం ముందు శైలజ తన తండ్రితో మాట్లాడే సన్నివేశం కూడా రచయితగా కిషోర్ ని మరోసారి గెలిపించిందని చెప్పాలి. దేవీశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం దీనికి మరింత సాయపడింది.

మొదటి నుండి పరిచయం చేసిన హరి పాత్రలోని చలాకితనాన్ని చివర్లో చంపెశాడే దర్శకుడు అని అనుకునేలోపే, అదేమీ లేదని పతాక సన్నివేశంలో నిరూపించాడు. అప్పటివరాకు జరిగిన మొత్తం సినిమాను ఓ సింగల్ టేక్ సన్నివేశంలో చెప్పించిన విధానం, అందులో రామ్ నటన పాత్ర ఔన్నత్యాన్ని నిలబెట్టాయి.

మిగతా విషయాలు…

మంచి చెప్పుకున్నప్పుడు, చెడు కూడా చెప్పుకోవాలి. మొదటి సగమంతా ఓ పసందైన కథనంతో, చక్కని సన్నివేశాలతో నడిపించిన దర్శకుడు రెండో సగంలో ఓ మామూలు సినిమానే తీశాడు. కథానాయకుడు కథానాయిక కోసం ఆమె ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటివారికి దగ్గరవ్వడం ఇలా అన్నీ మామూలుగా ఉన్నాయి. ఏళ్ళ తరబడి మాటల్లేకుండా దూరంగా బ్రతికిన మనుషులు ఎవరో అనామకుడి (హరి) మాటలను విని వెంటనే మారిపోవడంలాంటి అంశాలు, అప్పటివరకున్న తాజాదనాన్ని దెబ్బతీసింది. అలా కాకుండా, వారిమధ్య ప్రేమ చిగురించేలా కథానాయకుడి చేత ఏదైనా చేయించి, దాన్నిమాటలతో కాకుండా దృశ్యాలతో చూపించి ఉంటే బాగుండేది. ప్రాముఖ్యత ఉందనుకున్న ప్రిన్స్ మరియు శ్రీముఖి పోషించిన పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లభించలేదు. దర్శకుడు చేసిన మంచి పని, ఇలాంటి కథనంలో కూడా విడిగా ఓ హాస్యనటుడిని పరిచయం చేసి అతడితో ఇబ్బందిపెట్టలేదు. ఉన్న పాత్రలతోనే కథనాన్ని నడిపించాడు.

అలా, “నేను శైలజ” 2016కి ఓ చక్కని నాంది పలికింది. మూస చిత్రాలతో విసిగిపోయిన ప్రేక్షకులందరికీ ఈ చిత్రాన్ని సిఫార్సు చేస్తున్నాను.

ఇక నటనల విషయానికి వస్తే, రామ్ తన పాత్రకు పరిపూర్ణమైన న్యాయం చేశాడు. దర్శకుడు వ్రాసుకున్న పాత్రపై తన ముద్రను బలంగా వేశాడు. ఉదాహరణకు, మొదటి సగంలో బీచ్ లో మండుతాగే సన్నివేశం. కీర్తి సురేష్ పాత్రకు సరిగా సరిపోయింది. తన మనసులోని భావాలను బయటపెట్టలేని అమ్మాయి పాత్రలో బాగా నటించింది. సత్యరాజ్ నటన కూడా బాగుంది. విజయ్ కుమార్, నరేష్, ప్రగతి, రోహిణి ఇలా అందరూ తమ పాత్రలను బాగా పోషించారు. ప్రదీప్ రావత్ తన పాత్రను చాలా బాగా పోషించి అలరించాడు. ప్రిన్స్, శ్రీముఖి, చైతన్యకృష్ణ ఇలా వీరందరూ మామూలే.

ప్రత్యేకతలు :

  1. రచన – దర్శకత్వం (Script work & Direction). దర్శకుడు కిషోర్ ఈ సినిమాను ఎంత ప్రేమించి చేశాడో, ప్రేమ, కుటుంబ బంధాల మీద అతడి పరిశోధన, వాటిపట్ల అతడికున్న భావాలు చాలా బాగున్నాయి. అసభ్యత ఏమాత్రం లేని సన్నివేశాలు, మాటలు వ్రాసుకొని రచయితగా కూడా విజయం సాధించాడు దర్శకుడు కిషోర్. తన కథ, కథనాల మీద అతడికి చాలా స్పష్టత ఉందని అర్థమైంది. ఫీల్ గుడ్ ఫిలిం డైరెక్టర్ గా భవిష్యత్తులో మంచిపేరు సంపాదించుకునే అవకాశం ఇతడికి మెండుగా ఉంది.
  2. రామ్ (Ram). పైన చెప్పుకున్నట్టుగా ఇది రామ్ కి బాగా నప్పిన సినిమా. హరి పాత్రలో అతడి నటన పూర్తిగా అలరించింది. “పండగ చేస్కో”, “శివమ్”లాంటి సినిమాలతో అతడు చేసిన తప్పులు ఈ సినిమాతో పూర్తిగా తుడుచుకుపోయాయి.
  3. దేవీశ్రీప్రసాద్ సంగీతం (Music). పాటలతోనే కాకుండా దేవీ నేపథ్య సంగీతంతో కూడా సన్నివేశాల ఔన్నత్యాన్ని పెంచాడు. ముఖ్యంగా, సత్యరాజ్ తన కుటుంబంతో ఉన్న సన్నివేశాలలో వెనుక వచ్చే “వీణ” సంగీతం చాలా బాగుంది.
  4. సాహిత్యం (Lyrics). సీతారామశాస్త్రి గారు వ్రాసిన “ఏం చెప్పను”, “నా మనసున”, రామజోగయ్యశాస్త్రి వ్రాసిన “క్రేజీ క్రేజీ ఫీలింగ్”, భాస్కరబట్ల వ్రాసిన “శైలజ శైలజ” పాటల్లోని సాహిత్యం సినిమాకు చాలా బాగా సరిపోయాయి.
  5. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం (Cinematography). సినిమా అంతా అందమైన ప్రదేశాల్లో, మంచి షాట్స్ తీశారు సమీర్. “శైలజ శైలజ” పాటలో వాడిన లైటింగ్ చాలా బాగుంది.
  6. నిర్మాణ విలువలు (Production Values). స్రవంతి మూవీస్ ఇప్పటివరకు నిర్మించిన సినిమాలు (శివమ్ మినహా) దాదాపు మంచి అభిరుచి ఉన్న సినిమాలే. ఈ సినిమా కోసం నిర్మాత రవికిషోర్ పెట్టిన ఖర్చు సినిమాపై ఆయన అభిరుచిని మరోసారి తెలిపింది.

బలహీనతలు :

  1. నెమ్మదించిన రెండో సగపు కథనం. ఇక్కడ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

ఈ చిత్రం నేర్పిన పాఠాలు :

  1. స్పష్టత, బాధ్యత కలిగిన కథ, కథనాలు ఉంటే చాలు. ప్రేక్షకుడిని మెప్పించడానికి హాస్యనటులు, పేరడీలు అవసరం లేదు.
  2. నిజజీవితానికి కొంచెం నాటకీయత జోడించి చెప్తే అది ప్రేక్షకుడికి తప్పకుండా చేరువ అవుతుంది.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

2 thoughts on “నేను.. శైలజ… (2016)

  1. Pingback: Nenu Sailaja (2015) | Film Criticism

  2. yes 2nd half regular format but ekkada bore ledu rotha anipioyaledu, feel undela choosukunnadu movie lo, biggest plus point according to me is heroine oppukovadam ane point ki antha importance icchadu, edho pre climaxl lo kalisipoi fight tho end cheyakunda 🙂

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s